మొదటిసారి చూస్తున్నా... భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు
posted on Jan 2, 2020 8:28AM
రాజధానిని తరలించొద్దంటూ అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని గ్రామాల రైతులు, ప్రజల నిరసన దీక్షల్లో పాల్గొని సంఘీభావం తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతమంది మహిళలు రోడ్డెక్కి పోరాటం చేయడం తన జీవితంలో మొదటిసారి చూస్తున్నానన్నారు. ఇది చాలా గొప్ప విషయమని... మీరు అనుకున్నది సాధించి తీరుతారని అన్నారు. దేశానికే ఆదర్శంగా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు తపన పడ్డారని భువనేశ్వరి గుర్తుచేశారు. కానీ, ఈ ప్రభుత్వం రాజధానిని తరలించాలని చూస్తోందని మండిపడ్డారు. అమరాతి ప్రజలకు తాము అండగా ఉంటామన్న నారా భువనేశ్వరి.... అవసరమైతే తమ జీవితాలను సైతం అడ్డుపెట్టి పోరాడతామన్నారు.
ఇక, అమరావతి రైతులు, మహిళలు, ప్రజల పోరాటానికి విరాళంగా తన చేతి బంగారు గాజులను తీసి ఇచ్చారు. రాజధాని మహిళలు పడుతున్న బాధను తోటి మహిళగా తాను అర్ధం చేసుకోగలనని అన్నారు. అయితే, భువనేశ్వరి విరాళంగా ఇచ్చిన బంగారు గాజులను బహిరంగ వేలం వేసి వచ్చిన డబ్బును అమరావతి ఉద్యమానికి వినియోగించాలని చంద్రబాబు సూచించారు.