రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి... గెలిపించినోళ్లదే పీఠం.!
మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్‌లో కాక రేపుతున్నాయి. ముఖ్యనేతలంతా మున్సిపోల్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా పీసీసీ పగ్గాలు ఆశిస్తోన్న లీడర్లంతా మున్సిపల్ ఎన్నికలను సవాలుగా తీసుకున్నారు. తమ తమ పరిధిలోని మున్సిపాలిటీలను గెలిపించుకుని అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేందుకు పావులు కదుపుతున్నారు. పీసీసీ రేసులో ముందున్న మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి.... తన పార్లమెంట్ సెగ్మెంట్‌లోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసే దిశగా పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడ కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలను గెలిచి తీరాలంటూ దిశానిర్దేశం చేస్తున్నారు.
ఇక, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా తన పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యతలను తీసుకున్నారు. అలాగే, ప్రస్తుత పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తన పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మున్సిపాలిటీల గెలుపు బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. హుజూర్ నగర్ పరాజయంతో మసకబారిన ప్రతిష్టను తిరిగి సంపాందించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక, ఖమ్మం జిల్లా బాధ్యతలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలాగే, మంథని ఎమ్మెల్యే శ్రీథర్‌బాబు.... పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మున్సిపాలిటీలను తన భుజాలపై వేసుకున్నారు. ఇక, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.... ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యతలను తీసుకొని కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అలాగే, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.... సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలను ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ఇలా, పీసీసీ పగ్గాలు ఆశిస్తున్న నేతలంతా... ఎవరికి వారే తమ పరిధిలోని కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను గెలిపించుకుని సత్తా చాటాలని, తద్వారా హైకమాండ్ మెప్పు పొందాలని తపనపడుతున్నారు.
అయితే, ఎవరు ఎక్కువ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను గెలిపించుకుని సమర్ధులని నిరూపించుకుంటారో వారికే పీసీసీ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి. దాంతో, ఎవరు టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొని పీసీసీ పగ్గాలు అందుకుంటారోనంటూ గాంధీభవన్‌లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది.