నిలతీత
posted on Oct 26, 2013
నిలతీత
- డా.సి భవానిదేవి
నాకు తెలీలేదు గానీ
నేను పుట్టగానే
అమ్మ మొహం వాడిపోయిందిట!
అమ్మలక్కలు మూతులు ముడిచారట
కులం జాతి చుట్టరికాలు
పేరు కన్నా ముందే తగుల్కున్నాయిట!
మళ్ళీ ఇంకో ఇంటిపేరు
ముల్లకంచేలే మెట్లై
బతుకంతా గాయాలై
చివురేసేలోపే చిదిమేసే రక్కసిగోళ్ళు
మొగ్గలేసేలోపే తుంచేసే 'మను' వాదాలు
ఎన్ని తరాల సుదీర్ఘ పోరాటం
ఎందుకు ఈ సహజీవన వైరం ?
అమ్మకే బరువయ్యే అమ్మాయిలా పుట్టడం
నేరమని నాకప్పుడు తెలీదు
దేవుడు కనిపిస్తే ఒక్కటే ప్రశ్న
అమ్మాయిలా పుట్టి చూడు
అంత ధైర్యం ఉందా ? అని...