గంటా, కొండ్రు దారెటు? టీడీపీ హైకమాండ్ ఆరా..! 

పలువురు టీడీపీ ఎమ్మెల్యేలే కాదు... ముఖ్యనేతలు కూడా పక్కచూపులు చూస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులు... వైసీపీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా పక్క చూపులు చూస్తున్నవాళ్లలో ఎక్కువగా ఆయా పార్టీల నుంచి ఎన్నికల ముందు టీడీపీలో చేరినవాళ్లే ఉన్నారనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా మూడు రాజధానుల ప్రచారం తర్వాత ఇలాంటి వాళ్లంతా బయటపడుతున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తెలుగుదేశం తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే... ఒకరిద్దరు టీడీపీ నేతలు మాత్రం దాన్ని సమర్ధిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఆ వాయిస్ వినిపిస్తోంది. అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ ఆ వ్యాఖ్యలు చేశారో లేదో... వెంటనే టీడీపీ ఎమ్మెల్యే గంటా సమర్ధించారు. విశాఖలో పరిపాలనా రాజధానిని ఆహ్వానిస్తూ ట్వీట్స్ చేశారు. అలాగే, రాజాం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన కొండ్రు మురళి కూడా జగన్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ ప్రకటన చేశారు. దాంతో, వీళ్లిద్దరూ వైసీపీలో చేరడం ఖాయమనే మాట వినిపించింది. జగన్ చెంతకు వెళ్లాలనే ఆలోచనతోనే మూడు రాజధానుల ప్రకటనను స్వాగతించారనే ప్రచారం జరిగింది. అయితే, ఉత్తరాంధ్ర వాసిగా మాత్రమే తాను విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను ఆహ్వానించానని గంటా వివరణ ఇచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకి కూడా చెప్పానంటూ తెలియజేశారు. అయితే, కొండ్రు మురళి నుంచి మాత్రం ఎలాంటి వివరణ రాలేదు. దాంతో, కొండ్రు వైసీపీ గూటికి చేరడం ఖాయమనే మాట వినిపిస్తోంది. అయితే, కొండ్రు మురళి తీరుపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన కొండ్రు మురళికి చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, పార్టీలో మొదట్నుంచీ ఉంటోన్న ప్రతిభారతిని కాదని, కొండ్రుకి టికెట్ ఇచ్చారని తెలుగు తమ్ముళ్లు గుర్తుచేస్తున్నారు. ఆనాడు కొండ్రు రాకను తాము తీవ్రంగా వ్యతిరేకించామని, కానీ పార్టీ ప్రయోజనాల కోసం ఊరుకున్నామని, కానీ ఇఫ్పుడు కొండ్రు మురళి వ్యవహరిస్తున్న తీరు తేడాగా ఉందని మండిపడుతున్నారు. మూడు రాజధానులకు అనుకూలంగా కొండ్రు మురళి చేసిన వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అయితే, పార్టీ స్టాండ్ కు విరుద్ధంగా జగన్ వ్యాఖ్యలను సమర్ధించిన కొండ్రు మురళిపై అధిష్టానం  సీరియస్ గానే దృష్టిపెట్టిందట. అసలు కొండ్రు ఉద్దేశమేంటో తెలుసుకునేందుకు ఆరా తీస్తున్నారట. మొత్తం సిక్కోలు టీడీపీలో కొండ్రు మురళి వ్యవహారంపై జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ మారాలనే ఆలోచనతో జగన్ వ్యాఖ్యల్ని సమర్ధించారా? లేక... ఉత్తరాంధ్రపై అభిమానంతో మాట్లాడారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆచూకీ చెబితే తగిన బహుమతి!!

దేనికైనా సిద్ధం అంటూ సర్కారు తో తేల్చుకునేందుకు కొంత మంది రైతులు సిద్ధమయ్యారు. జల దీక్షలు చేపట్టారు. తాళ్లాయపాలెం లోని కృష్ణా నదిలో దిగి కొన్ని గంటల పాటు నినాదాలతో హోరెత్తించారు. చేతుల్లోని ఆకుపచ్చ జెండాలను ఊపుతూ మెడలోతు నీళ్ళల్లో గంటకు పైగా నిలబడ్డారు. వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగాయి. జగన్ కు అమరావతి అభివృద్ధి చేయడం చేతకాక పోతే మౌనంగా ఉండాలి, వచ్చే ఐదేళ్లలో ఆయన ఒక్క పనిచేయకపోయినా మా ప్లాట్లను అభివృద్ధి చేయక పోయినా మేం అడగము, రాజధానిని మాత్రం తరలించొద్దని రైతులు అర్థించారు. రాజధాని పై మంత్రుల చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ఎనిమిది గ్రామాలే రాజధానిలో ఉద్యమిస్తున్నాయన్న శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలపై మండిపడ్డారు. రేపటి రోజున విశాఖ పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు.  తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆచూకీ చెబితే తగిన బహుమతి ఇస్తామని రైతులు ప్రకటించారు. న్యాయం చేయండి అంటూ మున్సిపల్ కార్యాలయం కార్యదర్శి సీఆర్డీఏ కమిషనర్ కు రైతులు లేఖలు రాశారు. ఇంటెలిజెన్స్ పోలీసులు తనను ఫోటోలు తీయడం పై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తుళ్లూరులో యువకులు మోదీ, అమిత్ షా మాస్కులు ధరించి రోడ్డుపైనే క్రికెట్ ఆడుతూ రాస్తారోకో చేశారు. ఒక వ్యక్తి జగన్ మాస్కు ధరించి చండ్రకులు చేత పట్టుకొని రోడ్డెక్కాడు. అక్కడ ఉన్న పోలీసులు ఆయనను అడ్డుకొని జగన్ మోసుకుని లాగేశారు. రాజధాని రైతులు శిబిరాల వద్ద క్రిస్మస్ ను జరుపుకున్నారు. సర్కార్ తన నిర్ణయం మార్చుకునేలా చేయాలంటూ మహిళలు విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఉద్దండరాయునిపాలెంలో జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మహిళలు పాల్గొన్నారు. నాడు మోదీ అక్కడ అందించిన పవిత్ర నీరు మట్టికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతికి సారె సమర్పించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర అగ్ర నేతలు ఒక బృందంగా ఏర్పడి తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాలకి వెళ్లి రైతులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.  ఐక్య ఉద్యమాలతో రాజధాని తరలింపును అడ్డుకుంటామని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు తీర్మానం చేశారు. గుంటూరులో జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం సమావేశం జరిగింది. జేఏసీ అధ్యక్షుడు జి శాంతకుమారి మాట్లాడుతూ రాజధాని ఒక్క పార్టీకో ప్రాంతానికి సంబంధించిన అంశం కాదన్నారు. రాజధాని లోని 29 గ్రామాల్లో మొదలైన ఉద్యమం రాష్ట్ర మంతా విస్తరిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కలిసి అమరావతి కోసం బుధవారం జేఏసీగా ఏర్పడ్డాయి. ఈ కమిటీ కన్వీనర్ గా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పేరును ప్రకటించారు. అనంతరం మధు ఆధ్వర్యంలో జరిగిన జేఏసీ సమావేశంలో మాజీ హోమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, తదితర టీడీపీ నేతలు, జనసేన, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాకినాడ, అమలాపురం రాజమహేంద్రవరంలో జేఏసీలను ఏర్పాటు చేసి మంత్రులకు తమ డిమాండ్ ను వినిపిస్తూ వినతి పత్రాలు అందజేయాలని నాయకులు తీర్మాణించారు. కాగా రాజధాని ప్రాంత రైతులు ఈ నెల 28 వ తేదీన గుంటూరు జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు.మొత్తం మీద రాజధాని అంశంతో ఏపీ మొత్తం అట్టుడుకిపోతోంది అనడంలో అలాంటి సందేహం లేదు. మరి జగన్ ఈ అంశంపైఏ నిర్ణయానికి వస్తారు అన్నది మాత్రం వేచి చూడాలి.

 డీఎస్సీ 2020 నోటిఫికేషన్ విడుదల....

ప్రభుత్వ నోటిఫికేషన్ లు విడుదలైయ్యాయి అంటే చాలా యువతలో ఎనలేని ఉత్సాహం నెలకొంటుంది.ఉపాధ్యాయ వృత్తిని కోరుకుంటున్న ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఎస్సీ 2020 నోటిఫికేషన్ వచ్చే ఫిబ్రవరిలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జిల్లా మండల పరిషత్ ప్రభుత్వ మోడల్ గురుకులాలతో పాటు మున్సిపల్ పాఠశాలల్లో కలిపి ఖాళీగా ఉన్న దాదాపు 10,000 ల నుంచి 12,000 ల వరకు ఉపాధ్యాయ పోస్టులను ఈ డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. 75 నుంచి 480 మంది వరకు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలను ఒక యూనిట్ గా తీసుకుని ఖాళీలను నిర్ధారిస్తారు. ఉన్నత పాఠశాలలో మొత్తం తొమ్మిది మంది టీచర్లు ఉండాలి. వీరిలో ఆరుగురు సబ్జెక్టు టీచర్లు కాగా ముగ్గురు భాషా పండిట్లు ఉండాలి. ఈ ప్రకారం లేని పాఠశాలల వివరాలను సేకరించనున్నారు. అదే సమయంలో త్వరలో రిటైర్ అయ్యేవారికి వివరాలనూ పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలను కూడా సేకరించి డీఎస్సీ 2020 నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం డీఎస్సీ 2018 పేరిట మొత్తం 7,902 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే దివ్యాంగుల కోసం 602 టీచర్ పోస్టులతో ప్రత్యేకంగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే విద్యార్హతలు ఇతర సాంకేతిక అంశాలను కారణాలగా చూపుతూ పలువురు న్యాయ స్థానాల్లో కేసులు వేశారు. ఆయా కేసులపై విచారణ పెండింగ్ లో ఉంది. కోర్టు కేసులు లేని 2,654 టీచర్ పోస్టుల భర్తీకి ఈ నెల 22 జిల్లాల్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు నియామక పత్రాలు అందజేశారు. కోర్టు కేసుల కారణంగా ఇంకా 5,850 టీచర్ పోస్టుల భర్తీ నిలిచిపోయింది. వాటిపై ఉన్న కేసులన్నింటినీ జనవరి నెలాఖరు లోగా పరిష్కరించే దిశగా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది.  వచ్చే జనవరి మొదటి వారంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ జారి చేసి నెలాఖరులో పరీక్ష నిర్వహించనున్నారు. టెట్ కు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకునే అవకాశముందని అంచనా, అలాగే డీఎస్సీ 2020 కి ఐదారు లక్షల మంది దరఖాస్తు చేస్తారని పాఠశాల విద్యా శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. టెట్, డీఎస్సీల నిర్వహణకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం ప్రకటన చేయనుంది.

విశాఖ రాజధానిగా మారే అవకాశం ఉందా?

రాజధాని పట్ల రోజు రోజుకు ఉత్కంఠత పెరిగిపోతూనే ఉంది.ఎవరి ప్రాంతంలో వారు రాజధాని కాబోతుందన్న అంచనాలతో ఉన్నారు.అమరావతి నుంచి విశాఖపట్నానికి రాజధాని బదిలీ అవుతున్న నేపథ్యంలో అమరావతిపై కమిటీ వేయాలన్న యోచనలో సీఎం జగన్ ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని నగరం పై ఆలోచనలు చేస్తున్నామని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం అన్నప్పుడే రాజధాని తరలిపోవటం ఖాయమని తేలిపోయింది. జీఎన్ రావు కమిటీ నివేదిక కూడా రాజధానిగా విశాఖను తీర్చి దిద్దాలని సిఫారు చేసింది. రాజధాని నిర్మాణానికి 33,000 ల ఎకరాలు ఇచ్చిన రైతులు ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చ జరగనుంది. పరిపాలనా భవనాలు, హై కోర్టు బెంచ్ విశాఖలో అసెంబ్లీ భవన సముదాయం హై కోర్టు బెంచ్ అమరావతిలో హై కోర్టు కర్నూలు లోనే ఏర్పాటు చేస్తూ తీర్మానం చేయనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అమరావతిలో రైతులు చేపడుతున్న ఆందోళనలు చర్చకు రానున్నాయి. ఈ ఆందోళనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం లేదు. అమరావతి గ్రామాల ప్రజలు మినహా కృష్ణా, గుంటూరు జిల్లాలో ఎవరూ ఆందోళన చెందడం లేదని వాదిస్తోంది. గన్నవరం విమానాశ్రయం విస్తరణ సమయంలో సేకరించిన వెయ్యి ఎకరాలకు పరిహారంగా రాజధాని ప్రాంతంలో రైతులకు భూములిచ్చారని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. వారిలో చాలా మంది భూములను విక్రయించేసుకున్నారని అంటున్నాయి. ప్రభుత్వం సమీకరించిన భూముల్లో దాదాపు పదిహేను వేల ఎకరాలు క్రయ విక్రయాలతో చేతులు మారాయని వెల్లడిస్తున్నాయి. రాజధానిలో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారే అధికంగా ఉన్నారని అమరావతి పై ఆధారపడ్డ వారిలో స్థానికేతరులే అత్యధికమని చెబుతున్నాయి. వీరంతా వ్యాపార లావాదేవీల్లో భాగంగా క్రయ విక్రయాలు జరిపారే తప్ప రాజధాని పై ప్రేమతో కాదన్నది ప్రభుత్వ వర్గాల వాదన. రైతులతో చేసుకున్న ఒప్పందం మేరకు అభివృద్ధి చేసిన ప్లాట్లను అందజేస్తామని చెబుతున్నాయి. రాజధానే లేనప్పుడు ఈ ప్లాట్లకు విలువేమి ఉంటుందన్న ప్రశ్నకు సమాధానం లేదు. రైతులు కోరుకుంటే గతంలో వారిచ్చిన భూములను వెనక్కి ఇచ్చేస్తామని రోడ్లు వేసినా ప్రాంతాలకు భూమి ధర లెక్కగట్టి భూయజమానులకు పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. వీటిన్నింటి పైనా రైతులతో భూ యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపేందుకు వీలుగా మంత్రుల కమిటీ వేసే యోచనలో జగన్ ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. క్యాబినెట్ లో దీనిపై సమగ్ర నిర్ణయం తీసుకున్నాక కమిటీ పై ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో మంత్రులు అధికారులతో ఈ కమిటీని ప్రకటించవచ్చునని ఈ వర్గాలు పేర్కొంటున్నాయి.మరి రాజధాని పట్ల ఏం జరగబోతోంది అన్న విషయం రేపటి భేటిలో తెలనుంది.   

ముగిసిన సంపూర్ణ సూర్య గ్రహణం......

సాధారణంగా 11 గంటల సమయం అంటే చాలు సూర్యుడు మనల్నే చూస్తూ ఉంటాడు కానీ ఇవాళ 11 అవుతున్నా బయట వాతావరణం చల్లగా మారిపోయింది. ఎండే లేదు, ఎందుకంటే సూర్యుడు మాయమైపోయాడు. పట్టపగలు కూడా ఇంట్లో లైట్లు వేసుకోవాల్సిన పరిస్థితి, సూర్యగ్రహణం ముగుస్తొంది. ఈ ఏడాదికే కాదు ఈ దశాబ్దానికి ఇది ఆఖరి సూర్యగ్రహణం. నింగిలో జరుగుతున్న ఈ అద్భుతాన్ని ఖచ్చితంగా చూసితీరాల్సిందే లేదంటే జీవితంలో ఓ అరుదైన క్షణాన్ని మిస్సయి పోతాము. సూర్యగ్రహణం కనువిందు చేస్తోంది, విద్యార్థులు యువకుల రోడ్ల పై కొచ్చి గ్రహణాన్ని వీక్షిస్తున్నారు. దేశమంతటా రింగ్ ఆఫ్ ఫైర్ ను ఆసక్తిగా తిలకిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళలో సూర్యగ్రహణ ప్రభావం అధికంగా ఉంది. ఈ ఏడాది వార్షిక సూర్యగ్రహణంగా దీన్ని పిలుస్తున్నారు. సూర్యుడు భూమి మధ్యేమార్గాని చంద్రుడు అడ్డుకున్న సమయంలో సూర్యగ్రహణం వస్తుంది. సూర్యుని కప్పి ఉండడం వల్ల గ్రహణం ఏర్పడుతుంది. ఆయా సందర్భాన్ని బట్టి పాక్షికంగా లేదంటే సంపూర్ణంగా సూర్య లేదా చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఉదయం 9 గంటల 4 నిమిషాలకు సంపూర్ణ స్థితికి చేరుకున్న సూర్యగ్రహణం ఉదయం 11:16 నిమిషాలకు ముగుస్తుంది. సూర్యగ్రహణం గరిష్ఠంగా మూడు నిమిషాల నలభై సెకన్ల పాటు ఉండనుంది. సూర్యగ్రహణం భారత్ తో పాటు అస్ట్రేలియా, ఫిలిపీన్స్, సౌదీ అరేబియా, సింగపూర్ లలో కనిపిస్తుంది. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, ఒమన్, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, ఉత్తర మరియానా ద్వీపం, గ్వామ్ లో వార్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. కోజికోడ్, కోయంబత్తూర్, జాప్నా, ట్రింకోమలీ, సింబోల్ గా, బాటమ్, సింగపూర్, సింకవ్వాంగ్, గ్వామ్ లో సంపూర్ణ సూర్యగ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యగ్రహణం రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే అంశంపై భిన్న వాదనలున్నాయి. అయితే గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవద్దని, నీరు కూడా తాగొద్దు అని పెద్దలు చెబుతుంటారు. గ్రహణానికి ముందు నుంచే ఇంట్లో వంట చేయకూడదు అని అంటారు. ఇంట్లో ఉన్న వృద్ధులకూ ఆహారానికి బదులు ఎలక్ట్రోలైట్స్ ఇవ్వాలని సూచిస్తారు. సూర్యరశ్మి కనిపించని సమయంలో బాక్టీరియా చురుగ్గా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు వెల్లడిస్తున్నారు. 

ఖాకి నీడలో విజయవాడ.. టీడీపీ కీలక నేతల గృహ నిర్బంధం

  ఏపీ రాజధాని మార్పు పై అమరావతి ప్రాంత రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీకి 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ప్రకటించటంతో రాజధానికి భూమిలిచ్చిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతూ తమకు తోచిన విధంగా నిరసనలు చేపట్టారు. తాజాగా మాజీ సీఎం చంద్రబాబు, పలు ప్రజా సంఘాలు ఆ రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ ఆందోళనల నేపథ్యంలో  విజయవాడ నగరం మొత్తం ఖాకి నీడలో ఉంది. విజయవాడ నగరం లోని  కేశినేని నాని, బుద్ధా వెంకన్న వంటి ముఖ్య టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం లో ఉంచారు. ఐతే దీనిపై కేశినేని నాని తీవ్రంగా స్పందించారు. నాపై రౌడీ షీట్ ఉందా లేక క్రిమినల్ కేసులు ఉన్నాయా అని అయన పోలీసుల పై మండి పడ్డారు. ఎంపీగా ఉన్న వ్యక్తిని బయటకు వెళ్లకుండా ఎలా ఆపుతారని కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. ఢిల్లీ, బెంగళూరులో లక్షల మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియ చేశారని... వారిని ఎవరు ఆపారని అయన పోలీసుల తీరును  ప్రశ్నించారు.

బీజేపీపై యుద్ధానికి సిద్ధమైన కేసీఆర్... సోనియాకి ఆహ్వానం!!

బీజేపీపై యుద్ధానికి టీఆర్ఎస్ సిద్దమైందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. వారికి మద్దతుగా ఉద్యమించేందుకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సిద్ధమయ్యారని తెలుస్తోంది. అంతేకాదు ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టేందుకు సన్నద్ధమయ్యారని సమాచారం. అందులో భాగంగానే మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30వ తేదీన హైదరాబాద్‌లో ‘గాంధీ కావాలా? గాడ్సే కావాలా?’ నినాదంతో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు.  లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్‌ ఫ్రంట్‌ నిర్మిస్తానని ప్రకటించిన కేసీఆర్‌ ఆ తర్వాత ఎందుకో మౌనం వహించారు. ఇప్పుడు మళ్లీ జాతీయ రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు. సీఏఏ, ఎన్నార్సీల పుణ్యమా అని కేసీఆర్‌కు జాతీయ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించేందుకు అవకాశం దక్కింది. జాతీయ స్థాయిలో తాను జరిపే పోరాటంతో లౌకిక వాదులు, ముస్లింలు వచ్చే ఎన్నికల్లో తనకు అండగా నిలబడతారని కేసీఆర్‌ భావిస్తున్నారట. ఇటు తెలంగాణలోను, అటు దేశవ్యాప్తంగాను బీజేపీ విస్తరణను అడ్డుకొనేందుకు ఇదే అదునుగా భావిస్తూ, విపక్షాలను సమన్వయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. సీఏఏ, ఎన్‌సీఆర్‌లను వ్యతిరేకిస్తూ కేసీఆర్‌ జనవరి 30న హైదరాబాద్‌లో తలపెట్టిన సభకు జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించనున్నారు. ముస్లిం నాయకులు, ప్రతినిధులను దేశం నలు మూలల నుంచి ఆహ్వానించే బాధ్యతను అసదుద్దీన్‌ ఒవైసీకి అప్పగించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ సభకు సోనియా గాంధీ, మమత బెనర్జీ, నితీశ్‌ కుమార్, పినరై విజయన్‌ లను ఆహ్వానించనున్నారని సమాచారం.

రాజధాని రైతులకు న్యాయం జరిగేనా?

  రాజధాని పై తమకు న్యాయం జరగాలంటూ ధర్నాకి దిగిన రైతులలో కలవరం రేకెత్తుతోంది. రాజధాని మార్పుపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రమంత్రి వర్గం రేపు సమావేశమవుతుంది. క్యాబినెట్ సమావేశం నిర్ణయాన్ని ప్రభావితం చేసే విధంగా ఆందోళనను మరింత ఉధృతం చేసేందుకు రాజధాని రైతులు సమాయత్తమవుతున్నారు. ఇందుకోసం గురువారం నాడు పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. వామపక్ష నాయకులు కూడా గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. కేబినెట్ భేటీ దృష్ట్యా ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధమవుతోంది. ఇందు కోసం గ్రామగ్రామాన పోలీసులు మోహరిస్తున్నారు. మరోవైపు తమ ఆందోళనను ఆవేదననూ రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు సమయం కోరారు. రైతుల మొరను వినేందుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సమయాన్ని కేటాయించారు. రాజ్ భవన్ లో ఉదయం వారిని కలుసుకునేందుకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. రాజధానిని మూడు ముక్కలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ యోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా రాజధాని రైతుల గోడును తెలుపుకునేందుకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తూ అమరావతి రాజధాని రైతు సమీకరణ సమాఖ్య కన్వీనర్ మాదల రాజేంద్ర తదితరులు చేసిన వినతిని గవర్నర్ మన్నించారు. దీంతో ఏ ఏ కారణాల రీత్యా నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటునామో ఆయనకు వివరించేందుకు సమాఖ్య సమాయత్తమవుతుంది. రాజధాని లోని 29 గ్రామాల నుంచి అన్ని వర్గాలకు చెందిన ఒకరిద్దరు రైతులతో కూడిన బృందంగా గవర్నర్ ను కలవాలని నిర్ణయించింది. రాజధాని నగరంగా అమరావతిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తుందా లేక ఇప్పటికే ప్రకటించిన మూడు ముక్కల రాజధానికే ఓటేస్తుందా అనే విషయాన్ని తేల్చే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం శుక్రవారం జరగనుంది.దీంతో తమ ఆందోళన కార్యక్రమాల్లో మరింత ముమ్మరం చేసేందుకు రాజధాని రైతులు సన్నద్ధమవుతున్నారు. సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో జరిగే ధర్నాలో రాజధాని రైతులు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నట్లు సమాచారం.ఒక పక్క రైతుల ఆందోళన,మరో పక్క పోలీసుల ఆంక్షలతో రాష్ట్రం మొత్తంఏం జరగబోతోందా అన్న టెన్షన్ వాతావరణం నెలకొన్నది.  

ఎపి ప్లాంట్ నుండి హీరో మోటార్స్ తొలి బైక్ విడుదల... అభినందించిన బాబు 

  ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటార్స్ నుండి తొలి బైక్ ను ఆ సంస్థ విడుదల చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయం లో ఎంతో పోటీని తట్టుకొని ఏపీలో ఏర్పాటు చేసిన హీరో మోటార్స్ ప్లాంట్ నుండి తొలి బైక్ రిలీజ్ చేసిన సందర్బంగా ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హీరో సంస్థ సిబ్బందికి అభినందనలు తెలిపారు.  నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి తీసుకొచ్చిన మొట్ట మొదటి భారీ సంస్థ హీరో మోటార్స్ అని అయన తెలిపారు. తాను అప్పుడు చేపట్టిన అభివృద్ధి పనుల ఫలితాలు ఇప్పుడు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. నవ్యాంధ్ర ను ఆటోమొబైల్ రంగానికి చిరునామాగా తీర్చిదిద్దాలన్న ప్రయత్నంలో భాగంగా పక్క రాష్ట్రాలనుండి ఎంతో పోటీని తట్టుకుని హీరో మోటోకార్ప్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చామని చంద్రబాబు ఈ సందర్బంగా  గుర్తు చేశారు.

జార్ఖండ్ ఎన్నికల ఫలితాల పై హర్షం వ్యక్తం చేస్తున్న జగన్..... 

  జార్ఖండ్ లో జేఎంఎం కాంగ్రెస్ కూటమి సర్కార్ కొలువుదీరబోతోంది. 43 స్థానాల్లో కూటమికీ ఆధిక్యం లభించగా బీజేపీ 28 స్థానాల్లో మాత్రమే లీడ్ లో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి చేయబోతున్నారు జేఎంఎం వర్కింగ్ ప్రసిడెంట్ హేమంత్ సోరెన్. బర్హెడ్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఘన విజయాన్ని సాధించారు. దుంకాలలో కూడా ఆధిక్యంలోనే ఉన్నారు హేమంత్. తన తండ్రి శిబూ సొరేన్ కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు శిబూసోరెన్ కు చాలా ఊరటనిచ్చాయి. ఆయన ఒక విధంగా బీజేపీ పై ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలియజేశారు. తనయుడు హేమంత్ సీఎం కాబోతున్నాడనే ఆనందం ఆయన ముఖంలో కన్పిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు పై హేమంత్ కు కీలక సూచనలు చేశారు శిబుసోరెన్. ఎన్నికల ఫలితాల పై చాలా రిలాక్స్ గా ఉన్నారు హేమంత్ సోరెన్. తన నివాసంలో సైకిల్ తొక్కుతూ రిలాక్స్ అయ్యారు. తన కుమారుడితో కలిసి సైకిల్ తొక్కారు హేమంత్ సోరెన్. పార్టీని విజయం వైపు నడిపించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. జార్ఖండ్ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఇప్పటికీ నెరవేరిందన్నారు హేమంత్ సోరెన్. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని తెలిపారు. జార్ఖండ్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని ఎన్నికల ఫలితాలతో జేఎంఎం కార్యకర్తల్లో జోష్ వచ్చిందని ఆయన తెలియజేశారు.బ్రాంచితో సహా పలుచోట్ల సంబరాలు చేసుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు, బాణసంచా పేల్చి వేడకలు చేసుకున్నారు. ఓటమిని అంగీకరించినట్లుగా ప్రకటించారు జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్. 5 ఏళ్ళలో జార్ఖండ్ అభివృద్ధికి తాము కృషి చేసినట్లుగా ప్రజా తీర్పును శిరసావహిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి గుణపాఠం నేర్పనున్నారు కాంగ్రెస్ నేతలు. ఢిల్లీ ఎన్నికలతో పాటు వచ్చే అన్ని ఎన్నికల్లో కూడా బీజేపీ ఓటమి ఖాయమన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్. గత ఆరేళ్లుగా మోదీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు అర్థమయ్యేలాగా చేయగలిగామన్నారు. మొత్తం మీద జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు కాంగ్రస్ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.  

ఉక్కు కార్మాగారంతో రాయలసీమకు మంచి రోజులు రాబోతున్నాయన్న జగన్.........

  3 ఏళ్ల లోనే కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలియజేశారు. చంద్రబాబు మాదిరిగా తాను ఎన్నికలకు 6 నెలల ముందు టెంకాయ కొట్టలేదని అధికారం లోకి వచ్చాక 6 నెలలకే టెంకాయ కొట్టానని గుర్తు చేశారు. వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ రావడం వల్ల ఈ ప్రాంత పరిస్థితి మారుతుందని ఆయన తెలియజేశారు.6 నెలల ముందు ఒక పెద్దమనిషి వచ్చి టెంకాయ కొట్టాడని ఆయన తెలియజేశారు. ఉన్న 5 సంవత్సరాలు పరిపాలన చేయడానికే ప్రజలు అధికారాన్ని ఇచ్చారు అని,ఇలాంటి పరిస్థితుల్లో నాలుగున్నర సంవత్సరం ఏమీ చేయకుండా కేవలం ఎన్నికలకు 6 నెలలు ముందు మాత్రం వచ్చి టెంకాయ కొడితే దానిని మోసం అంటారు అని జగన్ తెలియజేశారు.కానీ అధికారం లోకి వచ్చిన 6 నెలలకే టెంకాయ కొడితే దానిని చిత్తశుద్ధి అని కూడా అంటారు అని ఆయన స్పష్టం చేశారు.వెనకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం, ఈ ప్రాంతానికి మంచి జరగాలి అంటే నీళ్ళు కావాలి, పరిశ్రమలు కావాలి, ఊద్యోగాలు రావాలి ఇవి ఎంత అవసరమో తెలిసిన వ్యక్తిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నానని జగన్ వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే ఈ రోజు కడపలోనే రాయలసీమ ఆర్థిక చరిత్రను, ఉద్యోగాల చరిత్రను మార్చడం కోసం 30 లక్షల టన్నుల ఉక్కు కార్మాగారానికి ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నట్లు సగర్వంగా వేదిక పై తెలియజేశారు.ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుతో రాయలసీమలో 25,000 ల మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందన్నారు. జిల్లాల ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్ తో సీమలో ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మన బ్రతుకులు మారుతాయని, పారిశ్రామిక రంగంలో రాయలసీమ ప్రాంతమంతా కూడా పరుగెడుతుందని ఆశాభావంతో తాను ఈ ఉక్కు ఫ్యాక్టరీకి పునాది రాయి వేయనున్నట్లు జగన్ తెలియజేశారు.  

విశాఖకు వైసీపీ ముప్పు... పెద్ద కుట్ర ఉందంటోన్న సబ్బం

టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖను రాజధానిగా ప్రకటించడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. జగన్ నిర్ణయంతో విశాఖకు పెనుముప్పు రాబోందని హెచ్చరించారు. సడన్‌గా విశాఖను రాజధానిగా చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని అనుమానం వ్యక్తంచేశారు. విశాఖను నాశనం చేసేందుకే జగన్ ప్రభుత్వం ఇక్కడికి రాజధానిని మార్చుతోందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఆరు నెలలుగా భీమిలిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న సబ్బం హరి... ఖాళీగా ఉన్న భూముల్ని దోపిడీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే ఆధారాలతో సహా దోపిడీని బయటపెడతానని సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఇప్పటికే రౌడీ మూకలు దిగాయని... ప్రభుత్వం నోటిఫై చేసిన భూముల్ని స్వాహాచేసే కుట్ర జరుగుతోందని సబ్బం ఆరోపించారు. అమరావతిలో భూముల్ని కబ్జా చేయలేరు కాబట్టే కొత్త ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నారని... కానీ, వైసీపీ నేతల ఆటలు విశాఖలో సాగవన్నారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని, అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించిన వైసీపీ నేతలు ఎందుకు నిరూపించలేకపోయారని సబ్బం ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అవినీతి జరిగినట్లు వైసీపీ ప్రభుత్వం నిరూపించి ఉంటే జగన్ ను ప్రజలు నమ్మేవారని, కానీ కేవలం ఆరోపణలుచేసి బురద చల్లే ప్రయత్నం చేయడంతో విశ్వాసం కోల్పోయారన్నారు. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమని... ఇప్పుడు రాజధానిగా ప్రకటించి చేసేదేమీ ఉండదన్నారు. విశాఖలో ఏవో రెండు భవనాలు కట్టడం మినహా ఏమీ చేయలేరని సబ్బం అన్నారు. విశాఖకు తనకున్న సహజ వనరులతో స్వతహాగా ఎదిగిందని, తమ స్వార్ధం కోసం వైజాగ్ ను నాశనం చేయొద్దని సూచించారు. అయితే, బీజేపీ నేతలు తలుచుకుంటే అమరావతిని మార్చడం జగన్ తరం కాదన్నారు. మోడీ-షాతో చెప్పిస్తే జగన్ ఏమీచేయలేరని సబ్బం వ్యాఖ్యానించారు. ఏపీలో బీజేపీ బలపడాలనుకుంటే రాజధాని వివాదంలో కల్పించుకోవాలని, మోడీ-షాతో మాట్లాడి మూడు రాజధానుల ఆటలకు కళ్లెం వేయాలని సూచించారు. జగన్ కు ఓటేసినందుకు ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారన్న సబ్బం హరి... రాజకీయ కక్షల కోసం రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని వైసీపీ ప్రభుత్వానికి సూచించారు.

ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ ఏమయ్యారు?

ఎన్నికల ముందు వరకు టిడిపిలో ఉన్న తిరుపతి ఎంపి బల్లి దుర్గా ప్రసాద్ ఫలితాలు ఊహించి వైసీపీ లోకి జంప్ చేశారు. ఇలా వచ్చారో లేదో అలా సీటు దక్కడం ఇలా భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి పై గెలిచి బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఊహించని విధంగా ఎంపికైన దుర్గా ప్రసాద్ నియోజక వర్గ ప్రజలకు కనిపించకుండా పోయారు. ఆయన ఎప్పుడు వస్తున్నారో ఎక్కడ ఉంటున్నారో సొంత పార్టీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన ఈయన తిరుపతి ఎంపిగా గెలిచాక కూడా గూడూరుకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడతారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే సమావేశాలు, రిబ్బన్ కటింగులలో తప్ప ఎంపీ కనిపించడం లేదు. ఎంపీకి సమస్యలు చెప్పుకుందామనుకునే ప్రజల సంగతి దేవుడెరుగు, కనీసం కార్యకర్తలకు కూడా బల్లి అందుబాటులో లేకుండా పోయారు. ఏదైనా అందామా అంటే పార్టీలోకి కొత్తగా వచ్చిన వ్యక్తి కావడంతో ఎవరు ఏమి చేయలేకపోతున్నారు. పార్టీ హైకమాండ్ కు చెప్పుకుందామంటే అది ఎవరో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు వైసిపి తిరుపతి నియోజక వర్గ కేడర్. కనీసం ఎంపీకి సంబంధించినవారైనా ఉన్నారా అంటే అది లేకుండా పోయింది. ఎంపీని కలవాలంటే ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితి వచ్చిందని నగరవాసుల్లోనూ చర్చ నడుస్తోంది.  ఇక ఎంపీని కలవాలని నియోజక వర్గ ప్రజలు అడిగితే కుమ్మరోడికి కుండలు కరువ అన్న రీతిలో తమకే దర్శనభాగ్యానికి దిక్కులేదని సొంత పార్టీ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతలు.  నెలకో రెండు నెలలకో ప్రెస్ మీట్ లో తప్ప మరెక్కడా కనిపించని ఎంపి బల్లి దుర్గా ప్రసాద్ తీరు పై తిరుపతి ప్రజలు గుర్రుగా ఉన్నారని సమాచారం. గెలిచాకే కాదు ఎన్నికల ప్రచారంలో కొన్ని ప్రాంతాల వారికి కనీసం మొహం కూడా చూపించలేదు దుర్గా ప్రసాద్. పార్లమెంట్ నియోజక వర్గంలో కీలకమైన తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తిలో ఎక్కడ బల్లి ప్రచారం చేసిన దాఖలాలు లేవు. గెలిచాకైనా మారతారు అనుకుంటే బల్లి దుర్గా ప్రసాద్ తీరులో మాత్రం మార్పు రాలేదు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా రైల్వే స్టేషన్ తనిఖీలు, ఆసుపత్రి తనిఖీ అంటూ హడావుడి చేయడం తప్ప నగర వాసుల సమస్యలు పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఎమ్మెల్యే భూమనతో ఉన్న భేదాభిప్రాయాల కారణం గానే బల్లి తిరుపతి మొహం చూడటం లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్నికల్లో గెలిచాక తిరుపతి వాసులకు వెంకన్న దర్శనం అయినా దొరుకుతుందేమో గానీ ఎంపీగారి దర్శనం అంతంత మాత్రమే అనే చర్చ జోరుగానే సాగుతోంది. పరిస్థితి ఇలానే ఉంటే నియోజక వర్గం ప్రజల్లో అది తీవ్ర అసంతృప్తికి కారణమవుతుందని అంటున్నారు. ఇక ఆ ఎఫెక్ట్ పార్టీ పై పడుతుందని తిరుపతి వైసీపీలో ప్రచారం జరుగుతోంది. ఎంపీగారి దర్శనం ప్రజలకు ఏ మేరకు అందుతుందో చూడాలి.

ఆస్ట్రేలియా కెప్టెన్ గా ధోనీ... ఈ దశాబ్దంలో ఒకే ఒక్కడు

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా... ధోనీకి సముచిత స్థానాన్ని కట్టబెట్టింది. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి ఇచ్చే గౌరవంలో భాగంగా ఈ దశాబ్దపు ఆస్ట్రేలియా వన్డే జట్టు కెప్టెన్‌గా ధోనీని ఎంపిక చేసింది. అలాగే, ఆ వన్డే టీమ్ లో ధోనీతోపాటు మరో ఇద్దరు భారత ఆటగాళ్లకు చోటు కల్పించింది. భారత్ కు తొలి టీ20 కప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన ధోనీని ఈ దశాబ్దపు కెప్టెన్‌‌గా క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎంచుకుంది. ధోనీతో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు జట్టులో చోటు కల్పించింది. అంతేకాదు, ధోనీ సేవలను క్రికెట్ ఆస్ట్రేలియా కొనియాడింది. ధోని ఆడిన టైమ్ భారత్‌కు గోల్డెన్ పీరియడ్ అని, ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడని, ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టును విజయతీరాలకు చేర్చిన ఘనత అతడి సొంతమని ఆకాశానికి ఎత్తేసింది.  భారత క్రికెట్‌ చరిత్రలో మహేంద్రసింగ్‌ ధోనీది ప్రత్యేకస్థానం. బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా, కెప్టెన్‌గా టీమిండియాను కొత్త పుంతలు తొక్కించిన మేటి ఆటగాడు. ఉత్కంఠ భరిత క్షణాల్లోనూ ప్రశాంతంగా ఆలోచిస్తూ విజయాలు అందుకున్న మిస్టర్‌ కూల్‌ కెప్టెన్. అలాంటి అరుదైన గుణగణాలు ఉన్నందుకే... మహేంద్రసింగ్‌ ధోనీ క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే టీమ్ ఆఫ్ ద డికేడ్ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు.

మోడీ-షా దృష్టికి రాజధాని వివాదం... జగన్ పై కన్నా ఘాటు వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి మారితే రాజధాని మారడం ఇంతవరకూ చరిత్రలో ఎక్కడా జరగలేదని.... జగన్మోహన్ రెడ్డి తన అపరిపక్వతతో పిచ్చి పనికి పూనుకుంటున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మారిస్తే... పెట్టుబడుదారులకు రాష్ట్రం మీద నమ్మకాలు పోతాయన్నారు. అమరావతి కేవలం రైతుల సమస్య కాదన్న కన్నా.... ఇది రాజధాని సమస్య అన్నారు. చంద్రబాబునో... జగన్మోహన్ రెడ్డినో చూసి రైతులు భూములివ్వలేదని... రాష్ట్ర భవిష్యత్ కోసం తమ భూములను త్యాగం చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములిస్తే ఇఫ్పుడు నట్టేట ముంచేయడం సరికాదన్నారు. బీజేపీ... అభివృద్ధి వికేంద్రీకరణను కోరుకుంటుందే కానీ... పరిపాలనా వికేంద్రీకరణను కాదని కన్నా స్పష్టంచేశారు. ఆరు నెలల పాలనలో శాంతిభద్రతల మాటేమో కానీ... ఎవ్వరికీ నిద్ర లేకుండా చేసిన ఘనత మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. కక్ష సాధింపు చర్యలు, అనుభవ రాహిత్యం, అపరిపక్వత కలిసిన జగన్ పాలనలో రాష్ట్రానికి దశదిశ లేకుండా పోయిందన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం పదివేలకోట్లు ఖర్చు చేశారని, ఇఫ్పుడు మీ ఇష్టమొచ్చినట్లు మార్చుతామంటే ఇక్కడెవరూ చూస్తూ కూర్చోలేదని కన్నా హెచ్చరించారు. అమరావతి రైతులకు బీజేపీ అండగా ఉంటుందన్న కన్నా లక్ష్మీనారాయణ.... రాజధాని ప్రజల ఆవేదనను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామన్నారు. అయినా, విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలని ఎవరూ అడిగారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే రాయలసీమ అభివృద్ధి జరిగిపోయినట్లేనా అన్నారు. హైకోర్టులున్న ప్రాంతాలేవీ అభివృద్ధి చెందిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే నికర జలాలు, పరిశ్రమలను తీసుకురావాలన్నారు. రాయలసీమను ఉద్ధరించడానికి కర్నూలులో హైకోర్టు అంటున్నారని, కానీ అది సీమ నాలుక గోచుకోవడానికి కూడా పనికి రాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. యువకుడు ముఖ్యమంత్రి కావడంతో ఏపీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానుకుంటే... ఇలా అమరావతిని అంధకారంలో ముంచుతాడని ఊహించలేదంటున్నారు.

విజయసాయి లేఖతో ఆ బీజేపీ ఎంపీపై విచారణ!!

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి పెద్ద షాక్ తగిలింది. సుజనా చౌదరిపై  ఉన్న ఆర్ధిక నేర ఆరోపణలపై ఈడీ, సీబీఐలతో విచారణ చేయించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందించారు. ఫిర్యాదును పరిశీలించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కేంద్ర హోంశాఖను ఆదేశించారు. సుజనా చౌదరి ఆర్ధిక నేర ఆరోపణలపై, అక్రమ కంపెనీలు, మనీ లాండరింగ్‌ వ్యవహారాలపై విచారణ జరపాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. దీనిపై రాష్ట్రపతి కార్యాలయం నుంచి విజయసాయి రెడ్డికి బదులిస్తూ లేఖ వచ్చింది. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి, విచారణ జరుపుతామని ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇంటిని గ్రంథాలయానికి ఇవ్వలేని చిరుకి రైతుల త్యాగం విలువేం తెలుస్తుంది!!

ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చేమోనని సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనను.. మెగాస్టార్ చిరంజీవి స్వాగతించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పుబట్టారు. దీంతో మెగా అభిమానుల్లో గందరగోళం నెలకొంది. జగన్ నిర్ణయాన్ని చిరంజీవి సమర్ధించడం పట్ల ఎలా స్పందించాలో తెలియక మెగా అభిమానులు తలలుపట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే అమరావతి ప్రాంత రైతులు మాత్రం చిరంజీవిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా సాక్షిగానే రైతులు చిరంజీవి మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ‘చిరంజీవి ఏ రోజూ ప్రజా సమస్యలపై స్పందించింది లేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి మూడు రాజధానులను ఎలా సమర్థిస్తారు?. మీ సినిమాలు చూడటానికి.. ఆడించుకోవటానికి జగన్‌ ని కలిశారు కానీ.. ఏనాడూ ప్రజా సమస్యలను పట్టించుకోలేదు’ అని ఓ రైతు వ్యాఖ్యానించాడు. ‘చిరంజీవికి వైజాగ్‌లో చాలా ఆస్తులున్నాయి. అందుకే మూడు రాజధానులు స్వాగతించారు.' అని ఓ రైతు ఆరోపించాడు. 'రైతుల గురించి మీకు తెలుసు కాబట్టి.. రైతులు పెట్టే అన్నమే మీరు తింటున్నారు కాబట్టి మాకు మద్దతివ్వండి. అంతేకాని ఇలా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే.. ఏపీలో మీ సినిమాలు కూడా రిలీజ్ చేయనివ్వం.’ అని మరో రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా చిరంజీవిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైజాగ్‌లో స్టూడియో కోసమే చిరంజీవి మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించారని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంకా కొందరైతే పాత విషయాలను తవ్వితీసి మరీ.. చిరంజీవి మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చిరంజీవి సొంత ఊళ్ళో నిరుపయోగంగా ఉన్న ఇంటిని గ్రంథాలయానికి ఇవ్వాలని ఆ ఊరి ప్రజలు కోరగా.. అప్పుడు చిరంజీవి ఇవ్వకుండా ఆ ఇంటిని డబ్బులకి అమ్ముకున్నారని అంటున్నారు. ప్రజాదరణతో సినిమాల్లో కోట్లు సంపాదించారు కానీ ఓ చిన్న ఇంటిని ఊరికోసం ఇవ్వలేకపోయారు. కానీ అమరావతి ప్రాంత రైతులు రాజధాని కోసం వేల ఎకరాల భూములు త్యాగం చేశారు. అలాంటి వారికి అండగా నిలవాల్సింది పోయి.. వారికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి అండగా నిలబడతారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.  

ఆ ఘటనతో తనకు ఏ సంబంధం లేదన్న డాక్టర్ సుధారాణి

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాస్పత్రిలో శిశువు తలను మొండెం నుంచి వేరు చేసిన ఘటన ఇంకా ప్రజలను కలచివేస్తూనే ఉంది. దీనిపై లోతుగా విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. మరోవైపు అసలు ఈ ఘటనలో తనకు ఎటువంటి ప్రమేయం లేదని సీనియర్లు తనను బలి చేశారని ఆరోపిస్తోంది డ్యూటీ డాక్టర్ సుధారాణి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 18 న ఒక మహిళ ప్రసవ సమయంలో శిశువు తలను కోశారు డాక్టర్లు. బాధ్యులైన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తారాసింగ్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. డ్యూటీ డాక్టర్ సుధారాణిని కూడా విధుల నుంచి తొలగించింది. సస్పెండైన డ్యూటీ డాక్టర్ సుధారాణి అసలు ఈ ఘటనతో తనకు సంబంధమే లేదని అంటుంటారు. ఆ రోజు గర్భిణీ మహిళా స్వాతి ప్రసవం కోసం వచ్చిన విషయం కూడా తనకు తెలియదని డ్యూటీలో ఉన్న డాక్టర్ తారాసింగ్ మరో డాక్టర్ సిరాజ్ లు ప్రసవం చేశారని చెప్పారు. వారిద్దరి నిర్వాకం వల్లే శిశువు తల తెగిపోయిందని తర్వాత వారు పేషెంట్ పరిస్థితి విషమంగా ఉందని తన ప్రమేయం లేకుండానే డాక్టర్ సిరాజ్ రెఫర్ లెటర్ రాసి హుటాహుటిన హైదరాబాద్ కు తరలించాడని అంటున్నారు. సీనియర్లు కావాలనే తనను బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అకారణంగా విధుల నుంచి తొలగింపుకు కారణమైన ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ తారాసింగ్ డాక్టర్ సిరాజ్ లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సుధారాణి ఆవేదన వ్యక్తం చేశారు.  

రుషికొండలో సచివాలయం..! నెలరోజుల్లోనే తరలింపు

ఇంకా, ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రానే లేదు... కానీ అప్పుడే ఏపీ రాజధాని తరలింపు ప్రక్రియ మొదలైపోయింది. సీఎం జగన్ అసెంబ్లీ ప్రకటనకు ముందే విశాఖలో పరిపాలనా రాజధాని కోసం భవనాల అన్వేషణ జరిగిపోతోంది. అధికారిక ప్రకటక చేశాక నెలరోజుల్లో వీలైనన్ని కార్యాలయాలను తరలించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పటికే భవనాల అన్వేషణ చేపట్టాలంటూ ఉన్నతాధికారుల నుంచి విశాఖ స్థానిక అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. దాంతో, ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటుకు అవసరమైన భవనాల కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు. అయితే, రుషికొండ ఐటీ పార్కు మిలీనియం టవర్ వన్ లో సచివాలయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రుషికొండ ఐటీ పార్కు మిలీనియం టవర్ వన్ లో ప్రస్తుతం నాలుగు అంతస్తులు ఖాళీగా ఉన్నాయి. మరో నాలుగు అంతస్తుల్లో ఒక ఐటీ కంపెనీ నడుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉంది. ఇక, దీని పక్కనే మిలీనియం టవర్-2 శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఇది పూర్తయితే మరో లక్ష చదరపు అడుగుల క్యాంపస్ అందుబాటులోకి వస్తుంది. మిలీనియం టవర్స్ కి పక్కనే వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సోదరుడు నిర్మిస్తోన్న ఐదు అంతస్తుల భవనం కూడా ఉంది. ప్రభుత్వం కోరితే దీన్ని ఇచ్చే అవకాశముంది. అలాగే, మిలీనియం టవర్స్ కి సమీపంలోనే నాలుగు ఎకరాల్లో నిర్మించిన ఐబీఎం క్యాంపస్ ఉంది. అయితే, ఐబీఎంతో చర్చించి ఆ క్యాంపస్ ను తీసుకుంటారని అంటున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కంపెనీకి చెందిన 70వేల చదరపు అడుగుల క్యాంపస్ ప్లగ్ అండ్ ప్లేతో రెడీ ఉంది. దీని పక్కనే మిరాకిల్ కంపెనీ భవనం ఖాళీగా ఉంది. అలాగే, రుషికొండ ఐటీ పార్కుకు సమీపంలోనే ఆదిత్య కంపెనీ నిర్మిస్తోన్న భారీ అపార్ట్ మెంట్ దాదాపు సిద్ధమైంది. ఇందులో వందకు పైగా ప్లాట్లు ఉన్నాయి. ఆ పక్కనే విల్లాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే, విశాఖ నడిబొడ్డున్న ఉన్న ఏడెకరాల విప్రో క్యాంపస్ ను కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఉద్యోగుల నివాసాల కోసం మధురవాడ దగ్గర సుమారు 20 ఎకరాల్లో భారీ రహదారులు, పార్కింగ్, వాకింగ్ ట్రాక్, హాస్పిటల్, కమ్యూనిటీ బిల్డింగ్స్ ... ఇలా సకల సౌకర్యాలతో నిర్మించిన హరిత ప్రాజెక్టు ఫ్లాట్లను తీసుకోవాలని భావిస్తున్నారు. అలాగే, సిరిపురం ప్రాంతంలో ఐటీ కేటాయించిన పలు భారీ భవంతులు ఖాళీగా ఉండటంతో వాటిని కూడా వినియోగించుకునేందుకు పరిశీలిస్తున్నారు. ఇన్ని భవనాలు, సదుపాయాలు ఈ ప్రాంతంలో అందుబాటులో ఉండటంతో....ఇక్కడే సచివాలయం ఏర్పాటు చేస్తారని అంటున్నారు.  మొత్తానికి, అధికారిక ప్రకటన రాకముందే విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటుకు చకచకా పనులు జరిగిపోతున్నాయి. మంత్రివర్గం అధికారికంగా నిర్ణయం తీసుకోకముందే ముందస్తు ప్రకాళిక ప్రకారం అన్నీ నడిచిపోతున్నాయి. ఇప్పటికిప్పుడు భారీ భవంతులు నిర్మించే ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడంతో.... ప్రస్తుతం ఉన్నవాటినే తీసుకుని నెలరోజుల్లో కార్యాలయాలను తరలించాలని భావిస్తోంది.