ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ సీనియర్ నేతల అసంతృప్తి!!
posted on Dec 31, 2019 @ 2:05PM
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఒకప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకుల్లో పలువురు సీనియర్లు కాలక్రమేణా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయాలు గులాబిదళంలో గుబులు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా నియోజక వర్గాల్లో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పని చేసిన నాయకులు నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల భర్తీలో అధినాయకత్వం అందరికీ న్యాయం చేయకపోవడం ఆ పార్టీ రెండో సారి అధికారంలోకొచ్చి ఏడాది అయినప్పటికీ అతీగతి లేకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు అనేక మంది కీలక పదవుల్లో ఉంటూ హవా కొనసాగిస్తుండటంతో పలు నియోజక వర్గాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది.
ప్రస్తుతం అందరూ కలిసి ఉన్నట్లే కనిపిస్తున్న అసంతృప్త జ్వాలలు మాత్రం లోలోపల రగులుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో నియోజక వర్గాల వారీగా పరిశీలిస్తే ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగు రామన్న హవా కనిపిస్తుంది. నిజానికి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్న కాలంలోనే ఇక్కడ టిఆర్ఎస్ బలోపేతానికి పలువురు నాయకులు చమటోడ్చారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర కూడా పోషించారు. అయితే ఆ సమయంలో జోగు రామన్న గులాబీ కండువా కప్పుకోవడం వరుసగా ఎన్నికల్లో గెలవడంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. ఆ తర్వాత టీఆర్ఎస్ తొలి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న లోక భూమారెడ్డికి డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పదవి దక్కింది. ఆ తరవాత జోగు రామన్న తన సన్నిహితులైన వారికే పలు పదవులు వచ్చేలా చక్రం తిప్పారు. కానీ ఇప్పటికీ చాలా మంది ద్వితీయ శ్రేణి నేతలు ఆయా పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
అటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాతి నిధ్యం వహిస్తున్న నిర్మల్ శాసన సభ నియోజకవర్గం లోనూ ఇలాంటి పరిస్థితి నెలకొనడం గమనార్హం. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైన కొత్తలో నిర్మల్లో గులాబీ కండువా కప్పుకునేందుకు చాలామంది వెనుకాడరు. పూజాడి శ్రీహరిరావు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసారు. కొన్నాళ్లు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2009,2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. తెలంగాణ వాదం బలంగానే ఉన్న స్థానికంగా ఉన్న ప్రత్యేక పరిస్థితులతో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో శ్రీహరిరావు పై బిఎస్పీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే గులాబీ గూటికి చేరారు. ఇంద్రకరణ్ కారు పార్టీలో చేరడం ఆ వెంటనే ఆయనకు రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు కూడా దక్కడంతో నిర్మల్లో పరిస్థితి పూర్తిగా మారింది. ఇంద్రకరణ్ రెడ్డి ప్రాబల్యం పెరిగింది. నామినేటెడ్, పార్టీ పదవులు, కాంట్రాక్టులు, ఇతర అన్ని లావాదేవీల్లోనూ మంత్రి చెప్పిందే వేదంగా కొనసాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని శ్రీహరిరావు వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఇక ఇదే నియోజకవర్గంలో మరో సీనియర్ నేత సత్యనారాయణగౌడ్ ఉన్నారు. ఈయన భార్య శోభారాణి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా కొనసాగారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు నామినేటెడ్ పోస్టుల రేసులో ఉన్నారు.
మరోవైపు ముథోల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ లోని కొందరు సీనియర్లు తమను పార్టీ అధిష్టానం ఎప్పుడు కరుణిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ బలోపేతం కోసం అనేక మంది నేతలు కష్టనష్టాలకోర్చి పనిచేసారు. టిడిపి ఎమ్మెల్యే వేణుగోపాలాచారి ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ లో చేరారు. 2014 లో ఆయనకే పార్టీ టికెట్ ఇచ్చింది, అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విఠల్ రెడ్డి విజయం సాధించి టీఆర్ఎస్ లో చేరారు. దీంతో వేణుగోపాలాచారి మరుగునపడ్డాయి. గులాబీ బాస్ కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యంతో క్యాబినెట్ హోదాతో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కొనసాగుతున్నారు. పోయిన ఎన్నికల్లోనూ విఠల్ రెడ్డికే పార్టీ టికెట్ ఇచ్చింది. భారీ మెజార్టీతో గెలుపొందడం ద్వారా విఠల్ రెడ్డి తన సత్తా చాటుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు తన స్థాయికి తగ్గ పదవి దక్కకబోతుందా అని వేణుగోపాలాచారి ఆశగా ఎదురు చూస్తున్నారు.
కీలకమైన మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే దివాకర్ రావు గెలుపునకు దోహదపడ్డ మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి నామినేటెడ్ పోస్టు రేసులో ఉన్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో, 2010 ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా మంచిర్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అధిష్టానంతో వచ్చిన అభిప్రాయ భేదాలతో 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకి జంప్ చేశారు, రాజకీయంగా నష్ట పోయారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవటంతో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి దివాకరరావు గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించారు. దీంతో ఒకనొక దశలో ఓటమి తప్పదనుకున్న టీఆర్ఎస్ ఎట్టకేలకు గెలిచింది. ఈ క్రమంలో అరవింద్ రెడ్డికి తగిన గుర్తింపు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఎలాంటి పదవి ఇస్తారనదే ప్రశ్నగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాజీ ఎంపీ నగేష్, టీఆర్ఎస్ పార్టీ మరో సీనియర్ నేత అరిగెల నాగేశ్వర్ రావులు కూడా నామినేటెడ్ పదవులో ఆశిస్తున్నారు. టిడిపిలో కీలక నేతలుగా పని చేసిన వీరిరువురూ గతంలో పలు పదవులను నిర్వహించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి ప్రజా ప్రతినిధులుగా గెలుపొందారు. పార్లమెంట్ ఫలితాల్లో నగేష్ ఓటమిని చవిచూడక నాగేశ్వరావు స్థానిక సంస్థల ప్రతినిధిగానే కొనసాగుతున్నారు. ఇప్పటికైనా తమ స్థాయిని అధిష్ఠానం గుర్తించి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు.
వీరేగాక టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి జెండా మోసిన అనేక మంది తమను అధిష్టానం గుర్తించాలని కోరుతున్నారు. రాష్ట్ర జిల్లా స్థాయి పదవులతో పాటు మార్కెట్ కమిటీలను ఎమ్మెల్యేల కనుసన్నలలోనే భర్తీ చేస్తుండడంతో ముందు నుంచి పని చేసిన తమకు ప్రాధాన్యం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పదవుల పందేరంలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.