చిలుకతో స్నేహం

చిలుకతో స్నేహం     ఒక అడవి అంచున చెన్నప్ప అనే బోయవాడు ఒకడు ఉండేవాడు. రోజూ ఏదో ఒకటి వేటాడి తెచ్చుకొని కడుపు నింపుకునేవాడు. అతనికి దగ్గరి బంధువులు అంటూ పెద్దగా ఎవ్వరూ లేరు- ఒంటరివాడు. ఒకరోజు అతను బిగించిన ఉచ్చులో చక్కని రామ చిలుక ఒకటి తగులుకున్నది. చాలా అందంగా, ముద్దుగా ఉన్నదది. అది దొరికిన రోజున ఇంట్లో తినేందుకు వేరే ఏమీ లేవు; కానీ చెన్నప్పకు దాన్ని చంపబుద్ధి కాలేదు. 'దీన్ని తింటే ఏం కడుపు నిండుతుంది?' అని దాన్ని ఓ పంజరంలో పడేసి, తను ఇన్ని నీళ్ళు త్రాగి పడుకున్నాడు.  తర్వాతి రోజున చెన్నప్ప నిద్రలేచే సరికి అది పంజరంలోనే తిరుగుతూ చక్కగా పాటలు పాడుతున్నది. అతనికి దాన్ని చూస్తే బలే ముచ్చట అనిపించింది. "సరేలే!‌ నీ టైం బాగుంది" అని వాడు దానికి కొన్ని పళ్ళు, విత్తనాలు తెచ్చి ఇచ్చి, వేటకు వెళ్ళాడు. ఆ రోజున అతను ఇంటికి వచ్చేసరికి చిలుక "ఇంత లేటైందేం?" అన్నది. అతను దానికేసి వింతగా చూసాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అతనికి చిలుకతోటి అనుబంధం పెరిగింది. దాని రెక్కలకి బంధం వేసి, ఇప్పుడు తనతో పాటు వేటకి కూడా తీసుకువెళ్తున్నాడు, చెన్నప్ప. దానికి ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నాడు.  ఒక రోజున అతను చిలకను వెంటబెట్టుకొని అలా వేటకు వెళ్ళాడు. ఆ రోజున ఏ జంతువూ దొరకలేదు; ఎండ బాగా ఉంది కూడా. మధ్యాహ్నం అయ్యేసరికి చెన్నప్ప బాగా అలసిపోయాడు. వేటను ఆపి ఒక చెట్టుకింద విశ్రాంతిగా పడుకున్నాడు. అతన్ని అలా చూసేసరికి రామచిలకకి జాలి అనిపించింది. దగ్గర్లో అంతటా వెతికి, ఓ పళ్ల చెట్టు మీదికి అతి ప్రయత్నం మీద ఎగిరింది. కొన్ని పళ్లను తను తిని, చెన్నప్ప కోసం కూడా కొన్ని పళ్ళు తీసుకున్నది. 'ఇక క్రిందికి దూకుదాం' అనుకుంటుండగా దానికి భయంగొలిపే దృశ్యం ఒకటి కనిపించింది! చెన్నప్ప పడుకున్న చెట్టు వెనకనే ఒక పొద ఉన్నది. ఆ పొదలోనే ఒక పులి కూర్చొని ఉన్నది. అది ఆశగా చెన్నప్ప వైపే చూస్తూ, పెదిమలు నాక్కుంటున్నది! దానికి ఆకలిగా ఉందని, ఏదో ఒక క్షణంలో అది చెన్నప్ప మీదికి దూకబోతున్నదని చిలుకకు అర్థమైంది.    దాని బుద్ధి చురుకుగా పని చేసింది. చెన్నప్ప పడుకున్న చెట్టు పైనే ఒక తేనెతుట్టె ఉంది. అతనికి ఇచ్చేందుకు తను కోసిన పండ్లను అది గురిచూసి సూటిగా ఆ తేనెతుట్టె మీదికి విసిరేసింది. తేనెటీగలు 'జుం' అంటూ లేచాయి. కొన్ని తేనెటీగలు సూటిగా క్రింద ఉన్న పొద వైపుకు దూసుకు పోయాయి. వెంటనే పులిని కుట్టటం మొదలెట్టేసాయి కూడా! పులి గిరుక్కున వెనక్కి తిరిగింది. తనను చుట్టుముడుతున్న తేనెటీగలనుండి తప్పించుకోవటం కోసం దూరంగా పరుగు తీసింది. ఇక చిలుక చెన్నప్ప దగ్గరికి వెళ్ళి "లే!లే! త్వరగా!" అని అరిచింది. చెన్నప్ప లేచేసరికి చుట్టూ తేనెటీగలు ముసురుకుంటున్నాయి. చటుక్కున తను వెంటతెచ్చుకున్న గోనెసంచీలో దూరాడతను! తేనెటీగలు పోయాక బయటికి వచ్చిన చెన్నప్పకు చిలుక పులి సంగతి చెప్పింది.    పొదలో పులి ఉండిన గుర్తులు కూడా చూసాక, చెన్నప్పకు చిలుక అంటే ప్రత్యేకమైన అభిమానం కలిగింది. "నువ్వు చాలా గొప్ప స్నేహితుడివి! నా ప్రాణాలు కాపాడావు! నీకు ఏ బహుమతి ఇవ్వమంటావు, చెప్పు!" అన్నాడతను. "వేరే ఏమీ వద్దు- నీకు ఇష్టమైతే నా రెక్కలకు కట్టిన బంధాలు తీసెయ్యి. నన్ను స్వేచ్ఛగా ఎగరనియ్యి!" అన్నది చిలుక. చెన్నప్ప మారు మాట్లాడకుండా దాని రెక్కలకున్న బంధాలను తొలగించాడు. 'చిలుక ఎగిరిపోతుంది' అనుకున్నాడు. కానీ అది అతన్ని విడిచి పోలేదు! ఇప్పుడు వాళ్ల స్నేహం మరింత గట్టిపడింది.  - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

డబ్బుల పర్సు గోల

డబ్బుల పర్సు గోల...!     బడిలో పిల్లలంతా కలిసి మ్యూజియం చూద్దామని వెళ్లారు. ఆదివారం, ఉదయం పూట వాతావరణం అంతా చల్లగా, హాయిగా ఉంది. మ్యూజియం బయట చక్కని పచ్చిక బయలు ఉంది. పిల్లలంతా అక్కడ కూర్చున్నారు, వరసలు వరసలుగా. వాళ్లతో పాటు వచ్చిన టీచర్లు కొందరు దగ్గర్లో నిలబడి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. కొందరేమో మ్యూజియం నిర్వాహకులతో మాట్లాడి టిక్కెట్లు తెచ్చేందుకు వెళ్లారు. ఓ పిల్లాడికి కొంచెం నవ్వుకోవాలనిపించింది. 'ఏం చేద్దాం?' అని చుట్టూ చూశాడు. దగ్గర్లోనే సుధాకర్ సార్ నిలబడి ఉన్నారు; వేరే ఎవరితోనో మాట్లాడుతూన్నారు. ఆయన ప్యాంటు జేబులో ఓ పర్సు- సగం జేబులో ఉంది; మిగిలిన సగం బయటికి వచ్చి ఉంది. వీడు ఓ కట్టెపుల్ల తీసుకొని, ఆ పర్సును పొడిచాడు, ఊరికే- పర్సు జారి క్రింద పడ్డది! పర్సు జారిపోవటాన్ని గమనించుకోలేదు సుధాకర్ సారు. తనలోకంలో తను ఉన్నారు. పిల్లాడు ఒక క్షణం పాటు ఆ పర్సును 'సారుకిద్దామా?' అనుకున్నాడు- కానీ ఇవ్వలేదు. దాన్ని కొంచెం అటు ప్రక్కగా ఉన్న గుబురులోకి తోసాడు. ఆపైన ఏమీ తెలీనట్లు కూర్చున్నాడు. ఓ పది నిముషాల తర్వాత సుధాకర్ సారు జేబులు తడుముకున్నారు. పర్సులేదు! ఆ పర్సులో చాలానే డబ్బులుండాలి! వాటికంటే ముఖ్యం, ఆయనకున్న రకరకాల కార్డులు అన్నీ ఉండాలి! అవి లేకపోతే తను బస్సుకూడా ఎక్కలేడు!! ముందు ఆయన అటూ ఇటూ వెతికి చూసాడు. ఆపైన తోటి టీచర్లను అడిగాడు. టీచర్లేమో పిల్లల్ని అడిగారు. చివరికి అందరు పిల్లలూ ఆ చుట్టుప్రక్కలంతా వెతకటంలో పడ్డారు. సుధాకర్ సార్‌కు చికాకు మొదలైంది. అరవటం మొదలెట్టారు. అంతలోనే మ్యూజియంవాళ్లు తలుపులు తెరిచారు. కొందరు పిల్లలు అటుపరుగెత్తారు. టీచర్లంతా సుధాకర్ సారుకేసి చూసారు. పిల్లల్ని వెనక్కి రమ్మన్నారు. సుధాకర్ సారేమో గంతులు వేస్తున్నారు -ఉన్నవాళ్లనీ లేనివాళ్లనీ కలిపి తిడుతూ శూన్యంలో వెతుకుతున్నారు. చుట్టూ ఉన్న పిల్లలు వణికిపోతున్నారు. టీచర్లంతా కంగారు పడుతున్నారు. "డబ్బులుపోతే పర్లేదు- కార్డులు పోయినాయే!' అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు "జాగ్రత్తగా ఉండొద్దూ!?" అంటున్నారు. అవి వింటున్నకొద్దీ మరింత రెచ్చిపోయారు సుధాకర్ సారు. "ఎవ్వరూ ఇక్కడి నుండి కదిలేది లేదు. నా పర్సు దొరకాలి! పిల్లలంతా లైనుగా నిలబడండి!” అని అరిచారు. పర్సుని పొదలోకి నెట్టిన పిల్లాడికి ఇప్పుడు భయం మొదలైంది. "పొదలోనే ఉండాలిగా!? ఎవరికీ ఎందుకు దొరకలేదబ్బా?!" అని మెల్లగా అటువైపు చూసాడు- పొదలో పర్సు లేదు!! వాడికి ప్రాణాలు పోయినంత పనైంది. దాంతో మళ్ళీ అటుకేసి చూడకుండా వేరే దిక్కుకు పోయి, చప్పుడు చేయకుండా బిక్కముఖం పెట్టుకొని కూర్చున్నాడు. కొద్దిసేపటికి అందరూ లేచి మ్యూజియంలోకి వెళ్లారు. కానీ ఏ ఒక్కరూ అక్కడి అపూర్వ వస్తువుల కేసి కొద్దిసేపైనా చూసిన పాపాన పోలేదు. సుధాకర్ సార్ అరుపులు, ఆక్రోశం, ఆవేశం అన్నీ ఐదారు గంటల పాటు కొనసాగాయి మరి! సాయంత్రం కావస్తుండగా అంతా బయటికొచ్చారు. టీచర్లు, కొందరు పిల్లలు మళ్లీ ఓసారి అక్కడంతా వెతికారు. అంతకు ముందు ఎందుకు కనిపించలేదో గానీ, ఇప్పుడు అటు చూడగానే కనిపించింది- పొదలో దాక్కున్న పర్సు! దాన్ని చూడగానే సుధాకర్ సారు ముఖం వెలిగింది. టీచర్లంతా ఊపిరి పీల్చుకున్నారు. పిల్లల నవ్వులు మళ్ళీ కొంచెం కొంచెంగా వినిపించాయి. దీనికంతటికీ కారణమైన పిల్లాడు మాత్రం అందరికంటే గట్టిగా, అందరికంటే సంతోషంగా నవ్వాడు. కానీ ఇదంతా కొద్ది సేపే- ఇళ్ళకు చేరాలిగా, అందరూ ఊపిరి పీల్చుకొని బస్సెక్కేందుకు బయలుదేరారు. మ్యూజియంలోని అరుదైన బొమ్మలు, పార్కులోని అందమైన పూలచెట్లు మటుకు ఆ రోజంతా తమని వీళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేదని ఏడుపు ముఖం పెట్టాయి. 'డబ్బుల పర్సు ఎంతపని చేసింది!' అని కుళ్ళుకున్నాయి.    

పిచ్చుక కోపం

పిచ్చుక కోపం     అనగనగా ఒక ఊళ్లో ఒక పిచ్చుక, ఒక కాకి ఉండేవి. అవి రెండూ ఒకసారి ఒక తోటకు వెళ్ళాయి. అక్కడ పిచ్చుకకు ఒక వరి గింజ దొరికింది. వెంటనే అది దాన్ని నోట్లో వేసుకుంది. కాకి కూడా అక్కడే ఆహారం కోసం వెదుకుతూ ఉంటే, దానికొక నాణెం కనబడింది. ఆ నాణాన్ని చూడగానే కాకికి వింత సంతోషం కలిగింది. అది ఆ నాణాన్ని తీసుకొని ఒక పెద్ద చెట్టు కొమ్మమీద ఆడుకోవడం మొదలుపెట్టింది. అది చూసిన పిచ్చుక, తను కూడా అలా నాణెంతో ఆడుకోవాలనుకుంది. అందుకని అది కాకి దగ్గరకు వెళ్ళి ’నాణాన్ని నాకివ్వవా’ అని అడిగింది. అప్పుడు కాకి "ఈ నాణెం నాది. నేను దీన్ని నీకివ్వను" అని చెప్పింది. పిచ్చుక మరోసారి అడిగింది. కానీ కాకి ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. పిచ్చుకకు కోపం ముంచుకొచ్చింది. "ఉండు నీ పని చెబుతా, నీ పని!" అని అది కాకి కూర్చున్న చెట్టుతో అన్నది, "చెట్టూ, చెట్టూ! ఆ కాకిని వెంటనే నీ మీదనుండి తరిమెయ్యి" అని. "ఊహూ! నేను తరమను. ఈ కాకి నాకేమీ హాని చెయ్యలేదు. సరైన కారణం లేకుండా ఊరికే నేనెవ్వరికీ ఇబ్బంది కలిగించను" అన్నది చెట్టు. చెట్టు మాటలు పిచ్చుకకు ఇంకా కోపం తెప్పించాయి. "సరే ఆగు. నీ పనీ పడతాను" అని అక్కడి నుండి చెట్లు కొట్టే ఒక మనిషి దగ్గరకు వెళ్ళింది పిచ్చుక. ఇక అక్కడ అతనితో చెప్పింది "ఓ మనిషీ! నువ్వా చెట్టును నరికి పారెసెయ్యి" అని. అందుకు ఆ మనిషి "నాకిప్పుడు వేరే పనుంది. నేను ఆ చెట్టును కొట్టలేను ఫో" అన్నాడు. "సరే. ఇక నేనిప్పుడు నీ సంగతేంటో చూస్తాను మొదట" అంటూ పిచ్చుక అక్కడి నుండి గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళింది. పిచ్చుక గ్రామ పెద్దతో, "ఓ పెద్దాయన గారూ! మీరా చెట్లు కొట్టే వాణ్ణి శిక్షించండి" అన్నది. అప్పుడా గ్రామ పెద్ద "ఊరికే తన పని తను చేసుకుంటున్న వాణ్ణి నేనెందుకు శిక్షిస్తాను? లేదు, లేదు. నేను ఆ పనిని చెయ్యలేను!" అన్నాడు. అప్పుడా పిచ్చుక "సరే. అయితే నేనింక రాజు దగ్గరికి పోయి చెప్తా, మీ అందరి పనీ" అంటూ రాజు దగ్గరికి ఎగిరివెళ్లింది. పిచ్చుక వెళ్ళి, రాజుతో "ఓ రాజా! మీరు గ్రామ పెద్దను దండించండి, దయచేసి" అని అడిగింది మర్యాదగా. అందుకు రాజు "నిరపరాధులను శిక్షించడమా! మేం ఆ పనిని చెయ్యలేము. చెయ్యము కూడా" అని చెప్పేశాడు. పిచ్చుక అక్కడి నుండి రాణి దగ్గరకు వెళ్ళింది. "ఓ మహారాణీ! మీరు రాజుతో చెప్పండి, ఆ గ్రామ పెద్దను శిక్షించమని" అన్నది. అందుకు రాణి "ఊహూ! నేను చెప్పను. అవన్నీ రాజుగారే చూసుకుంటారు" అని చెప్పింది. "అయితే సరే. నేను ఇంకెవరినైనా అడుగుతానుగానీ" అని పిచ్చుక ఒక ఎలుక దగ్గరికి పోయింది. "ఎలుకా, ఎలుకా! నువ్వు నాకోసం రాణిగారి బట్టలను కొరికి పారెయ్యవా!" అని అడిగింది. ఎలుక అన్నది, "రాణి నన్నేం చెయ్యలేదు కదా! నేనెందుకు రాణిగారి బట్టలను కొరుకుతాను? నేను కొరకను" అని. "సరేలే ఎలుకమ్మా!" అని పిచ్చుక అక్కడి నుండి ఒక పిల్లి దగ్గరకు ఎగిరింది. "ఓ పిల్లీ! నువ్వు రాణి గారి ఇంట్లోని ఎలుకను తినేసెయ్యి" అని చెప్పింది పిచ్చుక. పిల్లి అప్పుడే వేరే ఏదో తిని భుక్తాయాసంతో ఉన్నది. "నేను తిననమ్మా, నా కడుపులో చోటు లేదు" అని చెప్పిందది. అప్పుడు పిచ్చుక కుక్క దగ్గరికి వెళ్ళి అడిగింది "ఓ కుక్కా! నువ్వు ఆ పిల్లిని తినేసెయ్యి" అని. అందుకు ఆ కుక్క "నేనెందుకు తినాలి పిల్లిని? నాకా అవసరమే లేదు" అని చెప్పింది. అలసిపోయిన పిచ్చుక అక్కడినుండి మూతి తిప్పుకుంటూ ఒక కర్ర దగ్గరకి వెళ్ళింది. కర్రను అడిగింది, "ఓ కర్రా! నువ్వు ఆ కుక్కను బాగా కొట్టవా, దయచేసి?" అని. అందుకు ఆ కర్ర "లేదు, లేదు! నేను ఆ కుక్కను ఊరికే కొట్టలేను" అని చెప్పింది. పిచ్చుక అక్కడికి దగ్గర్లోనే ఉన్న మంట దగ్గరికి వెళ్ళింది. "మంటా, మంటా! నువ్వు కర్రను కాల్చెయ్యి" అని అడిగింది. మంట అన్నది, "లేదు పిచ్చుకమ్మా, నేను దూరంగా ఉన్న కర్రను ఏమీ చేయలేను" అన్నది. ఇక పిచ్చుక అక్కడి నుండి నది దగ్గరకు ఎగిరింది. నదితో- "ఓ నదీ! నువ్వు ఆ మంటను ఆర్పేయాలి. నా కోసం నువ్వా పనిని చెయ్యవా?" అని అడిగింది. అందుకు ఆ నది "నేనక్కడికి రాలేనుగానీ, అదిగో- ఆ చెట్టు కింద ఒక ముని కూర్చొని ఉన్నాడు చూడు. కావాలంటే అతని దగ్గరకు వెళ్ళు" అని చెప్పింది. అక్కడి నుండి పిచ్చుక ఋషి దగ్గరికి ఎగిరి వెళ్ళింది. "ఏం జరిగిందో చెప్పమ"న్నాడు ఋషి. పిచ్చుక రూపాయి నాణెంతో మొదలు పెట్టింది గానీ, చెప్తూ చెప్తూండగానే దానికి ఇక ఏం చెప్పాలో అర్థం కాలేదు. తన కోపం ఎవరిమీద మొదలై ఎటుపోయిందో చూసి దానికే నవ్వు వచ్చింది. చివరికి అది "నాకు సమాధానం దొరికింది స్వామీ, వెళ్లొస్తాను " అని చెప్పి, తినేందుకు గింజల్ని వెతుక్కుంటూ ఎగిరిపోయింది.    

గురుభ్యోనమః

గురుభ్యోనమః మనిషి జీవితంలో విద్య పోషించే పాత్ర చాలా పెద్దది. విద్య లేని వాడు వింత పశువు అన్నది పెద్దల మాట. విద్య లేకపోతే మనుషులేదో రాక్షసులు అవుతారని కాదు కాని విద్య వల్ల మనిషి కొన్ని విలువలు, క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని, తనకున్న ప్రాముఖ్యతను గుర్తించగలుగుతాడు. దురదృష్టవశాత్తు విద్య అనేది కేవలం సంపాదన కోసం అనే భావన చాలా గట్టిగా స్థిరపడింది ఈ రోజుల్లో. అయితే విద్యార్థిలోని ఆశక్తులను వెలికి తీసి అశక్తులుగా ఉన్నవారిని శక్తివంతమైన వారిగా తయారుచేసేవాడు ఉపాధ్యాయుడు. తల్లీ తండ్రీ గురువు, దైవం అన్నారు. మన పురాణాల్లో కూడా గురువు తర్వాతే దైవాన్ని స్తుతించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం అందరికి తెలిసినదే. అయితే ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన భారత మాజీ ఉపరాష్ట్రపతి మరియు మాజీ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం ను ఇలా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం, రాధాకృష్ణన్ గారు అధ్యాపకుడిగా చేసిన కృషి మొదలైనవి తెలుసుకుంటే ఉపాధ్యాయ వృత్తి ఇంత శక్తి మంతమైనదా అనిపిస్తుంది.  ఉపాధ్యాయుడు అంటే?? ఉపద్యాయుడికి అనేక ఇతర పేర్లు ఉన్నాయి. గురువు, టీచర్, అధ్యాపకుడు ఇలా. అయితే పేర్లు ఎన్ని అయినా భావం మాత్రమే ఒక్కటే. శిక్షించేవాడో, శిక్షణ ఇచ్చేవాడో ఉపాధ్యాయుడు అవ్వడు. విద్యార్థులకు మార్గ నిర్దేశం చేస్తూ తాను మార్గదర్శిగా నిలిచేవాడు అసలైన ఉపాధ్యాయుడు అవుతాడు. కానీ ప్రస్తుత కాలంలో దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. విద్యావ్యవస్థ కూడా దీనికి కారణం అని చెప్పవచ్చు. ఎంతసేపు పాఠ్యాంశాలు పూర్తి చేయడం, పరీక్షలు పెట్టడం, ర్యాంకులు, మార్కులు వీటి గోడవలోనే విద్యార్థులను నడిపిస్తున్నారు నేటి ఉపాధ్యాయులు. ఇష్టంతో బోధించడం కంటే, కేవలం సాలరీ కోసం, కాస్త సెక్యురిటి ఉంటుందనే ఆలోచనతో ఉపాధ్యాయులుగా మారుతున్నవాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు.  విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం | పాత్రత్వాత్ ధనమాప్నోతిధనాద్ధర్మం, తతః సుఖం || విద్య అనేది సక్రమంగా జరిగితే అది విద్యార్థిలో వినయాన్ని పోగు చేస్తుంది. వినయం ఉన్నపుడు విద్యార్థి అర్హత పొందగలుగుతాడు, అర్హత అనేది ఎప్పుడైతే కలుగుతుందో, అప్పుడు విద్యార్థి సంపాదనాపరుడు అవుతాడు. వినయం ద్వారా, అర్హత ద్వారా సంపాదించే డబ్బును ఆ వ్యక్తి కచ్చితంగా మంచి పనులకోసం ఉపయోగిస్తాడు. దీనివల్ల మనిషి జీవితం ధర్మబద్ధంగా కొనసాగుతుంది. విద్య అనేది మనిషిని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దగలదో చెప్పేది ఈ శ్లోకం. మరి అంతటి విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాల్సిన ఉపాధ్యాయుడు మళ్ళీ ఉత్తేజితుడై భావిభారత పౌరులుగా విద్యార్థులు మారడంలో తన వంతు పాత్ర పోషిస్తే. మన భారతం గొప్ప విద్యానిలయం అవుతుంది.  అలాగే జీవితంలో అమ్మ మొదటి గురువుగా మన జీవితానికి మొదటి అడుగు వేయిస్తుంది. తరువాత ఎదురయ్యే వాళ్ళు ఎందరో. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నేర్పేవాళ్లే. అందుకే జీవితంలో ఎందరో అధ్యాపకులు. ఇంకా చెప్పాలంటే జీవితమే పెద్ద గురువు అని స్వామివివేకానందుడు ఊరికే అనలేదని అర్థం అవుతుంది. ఉపాధ్యాయులు అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. వృత్తికి వన్నె తెచ్చిన డా౹౹ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.  ◆ వెంకటేష్ పువ్వాడ  

అంతరంగ ఆలోచన..

అంతరంగ ఆలోచన..!!   అంతరంగ ఆలోచన..!! తురంగ విహంగంతో లోక వీక్షణ..!! ఎన్నో సందేహాలు,ఆరాటాలు,పోరాటాలు..!! చిక్కు ముడుల నడుమ అజ్ఞాత శక్తి..! అదే ఈ సృష్టికి మూలమట..!! పంచభూతాల సృష్టి కర్తట..!! నీటిలో మునగదట..!! గాలిలో తేలదట..!! నిప్పుల్లో కాలదట..!! నింగిలో కనిపించదట..!! నేలపై నడవదట..!! అది ఓ అందని శక్తిట..!! అది ఉందో లేదో నాకెందుకట..!! ఉన్నచో నాకు కనిపించిన..!! నిలదీస్తా..ప్రశ్నలతో దాడి చేస్తా..!! ఆడ బిడ్డల మానభంగాల గురించి..!! కన్నీటితో కడుపు నింపుకునే బీద వారి గురించి..!! కరువుల..వరదల..గురించి..!! కుల మత భేదాలు గురించి..!! అదిగేదా..కదిగేదా..ఎన్నో..మరెన్నో కష్టాల గురించి..!! అదృష్ట శక్తి ఉన్నా..లేకపోయినా..నాకెందుకులే..!! ఒక్కటైతే నే యెరుగును..లే..మరణం తధ్యమని..!! జీవికి మృత్యువు తప్పదని..!! తోటి జీవులకు వేదన తప్పదని..!! కడకు మనకొక సమాధి..!! అదే మన కొత్త జివితానికి పునాది..!! - జాని.తక్కెడశిల

దారిలో దయ్యం-నాకేం భయం

దారిలో దయ్యం-నాకేం భయం   లోచర్లలో ఉండే చందు ఇప్పుడిప్పుడే ఆరో తరగతికి వచ్చాడు. వాళ్ల ఊరులో హైస్కూలు లేదు. అందుకని రొద్దం బడిలో చేరాడు. లోచర్ల నుండి రొద్దానికి పన్నెండు కిలోమీటర్లు. రోజుకు నాలుగుసార్లు అటూ ఇటూ తిరిగే బస్సొకటి ఆ ఊరి జనాలను, మిగతా ప్రపంచంతో‌ కలుపుతుండేది. లోచర్ల పిల్లలు ఓ నలుగురు కలిసి, బస్సులో రొద్దం బడికి వెళ్ళి వస్తుండేవాళ్ళు ప్రతిరోజూ. పెద్దవాళ్లెవరూ వెంట లేకుండా తాము పిల్లలమే అట్లా వెళ్ళటం వింతగానూ, కొంచెం భయంగానూ ఉండేది వాళ్లకు. అంతే కాక రొద్దం చుట్టుప్రక్కల అంతా చిన్నపాటి గుట్టలూ, నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాలూ చాలా ఉండేవి. బస్సులు రాకపోయినా, ఏ కారణం చేతైనా రద్దైనా పిల్లలు ఊరికి నడిచి రావాల్సి వచ్చేది. నడిచి వచ్చేసరికి రాత్రి బాగా చీకటి పడిపోయేది కూడా. అట్లాంటప్పుడు సాధారణంగా పిల్లలకందరికీ దయ్యాలు గుర్తుకొచ్చేవి. వాళ్ళలో ఎవ్వరేగానీ దయ్యాల్ని ఎప్పుడూ చూడలేదు- అయినా అందరికీ అవంటే చాలానే భయం ఉండేది. అయితే స్వతహాగా చాలా తెలివీ, ధైర్యమూ, ఆత్మవిశ్వాసమూ ఉన్న చందుకు మటుకు "కనీసం ఒక్క దయ్యాన్నైనా దగ్గరగా చూడాలి; దానితో‌ మాట్లాడాలి; దాన్ని ముట్టుకోవాలి" అని విపరీతమైన కోరిక ఉండేది. చాలా సార్లు ఆ సంగతిని వాడు మిగిలిన పిల్లలకు చెప్పి ఉన్నాడు కూడా.   ఒకసారి బడినుండి పిల్లలంతా ఇంటికి వస్తుండగా, దారిలో బస్సు టైరు పంక్చర్ అయ్యింది. ఆ సమయానికి బస్సులో ఎక్కువమంది లేరు. డ్రైవరు, కండక్టరు బస్సును అక్కడే ఆపేసి, "మీరంతా ఊరికి నడిచి వెళ్ళిపోండి" అని చెప్పేసారు. బస్సులో ఉన్నవాళ్లంతా దిగి చకచకా నడక మొదలెట్టారు. ఒక ఐదు నిముషాల తర్వాత చూస్తే ఈ పిల్లల కనుచూపు మేరలో అంతా నిర్మానుష్యం! చుట్టూ అలుముకుంటున్న చీకటి... వీరుగాడు ఓ దయ్యం గురించి చెప్పటం మొదలు పెట్టాడు. అది తెల్లగా ఉంటుందిట, మబ్బులాగా. దాని నోట్లో రెండు నాలుకలు ఉంటాయట. పిల్లలంతా ఒకవైపున వణికి పోతూనే మరోవైపున ఆసక్తిగా వింటూ నడుస్తున్నారు. మెల్లగా వెన్నెల కాయటం మొదలైంది. అంతలో వాళ్ళకు ఓ ముసలమ్మ కనిపించింది. ఓ కట్టె పట్టుకొని నడుస్తున్నది. తను కూడా లోచర్ల వైపే పోతున్నది. తెల్ల బట్టలు వేసుకొని, జుట్టు విరబోసుకొని ఉన్నది. పిల్లలు ఆమెను దాటుకొని పోబోతుండగా అడిగింది: బాబులూ! చీకటి పడినట్లున్నది. నాకు చూపు సరిగ్గా ఆనదు. కొంచెం మా ఇంటి వరకూ నాతో పాటు తోడుగా వస్తారా నాయనా?" అని. చందు ఆమె దగ్గరికి వెళ్ళి, "ఎక్కడవ్వా, మీ ఇల్లు?" అని అడిగాడు. "దగ్గరికి వచ్చేసాం బాబూ. అదిగో ఆ అక్కడ కనిపించేది మాదే" అన్నది అవ్వ ఓ వైపు చూపిస్తూ. చూస్తే అది ఏమంత దగ్గర అనిపించలేదు. పిల్లలంతా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. చందూ ఆమెతో "సరే పద అవ్వా! నేను వస్తాను నీతో; వీళ్లందరినీ ఇంటికి పొమ్మందాం" అని ఆమె వెంట బయలుదేరాడు. మిగిలిన పిల్లలంతా ఒకసారి వాడికేసి జాలిగా చూసి, తమ నడక వేగం పెంచారు. అవ్వ వాడిని ఏవేవో వంకర దారుల గుండా తీసుకెళ్ళింది. "ఇంకా ఎంత దూరం అవ్వా?" అంటే, "ఇదిగో- ఇక్కడే" అంటున్నది. చివరికి వాళ్ళిద్దరూ ఓ స్మశానంలోకి ప్రవేశించారు. చందుకి వణుకు వచ్చినట్లు అయ్యింది. "ఏంటీ?! మీ ఇల్లు ఇక్కడా?!" అని అడిగాడు వణుకుతున్న గొంతుతో. "అవును బాబూ! మేమూ, మా పిల్లలూ అందరం ఉండేది ఇక్కడే. బాగా లేదా?" సన్నగా నవ్వింది అవ్వ. "అంటే... అంటే.. మీరు దయ్యాలా?!" అరిచాడు చందు, ఎర్రబడిన ముఖంతో. "కాదు బాబూ! అయితే ఇట్లా రాత్రివేళల్లో మమ్మల్ని చూసినవాళ్ళు అందరూ అట్లానే అనుకుంటారు. నిజానికి మేం ఈ ప్రాంతం మొత్తానికీ కావలి వాళ్ళం. మిగతా వాళ్ళందరూ భయపడుతూ దూరం ఉండే ఈ ప్రదేశంలోనే మేం నిర్భయంగా తిరుగులాడతాం. తిరిగి తిరిగి ముసలివాళ్లం అవుతాం ఇట్లాగ!" నవ్వింది అవ్వ.   "మరి మీ భోజనమూ, అదీ?!" అడిగాడు చందూ, అనుమానంగా. "ఏవో దొరికిన పక్షుల్నీ, జంతువుల్నీ తింటాం. అడవిలో దొరికే వెదురుబియ్యం, దుంపలు పళ్ళు వండుకుంటాం" చెప్పింది అవ్వ. "మరి ఇక్కడి దయ్యాలు మిమ్మల్నేమీ చెయ్యవా?!" అడిగాడు చందు. అవ్వ కిసకిసా నవ్వింది. "దయ్యాలు ఎక్కడున్నై బాబూ?! లేవు! మాలాంటి వాళ్లనే మీవాళ్ళు 'దయ్యాలు' అని చెప్పుకుంటూ, వాళ్ళు భయపడుతున్నారు; మమ్మల్ని దూరం పెట్టి చిన్నబుచ్చుతున్నారు" అంది అవ్వ. ఆమె ధన్యవాదాలు అందుకొని, చందూ ఇంటికి బయలు దేరాడు. ఆలోచించినకొద్దీ వాడికి ఆశ్చర్యం వేసింది: "నిజమేనా? వీళ్లంతా మనుషులేనా? దయ్యాలు లేవా, అసలు?!" అని. అయితే గాలికి ఊగుతూ చెట్లు విడుస్తున్న వెన్నెల నీడలు ఇప్పుడింక తనని భయపెట్టటం మానేసాయని వాడు గమనించలేదు. కదిలే ఆ నీడలు చాలా అందంగా ఉన్నాయనిపిస్తున్నది వాడికి! ఇక ఆ తర్వాత వాడికి చీకటంటే భయం పూర్తిగా పోయింది కూడా! కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

చెప్పులకు బుద్ధొచ్చింది!

చెప్పులకు బుద్ధొచ్చింది!     రాముకు చెప్పులంటే చాలా ఇష్టం. ఎవరి చెప్పుల్ని చూసినా తనకూ అలాంటి చెప్పులుంటే బాగుండుననుకునేవాడు. ఒకసారి అతను అనంతపురం వెళ్లాడు. అక్కడ దుకాణాల ముంగిట, వరసలు వరసలుగా మెరుస్తున్న చెప్పులు అతన్ని కదలనివ్వలేదు. చూసీ చూసీ చివరికి అతనో జత చెప్పులు కొనుక్కున్నాడు. ఎర్రటి చెప్పు క్రింద నల్లటి తోలు! పైన అందంగా అమర్చిన బంగారు రంగు చంకీ! చెప్పులు భలే ఉన్నై! అవి వేసుకొని తిరిగితే గాలిలో ఎగిరినట్లే ఉంది! చాలా ఉత్సాహంగా ఆ చెప్పుల్ని వేసుకొని ఇంటికొచ్చాడు అతను. ఇంటికైతే వచ్చాడుగానీ వాటిని వదలబుద్ధి కాలేదు. వాటిని వేసుకొని ఇంట్లో అంతా తిరిగాడు; మళ్లీ మళ్ళీ వాటినే చూసుకొని మురిశాడు. అయినా తనివి తీరలేదు. వాటిని వేసుకొనే అన్నం తిన్నాడు; వాటిని వేసుకొనే నిద్రపోయాడు, నిద్రలేచాక మళ్లీ వాటిని చూసుకొని మురిశాడు - ఏం చేసినా తృప్తి కాలేదు! ఇక అవి అతని శరీరంలో భాగం అయిపోయాయి. క్షణం వదలకుండా వేసుకొని తిరుగుతున్నాడు రాము.  మామూలుగా `చెప్పులకేం తెలీద'నుకుంటాం గానీ, నిజానికి వాటికీ చాలానే తెలుసు. అవీ అలసిపోతాయి. రాము ఇలా వాటిని వదలకుండా వారం రోజులు వేసుకునే సరికి వాటికి ఎలా తప్పించుకుందామా' అని అలోచన మొదలైంది. కానీ రాము వాటిని వదిలితే గద! చివరికి ఒకసారి రాము గుడికి వెళ్ళి, అయిష్టంగానే చెప్పుల్ని బయట వదిలి, లోనికి పోగానే - చెప్పులు రెండూసమయమిదే'నని చల్లగా జారుకున్నాయి. అట్లా పారిపోయిన చెప్పులకు ఏం చేయాలో తెలీలేదు. అందుకని అవి ఓ అడవిలోకి వెళ్లి ఒక పొద మాటున నక్కి కూర్చుని, ఓం నమ: శివాయ' అని జపం మొదలుపెట్టాయి. వాటి మొరను ఆ శివుడు విన్నాడో లేదో గాని, ఆ దారిన పోయే కట్టెల రంగయ్య మాత్రం చక్కగా విన్నాడు. విని, అతను వచ్చి ఆ చెప్పుల్ని వేసుకొని రాజాలాగా నడవటం మొదలుపెట్టాడు! చెప్పుల పనిపెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు'యింది. రంగన్న బరువు ఎక్కువ. అదీగాక అతను అడవి దారుల్లో ఇష్టం‌వచ్చినట్లు తిరిగేరకం. ఆ చెప్పులు వేసుకొని బరువైన రంగన్న ముళ్ల దారుల్లో పోతుంటే ఒక్కోముల్లూ వాటిని గుచ్చి, శూలంలాగాఅ బాధపెడుతున్నది.  రెండు రోజుల్లో వాటి పనైపోయింది! "ఈ అడవి బ్రతుకు బాగాలేదు. ఎలాగైనా తప్పించుకోవాలి రంగన్న నుండి" అనుకున్నై అవి. త్వరలోనే వాటికి ఆ అవకాశం వచ్చింది. రంగన్న ఒక రోజున వాటిని విడిచి చెట్టెక్కి, కొమ్మలు నరికాడు. ఆపైన క్రిందికి దిగి కట్టెలు కొట్టుకొన్నాడు ; తర్వాత మోపునెత్తుకుని నడుచుకుంటూ వెళ్లిపోయాడు - చెప్పులు మరచి! చెప్పులకు మహదానందమైంది. ఇక అవి రెండూ పారిపోయి, అడవి చివర్లో ఓ గడ్డివాము కనబడితే, దానిలోకి పోయి దాక్కున్నాయి.  ఆవుల్ని మేపే ఆదెయ్య అటువైపు వచ్చేసరికి చెప్పులు గాఢ నిద్రలో ఉన్నాయి. కానీ ఆదెయ్య పశువులకోసమని గడ్డి పీకేసరికి అవీ బయటపడ్డాయి. ఇక చెప్పులకు ఆదెయ్య సేవ తప్పలేదు. ఆదెయ్య పశువుల పేడనెత్తినా, మూత్రాన్ని ఎత్తిపోసినా ఈ చెప్పులు వినియోగంలోకి వచ్చాయి. ఎరువు దిబ్బల వెంబడీ, వరిచేళ్ల గట్ల వెంబడీ, జారే జారే బురదలోనూ నడిచీ నడిచీ చెప్పులు నల్లబారాయి. ఇప్పుడు వాటికి బంగారు చంకీలు లేవు. ఎర్రటి పైతోలు లేదు. బంకమన్ను, గడ్డిపోచలు అంటుకొని అవి ఇప్పుడు లావెక్కాయి, బరువుతేలాయి. "ఇది ఇక అయ్యేది లేదు. తప్పించుకోవలసిందే" అనుకున్నై అవి. "రాము మమ్మల్ని ఎంత ముద్దుగా చూసుకునేవాడు! అట్లాంటి వాడిని వదిలి వచ్చేశాం, చూడు" అని వాటిలో పశ్చాత్తాపం మొదలైంది. ఒక రోజున ఆదెయ్య వాటిని వేసుకొని ఊళ్లోకి పోతే, అయిష్టంగానే మోశాయవి. వాటి కోరిక తీరాలనో, ఏమో- ఆదెయ్య వాటిని ఓ ఇంటి ముందు వదిలి, లోనికి వెళ్ళాడు. చూస్తే ఆ ఇల్లు ఎవరిదో కాదు - రాముదే! చెప్పులకు మహదానందమైంది. అవి ఆదెయ్యకు దొరకకుండా తప్పుకొని వేరే మూలన దాక్కున్నాయి. బయటికి వచ్చిన ఆదెయ్య కొంచెం వెతుక్కుని, `సర్లే, పోతే పోయాయి" అనుకొని వెళ్లిపోయాడు. వెంటనే చెప్పులు బయటికి వచ్చి గడప పక్కనే కూర్చున్నాయి - 'రాము తమని ఎప్పుడు చూస్తాడో, ఎప్పుడు మళ్ళీ ముద్దు చేస్తాడో' అని ఎదురుచూస్తూ.రాము ఆ పక్కగా చాలాసార్లు వెళ్ళాడు. కానీ వాటివైపు కనీసం కన్నెత్తైనా చూడలేదు. ఒకరోజున `ఎవరో వీటిని ఇక్కడ వదిలేసిపోయారు. పాత మురికి చెప్పులు! ఎవరికి పనికొస్తాయి?" అని రాము వాళ్ల అమ్మ ఆ చెప్పుల్ని తీసి బయట ఓ పక్కకు విసిరేసింది!   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

నిజాయితీ

నిజాయితీ     రాజు, వాళ్లమ్మ ఒక రోజున దుకాణానికి వెళ్లారు. బిల్లు కట్టే కౌంటరు దగ్గర్లో మూత లేని ఓ సీసా కనబడింది రాజుకు. ఆ సీసాలో సగానికి పైగా చాక్లెట్లున్నాయి.     రాజుకు వాటిని చూస్తే నోరూరింది. అటూ ఇటూ చూసాడు. అక్కడ ఎవ్వరూ లేరు. వెంటనే రాజు అందులోంచి మూడు చాక్లెట్లు తీసి జేబులో వేసుకున్నాడు.   ఇంటికి రాగానే వాళ్లమ్మకు చూపించాడు వాటిని. "ఇవెక్కడివి? నేను కొనలేదే?" అని ఆశ్చర్యపోయింది రాజు వాళ్లమ్మ. "నేనే తీశాను- వాటిని తినాలనిపించింది!" అన్నాడు రాజు అమాయకంగా.   రాజు వాళ్లమ్మకు కోపం వచ్చింది. అట్లా ఎవరికీ చెప్పకుండా ఎందుకు తీసావు? అది దొంగతనం అవుతుంది! అట్లా చేయకూడదు! ఇతరుల వస్తువులను దొంగలించకూడదు! అది ఎంత అసహ్యపు పనో తెలుసా?" అని బాధ పడింది అమ్మ. రాజు చేసిన పనికి ఆమె కళ్లలో నీళ్ళు తిరిగాయి.   రాజు వెంటనే తన తప్పు తెలుసుకున్నాడు. "ఇంకెప్పుడూ ఇట్లా చేయనమ్మా! అడగకుండా తీసుకుంటే పాపం, వాళ్ళకు నిజంగా కష్టమే" అన్నాడు. రాజు వాళ్ల అమ్మ నవ్వి, రాజును ముద్దు పెట్టుకున్నది. "వెంటనే పో. ఆ దుకాణం యజమానికి నువ్వు తెచ్చిన మూడు చాక్లెట్లూ ఇచ్చేసి- ఇంకెప్పుడూ ఇట్లా చేయనని చెప్పి రా!" అని పంపించింది.   దుకాణపు యజమాని రాజు నిజాయితీని మెచ్చుకున్నాడు. "అవును బాబూ! అడక్కుండా‌ తీసుకోకూడదు. అయితే నువ్విప్పుడు మంచివాడివైపోయావు కదా, అందుకని నీకు ఇదిగో, బహుమతి!" అని వాటికి మరో మూడు చాక్లెట్లు కలిపి ఇచ్చి పంపాడు!! Courtesy.. kottapalli.in  

సహాయం

సహాయం   అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. అది చాలా అల్లరి కోతి. అది ఒక రోజు మామిడి చెట్టు ఎక్కింది. అప్పుడే వస్తున్న కుందేలు కోతిని చూసి, "నాకు ఒక మామిడి పండు ఇవ్వు" అంది."నేను ఇవ్వను" అంది కోతి. అప్పుడు కుందేలు ఆకలితోటే వెళ్ళిపోయింది.అంతలో ఒక తోడేలు అటుగా వచ్చింది. కోతి దాన్ని చూసి బెదిరి, నేలమీద పరుగెత్తటం మొదలు పెట్టింది. తోడేలు దాని వెంటపడి తరిమి, చివరికి దాన్ని చేజిక్కించుకున్నది.    అటువైపుగానే కాస్త దూరాన తలవంచుకొని పోతున్నాయి కుందేలు, దాని మిత్రుడు జింకా. అవి చూసాయి, తోడేలు కోతిని ఎత్తుకుపోవడం. రెండూ'కోతిని కాపాడాలి. ఎలాగ?'అని ఒక ఉపాయం ఆలోచించాయి. గబగబా వెళ్ళి, తోడేలు వస్తున్న దారిలో ఓ చెట్టుకు మాంసం ముక్కను వ్రేలాడదీసాయి. ఆ మాంసం ముక్కని అందుకోవాలంటే తోడేలు బాగా పైకి ఎగరాలి. కోతిని లాక్కొస్తున్న తోడేలుకు చెట్టునుండి వ్రేలాడుతున్న మాంసం ముక్క కనపడగానే నోరూరింది.   "కానీ ఈ‌ కోతి ఒకటి ఉన్నదే, ఎలాగ?" అని ఆలోచించింది. కోతిని ఒక ప్రక్కగా చెట్టుమొదల్లో బంధించి వచ్చింది. మాంసం ముక్కను అందుకొనటం కోసం ఎగరబోయింది.   అయితే ఆ చెట్టు క్రింద ఉన్నది పెద్ద గుంత! కుందేలు, జింక ఆ గుంత కనబడకుండా దానిమీద ఆకులు, చెత్తా కప్పి ఉంచాయి! మాంసం ముక్కకోసం ఎగిరిన తోడేలు నేరుగా ఆ గుంతలోకే పడిపోయింది!   కుందేలు, జింక వెళ్ళి కోతిని విడిపించాయి. కోతి కుందేలుకు క్షమాపణ చెప్పుకున్నది. "ఇంతకుముందు నువ్వు అడిగితే నేను పండు ఇవ్వనన్నాను. నన్ను క్షమించు" అన్నది. "ఏం పర్లేదులే! మనకు ఆకలి ఎక్కువైనప్పుడు అందరమూ అలాగే చేస్తాము" అన్నది కుందేలు తేలికగా. అటుపైన మూడూ కలిసి సంతోషంగా జీవించాయి. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

పట్నం ఎలుక

పట్నం ఎలుక     అనగా అనగా ఒక పట్నం ఎలుక ఉండేది. ఒక నాడు అది పల్లెలో ఉన్న తన నేస్తం దగ్గరికి వెళ్ళింది. పల్లె ఎలుక పట్నం ఎలుకకి మర్యాదలు చేసి భోజనం పెట్టింది. పట్నం ఎలుకకి ఆ తిండి నచ్చలేదు. "మిత్రమా! ఈ పల్లెలో ఏం సుఖం ఉంది? ఇదేమి తిండి? పట్నంలోనైతే పిండి వంటలు తినవచ్చు; దర్జాగా బతకవచ్చు. ఒకసారి రుచి చూస్తే నీకే తెలుస్తుంది- నాతో రారాదూ?" అంది. సరేనని పల్లెటూరి ఎలుక బయలు దేరి పట్నం వెళ్ళింది. ఆ రోజు ఆ ఇంట్లో విందు. పిండి వంటలన్నీ అందంగా పేర్చి ఉన్నారు. వాటిని చూడగానే పల్లె ఎలుక పొంగి పోయింది. "మిత్రమా! ఎంత అదృష్టం చేసుకున్నావోగాని, ఇంత చక్కని ఆహారం తింటూ గడిపావు నువ్వు" అని పొగిడింది పట్నం ఎలుకను. పట్నం ఎలుక దర్జాగా దాన్ని ఆ వంటకాల దగ్గరికి తీసుకెళ్ళింది. అంతలోనే ఎవరో లోనికి వస్తున్న అలికిడి అయ్యింది: "మిత్రమా‌! కలుగులోకి దూరు! ఎవరో వస్తున్నారు!" అంటూ లోనికి పరుగు తీసిందది. పల్లె ఎలుక దాని వెనకనే కలుగులోకి పరుగెత్తింది. అవి అక్కడి నుండి చూస్తూండగానే ఇద్దరు మనుషులు లోనికి వచ్చి, మెల్లగా భోజనం చేసి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళగానే మళ్లీ వంటకాల దగ్గరికి చేరాయి ఎలుకలు. ఇంకా దేన్నీ రుచి చూడనే లేదు- మళ్ళీ అలికిడైంది! ఈసారి ఇంకా ఎక్కువ మంది మనుషులు లోనికి వచ్చారు. వాళ్లంతా తిని వెళ్ళేంత వరకూ ఎలుకలు కలుగులోంచి బయటికి రాలేకపోయాయి. ఆ సరికి వాటికి ఆకలి దహించుకు- పోతున్నది. గది ఖాళీ అయ్యిందో లేదో  రెండూ బయటికి పరుగెత్తాయి- మిగిలిన వంటకాలు తినేందుకు. అయితే అంతలోనే కుక్కల అరుపులు వినిపించాయి. రెండు ఎలుకలూ కలుగులోకి దూరాల్సి వచ్చింది మళ్ళీ. ఆ తర్వాత అవి బయటికి వచ్చేసరికి, ఇంటివాళ్ల పిల్లి వాటి వెంటపడి, కిలోమీటరు వరకూ తరిమింది! పల్లె ఎలుకకి ఆకలి దహించుకు-పోతోంది. చివరికి 'ఎలా అయితేనేం' అని, అక్కడే- రోడ్డు ప్రక్కన ఉన్న చెత్తకుప్పలో భయం భయంగా భోజనం కానిచ్చాయి, రెండు ఎలుకలూ!  అప్పుడు ఇంటి దారి పడుతూ అన్నది పల్లె ఎలుక- "మిత్రమా! భయపడుతూ పాయసం తినేకంటే ప్రశాంతంగా కూర్చొని మాడిన మెతుకులు తినటమే హాయినిస్తుంది నాకు. మీకూ మీ పట్టణ జీవితానికీ ఒక నమస్కారం. నా వరకూ నా పల్లె చాలు"అని. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

లచ్చయ్య మంచితనం

లచ్చయ్య మంచితనం   లింగేశ్వరంలో ఉండే కోటేశ్వరావు గొప్ప ధనవంతుడు, పరమ పిసినారి. 'అతనికి ఉన్నంత డబ్బు పిచ్చి వేరే ఎవ్వరికీ ఉండదు' అని చెప్పుకునేవాళ్ళు. ఎంగిలి చేత్తో విదిలిస్తే కాకులకు మెతుకులు దొరుకుతాయని, అతను అన్నం తినేప్పుడు ఎప్పుడూ చేతుల్ని తనకు దగ్గరగానే పెట్టుకునేవాడు.   కంచం అంచు వెంబడి మెతుకులు క్రింద పడకుండా ఉండాలని, తను ఎప్పుడు అన్నం తిన్నా, కంచం మధ్యలోనే కలుపుకొని తినటం అలవరచుకున్నాడు. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళు అడగకుండానే గ్లాసులకు గ్లాసులు నీళ్ళు ఇచ్చి, వాళ్లను వీలైనంత త్వరగా తిప్పి పంపించేవాడు: "వామ్మో! అతను బిచ్చగాడి నుండే బిచ్చం ఎత్తుకుంటాడు" అని బంధువులు ఎవ్వరూ అతని ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. అదే ఊళ్ళో మంచి, మర్యాద, మానవత్వం కలిగిన పేద రైతు ఒకడు ఉండే వాడు. అతని పేరు లచ్చయ్య. ఉన్నంతలో తృప్తిగా జీవించేవాడు లచ్చయ్య. ఇంటికి వచ్చిన అతిథులకు దేన్నైనా ప్రేమానురాగాలతో పంచేవాడు. తను ఒక పూట అన్నం తినకపోయినా ఇతరులకు పెట్టేవాడు. "నాకు వేరే ఏమీ ఇవ్వకపోయినా పర్లేదు కానీ, ఇంటికి వచ్చిన వాళ్ళకి కడుపునిండా అన్నం పెట్టి, సంతోషంగా సాగనంపే శక్తిని మటుకు ఉండనివ్వు స్వామీ" అని రోజూ దేవుడిని ప్రార్థించేవాడు.   రాను రాను ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాల వాళ్ళంతా లచ్చయ్య గురించి గొప్పగా చెప్పుకోవటం మొదలెట్టారు. దానితోబాటే కోటేశ్వరరావు పిసినారితనం కూడా ప్రచారమైంది. దాంతో కోటేశ్వరరావుకి లచ్చయ్య మీద కోపం పెరిగిపోయింది! చివరికి అతనిక తట్టుకోలేక, దూరం నుండి పిలిపించిన రౌడీలను కొందరిని లచ్చయ్య ఇంట్లో దొంగతనానికి పంపించాడు. ఆరోజు రాత్రి వాళ్ళు భోజనం కోసం వెతుక్కుంటుంటే ఎవరో చెప్పారు- "ఈ టైములో‌ భోజనం ఎక్కడ దొరుకుతుంది? ప్రక్కనే లచ్చయ్య ఇంటికి పోండి, కనీసం ఏ ఊరగాయో వేసి ఇంత అన్నం పెడతాడు" అని. అట్లా ఆ దొంగలు లచ్చయ్య ఇంట్లోనే భోజనాలు చేసారు. మరి ఆ సమయంలో వాళ్ళు ఏమనుకున్నారో ఏమో: ఆ రోజు రాత్రి కోటేశ్వర రావు ఇంట్లోనే దోపిడీ జరిగింది! దొంగలు అతని దగ్గరున్న డబ్బునీ, నగల్నీ, విలువైన సామాన్లనీ‌ మొత్తం దోచుకుపోయారు! దు:ఖంలో‌ ఉన్న కోటేశ్వరరావు కుటుంబానికి కూడా లచ్చయ్యే ఆసరాగా నిలిచాడు. వాళ్ళు తినేందుకు రోజూ భోజనం వండి పంపించాడు! అంతలో‌ వాళ్ళ పొరుగూరు లింగగిరిలో చెరువు కట్ట తెగింది- నీళ్ళన్నీ ఊళ్లోకి వచ్చాయి; పలు కుటుంబాలకు చెందిన ఇళ్ళు కూలిపోయాయి. లచ్చయ్య ముందుపడి, పునరావాసపు పనులు మొదలుపెట్టాడు. దానికోసం తనకున్న కొద్దిపాటి భూమినీ అమ్మేసేందుకు సిద్ధపడ్డాడతను! అయితే ఊళ్ళో వాళ్లంతా ముందుకొచ్చి, చందాలు వేసుకొని ఆ పనిని తమ వంతుగా నెరవేర్చారు. అంతలోనే మరో అద్భుతం జరిగింది. లచ్చయ్య కృషిని మెచ్చుకుంటూ ఎవరో కోటీశ్వరుడు ముందుకొచ్చి, పెద్ద మొత్తం విరాళంగా ఇచ్చాడు. ఆ సంగతి చెప్పి, లచ్చయ్య ఊళ్ళోవాళ్ళిచ్చిన చందాల డబ్బును ఎవరిది వాళ్ళకు వాపసు చేసాడు! దీన్నంతా దగ్గరనుండి గమనించిన కోటేశ్వరరావులో పరివర్తన కలిగింది- "ఇకమీద నేను లచ్చయ్యను వేరుగా చూడను- నా కుటుంబ సభ్యులలో ఒకడుగా ఆదరిస్తాను. అతను చేసే మంచిపనుల్లో నేను కూడా పాలు పంచుకుంటాను" అనుకున్నాడు. అతనిలో‌ మార్పును గమనించిన కుటుంబ సభ్యులూ, ఊళ్ళోవాళ్ళు కూడా చాలా సంతోషించారు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

ఒక వెంగళప్ప కథ

ఒక వెంగళప్ప కథ   ఒక రోజున వెంగళప్ప వాళ్ల నాన్నతో కలిసి అంగడికి వెళ్లాడు. నాన్న బఠానీలు కొని పెట్టాడు. దుకాణాదారు బఠానీలు తూశాక, వెంగళప్ప తన దోసిలిని ముందుకు చాపాడు. దుకాణదారు కొంచెం తటపటాయిస్తుంటే వెంగళప్ప "ఇయ్యన్నా!"అన్నాడు. దుకాణదారు వాటిని తక్కెడలోంచి నేరుగా వెంగళప్ప చేతుల్లో‌ పోశాడు. వాటిని అట్లాగే తినేందుకు ప్రయత్నించాడు వెంగళప్ప. వాడి నోటిని చేరేలోగా బఠానీలు సగానికి సగం కింద పడిపోయాయి. అది చూసి వాళ్ల నాన్న "ఒరే, నాన్నా! ఎవరన్నా ఏమన్నా ఇస్తే అలా చేతిలో పట్టుకోగూడదురా, జేబులో వేసుకోవాలి. అప్పుడు కదా, అవి భద్రంగా ఉండేది?! కొంచెం ఆలోచించాలి నాయనా" అని చెప్పాడు ముద్దుగా. ఆ రోజునే వాళ్ల అమ్మ పూరీలు చేయాలనుకున్నది. చూడగా ఇంట్లో నూనె లేదు. ఆవిడ కొడుకును పిలిచి "ఒరేయ్! పోయి శెట్టిని అడిగి కొంచెం నూనె పోయించుకొని రా,పో!" అని గిన్నె ఇచ్చింది. వెంగళప్ప ఉత్సాహంగా పరుగుత్తుకుంటూ పోయి అంగడిలో నూనె పోయించుకున్నాడు. వెనక్కి తిరిగి వస్తూంటే వాడికి అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది- "ఎవరన్నా ఏదైనా ఇస్తే జేబులో వేసుకోవాలి, అప్పుడు కదా, అవి భద్రంగా ఉండేది?" అని వెంటనే గిన్నెలోని నూనెనంతా జేబులో పోసుకున్నాడు. నూనె అంతా కారిపోయింది. ఇంటికి వెళ్ళాక వాళ్లమ్మ నెత్తీ నోరూ బాదుకున్నది- "పూరీలకు నూనె లేకపోగా, వాడి చొక్కాకున్న జిడ్డు వదిలించేందుకు కిలో డిటర్జెంటు పొడి అవసరమౌతుందే" అని. ఒకసారి వాళ్ళ ఊళ్ళోకి బాతులు అమ్మే ఆయన వచ్చాడు. మాంసం తినేవాళ్లంతా ఆరోజున పోయి తమకు కావలసినన్ని బాతులు తెచ్చుకుంటున్నారు. "మనకి ఒక బాతును తీసుకురా పో" అని పంపింది వెంగళప్ప వాళ్లమ్మ. వెంగళప్ప వెళ్ళి ఒక బాతును కొనుక్కున్నాడు. దుకాణదారు దాన్ని వీడి చేతికి ఇవ్వగానే అది రెక్కలు టపటపా కొట్టుకున్నది. వీడు బెదిరిపోయి దాన్ని వదిలేశాడు. బాతు ఒక్క ఎగురు ఎగిరి, అదృష్టం కొద్దీ దుకాణం లోపలికే పోయింది. దుకాణదారు దాన్ని మళ్ళీ పట్టుకొని తెచ్చి ఇస్తూ "ఒరే! ఇంతమాత్రం తెలీదురా?! పక్షుల్ని పట్టుకునేది ఎట్లాగ? మెడ దగ్గర పట్టుకుంటే అవి కిక్కురుమనకుండా ఉంటాయి- ఇలాగ మెడ పట్టుకో" అని బాతును వెంగళప్ప చేతికి అందించాడు. ఆ రోజు సాయంత్రం వాళ్ల నాన్న ఇంటికి వచ్చి "ఒరే! సుబ్బారావు మామయ్యగారింట్లో కోళ్ళు ఎక్కువై పోయి, మరీ‌ అల్లరి చేస్తున్నాయట.  మనం పెంచుకునేందుకు ఒక రెండు కోళ్ళు ఇస్తానన్నాడు. వెళ్ళి పట్టుకురా, పో" అని పంపాడు వెంగళప్పను. వెంగళప్ప రెండు కోళ్ళను దొరకపుచ్చుకొని, వాటి మెడలు పట్టుకొని ఎత్తుకొచ్చాడు. ఇంటికొచ్చేసరికి అవి కాస్తా చచ్చిపోయి ఉన్నాయి! "వాళ్ళింట్లో‌ ఇవి బానే ఉన్నాయి నాన్నా!" అన్నాడు వెంగళప్ప బాధపడిపోతూ. "అవునురా, మెడ పిసికితే కోళ్ళు ఎలా బ్రతుకుతాయి, కాళ్ళు కట్టేసి తల క్రిందులుగా పట్టుకొని తేవాలిగాని?!" అన్నాడు నాన్న, మరింత విచారంగా. వెంగళప్ప తల తిరిగింది ఈసారి. "అబ్బ!ఈ ప్రపంచాన్నంతా అంతా బలే తిక్కగా చేశాడు దేవుడు. దీన్ని అర్థం చేసుకునేది ఎలాగో, ఏమిటో" అనుకున్నాడు కలవరపడుతూ. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

రుచి లేని పండు

రుచి లేని పండు   హరిపురంలో నివసించే పవన్, గణేష్ ఇద్దరూ మంచి మిత్రులు. హరిపురాన్ని ఆనుకునే దట్టమైన అడవి ఒకటి ఉండేది. ఊళ్ళో వాళ్ళందరికీ ఆ అడవి అంటే భయం. ఎవ్వరూ ఆ అడవిలోకి పోయేవాళ్ళు కాదు. ఒకసారి పవన్, గణేశ్ ఇద్దరూ ఆడుకుంటూ ఆడుకుంటూ తమకు తెలీకుండానే అడవిలోకి ప్రవేశించారు. కొద్దిసేపటికి ఇద్దరికీ చాలా ఆకలైంది. చుట్టూ చూసుకుంటే ఏముంది, ఆకాశమంత ఎత్తైన చెట్లు, పొదలు- అన్ని దిక్కులా ఆవరించి ఉన్నాయి! వాళ్ళకు భయం వేసింది. "ఒరే! ఇక్కడికి ఎందుకొచ్చాంరా? ఎవరూ లేరు, ఇదేదో ఘోరంగా ఉంది?!" అన్నాడు పవన్. "ఎవ్వరూ లేని చోట్ల దయ్యాలు భూతాలు ఉంటాయిరా! ఇక మనపని ఇంతే!" అన్నాడు గణేశ్. ఇద్దరూ కొంచెం సేపు అక్కడే నిలబడి ఒకరి తర్వాత ఒకరు వణికారు.  ఆ తర్వాత, కొంచెం తేరుకున్నాక, "తినేందుకు ఏమైనా దొరుకుతాయేమో‌ చూద్దాంరా!" అన్నాడు పవన్, ఇద్దరూ అటూ ఇటూ చూసారు. అక్కడికి దగ్గర్లోనే వింత చెట్టు ఒకటి కనబడింది. ఆకాశాన్ని అందున్నేంత ఎత్తుగా, పెద్ద పెద్ద ఆకులతో పచ్చగా ఉందది. దాని కాయలు, పళ్ళలో ఒక వింత మెరుపు ఉన్నది. పవన్, గణేష్ ఇద్దరూ‌ మెల్లగా చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆ పండ్లను చూసిన కొద్దీ వాళ్ళకు ఇంకా ఎక్కువ ఆకలైంది. గణేష్‌ గబగబా చెట్టు పైకి ఎక్కి, పండ్లను కోసి, పవన్ దగ్గరికి విసిరాడు. పవన్ ఒక పండును కొరికి చూశాడు. తియ్యగా లేవు- ఏదో ఒక రకమైన చప్పదనం! "ధూ!" అని ఉమ్మేసి, పండును క్రింద పడేసాడు. పైనుండి చూసిన గణేష్‌ ఇక కోయటం ఆపి చెట్టు దిగి వచ్చాడు.    మెరిసే పళ్ళని చూస్తూ, "ఇట్లా అవుతుందనుకోలేదురా! ఇప్పుడెలాగ? ఇవన్నీ వదిలేసి ముందుకు పోదాం! త్వరగా ఇల్లు చేరుకుంటే అదే చాలు!" అన్నాడు. అంతలో ఏదో మెరుపు మెరిసినట్లయింది. ఇద్దరూ గట్టిగా కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తెరిచి చూస్తే ఆశ్చర్యం- తమ చుట్టూ చెట్లు లేవు! ఇద్దరూ తమ ఊరి పొలిమేర దగ్గరే నిలబడి ఉన్నారు! పవన్ వాళ్ళ తాత, వాళ్లని వెతికేందుకు వచ్చిన మనుషులు అందరూ వాళ్లకేసి అనుమానంగా చూస్తున్నారు. "ఇక్కడికెట్లా వచ్చాం? ఆ చెట్టేది?" అని అరుస్తున్న పిల్లలకేసి జాలిగా చూసారు పెద్దవాళ్ళు. అంతలోకే వాళ్ళ చూపులు చుట్టూ నేలమీద పడి ఉన్న పండ్లమీద పడ్డాయి.   తాత ఒక పండును చేతిలోకి తీసుకొని ఆసక్తిగా చూసాడు. "ఈ పండ్ల చెట్టే, నేను ఎక్కింది! ఏదీ ఆ చెట్టు?" అరిచాడు గణేష్. అంతలోకే తాత ఏదో అరవటం, అక్కడ చేరిన పెద్దవాళ్లంతా గబగబా క్రింద పడిన పండ్లను ఏరుకొని ఎవరి దారిన వాళ్లు పరుగు పెట్టటం చకచకా జరిగిపోయాయి. పిల్లలిద్దరూ ఆశ్చర్య పోయారు. తర్వాత చెప్పాడు తాత ఆ పండ్లలోపలి టెంక అంతా మేలిమి బంగారం! ఇట్లాంటి పండ్ల గురించి కథల్లో చదవటమే తప్ప, నిజంగా ఎవ్వరూ చూసి ఉండలేదు! ఇప్పుడు అకస్మాత్తుగా అవి కనిపించే సరికి, జనాలంతా ఎవరికి దొరికినన్ని వాళ్ళు ఎత్తుకుపోయారు! "అయితే నేమి? బంగారం పండ్లు తినడానికి పనికిరావు!" అని గట్టిగా నవ్వారు పవన్- గణేశ్, వాళ్ళ తాత తెచ్చిచ్చిన మామూలు పండుని కొరికి తింటూ. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

ఇష్టమైన రంగాన్ని ఎంచుకో

ఇష్టమైన రంగాన్ని ఎంచుకో   అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు తొగర్రాయి. ఆ ఊరి బడిలో యశ్వంత్ అనే పిల్లవాడు ఉండేవాడు. వాడికి అసలు చదువే రాదు. సాధారణంగా వాడి చదువుని ఎవ్వరూ పట్టించుకునేవాళ్ళు కాదు. టీచర్లు కూడా వాడిని ఏమీ‌ అడిగేవాళ్ళు కాదు- వాడు సమాధానం చెప్పలేడని వాళ్లకు తెలుసు. అయితే ఒక రోజున ప్రధానోపాధ్యాయుడు వాడిని కొట్టాడు- "ఇంత చిన్న సంగతులు కూడా తెలీట్లేదు నీకు- ఇంక చదువుకొని ఏం ప్రయోజనం?" అని కూడా అరిచాడాయన.  యశ్వంత్‌కి ఎందుకనో ఇది నచ్చలేదు. హెడ్మాస్టరు తనని 'కొట్టటం వేరు, ఇట్లా అరవటం వేరు' అనిపించి, వాడికి చాలా బాధ వేసింది. ఆ సంగతి వాడు వాడి మిత్రులకు చెబితే వాళ్ళు కూడా బాధపడి, "అరే! నిజంగానే నీకు చదువు అంటే ఇష్టం లేదు కదా? నీకు క్రికెట్ అంటే కదా, ఇష్టం ..? మరి ఇంక ఇక్కడ బడిని పట్టుకొని వ్రేలాడేది ఎందుకు? సెలవల్లో సెలక్షన్లు అవుతాయట-వచ్చే సంవత్సరం నుండీ క్రికెట్ కోచింగ్ కి పో రా! అదే నయం!" అన్నారు.  "సరేరా! అట్లాగే చేస్తా! నేను 2026 వరకూ క్రికెట్‌నే ఆడతా; మంచి క్రికెటర్ ని అవుతా; చూస్తూండండి!" అన్నాడు యశ్వంత్. ఆ సంవత్సరం పరీక్షలు కూడా రాయలేదు యశ్వంత్. మరుసటి ఏడాది వాడు బడికి రాలేదు. అటు తర్వాత అందరూ వాడి గురించి మర్చిపోయారు. కొన్ని సంవత్సరాలు గడిచాక, ఒక రోజున యశ్వంత్ వాళ్ళ మిత్రులకు అందరికీ ఫోన్లు వచ్చాయి- "సాయంత్రం టీవీ ఆన్ చేసి క్రికెట్ చూడండిరా, అంతా! నేనెవరో తెలుస్తుంది" అని.  ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. కానీ వాళ్లంతా టీవీ చూసి, గుర్తుపట్టారు! అక్కడ ఆడుతున్న కుర్రవాడు యశ్వంత్! వరస పెట్టి సిక్సులూ, ఫోర్లూ కొడుతున్నాడు! స్టేడియంలో ఉన్న వాళ్ళంతా ఉత్సాహంగా‌ చప్పట్లు కొడుతూ మెచ్చుకుంటున్నారు! మిత్రుల ఆనందానికి అవధులు లేవు! "మన ఊరి పిల్లాడురా, వాడు! యశ్వంత్- మన ఊరి వాడే!" అని అందరికీ చెప్పుకున్నారు.  ఆ తరవాత ఒకనాడు ఊరికి వచ్చిన యశ్వంత్‌కి బడిలో‌ ఘనంగా సన్మానం‌ జరిగింది. అప్పుడు వాడు స్నేహితులను మెచ్చుకుంటూ "అరే! మీరు నాకు చేసిన మేలు అంతా ఇంతా కాదురా! నన్ను కోచింగుకు పంపింది మీరే!‌ మీ సలహానే నన్ను ఇప్పుడు ఇంతవాణ్ణి చేసింది!" అన్నాడు. అప్పుడు మిత్రులు "మేము నిన్ను ఎంత వెళ్ళమని అన్నా నీ కృషి లేనిదే ఏదీ కాదురా!" అన్నారు.  ఆ రోజు బడిలో ఉండగా యశ్వంత్‌కి ఒక ఐడియా వచ్చింది. 'తను ఒక మంచి 'స్పోర్ట్స్ అకాడమీ' పెట్టాలి.. తనలాగా ఆటలు అంటే ఇష్టం ఉండే పల్లె పిల్లలకు సరైన దారి చూపించాలి. వారికి సరైన శిక్షణనిచ్చి, బలంగా తయారు చేయాలి!' అని. త్వరలోనే అతను దాన్ని అమలు పరచాడు. అట్లా ప్రారంభమైన "యశ" స్పోర్ట్స్ అకాడమీ ఎంతో మంది పిల్లలకు మార్గదర్శని అయింది!    - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

నక్క తిక్క కుదిరింది

నక్క తిక్క కుదిరింది     అనగనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు ఉండేవి. పెద్ద కుందేళ్ళ గుంపు కూడా ఒకటి ఉండేది వాటిలో. ఒకరోజున ఆ కుందేళ్ళ దగ్గరికి నక్క ఒకటి వచ్చింది. "ఈ విషయం తెలుసా, మీకు?! మన సింహరాజుగారికి ఏదో పెద్ద జబ్బు చేసింది. రాజ వైద్యులు కోతిగారు ఆయనకు మందులిస్తున్నారు. ఆయన చెప్పారు 'రోజూ ఓ కుందేలును ఆహారంగా తీసుకుంటే రాజుగారికి మంచిది; ఆరోగ్యం చక్కగా కుదురుకుంటుంది' అని. అందుకని మిమ్మల్ని రోజుకొకరుగా తీసుకు రమ్మని రాజాజ్ఞ!" అని చెప్పింది. కుందేళ్లకు మతిపోయింది. "రాజుగారి రోగం-కుందేళ్లకు శాపం" అని అన్నీ విచారపడి, రాత్రికి రాత్రే ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. "మనం ఎవ్వరం దొరకకుండా తప్పించుకుందాం. ఆయన ఏం చేస్తాడో చూద్దాం" అన్నాయి కొన్ని కుర్ర కుందేళ్ళు. ముసలి కుందేళ్లు వాటిని కసిరి "రాజుగారికి కోపం వస్తే మనందరినీ ఒకేసారి చంపేయగలడు. కాబట్టి మనమే మర్యాదగా ఒక్కొక్కరం వెళ్ళడం మంచిది. అయినా రాజుగారి ఆరోగ్యం కంటే మించింది ఏముంటుంది పౌరులకి? మీ కుర్ర కుందేళ్లకు ఏమీ తెలీదు ఊరుకోండి. మేం పెద్దవాళ్ళం వెళ్తాం, రోజుకొకరం! ఒక వారం రోజుల్లో ఆయన ఆరోగ్యమూ కుదురుకుంటుంది; మీకు ఈ శ్రమా తప్పుతుంది" అన్నాయి.  కుర్ర కుందేళ్లకు ఆ మాటలు నచ్చలేదు గానీ, పెద్దల మాటకు ఎదురు చెప్పలేక ఊరుకున్నాయి. అట్లా ఆ మరుసటి రోజునుండి ప్రతిరోజూ తెల్లవారుతుండగానే నక్క వచ్చేది: తనతోబాటు ఒక కుందేలును వెంటబెట్టుకు వెళ్ళేది. ఇట్లా ఒక వారం రోజులు గడిచాయి.   ఆ రోజున కుందేళ్లకు కోతి ఎదురైంది అడవిలో . దాన్ని చూడగానే కుందేళ్లకు తమ సమస్య, అది ఎప్పటికి పరిష్కారం అవుతుందోనన్న బెంగ గుర్తుకొచ్చాయి. వెంటనే అవన్నీ నేరుగా కట్టకట్టుకున్నట్టు కోతి దగ్గరికి వెళ్ళి, "రాజుగారికి జబ్బు తగ్గిందా?" అని అడిగాయి. కోతి ఏమీ‌ అర్థం కానట్లు ముఖం పెట్టింది: "రాజుగారికేం? చక్కగా ఉన్నారు. ఆయనకేం జబ్బు?! రాజవైద్యుడిని, నాకు తెలీని జబ్బులు ఏమొచ్చినై, ఆయనకు? ఈ పుకార్లు ఎవరు రేపుతున్నారో కనుక్కోవాలి. ఇంతకీ ఆయనకు జబ్బుచేసిందని ఎవరు చెప్పారు, మీకు?!" అని అడిగింది చికాకుగా. కుందేళ్లన్నీ ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచాయి. "ఓహో! ఇవన్నీ నక్క జిత్తులనమాట! సింహానికి ఆరోగ్యం బానే ఉంది. అయినా నక్క తమకు అబద్ధం చెప్పింది! రోజూ కుందేలునొకదాన్ని తీసుకు వెళ్తుంటే 'సింహం కోసమే కదా' అనుకున్నాంగానీ, నిజానికి దారిలోనే ఆ కుందేలును చంపి తిని ఆకలిని తీర్చుకుంటోందనమాట,ఈ జిత్తులమారి నక్క! ఆ ఆలోచనతో కుందేళ్ల గుండెలు దహించుకు పోయాయి. అంతలోనే అటుగా వచ్చింది నక్క. ఏంటి అల్లుళ్ళూ! ఏదో మీటింగు పెట్టుకున్నట్టున్నారే, మంచినీళ్ల బావి దగ్గర!" అంటూ. కుందేళ్ళు ఒకదాని ముఖం ఒకటి చూసుకున్నాయి. ఓ ముసలి కుందేలు గట్టిగా నవ్వి, నక్కతో "నక్కబావా! నీకు నూరేళ్ళు నిండుతున్నట్లున్నాయి- ఇప్పుడే మేమంతా నీ గురించి మాట్లాడుకున్నాం; అంతలోనే నువ్వు వచ్చేసావు! ఎట్లాగూ వచ్చావు కాబట్టి మా తాడు లాగే ఆటలో నువ్వూ కలువు. తాడును మా కుర్రవాళ్లంతా ఒక వైపు పట్టుకొని లాగుతారు; నువ్వు ఒక్కడివే ఒక వైపు పట్టుకొని లాగు. ఎదుటి వాళ్లను ఎవరైతే తమ వైపు లాగేసుకుంటారో వాళ్ళు గెలిచినట్లు. నీకు కూడా తెలుసుగా ఈ ఆట?!" అన్నాయి. "ఓ! తెలియకేమి? నేను ఒక్కడినీ చాలు, మిమ్మల్ని అందరినీ గెలిచేందుకు. కానివ్వండి మరి!" అన్నది నక్క. కుర్ర కుందేళ్ళన్నీ తాడుని గట్టిగా పట్టుకున్నాయి ఒకవైపున. మరోవైపున నక్క; వాటన్నిటినీ తనవైపు లాగేయాలని చాలా‌ బలంగా లాగసాగింది. కొంత సేపు ఆట రంజుగా సాగింది. చూస్తున్న కుందేళ్ళన్నీ ఉత్సాహంగా కేకలు పెట్టాయి. నక్క తనని తాను మర్చిపోయి, శక్తినంతా వెచ్చించి లాగుతున్నది. 'అన్నీ సరిగా ఉన్నాయి' అన్నప్పుడు, ముసలి కుందేలు సైగను అందుకొని, కుందేళ్ళన్నీ ఒకేసారి తాడును వదిలేసాయి! అంతే! నక్క, విసిరేసినట్టుగా వెళ్ళి వెనకాల ఉన్న బావిలో‌ పడిపోయింది తాడుతో సహా. మోసపు నక్క పీడ విరగడైనందుకు కుందేళ్ళన్నీ పండగ చేసుకున్నాయి. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

ఇప్పుడు అర్ధం అవుతోంది

1) పూర్వకాలంలో ఇంటికి దూరంగా మరుగుదొడ్లు ఎందుకు ఉండేవో... 2) చెప్పులు ఇంటి బయట విడిచి కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్న తరువాతే ఇంట్లోకి ఎందుకు రావాలో... 3) ఇంటా బయట ప్రతీ గడపకీ పసుపు ఎందుకు రాసేవారో.... 4) వారానికి ఒకసారి ఇంట్లో సామానులన్నీ సర్ది ఇల్లంతా ఎందుకు కడిగేవారో.... 5) సుద్దతో ఇల్లంతా ముగ్గులు ఎందుకు వేసేవారో... (Calcium నుండి విలువడే ధాతువులు ఇల్లంతా వ్యాపించి కొన్ని వ్యాధికారక వైరస్ లను నిరోదిస్తాయి) 6) సుచిగా స్నానం చేసాకే వంట ఎందుకు చేసేవారో.... 7) నోట్లో వేళ్ళు పెట్టుకోవద్దని,  గోళ్లు కొరకొద్దని, ఏదయినా తినేముందు చేతులు కడుక్కోవాలని ఎందుకు చెప్పేవారో.... 8) స్నానం చేసాక మడి అని చెప్పి... స్నానం చేయ్యని మిగతా వారిని అంటకుండా ఎందుకు తిరిగేవారో.... 9) మనం బయటకు వెళ్లేముందు ఎవరైనా తుమ్మితే ఆపశకునం అని... కొద్ది క్షణాలు ఆగి వెళ్ళమని ఎందుకు చెప్పేవారో... (ఆ తుమ్మిన వ్యక్తి నోటినుండి ముక్కు నుండి వెలువడిన తుంపరలు కొద్దిసేపు గాలిలో తేలియాడి మెల్లగా నేలమీదకు చేరుకుంటాయి.... ఆ తుంపరల బారినపడి అంటువ్యాధులు రాకుండా వుండాలని ఆలా చెప్పేవారు) 10) బయటకు వెళ్ళాక తెలిసినవాళ్ళు ఎదురు పడితే (కారాచలనం చేయ్యకుండా) రెండు చేతులు జోడించి నమస్కారం ఎందుకు చేసేవారో....  11) ప్రతీ కూరలోనూ పసుపు ఎందుకు వేసేవారో. 12) నెలకి ఒక్కసారి ఐనా మిరియాల చారు, మెంతుల పులుసు తప్పనిసరిగా ఎందుకు చేసేవరో.... 13) కనీసం ఆరు నెలలకి ఒక్కసారి అయినా ఆముదం లేదా చేదు (వేప మూడికలతో) ఎందుకు పట్టించేవారో.... 14) ఎవరి ఇంట్లో అయినా బిడ్డ పుట్టినా లేక ఎవరైనా చనిపోయినా 11 రోజులు మైల అని ఎందుకు అనేవరో... 15) ఉదయం లెవగానీ వేప మొదలైన ఔషధ గుణాలు కలిగిన పుడకలతో పళ్ళు తోముకునేవారు.  దీని వలనదంతాలకే కాకుండా కాలేయానికి, ఊపిరితిత్తులకు మంచి చేసేవి. 16) ఉదయం తప్పకుండా చద్దన్నం తినేవారు.  దీని వలన ఆరోగ్యం సమస్యలు వచ్చేవి కావు. ఇంకా ఇటువంటివి చాలా వున్నాయి... ఇవన్నీ ఆలోచిస్తుంటే మన పూర్వికులు కూడా కరోనాలాంటి మహమ్మారితో పోరాడి ఇటువంటి నియమాలను ఆచారాలతో మేళవించి అనుసరించారేమో అనిపిస్తుంది  గానీ మనకి ఆధునిక విజ్ఞానం ఎక్కువయ్యి.... కాకరకాయని.... కీకరకాయ అనడం మొదలుపెట్టాము. పెద్దవాళ్ళకి చాదస్తం ఎక్కువ అని వారిని చాందశవాదులుగా ముద్రవేసి వారు చెప్పిన మాటలను గేలిచేసి... గాలికి వదిలేసి ఇంతకాలం ఇష్టనుసారం తిరిగి.... ఇదిగో ఇప్పుడు మనకి తెలియకుండానే అవన్నీ కాకపోయినా అందులో కొన్ని ఆచారిస్తున్నాము. పెద్దలు చెప్పిన మాటలు చద్దన్నం మూట అనే నానుడి నిజంగా అద్భుతం కదా.  

మంచితనం

మంచితనం   అడవిలో ఎలుగుబంటి ఒకటి ఉండేది. ఒకసారి అది తేనె కోసం వెతుకుతూ ఉంటే, చెట్టుపైన ఓ పెద్ద తేనెపట్టు కనిపించింది. ఆ తేనెపట్టులోంచి తేనె కారుతోంది! కొంచెం కొంచెంగా, చెట్టు క్రిందికంటా కారుతోంది. ఎలుగుబంటి ఇంక ఊరుకుంటుందా? వెళ్ళి దానిని నాకటం మొదలు పెట్టింది. అది చూసాయి తేనెటీగలు! ’అమ్మో! ఈ ఎలుగుబంటి తేనెను నాకి ఊరుకోదు.  మళ్ళీ చెట్టెక్కుతుంది. మన తేనెపట్టును పట్టుకొని, దాన్ని పిండి తినేసేటట్లుంది!’ అనుకొని, దాని మీదికి దూకి కుట్టసాగాయి. అది గమనించిన ఎలుగుబంటి చేతికందిన రాళ్ళను, ఆకుల్ని, చెత్తను, చెట్టుకొమ్మల్ని వాటి మీదకు విసిరేస్తూ గంతులు వేసింది. తేనెటీగలేమో వాటినుండి తప్పించుకొని దూరంగా ఎగురుతూ, మళ్ళీ తిరిగి వచ్చి దాన్ని కుడుతూ పోయాయి. కొద్ది సేపటికి ఎలుగుబంటేమో తేనెటీగల్నుంచి తప్పించుకొని పారిపోయింది.  కానీ ’బుల్లి’ అనే తేనెటీగకు ఎలుగుబంటి వేసిన రాయి తగిలింది పాపం. దాని రెక్క కాస్తా విరిగి వేలాడసాగింది. అది నేలమీద పడిపోయింది. తేనెటీగలన్నీ దాన్ని చూసాయి కానీ, ఏమీ చెయ్యలేక ఊరుకున్నాయి. అయితే కొద్ది సేపటికి తిరిగి వచ్చింది ఎలుగుబంటి! అది వచ్చీ రాగానే అటూ ఇటూ చూసి, బుల్లిని తీసుకెళ్ళి తన గుహలో ఒకచోట పెట్టింది. దానికి రోజూ ఆహారం పెట్టింది. ఏవో ఆకుల్ని తెచ్చి పిండేది దాని రెక్కమీద. అట్లా కొన్ని రోజులు గడిచే సరికి బుల్లి రెక్క అతుక్కున్నది! అది ఎగరగలిగే స్థితికి రాగానే ఎలుగుబంటి దాన్ని విడిచిపెట్టింది. బుల్లి తన బంధువుల దగ్గరికి వెళ్ళి ఎలుగుబంటి మంచితనం గురించి చెప్పింది. అప్పుడు 'మనం ఎలుగుబంటిని కుట్టిపెట్టినా గానీ, మనసులో ఉంచుకోకుండా మన బుల్లిని కాపాడింది- ఈ ఎలుగు బంటి ఏదో పాపం మంచిదే!’ అనుకున్నాయి తేనెటీగలు. అవన్నీ ఎలుగుబంటి దగ్గరకు వెళ్ళి క్షమాపణ కోరాయి. తాము సేకరించిన తేనెను ఎలుగుబంటికి బహుమతిగా ఇచ్చాయి. చూస్తూండగానే ఎలుగుబంటి, తేనెటీగలు మంచి స్నేహితులైపోయాయి! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

అందమైన రాజ్యం

అందమైన రాజ్యం   అది ఒక అందమైన సామ్రాజ్యం. ఆ దేశపు రాజయిన 'శ్రీ శ్రీ శ్రీ వెంకటా చలపతి' గారు దేవుడికి మరో రూపం. ప్రజలంటే ఆయనకు ప్రాణం. ప్రజల మేలుకోసం తన ప్రాణాలు కూడా లెక్కచేయని మంచి మనిషి ఆయన. ప్రజలకు కూడా ఆయనంటే ఎంతో ఇష్టం, ప్రేమ, గౌరవం. ఎంతో అందమైన ఆ దేశంలో ఆ రాజావారి కోట చాలా‌ గొప్పగా ఉండేది. రంగు రంగులు పూల చెట్లు, వాటిపైన అందంగా ఎగిరే పలు రకాల సీతాకోక చిలుకలు- వాటి మధ్యన నెలకొని ఉండేది ఆ కోట. ఎందరో కవులు ఆ దేశాన్ని గురించి, ముఖ్యంగా ఆ కోట గురించి వర్ణించారు. ఆ దేశం అంతటా పచ్చదనం నిండి ఉండేది మరి. అయితే రాజా వెంకట చలపతి గారికి సంతానం లేదు. ఎవరైనా‌ ఈ మాటను అడిగితే‌ "నాకు పిల్లలు లేరా? ఎవరు చెప్పారు? నా ప్రజలే నా పిల్లలు" అనేవారాయన. మనస్సులో ఎంతో బాధ ఉన్నా, పైకి మటుకు నవ్వుతూ, ఆనందంగా ఉండేవారు. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు- "నీ కోసం కాదు- నలుగురి కోసం జీవించు" అని. ప్రతీ కథలోనూ రాక్షసులు ఉన్నట్లు, ఈ కథలో కూడా ఇద్దరు ఉన్నారు- ఒకడు ఫ్యాసీ, ఇంకోడు జ్యాసీ. ఫ్యాసీ ఒక దొంగ సన్యాసి. జ్యాసీ ఒక ప్రజానాయకుడు. వీళ్లు ఇద్దరూ అన్నదమ్ములు- కానీ ఈ విషయం ఎవరికీ తెలీదు. ఫ్యాసీ గొప్ప రుషిలాగా నటిస్తూ ప్రజలని మోసం చేసేవాడు. జ్యాసీ ప్రజలకు ద్వేషం నూరిపోస్తూండేవాడు. చక్కని ఆ దేశాన్ని నాశనం చేయాలని ఆశించేవాళ్ళు వాళ్ళిద్దరూ. ఫ్యాసీ ప్రజలలోకి వెళ్ళి "మన రాజు వెంకటా-చలపతి గారు ప్రతీ నిమిషం ఎంతో బాధ పడుతున్నారే, మీరు దాన్నిగురించి ఏమీ చేయట్లేదు " అనటం‌మొదలు పెట్టాడు. "అయితే ఏం చేయాలి చెప్పండి స్వామీ? ఆయనకి సంతానం కలగాలంటే ఏం చేయాలి?" అన్నారు ప్రజలు. "నాకు నిన్న దేవీ మాత నుండి ఒక సూచన వచ్చింది. అదేమిటంటే వెంకటాచలపతి గారు రాజ్యం వదిలివెళ్ళాలి. జ్యాసీ రాజ్యాన్ని పాలించాలి. అప్పుడే అందరికీ మేలు జరుగుతుంది" అన్నాడు ఫ్యాసీ. పాపం ప్రజలు ఆ మాటలు నిజమని నమ్మారు. రాజుగారిని రాజ్యం వదిలి వేయమని బలవంతం చేశారు. వెంకటాచలపతిగారికి అంతులేని కోపం వచ్చింది. "ప్రజలారా మీరంతా మోసపోయారు. అధికారం కోసం మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నాడు జ్యాసీ" అన్నాడాయన. “కాదు ప్రభూ! ఈ సంగతి మాకు ఫ్యాసీ సన్యాసి వివరించారు. దీనికీ‌ జ్యాసీకీ ఏ సంబంధమూ లేదు" అన్నారు ప్రజలు.   "ఇప్పుడే వెళ్ళి ఆ దుర్మార్గుల అంతు చూస్తాను' అని ఆవేశంగా ఫ్యాసీ ఆశ్రమానికి వెళ్ళారు వెంకటా చలపతిగారు. అక్కడ జరిగిన పోట్లాటలో ఫ్యాసీ-జ్యాసీ లతో‌పాటు ఆయనా మరణించారు. ఒంటరివారైన ఆ దేశ ప్రజలకు రాజావారి గుర్తుగా మిగిలింది ఇక ఆ కోట మాత్రమే. దాన్ని చూసినవాళ్ళంతా ఈరోజుకీ రాజావారి కథని గుర్తుచేసుకుంటూ ఉంటారు.    

కుందేలు తెలివి

కుందేలు తెలివి   అనగా అనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ కుందేలు, ఓ నక్క ఉండేవి. నక్కకేమో, మరి ఎప్పుడెప్పుడు కుందేలును తిందామా, అని ఉండేది. కానీ కుందేలు మాత్రం తెలివిగా తప్పించుకుంటుండేది. ఒక రోజున నక్క కుందేలును తన ఇంట్లో విందుకు రమ్మని పిలిచింది. పొరుగునే ఉంటుంది కదా, కాదనలేక వస్తుందేమో, వస్తే దాన్ని పట్టుకొని తినచ్చు' అనుకున్నది నక్క. కానీ కుందేలు 'నాకు కడుపునొప్పిగా ఉన్నది, విందు తినకూడదు'అని చెప్పి తెలివిగా తప్పించుకున్నది! ఆ సమయంలో అడవిని ఆనుకునే రోడ్డు వేస్తున్నారు. రోడ్డు పనివాళ్ళు తారు డ్రమ్ములు తెచ్చి పెట్టి, దాన్ని వేడి చేసి, రోడ్డు మీద పోస్తుండగా, ఆగి ఆగి చూసింది నక్క. వెంటనే దానికి ఒక తిరుగులేని ఉపాయం తట్టింది. అది వెళ్లి, తారుతో ఒక అందమైన నల్ల పిల్లి బొమ్మని చేసింది. తెల్ల కర్పూరం తెచ్చి దానికి కళ్ళుగా పెట్టింది. ఆ బొమ్మని జాగ్రత్తగా‌ తీసుకొని వచ్చి, కుందేలు వచ్చే-పోయే దారిలో పెట్టింది. దూరం నుండే కుందేలు రాకను చూసి, ప్రక్కనే పొదలో దాక్కుంది.  కుందేలు ఆ బొమ్మను నిజంగా పిల్లే అనుకున్నది. 'ఏంటి పిల్లి బావా! ఇక్కడేం చేస్తున్నావ్?' అంది దానితో. అది మాట్లాడలేదు. "ఏంటి, ఇక్కడున్నావ్? చెప్పు!" అన్నది కుందేలు కొంచెం కోపంతో. అయినా అది జవాబివ్వలేదు. దాంతో, "ఏయ్!‌మాట్లాడు!" అని కుందేలు కుడి చేత్తో దాన్ని ఒక్క దెబ్బ కొట్టింది- అంతే! దాని చెయ్యి తారుబొమ్మకు కరుచుకు పోయింది. 'వదులు , నా చెయ్యి వదులు' అని కుందేలు గింజుకుని తలతోటీ, కాళ్లతోటీ కొడితే, అవీ కరుచుకు పోయాయి! అప్పుడు నక్క వచ్చి పొట్ట చెక్కలయ్యేలా నవ్వింది. 'కొంచెం సేపు ఇలాగే తంటాలు పడు, ఆ తర్వాత నిన్ను కాల్చుకొని తింటాను' అన్నది, కులాసాగా పళ్ళు బైట పెట్టి నవ్వుతూ.  'అయ్యో నక్క బావా! ఇన్నాళ్ళకి నీ చేత చిక్కాను. ఇక నువ్వు నన్ను ఏమైనా చేసుకో, కానీ ఆ ముళ్ళ పొదలో మాత్రం పడెయ్యకు. అన్ని ముళ్లు ఒకేసారి నాలోకి దిగిపోతే, ఆ బాధను భరించటం నావల్ల కాదు. నువ్వన్నట్లు, నన్ను హాయిగా కాల్చుకొని తిను. అదే నయం!" అన్నది కుందేలు దానితో. 'అవునా, అంత బాధగా ఉంటుందా, అయితే నిన్ను తప్పకుండా ఆ పొదలో పడెయ్యాల్సిందే' అని, నక్క కుందేలును పీకి, ముళ్ళపొదలోకి విసిరేసింది. 'పిచ్చి బావా! నేను పుట్టిందీ, పెరిగిందీ ఈ పొదలోనే. ఈ ముళ్ళు నన్నేమీ చెయ్యవు!' అని ఇకిలించి, కుందేలు ఒక కట్టెపుల్లతో మిగిలిన తారును కూడా గీక్కొని, పారిపోయింది. మళ్లీ మోసపోయిన నక్క, తెల్ల మొహం వేసింది! కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో