2019 సుప్రీం రిపోర్ట్... సంచలన తీర్పులు...
posted on Dec 31, 2019 @ 1:30PM
అనేక సంచలన తీర్పులకు 2019 వేదికైంది. 2019లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల్లో ముఖ్యమైనది అయోధ్య అంశం. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి వీలు కల్పించేలా నవంబర్ 9న తీర్పు ఇచ్చింది సుప్రీం. ఇక, రాఫెల్ ఫైటర్ జెట్ డీల్ లో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. చౌకీదార్ చోర్ హై వ్యాఖ్యల సందర్భంలో రాహుల్ గాంధీపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని రాహుల్ కి సూచిస్తూ ప్రొసీడింగ్స్ ను ముగించింది సుప్రీంకోర్టు.
ఇక శబరిమల తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన కేసును ఏడుగురు జడ్జిల బెంచ్ కు రిఫర్ చేసింది. కొన్ని మసీదుల్లోకి, పార్సీ ఆలయాల్లోకి మహిళల ప్రవేశంలాంటి అంశాలన్నీ కూడా శబరిమల రివ్యూ కేసులోని అంశాల తరహాలోనివే అంటూ వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా సమాచార హక్కు పరిధిలోకి వస్తుందన్న సుప్రీం..... కాన్ఫిడెన్షియాలిటీ క్లాజ్ కింద న్యాయమూర్తులకు రక్షణ కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. అలాగే, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఫ్లోర్ టెస్ట్ కు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆదివారం నాడు సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ చేపట్టడం ఓ అరుదైన సందర్భం.
ఇక, ఎస్సార్ స్టీల్ ను ఆర్సెలర్ మిట్టల్ టేకోవర్ చేయడానికి మార్గం సుగమం చేసింది సుప్రీంకోర్టు. ట్రిపుల్ తలాక్ పై కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ రాజ్యాంగబద్దతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం తోసిపుచ్చింది. కర్నాటక రెబెల్ ఎమ్మెల్యేలకు ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఉద్యోగుల వేతనాలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
ఇలా, 2019లో సుప్రీంకోర్టు పలు కీలక తీర్పులు ఇచ్చింది. దేశంలో మత, రాజకీయ, సామాజిక వ్యవస్థలను ఇవి ప్రభావితం చేశాయి. వీటిలో అత్యధికం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా రంజన్ గొగోయ్ ఉన్నప్పుడు వెలువడ్డాయి.