ట్రెండింగ్ జ్యువెలరీ టిప్స్ అదిరిపోతాయ్! అందమంటే అమ్మాయిలు, అమ్మాయిల దగ్గరే అందం తిష్టవేసుకుని ఉంటుంది.  అందాల రాశులుగా నలుగురిలో తిరుగుతూ ఉంటే అదరహో అని అందరూ అనుకోవాల్సిందే. అమ్మాయిలు ఫాలో అయ్యే డ్రెస్సింగ్ స్టైల్ పార్టీ లలోనూ, ఫంక్షన్ లలోనూ వేరుగా ఉంటుంది. పండుగలు, దైవ కార్యాలప్పుడు వేరుగా ఉంటుంది. వాటికి తగ్గట్టు అమ్మాయిలు అలంకరించుకోవడం, డ్రెస్సుకు తగ్గట్టు మ్యాచింగ్ గా మ్యాజిక్ చేస్తూ అందరి ముందుకు రావడం చూస్తే అమ్మో ఇన్ని ఫాషన్ లు ఉన్నాయా అని ముక్కున వేలేసుకోవాల్సిందే.  పార్టీలు, ఫంక్షన్ల లో అమ్మాయిలు వేసుకునే జ్యువెలరీ విషయంలో బోలెడు వెరైటీలు ఉన్నాయి. మెడలో వేసుకునే గొలుసులు, నెక్లెస్ లు, లాంగ్ చైన్స్, పూసల దండలు ఇలాంటివి చాలా ఉంటాయి. అయితే ఏది వేసుకోవాలి అనే విషయంలో కొంచెం తికమకపడుతూ ఉంటారు. ఇంకా కొన్నిసార్లు డ్రెస్సుకు తగిన మ్యాచింగ్ లేక దిగులు పడిపోతారు.  అంత దిగులు పడాల్సిందేమి లేదు. అయితే ప్రతి డ్రస్సులోకి మ్యాచింగ్ అయిపోయే జ్యువెలరీ రెండున్నాయి. అవి ఒకటి బంగారం, రెండు వెండి. ఇది అందరికీ తెలిసిందేగా ఇందులో కొత్తేముంది అనుకోకండి. ఈ బంగారం, వెండి ఆభరణాలు ధరించడంలోనూ, సాధారణమైన ఫ్యాషన్ జ్యూవెలరి ధరించడంలోనూ కొన్ని టిప్స్ పాటిస్తే అమ్మాయిల ఆకర్షణ మరింత పెరుగుతుంది.  ◆ ఒకే పొడవు ఉన్న జ్యువెలరీ అసలు వేసుకోకూకదు. ఇప్పట్లో సింగిల్ చైన్ వేసుకుని పార్టీలకు, ఫంక్షన్ లకు వెళుతున్నవాళ్ళు చాలా తక్కువ. అలాంటి వాళ్ళు చేసే పొరపాటు అదే. నచ్చాయి కదా అని ఒకటే పొడవున్న చైన్స్ వేసుకోకూడదు. అలా వేసుకుంటే ఒకదాంట్లో మరొకటి కలిసిపోయి వేసుకున్నది ఏంటో ఎవరికీ అర్థం కాదు. అందుకే పెద్దగా ఉన్నవి, వాటి మధ్యలో చిన్నగా ఉన్నవి వేసుకోవాలి.  ◆ చాలా సన్నగా ఉన్న చైన్స్ ని పార్టీలకు ఫంక్షన్ లకు వేసుకోకపోవడం మంచిది ఒకవేళ వేసుకున్నా అవి వీలైనంత వరకు లేయర్స్ లేకుండా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే అవి గజిబిజి అయిపోతాయి. ◆ బంగారం, వెండి రెండింటిని కలిపి వాడితే లుక్ బాగుంటుంది.  ◆ పగడాలు, ముత్యాలు, పచ్చ, నీలం ఇలాంటి స్టోన్స్ తో ఉన్న జ్యువెలరీ కూడా గ్రాండ్ లుక్ ని ఇస్తుంది.  ◆ నార్మల్ చైన్ గా ఉండి దానికి లాకెట్ పెద్దగా ఉన్న జ్యువెలరీ చాలా అట్రాక్షన్ గా ఉంటుంది. అయితే లాకెట్ రంగు, డిజైన్ విషయంలో కాస్త టేస్ట్ అవసరం. బంగారం, వెండి, బీడ్స్, స్టోన్స్ ఎన్ని వెరైటీలు వున్నా వాటిని వేసుకోవడంలోనే లుక్ అంతా ఉంటుంది. ఫాషన్ ఐకాన్ గా కనిపించాలంటే ఆ మాత్రం ఫాలో అవ్వాలి కదా మరి.  ◆ నిశ్శబ్ద.

వర్షాకాలం నెలసరిలో శుభ్రత ఇలా! మహిళల్లో నెలసరి అనేది సాధారణమైన సమస్య. అయితే మారుతున్న ఋతువులను బట్టి వారు నెలసరిసమయంలో ఎదుర్కొనే ఇబ్బందులు వేర్వేరుగా ఉంటాయి. వేసవిలో, చలికాలంలో, వర్షాకాలంలో వాతావరణంలో జరిగే మార్పులు మహిళలను నెలసరి సమయాల్లో పలురకాల ఇబ్బందులకు గురిచేస్తాయి. ప్రస్తుతం అన్నిచోట్లా కొనసాగుతున్న వర్షాల ప్రభావం వల్ల వాతావరణం చాలా చల్లగానూ చుట్టుపక్కల ప్రాంతాలు చిత్తడిగానూ ఉంటాయి. నెలసరి సమయాల్లో నిరంతరం మార్చుకునే ప్యాడ్ లు, టాంపాన్ ల వల్ల యోని ప్రాంతాన్ని పదే పదే నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండటం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, రిప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి యోని ఇన్ఫెనెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. కేవలం ఇది మాత్రమే కాకుండా వర్షాకాలంలో కొన్ని అలవాట్ల వల్ల మహిళలకు నెలవారీ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వాటి గురించి తెలుసుకుని దూరంగా ఉండటం ఎంతైనా మంచిది. యోని ప్రాంతాన్ని శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి!! ◆ శుభ్రత అంటే చాలామంది దృష్టిలో పదేపదే జాగ్రత్త పడటం. కానీ అది చాలా తప్పు. అది అతి శుభ్రత అవుతుంది.  ◆వాతావరణంలో తేమశాతం ఎక్కువైతే సహజంగానే PH స్థాయిలు తగ్గుతాయి.  నెలసరి సమయాల్లో ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం, ప్యాడ్ లేదా టాంపాన్ మార్చుకున్న ప్రతిసారి యోనిని కడగడం చేస్తారు. అయితే మెత్తని శుభ్రమైన పొడిబట్టతో యోని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. ◆యోనిలో సహజంగా తేమను నిర్వర్తించడానికి మంచి బాక్టీరియా ఉంటుంది. కానీ అతిజాగ్రత్త వల్ల సబ్బులు,  ఇతర వాష్ లను ఉపయోగించి పదే పదే శుభ్రం చేయడం వల్ల అక్కడ మంచి బాక్టీరియా పోయి ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. బిగుతుగా ఉన్న వస్త్రాలను దూరం ఉంచాలి!! ◆ బిగుతుగా ఉన్న టాప్స్ వేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ చాలామంది బిగుతుగా ఉన్న జీన్స్, లెగ్గింగ్స్ వంటివి వేసుకోవడం వల్ల యోని ప్రాంతంలో మెల్లగా చెమట శాతం పెరుగుతుంది.  ◆అప్పటికే యోని ప్రాంతంలో ఉన్న తేమకు ఈ చెమట జతకలిస్తే  ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బాక్టీరియా చాలా తొందరగా వృద్ధి చెందుతుంది. ◆ నెలసరి సమయాల్లో యోని ప్రాంతాల్లో తేమ అయినా, చెమట ద్వారా ఏర్పడే తేమ అయినా తగినంత గాలి ప్రవాహం ఉంటేనే అవి ఆరిపోతాయి. కాబట్టి వదులుగా ఉన్న దుస్తులు వేసుకోవాలి.కాటన్ దుస్తులు ధరిస్తే మరింత మంచిది. పొడిగా ఉంచే మార్గం!! ◆ యోని ప్రాంతం పొడిగా ఉండాలంటే వేసుకునే ప్యాడ్ లేదా టాంపాన్ లను పూర్తిగా తడిచిపోయేవరకు ఉంచుకోకూడదు.  ◆ ఇంటి పనులు చేసేటప్పుడు ధరించిన దుస్తులు ఏమాత్రం తడి తగిలినా వాటిని మార్చుకోవాలి. అవాంచిత రోమాలు!! ◆చాలామంది బయటకు చెప్పుకోవడానికి చాలా షేమ్ గా భావించే విషయం. యోని ప్రాంతంలో అవాంచిత రోమాలు.  ◆నెలసరి సమయంలో ఎక్కువగా ఉన్న అవాంచిత రొమాల వల్ల తడిశాతం ఎక్కువగా ఉండిపోయి ఇన్ఫెక్షన్లు తొందరగా వస్తాయి. ◆ అందుకని ఆరోగ్యకరమైన పద్ధతుల్లో వాటిని తొలగించుకోవడం ముఖ్యం. చాలామంది చేసే పొరపాట్లు!! ◆ దిగువ, పేద తరగతి కుటుంబాలలో మహిళలు, అమ్మాయిలు చాలామంది ఇంట్లో ఉన్న వస్త్రాలను నెలసరి సమయాలలో వాడుతారు. పైగా వాటిని ఉతికి ప్రతి నెలా వాటినే ఉపయోగిస్తారు. ◆ ప్రతిసారి ఇలా ఉపయోగించడం వల్ల యోని ప్రాంతం చాలా తొందరగా సున్నితత్వాన్ని కోల్పోతుంది. ◆ చర్మం కందిపోవడం, యోని ప్రాంతం తేమ ఎక్కువగా ఉండటం, బాక్టీరియా పెరుగుదల వేగంగా జరిగే అవకాశాలు ఉంటాయి.  ఇవి మాత్రమే కాకుండా యోని సంబంధ జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మహిళలు వర్షాకాలంలో నెలసరి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో తేమ స్థాయి నిలకడగా ఉండేలా చూసుకోవాలి. దురద, మంట ఇతర సమస్యలు ఏవైనా ఎదురైతే గైనకాలజిస్ట్ ను కలవాలి.                                                ◆నిశ్శబ్ద.


Aracheta Gorinta / Mehendi / Gorinta Designs / Mehndi / Learn Simple & Easy Mehendi Designs / Learn Gorintaku Designs / Learn Tattoo Designs / Henna Designs

జీవితంలో స్త్రీలు ఎందుకు ముఖ్యం? ప్రతి వ్యక్తి జీవితంలో స్త్రీ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనిషి సామాజికంగా ఎదగడానికి, ఆర్థిక అవసరాలకు మగవాడి అండ ఉండాలేమో కానీ వ్యక్తిత్వానికి బీజం వేయడానికి ఇంకా చెప్పాలంటే మనిషి జననం, బాల్యం, ఆ బాల్యంలో బుడిబుడి అడుగుల బీజం. వీటికి ఖచ్చితంగా ఆడవాళ్లే ఎక్కువ బాధ్యత వహిస్తారు. గర్భవతి అయిన స్త్రీ సుఖంగా, సంతోషంగా ఉండాలి. మంచి మాటలు వినాలి. మంచి ఆలోచనలు చేయాలి. భర్త, ఇతరబంధువులు ఆమెకు కష్టం కలగకుండా చూడాలి. ఆమె కోరికలు తీర్చాలి. ఆమె ఎటువంటి ఒత్తిడికి గురి కాకూడదు. ఎటువంటి ఆందోళనలు చెందకూడదు. ఇందుకోసం రకరకాల పద్ధతులను ఏర్పరచారు. శిశువు జననం తరువాత ప్రథమగురువు 'తల్లి' అని నిర్దేశించారు. తల్లి పాడే లాలిపాటలు, జోలపాటలు, బుజ్జగింపులు, ప్రేమచర్యలు సర్వం పిల్లవాడి వ్యక్తిత్వ వికాసంలో ప్రథమపాఠాలు. ఆపై తండ్రి ప్రేమ, బంధువుల అనురాగం, పెద్దల మార్గనిర్దేశనం పిల్లవాడిని వేలు పట్టుకుని ఉత్తమవ్యక్తిత్వం వైపు నడిపించే అంశాలు. బాల్యంలో ఇంట్లో, నేర్చుకున్న అంశాల నిగ్గు తేల్చుకుని, స్వీయవ్యక్తిత్వాభివృద్ధికి రాచబాట నిర్మించుకోవటం పాఠశాలకు వెళ్ళటంతో ప్రారంభమౌతుంది. అంత వరకూ తానే కేంద్రబిందువుగా ప్రపంచం నడుస్తుందనుకున్న పిల్లవాడు సమాజంలో అడుగుపెడతాడు. పాఠశాలలో తనలాంటి అనేకకేంద్రబిందువులను చూస్తాడు. వారికీ, తనకూ భేదాన్ని గుర్తిస్తాడు. ప్రతి వ్యక్తీ ఎవరికి వారు ప్రత్యేకమైనా, ఎలాగైతే ఏ నీటి బిందువుకు ఆ నీటి బిందువు ప్రత్యేకం అయినా, జలప్రవాహంలో మిళితమై ప్రవహిస్తుందో, అలా తానూ సామాజిక స్రవంతిలో ఒక భాగం అని గ్రహిస్తాడు. అతడికి ఈ గ్రహింపునిచ్చేది. అధ్యాపకులు, తోటి విద్యార్థులు, సామాజిక వాతావరణం, పాఠ్యాంశాల వంటివి. అంతవరకూ తాను నేర్చుకున్నవాటికీ, ఇప్పుడు నేర్చుకుంటున్న వాటికీ నడుమ తేడాలు గుర్తిస్తాడు. తాను నమ్ముతున్నవాటిని, ఎదురుగా కనబడుతున్నవాటితో పోలుస్తాడు. అతడి అంతరంగంలో సంఘర్షణ చెలరేగుతుంది. ఈ సంఘర్షణ ఫలితంగా అతడి వ్యక్తిత్వం రూపు దిద్దుకుంటుంది. ఇక్కడ మనసు ప్రాధాన్యం స్పష్టంగా తెలుస్తుంది. ఆ మనసుపై శిశువు జననం నుంచీ పడిన ప్రభావాలు ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటాయి. అందుకే మన పూర్వికులు శిశువు మనసుపై మంచి ముద్రలు వేసేందుకు అనేక విధాలైన నియమాలను, సూత్రాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ ప్రతిఒక్కరికి ఎంతో ముఖ్యమైన అంశాలు. ఎన్ని తరాలు మారినా అందరికీ వర్తించే విషయాలు. ఆడవారి పాత్ర సమాజంలోనూ, ఇంట్లోనూ ఎంతో ఉన్నా ఆడవారిని గౌరవించకపోవడం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. తగిన గుర్తింపు అనేది ఉండదు ఆడవారికి. తన కుటుంబం కోసం చేసిన పనికి గుర్తింపు ఏంటి అని చాలామంది అనుకుంటారు కానీ గుర్తింపు అంటే ఆ వ్యక్తిని గౌరవించినట్టు అనే విషయాన్ని మరవకూడదు. అందుకే ఆడవారికి గుర్తింపు ఇవ్వడమంటే వారి కష్టాన్ని గౌరవించినట్టు అని అర్థం.  గుర్తింపు, గౌరవం అనేవి తన కర్తవ్యాన్ని మరింత ఇష్టంగా, మరింత బాధ్యతతో చేయడానికి దోహదపడే గొప్ప బహుమానం. ఆడవారిని గౌరవించే ఇల్లు ఎలాంటి కలహాలకు తావు లేకుండా ఉంటుందనేది ఒప్పుకోవలసిన విషయం కావాలంటే అలాంటి ఇళ్లను ఒకసారి గమనిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది.  యత్ర నార్యస్తు పూజ్యంతే-రమంతే తత్ర దేవతాః||  అన్నారు. అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివాసముంటారు అని అర్థం. అంటే దేవతలున్నచోట ఐశ్వర్యం, సంతోషం, ఆనందం ఉంటాయని అర్థం.                                        ◆నిశ్శబ్ద.