చిరంజీవి, రాజశేఖర్ రగడలో జగన్ పాత్ర ఉందా?
చిరంజీవి, రాజశేఖర్ రగడ, రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. జీవిత, రాజశేఖర్ దంపతులు ఎన్నికల టైంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. ఏపీలో అనేక నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేశారు. పార్టీలో మంచి ప్రాధాన్యత ఉంటుందంటూ జగన్ హామీ ఇచ్చినట్లు చెప్పుకున్నారు. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంతో నామినేటెడ్ పదవులపై జీవిత, రాజశేఖర్ లో ఆశలు మరింత పెరిగాయి. అయితే, అదే సమయంలో చిరంజీవి, సీఎం జగన్‌కు దగ్గర కావడం... జీవిత, రాజశేఖర్‌లకు అస్సలు నచ్చడం లేదంటున్నారు.
చిరంజీవి దంపతులు స్వయంగా జగన్ క్యాంపు హౌస్ కి వెళ్లి కలవడం, ఆ తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనకు చిరంజీవి సపోర్ట్ ఇవ్వడంతో, జగన్-చిరు బంధం బలపడిందనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవి క్లోజ్ అవుతుండటంతో, వైసీపీలో అసలు ప్రాధాన్యతే ఉండదన్న అభద్రతాభావంలోకి జీవిత-రాజశేఖర్‌లు వెళ్లారని అంటున్నారు. అంతేకాదు, ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా ఒకే సామాజికవర్గం ఆధిపత్యం ఉందని... అందుకే, చిరంజీవిని అస్త్రంగా ప్రయోగించి, ఆ వర్గం డామినేషన్‌కు చెక్ పెట్టాలన్నదే జగన్ వ్యూహంగా ప్రచారం జరుగుతోంది. దాంతో, మొన్నటివరకు ‘మా‘తో అంటీముట్టనట్టుగా వ్యవహరించిన చిరంజీవి, ఈమధ్య ఇండస్ట్రీకి సంబంధించిన కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. అయితే, ‘మా‘లో చక్రం తిప్పాలనుకున్న జీవిత-రాజశేఖర్‌లకు, చిరు వ్యవహారం పుండుమీద కారం చల్లినట్లు అయ్యిందని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. దీనికి, కొనసాగింపుగానే ‘మా‘ డైరీ ఆవిష్కరణలో ఇన్ డైరెక్ట్ గా చిరంజీవిని టార్గెట్ చేశారనే టాక్ వినిపిస్తోంది.
చిరంజీవితో తనకు ఎలాంటి గొడవుల్లేవని పైకి చెబుతున్నా, రాజశేఖర్ మనసులో ఉన్నది బయటపడిందని, అందుకే, చిరు కూడా కొంచెం ఘాటుగా రియాక్టయ్యారని విశ్లేషిస్తున్నారు. మరి, ఈ ‘మా‘ రచ్చ... ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.