రైతులకు అండగా జనసేనాని
posted on Dec 31, 2019 @ 2:31PM
అమరావతి రైతులకు అన్యాయం చేసి ఒక్క అడుగు ముందుకేసినా చూస్తూ ఊరుకునేదిలేదని మండిమడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజలకు భరోసా కల్పించకుండా.. అమరావతి రైతులకు భరోసా కల్పించకుండా.. వారికి అండగా నిలబడకుండా.. మీకు మీరే చర్యలు తీసుకుని ముందుకెళ్తే పరిణామాలు చాలా బాధ కలిగించే స్థితికి దారి తీస్తాయని పవన్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి కదిలిస్తున్న విషయం మొత్తం రాష్ట్రాన్నే కుదిపేసే అంశంగా మారిందన్నారు. మనల్ని మభ్య పెట్టి, భయపెట్టి, ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికే ఈ ప్లాన్ తప్ప మరొకటికాదని ఆయన తెలియజేశారు. హైకోర్ట్ అమరావతి నుంచి కదిలించాలంటే సుప్రీం కోర్టు చెప్పాలి.. కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలి.. అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని ఆయన వెల్లడించారు. ఈ ప్రభుత్వం రాయలసీమ ప్రజలను మోసం చేస్తొందని ఆయన మండిపడ్డారు. జీఎన్ రావు కమిటీ వాళ్లు చెప్పింది లిజిస్లేటివ్ అసెంబ్లీ విజయనగరంలో పెట్టాలని అన్నారు కానీ భీమిలిలో పెట్టాలని చెప్పలేదన్నారు. ఈ విషయం పై కూడా ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారు అని జనసేన అధినేత తెలియజేశారు.
రైతుల భూములు కోసం 40 సంవత్సరాలుగా గుమ్మం లోపలి నుంచి బయటికి రాని ఆడపడుచులు ఈ రోజు రోడ్ల మీద వస్తున్నారంటే అన్యాయాన్ని తట్టుకోలేక తప్పక మరే రాజకీయం చెయ్యడానికి కాదన్నారు. రోడ్లపైకి వచ్చిన ఇలాంటి ఆడపడుచులను..వారి కష్టాలను వైసీపీ నాయకులు పెయిడ్ ఆర్టిస్టులు అనే పదజాలంతో మాట్లాడటం క్షమించలేనిదని అన్నారు. మనుషుల్ని పశువులుగా వర్ణిస్తున్న తీరు తనకెంతో బాధనిచ్చిందన్నారు. స్పష్టత లేకుండా గనుక వైసిపి ఇలాగే ముందుకెళ్తే చాలా ప్రమాదముందన్నారు. రాజధాని ప్రజల మనోభావాలతో ముడిపడి ఉందని..రైతులు తమ సాగు భూములను ప్రజలు గురించి..రాష్ట్ర భవిష్యత్తు గురుంచి ఆలోచించి భూములను త్యాగం చేశారని గుర్తు చేశారు. కావున అమరావతి ప్రజల భవిష్యత్తును కాపాడటం జనసేన ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. రైతులకు అండగా నిలబడతామని అక్కడి ప్రజలకు మాటిచ్చారు జనసేనా అధినేత. ప్రజలు భూములిచ్చింది ప్రభుత్వానికి కనుక వారికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎల్లప్పుడు ఉంటుందన్నారు. ప్రభుత్వం మోసం చేస్తే నిలదీసే హక్కు.. ధర్నాలు చేసే హక్కు కూడా ప్రజలకు ఉందని అడ్డుకోకుండా మానవత దృష్టిగల చూడండి అంటూ పోలీస్ శాఖకు విన్నవించారు. ప్రజలపై, రైతులపై, రైతుకూలీలపై దయచేసి క్రిమినల్ కేసులు పెట్టవద్దని ఆయన విన్నవించారు. ఎప్పటికి 151 సీట్లు శాశ్వతం కాదని..అవి ఏ రోజైనా కూలిపోవచ్చని రైతు కన్నీరు పెట్టిన.. వారిని కన్నీరు పెట్టించిన ప్రభుత్వాలు ఇంత వరకు నిలబడ్డ దాఖలాలు లేవని ఆయన తెలియజేస్తూ ఎల్లప్పుడు జనసేన రైతులకు తోడుగా ఉంటుందని తెలియజేశారు.