లెన్స్

లెన్స్ - డా.సి. భవానీదేవి కంటికి కంటికి మద్య గాయానికి నెత్తురుకురుకూ మద్య ప్రతి  నిముషాన్నీవార్త గా కోసే ఈ లెన్స్ కత్తి ఎక్కడిది ? అద్భుతం, అవసాన కాలం ఏదైనా బందిపోటులా  గుండెల్లో గుచ్చుకుంటుంది కనురెప్పలు మూసేలోపు కనబోయే కలల్నీ కూడా గాలం వేసి ప్రసారిస్తుంది తెరచాటు దృశ్యాల కోసం ఇన్నిన్ని వేట కుక్కలు పొంచి చూస్తుంటే ఎక్కడని దాక్కోగలం ? ఒంటి స్తంభం మేడలు కీకారణ్యాలు కూడా నాసా కంట్లో లైవ్ టెలికాస్టే ! ప్రతిక్షణాన్నీ మింగే బైట్స్! ప్రతిసందర్భమూ డిజిటల్ పోజే ప్రతి జీవితం ఓ అల్బమే ! ప్రేమ మరణం అన్నీ సామాజికం జాతీయం ఇంక గుండెలు పిండే నీ ఏడుపుకూడా కెమేరా కోసమే! నువ్వు చావాలనుకుంటే మరణ వాగ్మూలం కూడా ముందుగానే చదువుకోవాలకుంటుంది ఆచ్చాదన లేని దృశ్యశకలాలు క్లోజప్స్లో బట్టబయలు ఎఫ్.టి.వి నయం కదూ! నీ బతుకు, నవ్వు,దుఃఖం నీవైతేగా ఆ కన్ను కాసేపు మూసేయ్ మిత్రమా! హాయిగా అమాయకంగా బతికేద్దాం!

ప్రతి ఏడు వస్తుంది దీపావళి

 దీపావళి -కనకదుర్గ ప్రతి ఏడు వస్తుంది దీపావళి అమావాస్యనాడు భువిలో దీపాలతో పున్నమి వెలుగులు విరజిమ్ముతుంది. నిరాశ అనే చీకటిని తొలగించి ఆశ అనే జ్యోతిని వెలిగించేదే దీపం స్వార్ధచింతన ఎక్కువై మనిషి కష్టాలనే చీకట్లల్లో చిక్కుకుపోయిన వారి గురించి ఆలోచించే మంచితనం కోల్పోతూ మనసుల్లో అంధకారం నింపుకుంటున్నారు. పండగ బోలెడంత డబ్బు పోసి ఇల్లంతా దేధీప్యమానంగా దీపాలతో ఎలక్ట్రిక్ లైట్లతో అలంకరించి శివకాశిలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిన్నారులు వారి చిన్ని చిన్నిచేతులతో తయారు చేసిన మతాబులను, తెచ్చుకుని కుటుంబం వారితో, స్నేహితులతో జరుపుకుని మురిసిపోవడమే దీపావళి కాదు. ఏనాడైతే స్వార్ధం అనే అంధకారంతో మూసుకుపోయిన హృదయాల్లో ఇతరుల పట్ల, సమాజం పట్ల తమ ధర్మం నిర్వర్తించాలనే దీపం వెలుగుతుందో, పేద, గొప్పా తేడాలు తొలగిపోయి ప్రతి ఒక్కరూ సమానంగా వుండేరోజు వచ్చిననాడు, మన అంతరంగాల్లో జ్యోతులు వెలుగుతాయి మూసుకుపోయిన మనస్సులు తెరుచుకుని ఏ తేడాలు లేకుండా తమస్సుని తరిమికొడతాయి.

ఆభాష

ఆభాష - డా.సి.భవానీదేవి పుట్టింది మొదలు నేను మాట్లాడిందేది నాకు మిగల్లేదు మానం తప్ప కాలం కొసవెంట నడిచొచ్చే సుదీర్ఘ నిశ్వాసం తప్ప ఉక్కిరిబిక్కిరియ్యే మతాల కుప్పల మద్య ఒక్క క్షణం భుమ్యాకాశాల్నీ బందించే నిశబ్ధం వేలకోట్ల స్వరాల్నీగడ్డ కట్టిస్తుంది దుఃఖం పొరలు పొరలవుతున్నా వెచ్చని అనుభవం తెరలు దించుకుంటున్నా నా పెదవులు మధ్య నలిగిపోతూనే ఉంటుంది దేహనాళాల్లోకి సంచలిస్తూ నన్ను కల్లోలపరుస్తూనే ఉంటుంది మాటలు తాకలేని మూగప్రకంపనలు పలుకు పలుకు చిలకలకి జోలపాడుతుంటాయి మొరటు పిడికిళ్ళు దూసే శబ్దాల ఈటెల మధ్య నిర్వేదపు పెనుచీకటి ముసుగేసిన రెప్పల్లో చైతన్యంలా పురివిప్పే మహా మౌనమే నా అంతర్భాష చివరి క్షణంలో కూడా నన్ను వీడని హృదయశ్వాస

అందానికి అందం ఈ ప్లాస్టిక్ బొమ్మ

అందానికి అందం ఈ ప్లాస్టిక్ బొమ్మ   -కనకదుర్గ- పొద్దు పొద్దునే వికో టర్మరిక్ రాసుకుని, మరి కాసేపు కాగానే ఫేయిర్ అండ్ లన్లీ రాసి, చర్మం నిగ నిగలాడాలనే ఆత్రం ఇది చాలదన్నట్టు మొటిమల కోసం అమెరికా నుంచి ఫ్రెండ్ పంపించిన ప్రొ ఏక్టివ్ ప్లస్ అనే క్రీం రాసుకుని, తను ఎప్పటికీ చాలా యవ్వనంగా కనిపించడానికి పాండ్స్ క్రీమ్ రాసుకుంటే మంచిదని అది కూడా రాసుకుంది ఓ సుందరి, సబ్బులయితే ఎన్ని కొని పెట్టుకుందో తన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి, లక్స్, పియర్స్, మైసుర్ సాండల్, సంతూర్, రెక్సోనా రాసుకుంటే అయితే అమ్మాయి చెయ్యి తగిలిందంటే భర్త కానీ, భాయ్ ప్రెండ్ కానీ ఆమెకి, ఆమె శరీర మృదుత్వానికి దూరంగా వుండలేరు అని చూసి అది కూడా రాసేసుకుంటుంది, డవ్ సబ్బు రాసుకుంటే చర్మం ఎంత మెత్తగా వుంటుందంటే ఒకసారి అది రాసుకున్న వారు మరో సబ్బు వాడరంటారు, కానీ అన్ని వాడితే అందరికంటే అందంగా వుండాలనే తాపత్రయంతో అన్ని వాడడం మంచిదనుకుంది మన సుందరి. జుట్టు పొడువుగా, మృదువుగా, నల్లగా  ఉండి ఒక్క వెంట్రుక కూడా వూడిపోకుండా పెరగాలంటే ప్యారాచ్యూట్ కొబ్బరి నూనె రాసుకుంది, జుట్టు పల్చగా వుండకుండా, తన జుట్టు వత్తుగా వుందని తెలియడానికి ఎక్కడైనా పార్టీలో అందరి కళ్ళు తన జుట్టు పైనే వుండేలా డాబర్ ఆమ్లా హేయిర్ ఆయిల్ రాసుకుంది, జుట్టు సాంప్రదాయంగా పొడవుగా జడ వేసుకుని అందరి దృష్టి మీ జుట్టు పైనే వుండాలంటే మందారం, ఉసిరికాయలు, కొబ్బరినూనె కలిపి తయారు చేసిన నూనె రాసుకుంటే మరీ మంచిదనీ అది కూడా పట్టించింది.   జుట్టు టీవిలో చూపించే విధంగా పట్టుకుచ్చులా మెరిసిపోతూ వుండాలంటే, అలాగే ఒక లారీని లాగి పారేసేంత ధృఢంగా, పొడువుగా వుండాలంటే గార్నియర్ షాంపూ రాసుకుని తలార స్నానం ఒకరోజు, మరో రోజు చుండ్రు రాకుండా నల్లగా మెరుస్తూ వుండే జుట్టుకోసం ఒక సినీ హిరోయిన్లా కనపడడానికి హెడ్ అండ్ షౌల్డర్స్ షాంపూ రుద్దుకుని తలకి పోసుకోవడం, జుట్టు రోజంతా మెరుస్తూ మెరిపిస్తూ వుండాలంటే సన్ సిల్క్ షాంపూతో తలకి పోసుకుంటే షైనీ గ్లో వుంటుందని చూడగానే వెంటనే తెచ్చుకుని తలకి పోసేసుకుంది. ట్రెసెమ్మె షాంపూ రాసుకుంటే హేయిర్ సలాన్ కి వెళ్ళకుండానే అలాంటి జుట్టుని సంపాదించుకోవచ్చు. ఇన్నీ కాస్మటిక్స్ వున్నా కూడా తనివి తీరని వారికి అడుగడుక్కి బ్యూటీ సలాన్ లు మొదలయ్యాయి. వయసు తక్కువగా కనపడడానికి చిన్న చిన్న ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్స్ ద్వారా ఎంత వయసు వచ్చినా యవ్వనంలో వున్న స్త్రీలానే కనపడేలా, బోటాక్స్ లు, ఫేస్ లిఫ్ట్ లతో,  రక రకాల సర్జరీలతో వయసునే ఆపే ప్రయత్నం చేస్తున్నారు.  ఈ కాస్మటిక్స్ ఇండస్ట్రీలకు లాభాలను ఆర్జించి పెడుతున్న ప్రపంచంలోని మధ్యతరగతి, డబ్బున్న స్త్రీలందరూ పురుషులను తాము అందంగా వుండి వారిని ఆకర్షించి వుంచుకోవాలనే తాపత్రయం.  ఇన్ని చేసినా ఎంతో మంది ముసలి పురుష పుంగవులు  తమ కూతుళ్ళ, మనవరాళ్ళ వయసు వాళ్ళని  పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు పాపం. సహజమైన అందంతో వుండే అమ్మాయిలను అందానికి అందం అయిన పుత్తడిబొమ్మ అనేవారు, కానీ ఈ రోజు ఈ కాస్మెటిక్స్, ప్లాస్టిక్ సర్జరీల మోజులో అందానికి అందం ఈ ప్లాస్టిక్ బొమ్మలు అవుతున్నారు!