త్రిముఖ పోటీ ఉండేనా ?.. నిజామాబాద్ జిల్లాలో పెరిగిన మునిసిపల్ సీట్లు
posted on Dec 31, 2019 @ 1:28PM
కమలం జోరు, కాంగ్రెస్ ఫైట్ నిజమాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల చిత్రమిది. బల్దియా ఎన్నికల కోసం పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. గత మున్సిపల్ ఎన్నికల తరవాత ప్రతిపక్ష పార్టీల నేతలు టీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఇప్పుడు నిజామాబాద్ కారు ఓవర్ లోడ్ తో సతమతమవుతోంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ లో 10 డివిజన్లను టిఆర్ఎస్, 16 డివిజన్లను కాంగ్రెస్, 16 డివిజన్లలో ఎంఐఎం, బీజేపీ 7 డివిజన్లు, ఇండిపెండెంట్లు 1 డివిజన్ లో గెలుపొందారు. అప్పటి రాజకీయ సమీకరణాల్ని బట్టి ఎంఐఎం, టిఆర్ఎస్ స్వతంత్రుల మద్దతుతో మేయర్ పీఠం కైవసం చేసుకుంది. అయితే ఆ తరువాత కాంగ్రెస్ తరపున గెలిచిన 14 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ లో చేరారు. బిజెపి నుంచి ఆరుగురు కారు లోకి జంప్ అయ్యారు. దీంతో 30 మంది కార్పొరేటర్ల బలం టిఆర్ఎస్ కు చేకూరింది. అయితే ఇప్పుడు కార్పొరేషన్ లో రాజకీయ పరిస్థితులు మారాయి. శివారు గ్రామాలు కార్పొరేషన్ లో చేరాయి. దీంతో డివిజన్ల సంఖ్య 60 కి చేరింది. గ్రామీణ ప్రాంతాలు విలీనం కావడం తమకు కలిసొస్తుందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి.
టీఆర్ఎస్ గతంలో లాగానే ఎంఐఎంతో పొత్తు పెట్టుకునే అవకాశముంది. మిగిలిన ప్రతి పక్ష పార్టీలో ఒంటరి పోరాటం చేయాలని నిర్ణయించాయి. ఆర్మూర్ మున్సిపాలిటీ రాజకీయ ముఖచిత్రం మారింది. సీట్ల సంఖ్య 36 కు పెరిగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన కౌన్సిలర్లు చాలామంది అధికార పార్టీ లోకి వలస వచ్చారు. కాంగ్రెస్ గతంలో బలంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. బీజేపీ ఈ సారి ఇక్కడ పోటీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నిజామాబాద్ జిల్లాలో 4 మున్సిపాలిటీల్లో 146 వార్డులు ఉన్నాయి. స్థానిక సంస్థల రిజర్వేషన్ వల్ల సగం సీట్లు మహిళలకు రిజర్వు కానున్నాయి. దీంతో ఈ మున్సిపాలిటీలో హోరాహోరీ పోరు నడిచే అవకాశముంది.