కేసీఆర్-జగన్ మధ్య దూరం.! ఉమ్మడి ప్రాజెక్టుపై వెనకడుగు?
posted on Jan 2, 2020 @ 10:06AM
కేసీఆర్, జగన్ మధ్య దూరం పెరిగిందనే మాట వినిపిస్తోంది. ఇటీవల తన సన్నిహితులతో జగన్మోహన్ రెడ్డిపై కేసీఆర్ నెగటివ్ కామెంట్స్ చేశారనే టాక్ బయటికొచ్చింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ వేలకోట్లు సంపాదించారని, అందుకే సీబీఐ కేసులు పెట్టిందని అన్నారట. అయితే, చంద్రబాబు పేరు ఎత్తితే చాలు అంతెత్తున లేస్తూ మాటల తూటాలతో విరుచుకుపడే కేసీఆర్.... తన సన్నిహితులతో ముందు మాత్రం పాజిటివ్ కామెంట్స్ చేశారని అంటున్నారు. ఆంధ్రోళ్లు చాలా స్వార్ధపరులని, అవకాశవాదులని... లేకపోతే నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కష్టపడిన చంద్రబాబును ఘోరంగా ఓడించడమేంటి? తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేలకోట్లు సంపాదించి జైలుకెళ్లొచ్చిన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమేంటంటూ అన్నారట. ఇటీవల తనను కలిసిన ఏపీ విపక్ష నేతలతోనూ కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని జనం వ్యతిరేకంగా ఓటేశారని.... జగన్మోహన్ రెడ్డి ఏమైనా నిజాయితీగా సంపాదించారా? అంటూ అన్నారట. అయినా, చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రమే అవినీతి జరిగిందా? అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారట. అమరావతిలో అంతర్జాతీయస్థాయి రాజధానిని నిర్మించాలని చంద్రబాబు ఆశపడ్డారని, కానీ జగన్మోహన్ రెడ్డేమో.... రాజధానినే మార్చేస్తున్నాడని తనను కలిసిన ఏపీ విపక్ష నేతలతో అన్నారట.
కేసీఆర్ కామెంట్స్ ను పక్కనబెడితే, రెండు రాష్ట్రాల మధ్య ఇటీవల తెరపైకి వచ్చిన గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు ఆగిపోయిందని అంటున్నారు. గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కి తరలించడం ద్వారా... ఏపీలో రాయలసీమకు.... తెలంగాణలో మారుమూల ప్రాంతాలను నీళ్లు అందించాలని కేసీఆర్, జగన్ భావించారు. ఈ ప్రాజెక్టును ఇరురాష్ట్రాలకు కలిసి చేపట్టాలని నిర్ణయించారు. అనుమతితోపాటు నిధులు కూడా కావాలంటూ ఇరువురు ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కూడా కోరారు. కానీ, ఈ ప్రాజెక్టుపై కేసీఆర్, జగన్ మనసు మార్చుకున్నారని అంటున్నారు. ఎవరికి వాళ్లు... తమతమ భూభాగాల్లోనే ప్రాజెక్టును నిర్మించడానికి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుపై మనసు మార్చుకోవడంపై ఇరువురి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది.