హైదరాబాద్ లో డ్రగ్స్ దందా... న్యూఇయర్ వేడుకలపై మాఫియా కన్ను...
డిసెంబర్ 31... 2019కి వీడ్కోలు పలుకుతూ... నూతన సంవత్సరం 2020కి స్వాగతం పలికే రోజు... అందుకే... హైదరాబాద్ నగరం అంతా ఒకటే సందడి... కేరింతలు... తుళ్లింతలతో పబ్‌లు, క్లబ్‌లు హోరెత్తిపోతాయి. పార్టీల పేరుతో జనం ఊగిపోతారు. ఇదే డ్రగ్స్ మాఫియాకు వరంగా మారబోతోంది. న్యూఇయర్ పార్టీలపై డ్రగ్స్ మాఫియా కన్నేసింది. వందల కోట్ల వ్యాపారానికి తెర లేపింది. దాంతో, జుబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట లాంటి ప్రాంతాల్లో డ్రగ్స్ అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నట్లు చెబుతున్నారు. అలాగే, శివారు ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థులే లక్ష్యంగా కొకైన్, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలు విక్రయాలు చేస్తున్నారు.
ఒక్క గ్రాము కొకైన్ మూడు వేలకు... హెరాయిన్ పదివేలకు అమ్ముతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఇదంతా జరిగిపోతోంది. అయితే, కాలేజీలతో పాటు పబ్‌లు, క్లబ్‌లు, రిసార్టుల్లో మత్తు పదార్ధాల అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో, డ్రగ్స్ నియంత్రణపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ప్రత్యేక పోలీసు బృందాలతో నిఘా పెంచారు. అలాగే... హోటళ్లు, పబ్‌లు, రిసార్ట్‌ల నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు.
ముంబై, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి మత్తు పదార్థాలు హైదరాబాద్ కి సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. దాంతో, హైదరాబాద్‌కు భారీగా గంజాయి సరఫరా అయ్యే అవకాశం ఉండటంతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచారు పోలీసులు. పబ్‌లకు డ్రగ్ పంపిణీ చేస్తున్న నైజీరియన్ గ్యాంగ్‌లు... డ్రగ్స్ కేసులో అరెస్టయిన కెల్విన్ ముఠాపై ఫోకస్ పెట్టారు. హెరాయిన్, కొకైన్, గంజాయితోపాటు అతితక్కువ ధరకు లభించే మత్తు ఇంజక్షన్లను వాడుతున్నట్లు కూడా గుర్తించారు. అయితే, కొత్త రూట్స్‌లో డ్రగ్ రవాణా అవుతున్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్, ఎస్వోటీ, సీసీఎస్ లతో నిఘా పెంచారు.
ప్రైవేటు బస్సుల్లో డ్రగ్స్ సరఫరా అవుతుండటంతో సెర్చ్ చేస్తున్నారు. అలాగే, డ్రగ్స్ అక్రమ వ్యాపారానికి ఆన్‌లైన్ వేదికగా మారుతోంది. నేరుగా అమ్మితే పోలీసులు పట్టుకుంటారని ఆన్‌లైన్ వెబ్‌సైట్లతో కొకైన్, బ్రౌన్ షుగర్, సిలికాన్ వంటి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. కొరియర్స్ పార్సిళ్లలో డ్రగ్స్ సేల్ చేస్తుండటంతో నిఘాను పటిష్టం చేశారు పోలీసులు. ఇప్పటికే రహస్య ప్రదేశాల్లో నిల్వచేసి న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ అమ్మేందుకు సిద్ధంగా ఉన్నారని అనుమానిస్తున్నారు. వేడుకల నేపథ్యంలో గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పెద్దఎత్తున మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు.
పబ్, రిసార్ట్ నిర్వాహకులు డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా... మత్తు పదార్థాలు సప్లయ్ చేసినా జైలుకు పంపిస్తామంటున్నారు. న్యూ వేడుకల సందర్భంగా ఫైర్ స్టార్, త్రీ స్టార్ హోటళ్లు, పబ్‌లు, రిసార్టులపై ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే, పార్టీలు జరుగుతున్న ప్రాంతాల్లో ఎలాంటి సంగీత కచేరీలు, డీజే సౌండ్స్ ఉపయోగించవద్దని హెచ్చరించారు. అసభ్య నృత్యాలు, అశ్లీల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే హోటళ్లు, పబ్‌లు, రిసార్ట్‌లు సీజ్ చేసి లైసెన్సులు రద్దు చేస్తామన్నారు.