ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ పై ఇండియా గెలుపు

19 సంవత్సరాలలోపు బాలుర ప్రపంచకప్ పోటీలలో చిరకాల ప్రత్యర్థి దాయాది పాకిస్తాన్ పై ఇండియా ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది.  టౌన్స్ విల్లె లోని టోనీ ఐర్లాండ్ స్టేడియంలో జరిగిన భారత - పాకిస్తాన్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఒక వికెట్ తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత బౌలర్లు పాకిస్తాన్ ను 136 పఫుగులకే కట్టిడి చేసింది. అటుపిమ్మట బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు అతి కష్టం మీద 137 పరుగులు చేయడానికి తొమ్మిది వికెట్లు కోల్పోయి లక్షాన్ని ఛేదించింది. ఈ విజయంతో భారత క్రికెట్ అభిమానులలో సందడీ నెలకొంది. రంజాన్ పర్వదినాన భారత జట్టు పాకిస్తాన్ పై విజయం సాధించి క్రికెట్ అభిమానులకు రంజాన్ కానుకను అందజేసింది. 

నాగపూర్ లో మళ్ళీ రేవ్ పార్టీ రచ్చ!

నాగపూర్ లో మరో రేవ్ పార్టీ రాచ్చయ్యింది. బరితెగించి బట్టలు కూడా ఒంటిమీద లేకుండా చిందులేస్తున్న 183 మంది యువతీ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలో ఇంతపెద్ద ఎత్తున జరుగుతున్న రేవ్ పార్టీ గుట్టు రట్టవడం ఈ మధ్యకాలంలో ఇది రెండోసారి. పోలీసుల చేతికి చిక్కిన మందుబాబులు, భామల్లో చాలామంది పెద్దోళ్ల పిల్లలే. వాళ్ళని వదిలేయమని కేసును మసిపూసి మారేడుకాయ చేయమని ఒత్తిడి బాగా పెరిగిపోతోందని పోలీస్ బాస్ లు చెబుతున్నారు. పట్టుబడ్డ వాళ్ళందర్నీ వైద్య పరీక్షలకు పంపారు. డ్రగ్స్ సేవిన్చినట్టు రక్తపరీక్షల్లో రుజువైతే కఠినశిక్ష తప్పదని పోలీసులు అంటున్నారు.

ప్రకాశం బ్యారేజిపై 25న టీడీపీ మహాధర్నా

కృష్ణాడెల్టాకు నీటి విడుదల కోరుతూ ఈ నెల 25న విజయవాడ ప్రకాశం బ్యారేజిపై మహాధర్నా నిర్వహించనున్నట్టు టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. శనివారం మచిలీపట్నంలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించారు. ఈ మహాధర్నాలో నాలుగు జిల్లాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు పాల్గొంటారన్నారు. మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. రిజర్వాయర్లలో పుష్కలంగా నీరున్నా కృష్ణాడెల్టాను బీడుగా మారుస్తున్నారన్నారు. ఆగస్టులో కూడా డెల్టాలో తాగు నీటి ఎద్దడి ఉండటం సిగ్గుచేటని విమర్శించారు.

అసోం అల్లర్ల వెనక పాకిస్తాన్‌ కుట్ర

అసోంలో చెలరేగిన హింసాకాండ వెనక పాకిస్తాన్‌ కుట్ర దాగి ఉందని భారత సర్కారు గుర్తించింది. ఆ దేశానికి చెందిన కొన్ని బ్లాగుల్లో ఉంచిన నకిలీ ఫోటోలే హింసకు కారణమయ్యాయని... హోంశాఖ విచారణలో తేలింది. దీనిపై పాకిస్తాన్‌ను నిలదీసేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. మరోవైపు.. అల్లర్లు క్రమంగా మిగతా ప్రాంతాలకూ పాకుతుండడం ఆందోళన కలిగిస్తోంది..   అల్లర్ల వ్యవహారంపై విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టిన హోంశాఖ... వీటికి కారణమైన ఫోటోలు ఎలా వ్యాపించాయన్న దానిపై దృష్టి సారించింది. ఇంటర్‌నెట్‌లోని పలు సైట్లలో కనిపించిన ఈ నకిలీ ఫోటోలు.. పాకిస్తాన్‌ నుంచి అప్‌లోడ్‌ అయినట్లు.. హోంశాఖ కార్యదర్శి ఆర్‌ కే సింగ్‌ ప్రకటించారు. ఎక్కడో భూకంపం, తుఫాను వచ్చినప్పుడు చనిపోయిన వారి ఫోటోలను... అల్లర్లలో చనిపోయిన మైనార్టీలుగా   చూపిస్తూ.. రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని.. వెల్లడించారు. ఇప్పటికే ఈ ఫోటోలు ఉన్న 76 సైట్లను నిలిపివేశామని చెప్పారు.  ఈ విషయంపై వెంటనే పాకిస్తాన్‌ను వివరణ కోరుతామని.. అన్ని స్పష్టమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఆ దేశం ఎలా స్పందిస్తుందో చూడాలని.. హోంశాఖ వర్గాలు అన్నాయి.  

సిరీస్‌కు సేలేక్ట్ అయి, రిటైర్‌మెంట్ ప్రకటించిన లక్ష్మణ్

వీవీఎస్ అంటే వెరీ వెరీ స్పెషల్! పరుగులు తీయడమే కాదు... ఆ పరుగును ఆపడంలోనూ లక్ష్మణ్ వెరీ వెరీ స్పెషల్. జెంటిల్‌మెన్ గేమ్‌లో మనవాడు అసలు సిసలైన్ జెంటిల్‌మన్! ఈ సొగసరి షాట్ల బ్యాట్స్‌మన్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన కెరీర్‌కు సెలవు పలికాడు. మరో నాలుగు రోజుల్లో హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగే టెస్టులో ఆడాల్సి ఉన్నా... అంతకంటే ముందే గుడ్‌బై చెప్పాడు.   ఉద్వేగ భరిత వాతావరణం మధ్య... శనివారం తన రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఒక ఆటగాడు సిరీస్‌కు సెలెక్ట్ అయి, అది ఆడకుండానే రిటైర్మెంట్ ప్రకటించడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి! ఏ ఆటగాడైనా సొంత గడ్డపై, సొంత ప్రేక్షకులమధ్య బ్యాటు ఝళిపించి... కెరీర్‌కు చిరస్మరణీయమైన ముగింపు పలకాల ని భావిస్తాడు. కానీ... లక్ష్మణ్ దీనికిముందే ఎందుకు 'లక్ష్మణ రేఖ' గీసుకున్నాడు? ప్రత్యర్థులు కూడా ప్రశంసించే లక్ష్మణ్ మనసును 'ఎవరైనా' గాయపరిచారా? అయితే... వారెవ రు?

మిస్ వరల్డ్ 2012 గా చైనా ముద్దుగుమ్మ

అందాల పోటీల్లోనూ చైనా తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. స్వదేశంలో నిర్వహించిన మిస్ వరల్డ్-2012 పోటీల్లో చైనాకు చెందిన యు వెన్ సియా టైటిల్‌ను గెలుచుకుని డ్రాగన్ సత్తా చాటింది. భారతదేశం నుంచి గట్టి పోటీ ఇచ్చిన వన్యా మిశ్రా కేవలం టాప్ 7 వరకు వచ్చినా.. చివర్లో తడబడింది. చైనాకు మిస్ వరల్డ్ టైటిల్ దక్కడం ఇది రెండోసారి. గత సంవత్సరపు విజేత వెనిజులాకు చెందిన ఇవియన్ సర్కోస్ చేతులమీదుగా మిస్‌వరల్డ్ కిరీటాన్ని వెన్ సియా అందుకుంది. బీజింగ్‌లోని డాంగ్‌షింగ్ ఫిట్‌నెస్ సెంటర్లో అంగరంగ వైభోగంగా ఈ టైటిల్ ప్రదాన కార్యక్రమం జరిగింది. 23 ఏళ్ల వెన్ ప్రస్తుతం సంగీతాన్ని అభ్యసిస్తోంది. భవిష్యత్తులో సంగీత ఉపాధ్యాయినిగానే స్థిరపడాలనుకుంటోంది. ఈ పోటీలో మొదటి రన్నరప్‌గా మిస్ వేల్స్ సోఫీ మౌల్డ్స్, రెండో రన్నరప్‌గా మిస్ ఆస్ట్రేలియా జెస్సికా కహావతి నిలిచారు. మిస్ ఇండియా వన్యా మిశ్రా టాప్ 7కు మించి పైకి వెళ్లలేకపోయినా, ఆమెకు 'మిస్ సోషల్ మీడియా', 'బ్యూటీ విత్ ఎ పర్పస్' టైటిళ్లు దక్కడం కొంత ఊరట

ఢిల్లీ నుంచి బొత్స సత్యనారాయణకు పిలుపు

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. ఆయన తక్షణమే హస్తిన రావాల్సిందిగా ఆదేశాలు అందాయి. దీంతో బొత్స సత్యనారాయణ ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రి ధర్మాన వ్యవహారంతో పాటు, రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులపై కలవరపడ్డ అధిష్టానం బొత్సకు కబురు పెట్టినట్లు తెలుస్తోంది. సీబీఐ చార్జ్‌షీట్‌తో మనస్తాపం చెందిన ధర్మాన ప్రసాదరావు పదవికి రాజీనామా చేయడం సహచర మంత్రుల్లో సానుభూతి వ్యక్తమవుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. పలువురు ఆయనతో విడివిడిగా, సామూహికంగా భేటీ అవుతున్నారు. ఇదే సమయంలో సీఎం వ్యతిరేక వర్గ నేతలంతా ధర్మానను కలుస్తున్నారు. ఈ తరుణంలో బొత్స ఢిల్లీ ప్రయాణం ఆసక్తి రేకెత్తిస్తోంది.

రుయా ఆస్పత్రిలో కొనసాగుతున్న శిశు మరణాలు

తిరుపతి రుయా ఆస్పత్రిలో శిశు మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు మరో నలుగురు చిన్నారులు చనిపోయారు. మృత్యువాత పడిన వారంతా వాయల్పాడు, పుత్తూరు, మదనపల్లెలకు చెందినవారు. చికిత్స పొందుతున్నవారిలో 37 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఈ మేరకు తాజా మెడికల్ బులిటెన్ను శనివారం వైద్యులు విడుదల చేశారు. గత మూడు రోజుల్లో 19మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా తిరుపతి రుయా ఆస్పత్రిలో శిశు మరణాలపై ప్రభుత్వం స్పందించింది. హైదరాబాద్ నుంచి ప్రత్యే వైద్య బృందం ఈరోజు మధ్యాహ్నం తిరుపతి వెళ్లనుంది. ఈ బృందంలో నీలోఫర్ వైద్యులు హిమబిందు, సుబ్రహ్మణ్యం, మురళీరావు ఉన్నారు. శిశువుల మరణాలపై వీరు ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించనున్నారు.

ఈరోజు సాయంత్రం రిటైర్మెంట్‌ ప్రకటించనున్న లక్ష్మణ్

 భారత బ్యాటింగ్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్.. న్యూ జిలాండ్‌తో రెండు టెస్టుల అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే యోచనలో ఉన్నాడు. తన రిటైర్మెంట్‌పై ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఉప్పల్ స్టేడియంలో అధికారికంగా ప్రకటించనున్నారు. గత 16 ఏళ్లుగా భారత క్రికెట్‌కు నిరుపమాన సేవలందించి జట్టు నంబర్‌వన్‌గా నిలవడంలో లక్ష్మణ్ కీలక పాత్ర పోషించాడు.   న్యూజిలాండ్‌తో జరుగబోయే రెండు టెస్టుల సిరీస్ అతడికి ఆఖరిది కానుంది. ఈనెల 23 నుంచి 27 వరకు ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్టు జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు లక్ష్మణ్ తన రిటైర్‌మెంట్ ప్రకటన చేయొచ్చనే కథనాలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్న విషయం తెలిసిందే.