ప్రతి ఏడు వస్తుంది దీపావళి
posted on Nov 4, 2013
దీపావళి
-కనకదుర్గ
ప్రతి ఏడు వస్తుంది దీపావళి
అమావాస్యనాడు భువిలో
దీపాలతో పున్నమి వెలుగులు
విరజిమ్ముతుంది.
నిరాశ అనే చీకటిని
తొలగించి ఆశ అనే జ్యోతిని
వెలిగించేదే దీపం
స్వార్ధచింతన ఎక్కువై మనిషి
కష్టాలనే చీకట్లల్లో చిక్కుకుపోయిన
వారి గురించి ఆలోచించే మంచితనం
కోల్పోతూ మనసుల్లో అంధకారం
నింపుకుంటున్నారు.
పండగ బోలెడంత డబ్బు పోసి
ఇల్లంతా దేధీప్యమానంగా దీపాలతో
ఎలక్ట్రిక్ లైట్లతో అలంకరించి
శివకాశిలో ప్రమాదకరమైన
పరిస్థితుల్లో చిన్నారులు వారి
చిన్ని చిన్నిచేతులతో
తయారు చేసిన మతాబులను,
తెచ్చుకుని కుటుంబం వారితో,
స్నేహితులతో జరుపుకుని
మురిసిపోవడమే దీపావళి కాదు.
ఏనాడైతే స్వార్ధం అనే అంధకారంతో
మూసుకుపోయిన హృదయాల్లో
ఇతరుల పట్ల, సమాజం పట్ల
తమ ధర్మం నిర్వర్తించాలనే
దీపం వెలుగుతుందో,
పేద, గొప్పా తేడాలు తొలగిపోయి
ప్రతి ఒక్కరూ సమానంగా
వుండేరోజు వచ్చిననాడు,
మన అంతరంగాల్లో జ్యోతులు వెలుగుతాయి
మూసుకుపోయిన మనస్సులు తెరుచుకుని
ఏ తేడాలు లేకుండా తమస్సుని తరిమికొడతాయి.