అడుగడుగునా ఆంక్షలే.. న్యూ ఇయర్ వేడుకలకి వెళ్తే జాగ్రత్త.. కేసులు తప్పవు
posted on Dec 31, 2019 @ 12:09PM
నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలు అమలులో ఉంటాయని ఈవెంట్స్ నిర్వహిస్తున్న నిర్వాహకులతో కౌన్సెలింగ్ ఏర్పాటు చేశామన్నారు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్. సైబరాబాద్ పరిధిలో అన్ని ఫ్లై ఓవర్లు సాయంత్రం నుంచే మూసివేస్తామని.. గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి ఎయిర్ పోర్టు వెళ్ళేవారు ఫ్లైట్ టికెట్ వివరాలు చూపిస్తేనే అనుమతి ఉంటుందన్నారు. మద్యం సేవించిన వారు క్యాబ్ సర్వీసులను ఉపయోగించుకోవాలని అంటున్నారు పోలీసులు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యూయర్ ఈవెంట్స్ పబ్ల పై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు అనుమతి లేకుండా ఎవరైనా ఈవెంట్స్ నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ ల పరిధిలో ఇవాళ రాత్రి 11 గంటల నుంచి 5 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్న రహదారులను వదిలేసి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు పై రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు లైట్ మోటర్ వెహికల్స్ ను అనుమతించరు. పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపైన వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వరు. కేవలం శంషాబాద్ విమానాశ్రయం వెళ్లే వారికి మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డు పైకి అనుమతిస్తారు. గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, సైబర్ టవర్, మైండ్ స్పేస్ ఫ్లై ఓవర్లు తెలుగుతల్లి, కామినేని, ఎల్ బీనగర్, పంజాగుట్ట ఫ్లైవోర్లతో పాటు నల్గొండ చౌరస్తా పైవంతెన, చింతల్ కుంట అండర్ పాస్లను మూసివేయనున్నారు. వాహనాల వేగాన్ని నియంత్రించడం కోసం పలుచోట్ల తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రాత్రి 10 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పైకి వాహనాల రాకపోకలను నిలిపి వేస్తామని ప్రకటించారు. ఆ దారుల మీదుగా వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.