ఉమ్మడి వరంగల్ లో మొదలైన పార్టీ నేతల హడావిడి: మున్సిపల్ ఎన్నికల మేళా......
posted on Jan 1, 2020 9:08AM
మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణ అంతా నేతల సందడి మొదలైయ్యింది.ఎన్నికల కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలు మున్సిపల్ పోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి సమీకరణాల చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రచారం, పోలింగ్ కు సమయం తక్కువగా ఉండటంతో ప్రధాన పార్టీల అన్నింటికీ గెలుపు అగ్నిపరీక్షలా మారింది. దీంతో ముందస్తు వ్యూహాలను రచిస్తున్నారు.ఇందులో అధికార పార్టీ ఒక్క అడుగూ ముందు వరుసలో ఉంది. ఎన్నికల షెడ్యూల్ ఖరారైన మరుసటి రోజునే టీఆర్ఎస్ నేతలు ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా పట్టణాలలో అంతర్గత సమావేశాలకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ నాయకులు కూడా ఎన్నిక లకు సన్నద్ధం అవుతున్నారు. ముఖ్య నాయకులు సైతం జిల్లాలోని ఆయా మున్సిపాల్టీలకు చెందిన నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. పోటీ ప్రధానంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొని ఉండటంతో ఈ రెండు పార్టీల హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. బిజెపి వామపక్షాలు కూడా మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం అంటున్నాయి.కానీ వార్డుల రిజర్వేషన్ మున్సిపల్ ఛైర్మన్ ల రిజర్వేషన్ లు ఇంకా ఖరారు కాకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది. వార్డుల్లో తమకు రిజర్వేషన్ కలిసి వస్తుందా లేదా అన్న డైలమాలో నేతలు ఉన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను విజయ తీరాలకు తీసుకెళ్తాయని టీఆర్ఎస్ నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలే తమను గెలిపిస్తాయి అని విపక్షాలు ధీమాగా చెబుతున్నాయి.ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9 మున్సిపాలిటీలో రాజకీయ సందడి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ అదే స్థాయిలో ఎన్నికల రణరంగానికి పార్టీలూ సిద్ధమవుతున్నాయి. పోరు పోరులో సత్తా చాటాలని అందరూ అంచనాలు వేస్తున్నారు. మరి ఎవరి అంచనాలు నెగ్గుతాయి తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.