2019 బ్యాంకింగ్ రిపోర్ట్... ఇందిర తర్వాత మోడీనే...
posted on Dec 31, 2019 @ 1:39PM
2019 ఇక కాలగర్భంలోకి వెళ్తోంది...2020 రాబోతుంది. 2019లో దేశంలో ఊహించని మార్పులు తీసుకువచ్చింది. బ్యాంకింగ్, పార్లమెంట్, ఉగ్రవాదం, ఎన్నికలు, సుప్రీంకోర్టు తీర్పులు కీలక అంశాలుగా నిలిచాయి. ఒక్కో ముఖ్యమైన ఘటన దేశంపై తనదైన రీతిలో ప్రభావాన్ని కనబర్చింది. ముఖ్యంగా 2019 ముఖ్యమైన ఆర్థికపరమైన సంఘటనలకు వేదికైంది. దేశ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేసే రీతిలో పలు ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాలు చోటు చేసుకున్నాయి. దేశ బ్యాంకింగ్ రంగాన్ని ప్రభావితం చేసే కొన్ని ప్రధాన నిర్ణయాలు 2019లో తీసుకున్నారు. జనవరిలో మొదలైన బ్యాంకుల విలీన ప్రక్రియ ఏడాది చివరి వరకూ కొనసాగింది.
ఒకప్పుడు నాటి ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయీకరణ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ తరహా చరిత్రాత్మక నిర్ణయాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకుంది. పది ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనంచేసి నాలుగు పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. 2017లో 27 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉండగా విలీనాల తరువాత వాటి సంఖ్య 12కు తగ్గిపోయింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమైపోయాయి. దాంతో, దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ గా పీఎన్ బీ రూపుదిద్దుకుంది. ఇండియన్ బ్యాంక్ లో అలహాబాద్ బ్యాంక్ విలీనం కానుంది. కెనరా బ్యాంక్ లో సిండికేట్ బ్యాంక్ కలసిపోయింది. దాంతో, నాలుగో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ గా కెనరా బ్యాంక్ మారింది. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ రెండూ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమయ్యాయి. దీంతో దేశంలో ఐదో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ గా యూనియన్ బ్యాంక్ నిలిచింది.
మొత్తానికి బ్యాంకింగ్ రంగంలో పెను మార్పులకు 2019 వేదికైంది. మొత్తం దేశ బ్యాంకింగ్ రంగమే ప్రభావితమయ్యేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఇందిర తర్వాత బ్యాంకింగ్ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రధానిగా మోడీ నిలిచారు.