ఆభాష

ఆభాష

- డా.సి.భవానీదేవి

పుట్టింది మొదలు
నేను మాట్లాడిందేది నాకు మిగల్లేదు
మానం తప్ప
కాలం కొసవెంట నడిచొచ్చే
సుదీర్ఘ నిశ్వాసం తప్ప

ఉక్కిరిబిక్కిరియ్యే మతాల కుప్పల మద్య
ఒక్క క్షణం
భుమ్యాకాశాల్నీ బందించే నిశబ్ధం
వేలకోట్ల స్వరాల్నీగడ్డ కట్టిస్తుంది

దుఃఖం పొరలు పొరలవుతున్నా
వెచ్చని అనుభవం తెరలు దించుకుంటున్నా
నా పెదవులు మధ్య నలిగిపోతూనే ఉంటుంది

దేహనాళాల్లోకి సంచలిస్తూ
నన్ను కల్లోలపరుస్తూనే ఉంటుంది
మాటలు తాకలేని మూగప్రకంపనలు పలుకు
పలుకు చిలకలకి జోలపాడుతుంటాయి
మొరటు పిడికిళ్ళు దూసే శబ్దాల ఈటెల మధ్య
నిర్వేదపు పెనుచీకటి ముసుగేసిన రెప్పల్లో
చైతన్యంలా పురివిప్పే
మహా మౌనమే నా అంతర్భాష

చివరి క్షణంలో కూడా
నన్ను వీడని హృదయశ్వాస