కనిపించని కొండా దంపతులు.. భూపాలపల్లిలో కలవరపడుతున్న కార్యకర్తలు!!

కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు కొండా మురళి. ఒకప్పుడు కొండా మురళి పేరు చెబితే కాంగ్రెస్ క్యాడర్ కి కొండంత ధైర్యం వచ్చేది. ఎన్నికలు ఏవైనా కొండా మా అండ అంటూ జండాలు పట్టుకొని ధూంధాం చేసేవారు. ఎన్నికల్లో గెలుపు ఓటములకు అతీతులుగా హల్ చల్ చేసే వారు. కానీ మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆనాటి ఉత్సాహమే కనిపించడం లేదు. భూపాలపల్లి మునిసిపాలిటీ పోరులో అన్ని రాజకీయ పార్టీలతో పాటు పలుకుబడి ఉన్న స్వతంత్రులు సైతం దూసుకుపోతూండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం డీలా పడిపోయింది. ఒక వైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మరోవైపు బిజెపి నేత చందు పట్ల కీర్తి రెడ్డి ఇప్పటికే టౌన్ లో ప్రచారం మొదలుపెట్టారు. బస్తీల్లో జెండాలతో ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం నడిపించే నాయకుడు లేక నిరుత్సాహంలో మునిగిపోయింది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించిన గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుకు భూపాలపల్లి నియోజక వర్గ బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే మునిసిపాలిటీలో టికెట్లు ఖరారు చేస్తుంటే ఇక్కడ మాత్రం కొండా మురళి పట్టించుకోవడం లేదని కార్యకర్తలు అంటున్నారు. భూపాలపల్లి మునిసిపాలిటీ ఎన్నికల బాధ్యతలు కూడా మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పై పడింది. కొండ అందుబాటు లోకి రాకపోవడంతో శ్రీధర్ బాబు జోక్యం చేసుకోవలసి వస్తోంది. అయితే శ్రీధర్ బాబు ప్రభావం భూపాలపల్లిలో ఉండదని క్యాడర్ చెబుతోంది. కొండా మురళి కానీ, సురేఖ కానీ తమ తరపున ప్రచారం చేస్తే గెలిచే అవకాశాలుంటాయని కార్యకర్తలు చెబుతున్నారు. అయితే కొండా దంపతులు మాత్రం భూపాలపల్లి వైపు కన్నెత్తి చూడడం లేదు.

జగన్ ఒక ఉన్మాది... చింతమనేని తీవ్ర వ్యాఖ్యలు

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టిన వాడెవడూ రాజధాని అమరావతిని మార్చాలని కోరుకోడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్న చింతమనేని ప్రభాకర్.... రాజధాని మార్పు కోరుకుంటున్నవారిపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఒక ఉన్మాది... దుర్మార్గుడని... ప్రజలందరిలో ఇదే అభిప్రాయముందన్నారు. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా, వైసీపీ అడ్రస్ గల్లంతవుతుందంటూ చింతమనేని జోస్యం చెప్పారు. ఇక, జగన్ తన ఇంటి పేరును రివర్స్ అని పెట్టుకుంటే బాగుంటుందంటూ సెటైర్లు వేశారు. రాజధాని అమరావతి తరలింపు కేవలం 29 గ్రామాల సమస్య కాదని... మొత్తం రాష్ట్రం సమస్య అన్నారు. అమరావతి నుంచి రాజధానిని మార్చితే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు.

వణికిపోతున్న గులాబీ నేతలు... గండం గట్టెక్కేందుకు నానా తిప్పలు...

తెలంగాణ మున్సిపోల్స్ లో రిజర్వేషన్ల ఉత్కంఠకు తెరపడగా, అభ్యర్ధుల ఎంపిక ప్రధాన పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తోంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ నేతల్లో గుబులురేపుతోంది. నేనంటే నేనంటూ ద్వితీయ శ్రేణి నేతలంతా పోటీకి సై అంటుండటంతో... అభ్యర్ధుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. మరోవైపు, పాత... కొత్త నేతల మధ్య పోరు ...పార్టీ పెద్దలకు కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. అయితే, మున్సిపోల్స్ ను ప్రధాన పార్టీలన్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, అధికార టీఆర్ఎస్ మరింత సవాలుగా తీసుకుంది. పైగా ఒక్క మున్సిపాలిటీ చేజారినా పదవులు ఊడతాయంటూ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వార్నింగ్ ఇవ్వడంతో.... అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే, ప్రతి చోటా టికెట్ల పంచాయతీ జరుగుతోంది. సిట్టింగ్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో ఆశావహులు పోటీ పడుతున్నారు. నాకు టికెట్ రాకపోతే... వాడెలా గెలుస్తాడో చూస్తానంటూ ఆశావాహులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. దాంతో, గులాబీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు, ఒక్కో డివిజన్‌ నుంచి ఐదుగురు చొప్పున టికెట్లు ఆశిస్తుండటంతో అభ్యర్ధుల ఎంపిక కత్తి మీద సాములా మారింది. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గెలుపు ఆయా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు అప్పగించడంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.  అయితే, సర్వే రిపోర్ట్ ఆధారంగా టికెట్లు కేటాయించనుండటంతో, సిట్టింగుల్లో ఎక్కువ మందికి అవకాశం రాకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. దాంతో, టికెట్‌ దక్కకపోతే రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు కొందరు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరోవైపు, టీఆర్ఎస్‌లో అసంతృప్తులకు గాలమేసేందుకు కాంగ్రెస్‌, బీజేపీ ప్రయత్నిస్తుండటంతో.... వాళ్లను బుజ్జగించేందుకు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు నానా తంటాలు పడుతున్నారు. మొత్తానికి, ఒకవైపు రెబల్స్ బెడద.... మరోవైపు సీఎం కేసీఆర్‌ పెట్టిన బాధ్యతలు గుర్తొచ్చి... ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలోనని గులాబీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.  

తెరపైకి రాయలసీమ రాష్ట్రం... కలకలం రేపుతోన్న జేసీ కామెంట్స్...

జేసీ దివాకర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, లేని పక్షంలో... గ్రేటర్ రాయలసీమను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజధానిని అమరావతి నుంచి మార్చితే ఒప్పుకునే ప్రసక్తే లేదన్న జేసీ దివాకర్ రెడ్డి... ఒకవేళ రాజధాని మార్పు జరిగితే మాత్రం తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ రాయలసీమ వాదాన్ని మరోమారు తెరపైకి తెచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన జేసీ... రాజధాని వివాదంపై చర్చించారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించేలా చూడాలని కోరారు. లేనిపక్షంలో గ్రేటర్ రాయలసీమను ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ రాయలసీమ విషయంలో జేసీ దివాకర్ రెడ్డి తనదైన వాదనలు వినిపించారు. మిగతా రాయలసీమ నేతలకు భిన్నంగా సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. రాష్ట్ర విభజన జరిగితే అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆనాడు కోరారు. అప్పటి కేంద్ర పెద్దలతోనూ జేసీ ఆనాడు చర్చించారు. లేదంటే, అనంతపురం జిల్లా భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కర్నాటకలోనైనా కలపాలని అప్పట్లో జేసీ డిమాండ్ చేశారు. అయితే, అప్పటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో జేసీ కోరిక నెరవేరకుండానే రాష్ట్ర విభజన జరిగిపోయింది. అయితే, ఇప్పుడు రాజధాని వివాదం నడుస్తున్నవేళ మరోసారి రాయలసీమ వాదాన్ని జేసీ దివాకర్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా ఉంటే అమరావతి ఉండాలని... లేదంటే... గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాలంటూ డిమాండు చేయడంతో జేసీ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

బ్యాలెట్ విధానం... పార్టీల గుర్తులపై... మున్సిపోల్స్ పై మరో క్లారిటీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగనున్నాయి. అలాగే, ఆయా అభ్యర్ధులు... తమతమ పార్టీల గుర్తులపైనే పోటీపడనున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, టీడీపీ, వైసీపీతోపాటు గుర్తింపు పొందిన పార్టీలన్నీ తమతమ గుర్తులపైనే పోటీ చేయనున్నాయి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్ధులంతా ఆయా సింబల్స్‌‌పైనే పోటీ చేస్తారు. అయితే, గుర్తింపు లేని పార్టీలు... ఇండిపెండెంట్స్‌ కోసం 50 సింబల్స్‌ను అధికారులు ఎంపిక చేశారు. నామినేషన్ల దాఖలు, పరిశీలన, తిరస్కరణలు, ఉపసంహరణ... ఇలా మొత్తం నామినేషన్ల ప్రక్రియ పూర్తయి... అభ్యర్ధుల తుది జాబితా ఫైనలైజ్ అయ్యాక ఆయా అభ్యర్ధులకు గుర్తులను కేటాయించనున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో 53లక్షల 63వేల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 800మందికి ఒకటి చొప్పున మొత్తం 6వేల 625 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, ఎన్నికల నిర్వహణ కోసం 40వేల మంది సిబ్బందిని వినియోగించబోతున్నారు. ఇక, ఓటర్లు... తమది ఏ పోలింగ్‌ స్టేషన్లో తెలుసుకునేలా టీపోల్‌ యాప్‌ను ఎన్నికల అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఆదేశాలిచ్చింది. మున్సిపల్ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను పాటించలేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్  కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే ఎన్నికల ప్రక్రియ ఆరంభమయ్యేలా షెడ్యూల్ విడుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ ఉత్తమ్... హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో, వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం... విచారణ పూర్తయ్యే వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి... గెలిపించినోళ్లదే పీఠం.! 

మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్‌లో కాక రేపుతున్నాయి. ముఖ్యనేతలంతా మున్సిపోల్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా పీసీసీ పగ్గాలు ఆశిస్తోన్న లీడర్లంతా మున్సిపల్ ఎన్నికలను సవాలుగా తీసుకున్నారు. తమ తమ పరిధిలోని మున్సిపాలిటీలను గెలిపించుకుని అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేందుకు పావులు కదుపుతున్నారు. పీసీసీ రేసులో ముందున్న మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి.... తన పార్లమెంట్ సెగ్మెంట్‌లోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసే దిశగా పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడ కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ సెగ్మెంట్‌ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలను గెలిచి తీరాలంటూ దిశానిర్దేశం చేస్తున్నారు.  ఇక, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా తన పార్లమెంట్ సెగ్మెంట్‌ పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యతలను తీసుకున్నారు. అలాగే, ప్రస్తుత పీసీసీ చీఫ్‌, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తన పార్లమెంట్ సెగ్మెంట్‌ పరిధిలోని మున్సిపాలిటీల గెలుపు బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. హుజూర్ నగర్ పరాజయంతో మసకబారిన ప్రతిష్టను తిరిగి సంపాందించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక, ఖమ్మం జిల్లా బాధ్యతలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలాగే, మంథని ఎమ్మెల్యే శ్రీథర్‌బాబు.... పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మున్సిపాలిటీలను తన భుజాలపై వేసుకున్నారు. ఇక, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.... ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యతలను తీసుకొని కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అలాగే, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.... సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలను ఛాలెంజ్‌‌గా తీసుకున్నారు. ఇలా, పీసీసీ పగ్గాలు ఆశిస్తున్న నేతలంతా... ఎవరికి వారే తమ పరిధిలోని కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను గెలిపించుకుని సత్తా చాటాలని, తద్వారా హైకమాండ్‌ మెప్పు పొందాలని తపనపడుతున్నారు. అయితే, ఎవరు ఎక్కువ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను గెలిపించుకుని సమర్ధులని నిరూపించుకుంటారో వారికే పీసీసీ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి. దాంతో, ఎవరు టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొని పీసీసీ పగ్గాలు అందుకుంటారోనంటూ  గాంధీభవన్‌‌లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది.  

ఒక పక్క ఆందోళనలు... మరోపక్క తరలింపు... జగన్ ప్రభుత్వం సాహసం...

విశాఖ సాగరతీరం ...సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిపాలనా నగరంగా మారనుంది. సంక్రాంతి తర్వాత విశాఖ నుంచే పరిపాలన సాగించేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించే ప్రక్రియ మొదలుకానుంది. ముందుగా జీఏడీ నుంచి మూడు, ఫైనాన్స్ నుంచి 2, మైనింగ్ నుంచి 2, హోంశాఖ నుంచి 4, ఆర్‌ అండ్ బీ నుంచి 4 సెక్షన్లు తరలివెళ్లనున్నాయి. ప్రస్తుతానికి, 34 ప్రభుత్వ శాఖలను విశాఖకు తరలివెళ్లాలంటూ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, విశాఖ మిలీనియం టవర్స్‌ నుంచి ప్రభుత్వ పాలన సాగనున్నట్లు తెలుస్తోంది. విశాఖ-భీమిలి బీచ్ రోడ్‌లోని రుషికొండ ఐటీ పార్కులో నిర్మించిన మిలీనియం టవర్‌-1ను సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ భవనాన్ని 4 ఎకరాల విస్తీర్ణంలో 145కోట్లతో నిర్మించారు. 10 అంతస్థుల ఈ భవనంలో అధునాతన సౌకర్యాలతో 2లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉంది. అలాగే, లక్షన్నర చదరపు అడుగుల పార్కింగ్‌ ప్లేస్ కూడా రెడీగా ఉంది. ప్రస్తుతం విదేశీ ఐటీ కంపెనీ కాండ్యుయెంట్‌ వినియోగిస్తున్న ఈ భవనాన్ని ఖాళీ చేయించి.... అందులో సీఎం క్యాంపు కార్యాలయం పెడతారని చెబుతున్నారు. మిలీనియం టవర్-1 పక్కనే టవర్-2 పేరుతో మరో భవనాన్ని 80 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే మరో లక్ష చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వస్తుంది. మిలీనియం టవర్స్ పక్కనే 70కోట్లతో నిర్మించిన స్టార్టప్ విలేజ్‌లో 50వేల చదరపు అడుగుల స్థలం రెడీగా ఉంది. ఇక్కడున్న స్టార్టప్‌ కంపెనీలను 3నెలల క్రితమే ఖాళీ చేయించారు. ఇవన్నీ రుషికొండ హిల్‌ నెంబర్ త్రీలోనే ఉన్నాయి. ఇక, వైఎస్ హయాంలో కెనెక్సా కంపెనీకి కేటాయించిన 25 ఎకరాల్లో 20 ఎకరాలను ఆ కంపెనీ వెనక్కి ఇచ్చేసింది. అలాగే, హిల్‌ నెంబర్‌-2లో పలు ఐటీ కంపెనీలకు స్థలాలు కేటాయించినా, ఇప్పటివరకు నిర్మాణాలు చేపట్టకపోవడంతో వాటిని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, రుషికొండ ఐటీ పార్కుకు సమీపంలో... జాతీయ రహదారి పక్కనున్న 20 ఎకరాల వీఎంఆర్‌డీఏ స్థలాన్ని కూడా తీసుకుని ప్రభుత్వ కార్యాలయాల కోసం భవనాలు నిర్మించే అవకాశముందంటున్నారు. జనవరి 20న నిర్వహించే అత్యవసర అసెంబ్లీ సమావేశం తర్వాత విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అంటున్నారు. మరోవైపు, రిపబ్లిక్ డే పరేడ్‌ను కూడా విశాఖలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకపక్క అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతుంటే... మరోపక్క సంక్రాంతి తర్వాత విశాఖ కేంద్రం పరిపాలన కొనసాగించేందుకు జగన్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అయితే, రాజధాని మార్పుతో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా వైసీపీ సర్కారు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  

కేటీఆర్ కు సన్మానం... హరీష్ కు అవమానం..!

ఒకరు కేటీఆర్... మరొకరు హరీష్ రావు... ఇద్దరూ మంత్రులే... పైగా ఒకరు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తనయుడు కాగా... మరొకరు స్వయానా మేనల్లుడు... అయితే, వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం కోసం ఇద్దరూ తమతమ కుటుంబాలతో తిరుమల వెళ్లారు. ఇద్దరి హోదాలూ దాదాపు ఒక్కటే... కానీ, టీటీడీ అధికారులు... కేటీఆర్ ను ఒకలా... హరీష్ రావును మరోలా ట్రీట్ చేశారు. మంత్రి కేటీఆర్ ...ఏపీలో అడుగుపెట్టింది మొదలుకొని... శ్రీవారి దర్శనం పూర్తయ్యేవరకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. కేటీఆర్ తిరుపతిలో అడుగుపెట్టగానే ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత దాదాపు కేటీఆర్ వెన్నంటే ఉంటూ వచ్చిన చెవిరెడ్డి... దర్శనం ముగిసేవరకూ అడుగడుగునా స్వాగత సత్కారాలు చేశారు. అయితే, కేటీఆర్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన వైసీపీ నేతలు, టీటీడీ అధికారులు... మంత్రి హరీష్ రావు విషయంలో మాత్రం సరిగా స్పందించలేదు. మంత్రి హోదాలో ఉన్నా... కనీసం ప్రోటోకాల్ పాటించకుండా అవమానకరంగా ప్రవర్తించారు. దాంతో, హరీష్ రావు తీవ్రంగా నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. టీటీడీ అధికారుల తీరుపై హరీష్ అసంతృప్తి వ్యక్తంచేశారు. అంతేకాదు దర్శనం కూడా చేసుకోకుండానే వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అయితే, విషయం తెలుసుకున్న టీటీడీ పాలకమండలి సభ్యుడు దామోదర్.... మంత్రి హరీష్ రావును శాంతింపజేశారు. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండటం... అలాగే, మంత్రి హరీష్ రావు రాకపై సరైన సమాచారం లేకపోవడం వల్లే తప్పిదం జరిగిందంటూ వివరణ ఇచ్చారు. ఆ తర్వాత హరీష్ రావును దగ్గరుండి శ్రీవారి దర్శనం చేయించారు.  అయితే, నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన టీటీడీ అధికారులు.... పుష్కరిణి వైపు నుంచి ఆలయంలోకి తీసుకెళ్లడంపై భక్తులు మండిపడుతున్నారు. అదే సమయంలో, హరీష్ రావును పట్టించుకోవడంపైనా విమర్శలు చెలరేగుతున్నాయి. పైగా, హరీష్ 13 వీఐపీ టికెట్లు అడిగితే... కేవలం ఆరు మాత్రమే ఇచ్చారని అంటున్నారు. ఇక, కేటీఆర్ కు అడుగడుగునా స్వాగత సత్కారాలు చేసిన టీటీడీ అధికారులు.... హరీష్ కు మాత్రం స్వాగతం కాదు కదా... దర్శనంపై కనీసం సమాచారం కూడా ఇవ్వలేదంటున్నారు. అయితే, హరీష్ మాత్రం తిరుమలలో తనకెలాంటి అవమానం జరగలేదని చెబుతున్నారు. మొత్తానికి తిరుమల కొండపై టీటీడీ అధికారుల తీరు వివాదాస్పదమైంది.

విశాఖకు సచివాలయం తరలింపు.. ముహూర్తం ఖరారు!!

ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని భావిస్తోన్న వైఎస్ జగన్ సర్కార్.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖకు సచివాలయం తరలింపునకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 20వ తేదీ నుంచి విశాఖలో తాత్కాలిక సచివాలయ కార్యకలాపాలు ప్రారంభించాలన్న యోచనలో వైసీపీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి విశాఖలోని మిలినీయం టవర్స్‌లో కొత్త సచివాలయం ప్రారంభం కానుందని సమాచారం.  విడతలవారీగా సచివాలయం తరలింపునకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలుస్తోంది. ప్రాధాన్యత కలిగిన శాఖల్లో కీలక విభాగాలను ఆన్ డ్యూటీ కింద తరలించేందుకు సిద్దమయ్యారట. మొత్తంగా 34 శాఖల నుంచి కీలక విభాగాల తరలించనున్నట్టు సమాచారం. మరోవైపు ఈ నెల 20, 21 వ తేదీలలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది రిప్లబిక్ డే పరేడ్ కూడా విశాఖలో నిర్వహించే యోచనలో జగన్ సర్కార్ ఉందని సమాచారం.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. హస్తినలో మొదలైన ఎన్నికల సందడి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 8 న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 11 న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. మొత్తం 13,750 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేయనుంది ఈసి. కోటీ నలభై ఆరు లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. 90 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారు. మొత్తం 70 స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు ఉధృతం చేశాయి. సీఎం కేజ్రీవాల్ మరోసారి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 7 ఎంపీ సీట్లను గెలుచుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే బూత్ లెవల్ ప్రచారం ప్రారంభించారు.  జనవరి 14 న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67 స్థానాల్లో విజయం సాధించగా.. బిజెపి 3 సీట్లలో మాత్రమే గెలిచింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. అందుకే ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు అమిత్ షా. ఢిల్లీలో త్రిముఖ పోటీ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బిజెపి, కాంగ్రెస్ కూడా రేసులో ఉన్నాయి. ఆప్, కాంగ్రెస్ ల మధ్య ఓట్లు చీలితే తమ విజయం సులభమవుతుందన్న భావన బిజెపి నేతల్లో ఉంది. సీనియర్ సిటిజన్ల కోసం ఈసీ ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది.

వైసీపీలో చేరాలని జేసీపై ఒత్తిడి.. బెదిరింపులు!!

టిడిపి అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన సమయంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీస్ అధికారుల సంఘం ఫిరియాదుతో ఐపీసీ 153 ఎ 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జేసీని దాదాపు ఏడు గంటలకు పైగా ఆయనను పోలీస్ స్టేషన్ లోనే నిర్భందించారు. విషయం తెలుసుకున్న జేసీ అనుచరులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. మరోవైపు పోలీసులతో టిడిపి నేతలు పార్థసారథి, రఘునాథరెడ్డి, ఈరన్న వాగ్వాదానికి దిగారు. దీంతో వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. పీఎస్ ఎదుట జేసీ అనుచరుడు ఆత్మహత్య యత్నం చేశాడు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఓ దశలో టిడిపి కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎట్టకేలకు జేసీకి స్టేషన్ బేయిల్ ఇచ్చారు. దీంతో కోర్టును ఆశ్రయించిన జేసీ షరతులతో కూడిన ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ప్రతి రెండోవ ఆదివారంతో పాటు నాలుగువ ఆదివారం పది గంటల నుంచి నాలుగు గంటల లోపు స్టేషన్ లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అందువల్ల అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో హాజరయ్యారు దివాకరెడ్డి. అయితే పోలీసుల నిర్బంధం పై టిడిపి నేత దివాకరెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. వైసీపీలో చేరాలని పోలీసులు పరోక్షంగా చెప్పారని పోలీసు అధికారులపై రిమోట్ శక్తి బాగా పని చేస్తుందని విమర్శలు గుప్పించారు. కోర్టు ఉత్తర్వులున్నా అక్రమంగా స్టేషన్ లో నిర్బంధించారని ఆరోపించారు. స్థానిక ఎన్నికలు ఉండటంతో టిడిపి క్యాడర్ ను బెదిరించేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని ఫైరయ్యారు జేసీ. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు జేసీ. వైఎస్ హయాంలో ఇలాంటి దుర్మార్గాలు చేయలేదని ఆయన పేర్కొన్నారు.

ప్రకృతి సేద్యంతో పదింతల లాభం పొందుతున్న గుంటూరు రైతు

దేశంలో పెరిగిపోయిన పెట్టుబడి ఖర్చులు, గిట్టుబాటు కాని ధరలు తదితర కారణాలతో సేద్యమంటేనే రైతులు కాడిని వదిలేస్తున్నారు. ప్రత్యామ్నయ దారులు వెతుక్కుంటున్నారు. కానీ గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు పెట్టుబడులను తగ్గించుకుంటూ ప్రకృతి వ్యవసాయంలో కూరగాయలను పండిస్తున్నాడు. నాణ్యమైన దిగుబడులు తీస్తూ మంచి ఆదాయాన్ని పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినవడ్లపూడి గ్రామానికి చెందిన రైతు నల్లబోతు లక్ష్మణరావు వంగ తోటను వేశారు. ప్రకృతి వ్యవసాయంలో ఎకరంలో వంగను సాగు చేస్తూ నాణ్యమైన దిగుబడులను తీస్తున్నాడు. కూరగాయల్లో రాజు ఎవరంటే వంకాయ అంటారు. ఆ వంకాయను పండించిన ఈ రైతు కూడా రాజవుతున్నాడు.  రైతు లక్ష్మణరావు గత 15 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు. అయితే గతంలో రసాయన ఎరువులు వాడి పంట పండించేవారు. పంట దిగుబడులు వచ్చినా పెట్టుబడులు పెరిగిపోయేవి.. అంతగా లాభం ఉండేది కాదు. ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని తాను కూడా ఈ విధానంలో సాగును ఆరంభించారు. ప్రస్తుతం నిమ్మ తోటలో అంతర పంటగా ఎకరంలో వంగను సాగు చేస్తున్నారు. వంగ మామూలుగా ఆరు నెలల పంట, కానీ ప్రకృతి విధానంలో సాగు చేయటం వలన మరో రెండు మూడు నెలల పంటకాలం పెరుగుతోంది. ఈ ఏడాది నుండి రసాయన ఎరువుల జోలికి పోకుండా సొంతంగా తయారు చేసుకున్న కషాయాలు ఎరువులను వాడుతున్నారు. ముఖ్యంగా పంటకు మూడు సార్లు ద్రవ జీవామృతాన్ని డ్రిప్ ద్వారా అందించారు. చీడపీడల నివారణకు అగ్ని అస్త్రం బ్రహ్మాస్త్రం మొక్కల బలానికి పంచగవ్యను వాడుతున్నారు. పూత రాలిపోకుండా ఉండేందుకు కోడుగుడ్డు, నిమ్మరసం, పుల్లటి మజ్జిగ లాంటివి పిచికారీ చేస్తున్నారు. వేపగింజల కషాయం కూడా కొట్టడంతో తోటలో ఎలాంటి చీడపీడలు ఆశించడం లేదు. ఇటు దిగుబడి కూడా నాణ్యమైనది రావడం మార్కెట్ లో మంచి ధర పలుకుతుంది. ప్రకృతి వ్యవసాయ విధానంలో వంగ సాగు చేసే రైతు లక్ష్మణరావు ఎకరాకు 15,000 పెట్టుబడి పెట్టాడు. దిగుబడి పది నుంచి పదిహేను టన్నుల వరకూ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ లో సరాసరి కిలో ధర 15 నుంచి 20 కాగా రెండు లక్షల వరకు ఆదాయం పొందనున్నాడు. ఈ రైతును చూసి మిగతా రైతులు కూడా రసాయన ఎరువులను వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తే పెట్టుబడులు తగ్గి అధిక లాభాలు ఆర్జించవచ్చు.

అమెరికాకు ఇక చావే దిక్కు.. ఇరాన్ జనరల్ సులేమణి మృతిపై విషాద ఛాయలు

ఇరాన్ కార్డ్ స్పోర్ట్స్ చీఫ్ జనరల్ సులేమాణి హత్యతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ తమపై దాడికి తెగబడితే మునుపెన్నడూ లేనంత తీవ్రస్థాయిలో ప్రతీకారం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ లో 52 కీలక వ్యూహాత్మక ప్రాంతాలను గుర్తించామని.. తమపై దాడి చేస్తే ఆ 52 ప్రాంతాలను ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తూ ట్రంప్ ట్వీట్ చేశారు. మిలిటరీ సంపత్తి కోసం ఇటీవలే రెండు ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేశామన్నారు ట్రంప్. ప్రపంచంలోనే తమది అతిపెద్ద అత్యంత సామర్థ్యం ఉన్న ఆర్మీ అని మా స్థావరాలపై కానీ.. పౌరులపై కాని దాడి చేస్తే క్షణం ఆలస్యం చేయకుండా ప్రతీకార దాడులు ఉంటాయని స్పష్టం చేశారు.  ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. పశ్చిమాసియాలో అమెరికా ద్వేషపూరిత ఉనికి అంతమయ్యేందుకు ఇదే ప్రారంభమని ప్రకటించింది. సాంస్కృతిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని తెలపడం యుద్ధ నేరంగా పరిగణనలోకి వస్తుందని.. మిలిటరీ ఉన్నతాధికారిని దొంగదెబ్బతీసి చంపడం పిరికి చర్య అని తెలిపింది. తమతో యుద్ధం ప్రారంభించే ధైర్యం అమెరికాకు లేదని ఇరాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ రహీం మాజాఫి వ్యాఖ్యానించారు. తమ సైనిక స్థావరాల్లో ఉన్న అమెరికా సైనికులను వెనక్కు పంపాలని ఇరాక్ పార్లమెంటు నిర్ణయం తీసుకుంది. ఐఎస్ పై పోరులో సాయపడేందుకు ఇరాక్ లో 5,200 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఇక కెన్యా తీరంలోనే అమెరికా కెన్యా సైనికులు ఉన్న స్థావరంపై సోమాలియాకు చెందిన అల్షబాబ్ తీవ్రవాద సంస్థ ఆదివారం దాడి చేసింది. ఈ దాడిని తిప్పికొట్టి నలుగురుని హతమార్చామని కెన్యా దళాలు తెలిపాయి.  తమ హీరో జర్నల్ ఖాసిం సులేమానికి ఇరాన్ లో అభిమానులు భారీగా తరలి వచ్చి అశ్రునివాళులర్పించారు. నల్లని దుస్తులు ధరించి కన్నీళ్లు పెట్టుకుంటూ గుండెలు బాదుకుంటూ బాధను వ్యక్తపరిచారు. అమెరికాకు ఇక చావే అని నినదిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇరాక్ నుంచి సులేమాని మృతదేహం ఇరాన్ లోని ఆహ్వాస్ పట్టణానికి చేరింది. అతనితో పాటు మరణించిన వారి మృతదేహాలను టెహ్రాన్ కు తరలించారు. టెహ్రాన్ మొత్తం సులేమాని కోసం నినదించింది. రోడ్లు జనాలతో కిక్కిరిసిపోయాయి. మహిళలు చిన్నారులు కూడా ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఆ దేశ అధ్యక్షుడుతో పాటు నాయకులు కూడా సులేమాని అంతిమయాత్రలో పాల్గొన్నారు.  

జగన్ మాయ.. అందుకే మూడు రాజధానుల ముచ్చట!!

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది విద్యార్థి జేఏసీ. అమరావతి పరిరక్షణ సమితి విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. ప్రధాన ప్రాంతాల్లో నిరసనలకు దిగి స్కూల్స్, కాలేజీ బస్సులను అడ్డుకున్నారు. మూడు రాజధానుల ప్రకటన చేసి ముఖ్యమంత్రి ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారని అన్నారు. అమరావతి లోనే రాజధాని కొనసాగిస్తామని ప్రకటన చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు విద్యార్థి జేఏసీ. ఒక్కసారి అవకాశం కలిపిస్తే రాష్ట్రాన్ని ఉద్దరిస్తానని జగన్ మోహన్ రెడ్డి చెప్పారని.. కానీ భారతదేశంలో ఇంత అమానుషమైన ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదన్నారు. భారతదేశ ప్రజలందరూ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదనను వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక నవరత్నాలను తప్పకుండా అమలుపరుస్తానని జగన్ జనాన్ని మభ్యపెట్టారని అన్నారు. నవరత్నాలను మరిపించడానికే మూడు రాజధానుల గోల పెట్టారని అన్నారు. రైతుల త్యాగాలను అపహాస్యం చేస్తూ ఆందోళనలకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో చేస్తున్న ధర్నాలకు ఎటువంటి అనుమతి లేదన్నారు తుళ్లూరు అడిషనల్ ఎస్పీ చక్రవర్తి.

మోదీతో భేటీ.. బీజేపీలో చేరనున్న నటుడు మోహన్ బాబు!!

2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశాన్ని విభేదిస్తూ.. వైసీపీకి మద్దతు తెలిపాడు నటుడు మోహన్ బాబు. అలాంటిది ఆయన తన కుటుంబ సభ్యులతో ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ప్రధానమంత్రితో అరగంటకు పైగా చర్చించారు. మోహన్ బాబు మోదీని కలిసినప్పుడు కూతురు లక్ష్మీ ప్రసన్న , కుమారుడు విష్ణు , కోడలు వెరోనికా ఉన్నారు. మోదీ ఆహ్వానం మేరకే వీళ్లు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లి మోదీని కలిశారని తెలుస్తోంది. ఈ భేటీపై మంచు లక్ష్మి ట్వీట్ కూడా చేశారు.  గతంలో మోహన్ బాబు కొన్నాళ్లు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన పని చేశారు. 2019 ఎన్నికలకు వైసిపికి మద్దతు ప్రకటించారు. జగన్ తో బంధుత్వం కూడా ఉంది ఆయన కుటుంబానికి. మరి ఇప్పుడు ఊహించని విధంగా ప్రధాని మోదీని కుటుంబంతో సహా కలుసుకున్నారు. మోదీ కూడా ఆయనను బీజేపీలోకి ఆహ్వానించారని తెలుస్తోంది. మోహన్ బాబు బీజేపీలో చేరుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది . మోహన్ బాబు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా లేదా అనే విషయం ఆయనే స్వయంగా చెప్పాలి లేదంటే లక్ష్మి చేసే మరో ట్వీట్ ద్వారా తెలియాలి. అది కూడా మరికాసేపట్లోనే తెలిసే అవకాశం కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' నటుడికి బాలయ్య సాయం.. నెటిజన్ల ప్రశంసల వర్షం!!

నందమూరి బాలకృష్ణ మరోసారి తన మంచి మనస్సుని చాటుకున్నాడు అంటూ అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీతో హడావుడి చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో టీడీపీ అధినేత చంద్రబాబుని, నందమూరి కుటుంబాన్ని కించపరిచేలా చూపించారంటూ.. అప్పట్లో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది కావాలని వైసీపీ వాళ్ళతో కుమ్మక్కై వర్మ చేసిన సినిమా అని ఆరోపణలు వచ్చాయి. మొత్తానికి ఈ సినిమా ఎన్నికలకు ముందు ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. కాగా ఎన్నికలు ముగిసిన ఏడు నెలలు తరువాత.. ఈ సినిమా చర్చనీయాంశమైంది.  లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఎన్టీఆర్ పాత్రధారి విజయ కుమార్ భార్యకు క్యాన్సర్ సోకింది. ఆమెకు ఇప్పుడు.. బాలయ్య నడుపుతున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా పేరుతో తమ కుటుంబం, పార్టీ ప్రతిష్ట దెబ్బ తీయాలని చూసిన వారికి కూడా బాలయ్య సాయం చేయడం నిజంగా అభినందనీయమని ప్రశంసిస్తున్నారు.

పాక్ సైన్యం నుండి ఏపీ మత్స్యకారులను విడిపించిన నేతలు!

భారత దౌత్యాధికారులు పాకిస్థాన్ అధికారులతో కలిసి చర్చలు జరిపారు. గత 13 నెలలుగా పాకిస్థాన్ చెరలో బందీలుగా ఉన్న శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులను పాకిస్థాన్ అధికారులు విడుదల చేశారు. మొత్తం 20 మందిని రేపు ( జనవరి 7వ తేదీన ) వాఘా సరిహద్దుల్లో శ్రీకాకుళం మత్స్యకారులను విదేశాంగ శాఖ అధికారులకు పాక్ అప్పగించనుంది.  పాకిస్థాన్ చెరలో మగ్గిన ఏపీ మత్స్యకారులను స్వస్థలానికి తీసుకు వచ్చేందుకు భారత్ పాక్ సరిహద్దు ప్రాంతం వాఘా వెళ్లారు మంత్రి మోపిదేవి వెంకట రమణ. తెలుగు మత్స్యకారులను పాకిస్థాన్ విడిచిపెట్టడంతో వారిని తీసుకురావాలని మోపిదేవిని సీఎం జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వాఘా బోర్డర్ పయనమైన మోపిదేవి అక్కడికి చేరుకున్నారు. లాంఛనాలు పూర్తయ్యాక పాక్ అధికారులు ఏపీ మత్స్యకారులను భారత అధికారులకు అప్పగించనున్నారు. కొంతకాలంగా వైసీపీ ఎంపీలు అవిశ్రాంతంగా ప్రయత్నాలు చేయడంతో పాక్ చెర నుంచి మత్స్యకారుల విడుదలకు మార్గం సుగమం అయ్యిందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడానికి విజయసాయిరెడ్డి తోడ్పడ్డారని ఆయన అన్నారు.  గుజరాత్ లో చేపల వేటకు వెళ్లిన వీళ్ళు పొగ మంచు కారణంగా పాక్ జలాశయాలలోకి ప్రవేశించారు. దీంతో పాక్ కోస్ట్ గాడ్స్ వారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, వైసీపీ విజయసాయి రెడ్డి వంటి నేతలు.. మత్స్యకారులను విడిపించాలని కేంద్రాన్ని కోరారు. ఎట్టకేలకు ప్రయత్నాలు ఫలించి మత్స్యకారులు పాక్ చెర నుండి విడుదల అయ్యారు. మొత్తానికి మత్స్యకారుల కుటుంబాలల్లో ఆనందాన్ని తీసుకువచ్చేందుకు నేతలు తీవ్రంగా కష్టపడ్డారనే చెప్పుకోవాలి.

తెలంగాణ సీఎంగా కేటీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్!!

తెలంగాణ రాష్ర్టానికి యువనేత కేటీఆర్ ను సీఎం చేయాలని మంత్రివర్గంలోని సభ్యులతో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మునిసిపల్ ఎన్నికలు పూర్తయితే రాష్ట్రంలో నాలుగేళ్ల వరకు మళ్ళీ ఎన్నికలు ఉండే అవకాశం లేదు. దీంతో మునిసిపల్ ఎన్నికల అనంతరమే సీఎం పీఠంపై కేటీఆర్ ను కూర్చోబెట్టాలనే కార్యకర్తల ఆకాంక్ష రోజురోజుకు పెరుగుతోంది. కేటీఆర్ ను సీఎం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు సీనియర్ నేత మంత్రి కొప్పుల ఈశ్వర్. గతంలో ఇలానే ఇద్దరు ముగ్గురు మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మంత్రివర్గంలోని మిగతా సభ్యులు కూడా చేస్తున్నారు. పార్టీ పెద్దల నుంచి సంకేతాలు రాని పక్షంలో మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  కేటీఆర్ ను సీఎం పీఠంపై కూర్చొబెడితే.. కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ఏంటనే అంశంపై పలు ఊహాగానాలు తెరపైకొస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాలను నడిపించాలనుకుంటే ప్రభుత్వ పరంగా అడ్వైజరీ కమిటీ నియమించి దానికి చైర్మన్ గా కేసీఆర్ అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ చక్రం తిప్పవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటే రాజ్య సభ స్థానం నుంచి పార్లమెంటు వైపు అడుగులు వెయ్యొచ్చు. అదే జరిగితే గజ్వేల్ నియోజక వర్గం నుంచి ఆయన కుమార్తె కవితను ఎమ్మెల్యేగా బరిలో దించేందుకు కూడా అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అది కూడా జరగని పక్షంలో జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు కేసీఆర్ తెరపైకి తెచ్చిన ఫెడరల్ ఫ్రంట్ నినాదాన్ని మరోసారి అందుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో కూడా కేసీఆర్ రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై ఆరేళ్లుగా తాను చేసిన పనుల పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ వ్యాఖ్యల వెనుక మర్మమేమిటని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.  

30 మందికి పైగా గాయాలు.. ఢిల్లీ 'జేఎన్ యూ'లో అల్లరి మూకల దాడులు!!

ఢిల్లీలోని జేఎన్ యూలో మళ్లీ హింస చెలరేగింది. యూనివర్సిటీ క్యాంపస్ లోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధరించి చొరబడ్డారు. అలా చొరబడిన వ్యక్తులు విద్యార్థుల పై, ప్రొఫెసర్ల పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో జేఎన్ యూ ప్రెసిడెంట్ అయిషేయ్ ఘోష్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.  తమపై దాడికి పాల్పడింది ఏబీవీపీ కార్యకర్తలే అని ఆరోపించారు అయిషేయ్ ఘోష్. ఆ అనుమానాస్పద వ్యక్తులు రాడ్లు, కర్రలతో దాడి చేయడంతో దాదాపు 30 మందికి విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుగా వచ్చిన ప్రొఫెసర్లపై కూడా దాడి చేశారు. ఈ ఘటన తర్వాత యూనివర్సిటీలో భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ దాడి జరిగిన దృశ్యాలు కేమరాలకు చిక్కడంతో వాటిపై దృష్టి పెట్టారు పోలీసులు.  జేఎన్ యూలో గత కొద్దిరోజులుగా విద్యార్ధి సంఘాలు పోటా పోటీగా నిరసనలు చేస్తున్నాయి. హాస్టల్ ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థులు చాలా రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. అయితే తాజాగా జరిగిన హింసలో బయటి వ్యక్తుల ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. హాస్టల్లో ఫర్నీచర్ ను కూడా ధ్వంసం చేశారు ఆందోళనకారులు. క్యాంపస్ లో హింసకు ఏఐఎస్ఐ విద్యార్థులే కారణమని ఏబీవీపీ ఆరోపించింది. కాంగ్రెస్ లెఫ్ట్ నేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల పై దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని లెఫ్ట్ నేతలు ప్రశ్నించారు