జగన్ తరపున రాయబారమా? లేక చిరు ప్రాధాన్యతపై కోపమా? మోహన్ బాబు అడుగులు ఎటువైపు?

  మోహన్‌ బాబు, తన ఫ్యామిలీతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌ షాను కలవడంపై రాజకీయవర్గాల్లో రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. తమ విద్యాసంస్థల ఫంక్షన్‌కు రావాలని ఆహ్వానించేందుకే మోడీని కలిశామని మోహన్‌ బాబు చెబుతున్నా, అంతకుమించిన సంప్రదింపులేవో జరిగాయన్న ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబు, త్వరలో వైసీపీని వీడి, కమలం గూటికి చేరతారన్న ప్రచారం ఆరోజు నుంచే సాగుతోంది. అయితే, బీజేపీలోకి రావాలని మంచు ఫ్యామిలీని మోడీ ఆహ్వానించారా అన్న మీడియా ప్రశ్నకు, దానిపై తానిప్పుడే మాట్లాడను, అవన్నీ తర్వాత చెబుతానంటూ మోహన్ బాబు చేసిన దాటవేత వ్యాఖ్యలు కూడా, ఆయన పార్టీ మారతారన్న ఊహాగానాలకు బలమిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వస్తే, ఏదో ఒక నామినేటెడ్‌ పదవి వస్తుందని మోహన్ బాబు ఆశించారు. ముఖ్యంగా టీటీడీ ఛైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకుంటే అది దక్కలేదు. ఆ తరువాత ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం సాగింది. అయితే ఈ పదవిని మరో నటుడు విజయ్ చందర్‌కు ఇచ్చారు. దాంతో, సీఎం జగన్, మోహన్ బాబుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ప్రచారం మొదలైంది. అంతేకాదు, త్వరలో... వైసీపీకి దక్కబోతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో, తనకు ఒకటి వస్తుందని మోహన్‌ బాబు ఆశలు పెట్టుకున్నారు. కానీ వైసీపీ నుంచి అలాంటి సానుకూల సంకేతాలేవీ రాకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు చిరంజీవి క్లోజ్‌ కావడం, మోహన్‌ బాబుకు అస్సలు నచ్చడం లేదని అంటున్నారు. మెగాస్టార్ కు అంత ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. జగన్ మీటింగ్ తర్వాత సినీ పరిశ్రమలో చిరు యాక్టివ్‌ కావడం, దాసరిలా పెద్దన్న పాత్ర పోషించేందుకు పావులు కదపడం కూడా మోహన్‌ బాబుకు రుచించడం లేదంటున్నారు. అసలే సీఎం జగన్‌, తనకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని, నామినేటెడ్‌ పోస్టు కూడా ఇవ్వడం లేదని రగిలిపోతున్న మోహన్‌ బాబుకు, ఈ పరిణామాలు రుచించడం లేదనే మాట వినిపిస్తోంది. అందుకే ప్రధాని మోడీని కలిసి, తనకు ప్రధాని ఇస్తున్న ఇంపార్టెన్స్‌ను చాటిచెప్పాలనుకున్నారని, అందులో భాగంగానే ఢిల్లీ టూర్‌ అన్న చర్చ జరుగుతోంది. జగన్ పై కోపముందని ఒకవైపు ప్రచారం జరుగుతుంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి పాలనపై మోహన్‌ బాబు ప్రశంసలు కురిపించడం వెనుక ట్విస్టు ఉందంటున్నారు. కేవలం... ప్రధాని, హోంమంత్రి దగ్గర తనకు పరపతి వుందని జగన్‌కు చెప్పడం ద్వారా, వైసీపీలో తనకు ప్రాధాన్యం పెంచుకోవడం, మోహన్‌ బాబు వ్యూహంలో భాగమన్న చర్చ జరుగుతోంది. అయితే, అదే సమయంలో జగన్ తరపున మోడీ, అమిత్ షాతో మోహన్ బాబు రాయబారం నడిపారనే మాటలు కూడా కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి తన మాటలే కాదు చేతలు కూడా సంచలనమేనని, తన రూటే సెపరేటని చెప్పుకునే మోహన్‌ బాబు, కేంద్ర పెద్దలను కలిసి అనేక రకాల చర్చలకు తెరలేపారు. మరి మోడీని మంచు ఫ్యామిలీ కలవడంలో అర్థం, వైసీపీని వీడి బీజేపీలో చేరడమా....లేక, చిరంజీవికి జగన్‌ క్లోజ్‌ కావడం సహించలేక, తాను మోడీకీ దగ్గరవడమా అన్నది, ఎవరి ఆలోచనను బట్టి, వారు అంచనా వేసుకుంటున్నారు. మరి, మంచు ఫ్యామిలీ రూటేంటో, అడుగులు ఎటు పడతాయో చూడాలి.  

నిజామాబాద్ లో ముగ్గురు ఎమ్మెల్యేలు వర్సెస్ ఇద్దరు ఎంపీలు

నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో పోరు.... ముగ్గురు ఎమ్మెల్యేలు... వర్సెస్‌ ఇద్దరు ఎంపీలు అన్నట్లుగా మారింది. అధికార టీఆర్‌ఎస్‌కి‌... అలాగే, బీజేపీకి... నిజామాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి పట్టంకట్టిన ఇందూరు ఓటర్లు.... పార్లమెంట్‌ ఎన్నికల్లో అనూహ్యంగా కాషాయం వైపు మొగ్గుచూపడంతో ...ఇప్పుడు... ఏ పార్టీకి పట్టం కడతారనే ఉత్కంఠ రేపుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల వరకూ ...గులాబీ పార్టీకి నిజామాబాద్‌ జిల్లా కంచుకోటలా ఉండేది. అయితే, 2019 జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఊహించనివిధంగా కారు బోల్తాపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు మొత్తం స్థానాలను క్వీన్ స్వీప్ చేసిన టీఆర్ఎస్‌.... అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని కోల్పోయింది. ముఖ్యమంత్రి కుమార్తె కవితపై బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్‌ విజయఢంకా మోగించారు. అయితే, కవిత ఓటమికి ఎమ్మెల్యేల అశ్రద్ధే కారణమన్న ప్రచారం జరిగింది. అయితే, నిజామాబాద్‌ కార్పొరేషన్‌ గెలుపు బాధ్యతలను మళ్లీ ఎమ్మెల్యేలకే సీఎం కేసీఆర్ అప్పగించడంతో... పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎదుర్కొన్న అపవాదును చెరిపేసుకోవాలని భావిస్తున్నారు. అందుకే, అభ్యర‌్ధుల ఎంపిక దగ్గర్నుంచి... బి-ఫారాలు, బుజ్జగింపుల వరకు అన్నీ ఎమ్మెల్యేల స్వయంగా చేసుకుంటున్నారు. అయితే, గత ఎన్నికల్లో 10 డివిజన్లు మాత్రమే గెలుచుకుని, ఎంఐఎంతో కలిసి నిజామాబాద్‌ కార్పొరేషన్‌ను దక్కించుకున్న గులాబీ పార్టీ... ఈసారి సింగిల్‌గా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. నిజామాబాద్ కార్పొరేషన్‌లో... మొత్తం 60 డివిజన్లు ఉండగా... అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పరిధిలో 50 డివిజన్లు, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరిధిలో 8 డివిజన్లు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిధిలో రెండు డివిజన్లు ఉన్నాయి. అయితే, గెలుపు బాధ్యతల్లో ప్రధాన పాత్ర బిగాలపైనా ఉన్నా... ముగ్గురు ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో అధికార టీఆర్ఎస్‌ పరిస్థితి ఇలాగుంటే, పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయ జెండాను రెపరెపలాడించిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌... మరోసారి తన సత్తా చాటుకోవాలని చూస్తున్నారు. అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం దగ్గర్నుంచి ...గెలుపు బాధ్యతలను తానే తీసుకుంటూ... కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. మరోవైపు అర్వింద్ తండ్రి డీఎస్‌ ప్రభావం కూడా నిజామాబాద్‌లో ఉంటుందని అంటున్నారు. అయితే, డీఎస్ అనుచరులంతా... బీజేపీలో చేరడంతో... ఆ బలం కూడా కాషాయ పార్టీకే కలిసొస్తుందని లెక్కలేస్తున్నారు. దాంతో, నిజామాబాద్ కార్పొరేషన్‌లో పోరు... ముగ్గురు ఎమ్మెల్యేలు... వర్సెస్‌ ఇద్దరు ఎంపీలు అన్నట్లుగా మారిందనే చర్చ జరుగుతోంది.   ఓట్లు, విస్తీర్ణం పరంగా నిజామాబాద్ కార్పొరేషన్ పెద్దది కావడం... పార్లమెంట్‌ ఎన్నికల్లో... కమలం వికసించడంతో... ఇప్పుడు... ఏ పార్టీకి పట్టం కడతారనే ఉత్కంఠ రేపుతోంది. అసలు, నిజామాబాద్‌ ప్రజల నాడి ఎలాగుందనేది అంతుపట్టడం లేదు. అయితే, ఎప్పుడూ విలక్షణ తీర్పునిచ్చే ఇందూరు ఓటర్లు... ఈసారి ఎలాంటి సంచలనాలకు తెరలేపుతారో చూడాలి.

నో డ్యూస్ సర్టిఫికెట్ ఉంటేనే నామినేషన్... మున్సిపోల్స్ లో కొత్త రూల్...

నోటీసులు మీద నోటీసులు ఇచ్చారు... ఇంటింటికీ వందసార్లు తిరిగారు... డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఇచ్చారు... కానీ వాళ్లు దిగిరాలేదు. అధికారుల హెచ్చరికలను సైతం లెక్క చేయలేదు. మొండి బకాయిలు చెల్లించాలంటూ ఎన్నిసార్లు మొత్తుకున్నా కదల్లేదూ మెదల్లేదు. కానీ, మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అంటూ... వాళ్లే స్వయంగా వచ్చి మొండి బకాయిలను చెల్లిస్తున్నారు. 120 మున్సిపాలిటీలు, 19 కార్పొరేషన్లకు జనవరి 22న ఎన్నికలు జరగనుండటంతో బరిలోకి దిగాలనుకుంటోన్న వాళ్లు ముందుగా పన్ను బకాయిలు క్లియర్ చేసుకునే పనిలో పడ్డారు. నామినేషన్లు దాఖలు చేయాలంటే, ఎలాంటి పెండింగ్ బకాయిలు ఉండకూడదనే నిబంధన ఉండటంతో నో డ్యూస్ సర్టిఫికెట్ కోసం మొండి బకాయిలన్నీ చెల్లించేస్తున్నారు. అలాగే, అభ్యర్ధులను ప్రతిపాదించే వాళ్లకు కూడా బకాయిలు ఉండకూడదనే రూల్ ఉండటంతో... వాళ్లు కూడా పన్నులు చెల్లించేందుకు క్యూ కడుతున్నారు. పన్ను బకాయిలుంటే, మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధన ఉండటంతో... బరిలోకి దిగాలనుకుంటున్న బడాబాబులంతా తమతమ బకాయిలను చెల్లించి నో డ్యూస్ సర్టిఫికెట్లు తీసుకెళ్తున్నారు. దాంతో, ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయిలు వసూలు అవుతున్నాయని అధికారులు అంటున్నారు. పన్నులు చెల్లించేందుకు బడాబాబులు తరలివస్తుండటంతో ాయా మున్సిపాలిటీల్లో ప్రత్యేక కౌంటర్లను సైతం ఏర్పాటు చేశారు. మొండి బకాయిలున్న వాళ్లంతా బడాబాబులు, ఎక్కువగా పొలిటికల్ లీడర్సే ఉండటంతో భారీ మొత్తంలోనే వసూళ్లు జరుగుతున్నాయని అంటున్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో అయితే, కోట్లల్లో బకాయిలు పేరుకుపోయాయని, అయితే ఎన్నిసార్లు నోటీసులు ఇఛ్చినా కట్టనివాళ్లు సైతం ఇప్పుడు స్వచ్ఛందంగా వచ్చి చెల్లిస్తున్నారని అధికారులు అంటున్నారు. ఏ మున్సిపాలిటీలోనైనా, సాధరాణ రోజుల్లో కనీసం 40వేలు కూడా పన్ను ఆదాయం రాదని, కానీ ఇప్పుడు రోజూ లక్షల్లో బకాయిలు చెల్లిస్తున్నారని చెబుతున్నారు. అంతేకాదు, వందలసార్లు తిరిగినా వసూలు కాని మొండి బకాయిలు సైతం... మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని... వాళ్లే స్వయంగా వచ్చి చెల్లిస్తున్నారంటూ అధికారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.  

తెలంగాణలో నామినేషన్ల సందడి... ఇంకా రెండ్రోజులే గడువు...

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నోటిఫికేషన్ విడుదలైన 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు అవుతున్నాయి. ఇవాళ్టి నుంచి జనవరి 10వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇక, జనవరి 22న పోలింగ్ నిర్వహించి.... 25న ఫలితాలను ప్రకటించనున్నారు. అయితే, తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్‌కు జనవరి 12, 13 వరకు గడువు ఇచ్చారు. అలాగే, నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 14ని తుది గడువుగా ప్రకటించారు. జనవరి 22న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహించి.... జనవరి 25న ఫలితాలను ప్రకటించనున్నారు. మున్సిపల్‌ చట్టం-2019 ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో తప్పుల కారణంగా హైకోర్టు స్టే ఇవ్వడంతో కరీంనగర్‌లో ఎన్నికను వాయిదా వేసినట్లు తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు.  

విస్మయంలో విశాఖ వాసులు.. అసలు రాజధాని ఇక్కడ ఉంటుందా?లేదా?

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన తరువాత ఉత్తరాంధ్రలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా సందడి చేశారు. జగన్ చిత్ర పటాలకి పాలాభిషేకం చేస్తూ పండుగ చేసుకున్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటు చేయడం ఖాయమని విజయసాయిరెడ్డి స్పష్టం చేయడంతో పాటు భీమిలి నియోజక వర్గ పరిధిలోకే రాజధాని వస్తుందంటూ స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఈ తరుణంలో వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి జగన్ నిర్ణయాన్ని స్వాగతించటం మొదలు పెట్టారు. ఈ లోపు జీఎన్ రావు కమిటీ నివేదిక రావడం అది ముఖ్యమంత్రి జగన్ ప్రకటనకు దగ్గరగా ఉండటంతో అమరావతిలో ఒక్కసారిగా మంటలు మొదలయ్యాయి. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే ప్రకటన అనంతరం మంత్రులు అవంతి, బొత్స సహా విజయసాయిరెడ్డి ఈ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు , ఇతర నేతలు సీఎం జగన్ కు జేజేలు పలికారు. టిడిపికి చెందిన విశాఖ నేతలు సైతం ఇక్కడ రాజధాని ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతించేలా మాట్లాడక తప్పలేదు. అయితే అమరావతి రైతుల సమస్యలను కూడా తీర్చాలని వారు కోరారు.   ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన తర్వాత విశాఖ ఉత్సవ్ లో పాల్గొనేందుకు సీఎం జగన్ విచ్చేశారు. ఆయనకు వైసీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విశాఖ వేదికగా ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ప్రకటన చేస్తారని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ జగన్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. విశాఖ ఉత్సవ్ ను ప్రారంభించి తరువాత రాజధాని విషయం పై ఒక్క మాట కూడా మాట్లాడకుండా జగన్ వెళ్ళిపోయారు. ఈ పరిణామంతో విశాఖ సహా ఉత్తరాంధ్ర వాసులు విస్మయానికి గురయ్యారు. దీంతో ఆ ప్రాంత ప్రజల స్వరంలో మార్పు వచ్చింది. ఏపీ రాజధానిగా అమరావతిని కాదని జగన్ నిస్పష్టంగా చెప్పలేదు. హైపవర్ కమిటీ నివేదిక వచ్చాకే మూడు రాజధానుల అంశంపై తుది నిర్ణయం అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖలో రాజధాని తథ్యమని ఆయన చెప్పడం లేదు అని సాగర తీర ప్రజానీకం చెప్పుకుంటోంది. ప్రశాంతంగా ఉన్న విశాఖను రాజధానిగా మారిస్తే గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని భారీ నిర్మాణాలు జరిగి జనసాంద్రత పెరిగిపోతుందని.. ట్రాఫిక్ రోదతో అల్లాడిపోతామని కొందరు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. అమరావతిలో చంద్రబాబు ముద్ర కనిపించకుండా చేయాలనే దురుద్దేశంతోనే అధికార వికేంద్రీకరణ అనే ముసుగులో విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాప్టల్ అనే కొత్త రాజకీయానికి జగన్ తెరతీశారని కొందరు వాదిస్తున్నారు.

జగన్నాటకం... పిన్నెల్లిపై దాడి చేసింది కడప వైసీపీ కార్యకర్తలే!!

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనం పై దాడి ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది. అసలు దాడి చేసింది రైతులా లేక రైతుల ముసుగులో ఉన్న వేరే వ్యక్తులా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రహదారి దిగ్బంధం భాగంగా రైతులు రాస్తారోకో నిర్వహిస్తుండగా అదే సమయంలో మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అటుగా వచ్చారు. ఉద్యమానికి సంఘీభావం తెలపాలని రైతులు కారును ఆపారు. పిన్నెల్లి కారుముందు బైటాయించిన రైతులు రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ క్రమం లోనే కొందరు ఆందోళనకారులు ఎమ్మెల్యే కారు పై రాళ్లు రువ్వడంతో కారు వెనుక భాగం అద్దాలు పగిలిపోయాయి. ఈ వ్యవహారంపై స్థానికుల్లో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యూహం ప్రకారమే పిన్నెల్లి పై రాజధాని వ్యతిరేక శక్తులు దాడి చేశాయని అంటున్నారు స్థానికులు. పిన్నెల్లి కారును అడ్డుకున్న చోట వైసీపీ కార్యకర్తలు ఉన్నారంటున్నారు స్థానిక రైతులు. రాజధాని కోసం జరుగుతున్న ఉద్యమంలో కడప జిల్లా వైసీపీ కార్యకర్తలకు పని ఏంటని రాజధాని రైతులు నిలదీస్తున్నారు.  పిన్నెల్లి ఉద్దేశ పూర్వకంగానే ఆందోళనకారుల వద్దకు వచ్చి కారు ఆపారని డోర్ కూడా తీశారని చెబుతున్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడ్డ తరవాత దాడి జరిగిందని రాజధాని రైతులంటున్నారు. దాడి జరిగిన సమయంలో కడప జిల్లాకు చెందిన వైసీపీ కార్యకర్తలు అక్కడే ఉన్నారని అంటున్నారు. దీంతో ఎమ్మెల్యే కారు అడ్డగింపు వ్యవహారాల్లో అనుమానాలు బలపడుతున్నాయి. టీడీపీ కార్యకర్తలే పిన్నెల్లి కారుపై దాడి చేశారంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలకు తెలుగుదేశం నేతలు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నారు. ఎమ్మెల్యే ఆనం, మంత్రి సురేష్ ను అడ్డుకోని రైతులు అతడిని మాత్రమే ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నిస్తున్నారు ఏపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు. సీఎం ఆదేశాలతోనే పిన్నెల్లి అక్కడకు వచ్చారని ఆరోపించారు. అటు రాజధాని రైతులు చెబుతున్న మాటలతో దాడి ఘటన పై మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి.

మంత్రి కాదు ముఖ్యమంత్రి... కళకళలాడుతున్న కేటీఆర్!!

చర్చకు బలం చేకూర్చినట్లుగానే ఉంది. మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు నిట్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు అధికార పార్టీ నేతలు అందరూ క్యూ కట్టారు. అనంతరం మడికొండ ఐటీ కంపెనీల వద్దకు చేరుకునేందుకు కాన్వాయ్ సిద్ధమవుతుండగా మంత్రి కేటీఆర్ ఒక్కసారిగా డ్రైవర్ సీట్లో కూర్చున్నారు. సైంట్ కంపెనీ అధినేత బీవీ మోహన్ రెడ్డి బెంజి కారును కేటీఆర్ తన కాన్వాయ్ లోని ఇతర వాహనాలతో సమానంగా నడిపించారు. సాధారణంగా మంత్రుల కాన్వాయ్ లో ప్రత్యేకంగా అంబులెన్స్ ఉండదు. కేటీఆర్ కు మాత్రం అంబులెన్స్ తో పాటు రోప్ పార్టీని సైతం ఏర్పాటు చేశారు. మీడియాకు సైతం ఎంట్రీ పాసులను అందజేశారు. మంత్రి కేటీఆర్ డ్రైవ్ చేస్తున్న కారును ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రైవేటు వాహనంగా భావించి నిలిపివేయటంతో కాన్వాయ్ లో కొద్ది సేపు కలకలం రేగింది. తాజాగా కేసిఆర్ తరువాత కేటీఆర్ ముఖ్యమంత్రి అంటే తప్పేంటి అంటూ వ్యాఖ్యానించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆయన ఒక్కరే కాదు మరికొందరు టీఆర్ఎస్ నేతలు కూడా కేసిఆర్ తరువాత కేటీఆర్ సీఎం అంటూ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లిన మంత్రి కేటీఆర్ కు టీటీడీ అధికారులు దగ్గరుండి మర్యాదలు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్బంగా బయో మెట్రిక్ ద్వారా దర్శనం చేయించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారన్న సమాచారంతోనే ఏపీ అధికార పార్టీ నేతలు, అధికారులు కేటీఆర్ దగ్గరుండి దర్శనం చేయించినట్లు ప్రచారం జరుగుతోంది.

మహబూబ్ నగర్ జిల్లాలో మునిసిపల్ ఎన్నికలపై హైకోర్టు స్టే

మహబూబ్ నగర్ జిల్లాలో రెండు మునిసిపాలిటీల ఎన్నికలపై హై కోర్టు స్టే విధించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇవే కీలక మునిసిపాలిటీలు కావడాం గమనర్హం. ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పాలమూరు వాసులకు హై కోర్టు తీర్పు షాకిచ్చినట్లు అయ్యింది. ఓటర్ల జాబితా.. వార్డుల విభజన సరిగ్గా జరగలేదని మహబూబ్ నగర్ వనపర్తికి చెందిన ఇద్దరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు.దీంతో ఈ రెండు మునిసిపాలిటీల ఎన్నికల పై హై కోర్టు స్టే విధించింది. జిల్లాలో ఉన్న మొత్తం 19 మునిసిపాలిటీల్లో అచ్చంపేట, జడ్చర్ల ప్రజాప్రతినిధుల పదవీ కాలం పూర్తి కాకపోవడంతో ఆ రెండింటి ఎన్నికలు నిలిపేశారు అధికారులు.అవికాకుండా మరో రెండు మున్సిపాలిటీల ఎన్నికల్లో నిలిచిపోవడంతో పదిహేను మున్సిపాలిటీలకే ఎన్నికలు జరగనున్నాయని సమాచారం. ఓటర్ల జాబితాలో గందరగోళం జరగడం వార్డుల విభజన సరిగా జరగలేదని మహబూబ్ నగర్ పట్టణాని కి చెందిన రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి హైకోర్టు లో పిటిషన్ వేశారు. దీంతో వార్డుల విభజన ఓటర్ల జాబితాను సరిచేసుకుని రావాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.ఆదేశాల తరువాత కూడా సరిచేయకపోవడం.. పిటిషన్ మళ్లీ విచారణకు రావడంతో హైకోర్ట్ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల పై స్టే విధించింది.వనపర్తి పట్టణానికి చెందిన సమద్ హైకోర్టును ఆశ్రయించారు. మరణించిన వారి ఓట్లు కూడా లిస్ట్ లో ఉండటంతో పాటు వార్డుల రిజర్వేషన్లు సరిగా జరగలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిన హై కోర్టు ఈ రెండు మునిసిపాలిటీలకు స్టే విధించింది.

రాజధానిగా అమరావతినే కొనసాగించాలనేది నా కోరిక: వైసీపీ ఎమ్మెల్యే

ఏపీలో రాజధాని రగడ రోజురోజుకి ఉదృతమవుతున్న సంగతి తెలిసిందే. అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దని, మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని.. రాజధాని ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. విపక్ష పార్టీలు వారి ఆందోళనకు మద్దతుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీ అమరావతి కోసం గట్టిగా పోరాడుతోంది. మరోవైపు అధికార పార్టీ వైసీపీ మాత్రం.. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అందుకే టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులతో ఆందోళనలు చేయిస్తుందని ఆరోపిస్తోంది. మొత్తానికి ఇలా ఆరోపణలు, ఆందోళనల మధ్య రాజధాని రగడ ఉధృతమవుతోంది. ఇదిలా ఉంటే దాదాపు వైసీపీ నేతలంతా మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే ఒక వైసీపీ ఎమ్మెల్యే మాత్రం.. రాజధానిగా అమరావతి ఉంటే బాగుంటుందని అంటున్నారు. అలా అని సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించరట. ఇంతకీ ఆ నేత ఎవరో కాదు.. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ తాజాగా నియోజకవర్గంలో ఆయన పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజక వర్గ సమగ్రాభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంత వాసిగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలనేదే నాకోరికా అన్నారు. అయితే పార్టీ అధినేత జగన్‌ నిర్ణయమే నాకు శిరోధార్యమన్నారు. కాగా వసంత వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తీరు కర్ర విరక్కూడదు, పాము చావకూడదు అన్నట్టుగా ఉందని అమరావతి ప్రాంత రైతులు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతే కొనసాగుతుందని చెప్పి.. తీరా ఎన్నికల్లో గెలిచాక ఇప్పుడేమో పార్టీ అధినేత జగన్‌ నిర్ణయమే నాకు శిరోధార్యమనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలనేదే నాకోరిక అంటూ.. మళ్లీ జగన్ నిర్ణయానికి జై కొట్టడం ఏంటని వసంత తీరుని రైతులు తప్పుబడుతున్నారు. ఆయన స్వలాభం కోసం రెండు మాటలు చెప్పకుండా.. అమరావతి ప్రాంత రైతులకు అన్యాయం జరగకుండా పోరాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఇరాన్ లో కుప్పకూలిన విమానం..176 మంది దుర్మరణం

ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం ఇరాన్ లో కుప్పకూలింది. విమానంలో దాదాపు 180 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని ఇమామ్ ఖామెనెయీ విమానాశ్రయం నుండి ఉక్రెయిన్ రాజధాని కీవ్ కి వెళుతుంది. ఇరాన్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవ్వగానే ప్రమాదానికి గురైనట్లుగా సమాచారం. సాంకేతిక సమస్యల కారణాల వల్లే ప్రమాదం జరిగిందనట్లుగా తెలిపింది ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్. విమానం కుప్పకూలిన వెంటనే ఘటనాస్థలానికి సహాయ సిబ్బందిని పంపించింది ఇరాన్ ప్రభుత్వం. అప్పటికే విమానం మంటల్లో ఉందని.. తాము సిబ్బందిని పంపించి కొంతమందినైనా కాపాడగలమని అనుకున్నా కుదరలేదని ఇరాన్ అత్యవసర సేవల అధికారి పిర్హొస్సేన్ కౌలీవాండ్ మీడియాతో తెలిపారు.  ప్రమాద సమయంలో విమానంలో ఉన్నవారు సజీవంగా ఉండే అవకాశమే లేదని ఇరాన్‌కు చెందిన రెడ్ క్రిసెంట్ ప్రకటించింది. ఇక ఇప్పటికే జరుగుతున్న  ఇరాన్-అమెరికా ఘర్షణతో ఈ ఘటనకు సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

రాజధాని పరిరక్షణ సమితికి ఎకరం పొలం రాసిచ్చిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్!!

రాజధాని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలకు కృష్ణా జిల్లా ముదినేపల్లికి చెందిన వైష్ణవి ఎకరం భూమి విరాళంగా ఇచ్చింది. తన తండ్రి నుంచి సంక్రమించిన భూమిలో ఎకరం భూమి పత్రాలను తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అందించింది. గతంలో రాజధాని నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం అందించిన వైష్ణవిని నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అమరావతి అంబాసిడర్ గా ప్రకటించారు. తరువాత కాలంలో సుమారు నాలుగు లక్షల వ్యయంతో తాను చదువుకునే పాఠశాల అభివృద్ధి చేయటమే కాకుండా 400 మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఆమె కృషి చేసింది. ప్రస్తుతం రాజధాని అమరావతి తరలింపు పై ప్రజల్లో గందరగోళం, మూడు రాజధానుల ప్రకటన ద్వారా అయోమయం నెలకొన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ భవన్ కు వచ్చి.. అమరావతి పరిరక్షణ కోసం ముదినేపల్లిలో ఈ నెల 12 న దుర్గా మహాచండీయాగం నిర్వహిస్తున్నామని దానికి హాజరు కావాలని చంద్రబాబును ఆహ్వానించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైష్ణవి లానే అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఐదు కోట్ల ఆంధ్రుల పై ఉందని ఆయన పేర్కొన్నారు.

నువ్వా-నేనా ?.. దాడి ప్రతిదాడులతో యుద్ధ వాతావరణంలో అమెరికా-ఇరాన్

రెండు దేశాలు ఎక్కడ తగ్గటం లేదు.. నేనంటే నేను అంటూ దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇరాన్ మిలిటరీ కమాండర్ సులేమాణి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది ఇరాన్ ప్రభుత్వం. ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై గురిపెట్టి.. అమెరికా స్థావరాలైన అల్లాసత్, ఇర్బిల్ ఎయిర్ బేస్ లపై ఇరాన్ రాకెట్ దాడులు చేసింది. అమెరికా స్థావరంపై కనీసం 12 కు పైగా రాకెట్లను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో అమెరికా సైనికులకు జరిగిన నష్టం పై ఇంకా స్పష్టత రాలేదు. ఎయిర్ బేస్ లపై దాడిని పెంటగాన్ ధ్రువీకరించింది. ఈ దాడిలో జరిగిన నష్టం పై అమెరికా అంచనా వేస్తోంది. ఇరాక్ లో ఇరాన్ రాకెట్ దాడులను అధ్యక్షుడు ట్రంప్ నిశితంగా గమనిస్తున్నారని అన్నారు అమెరికా రక్షణ శాఖ అధికారి. తాము కూడా సరైన సమయంలో బదులిస్తామని అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. దాడులపై పూర్తి నివేదికను ట్రంప్ కు సమర్పించామని ఆయన దానిపై తదుపరి చర్యలు తీసుకుంటారని వైట్ హౌజ్ వెల్లడించింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సీఎం వరాల జల్లులు.. ఏప్రిల్ లోపు 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు!!

209 వ రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశం ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వివిధ పథకాల కింద నగదును బదిలీ చేయగలుగుతున్నామని సీఎం అన్నారు. రైతులకు ఆటోలు, ట్యాక్సీలు నడుపుకునే వారికి , మత్స్యకారులకు.. చేనేతలకు.. అగ్రి గోల్డ్ బాధితులకు సుమారు 15 వేల కోట్లకు పైనే నగదు బదిలీ ద్వారా ఇచ్చినట్లు స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి చిరు వ్యాపారులు , తోపుడు బండ్ల వారికి 10 వేల రూపాయల వడ్డీ లేని రుణం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన వినియోగంలో రాష్ట్రం 12 వ ర్యాంక్ లో ఉందని గుర్తు చేశారు. మహిళలు , రైతుల విషయంలో బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వారికి రుణాలు ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పై బ్యాంకర్లు దృష్టి పెట్టాలని కోరారు.  కౌలు రైతుల విషయంలో లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు ఇవ్వడం లేదని ఎస్ఎల్బీసీ లెక్కలు చెబుతున్నాయని వారి కోసం ఒక చట్టాన్ని తీసుకువచ్చినట్లు సమావేశాల్లో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బ్యాంకర్లు ప్రభుత్వం కలిసి కౌలు రైతులకు మరింత ఎక్కువగా రుణాలు అందించేలా ముందడుగు వేయాలని జగన్ స్పష్టం చేశారు. ఏప్రిల్ నాటికి దాదాపు 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమావేశాల్లో వెల్లడించారు. వైఎస్ఆర్ నవోదయం క్రింద ఖాతాల పునః వ్యవస్థీకరణపై దృష్టి సారించాలని కోరారు. పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి అమ్మఒడి కింద ఈ నెలలో రూ.6,500 కోట్లు ఇవ్వబోతున్నట్లు సీఎం అన్నారు. నాడు- నేడు కింద 45 వేల స్కూళ్లు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కాలేజీలను బాగుచేస్తున్నామని దీనికి దాదాపు రూ.12 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్లు సీఎం తెలిపారు. గత ప్రభుత్వం వడ్డీలేని రుణాలు పావలా వడ్డీ కింద పెట్టిన బకాయిలు రూ.648.62 కోట్లు ఉన్నాయని బ్యాంకర్లు చెబుతున్నారని ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నట్టు జగన్ తెలిపారు.

ఎంత సుఖమో.. వారానికి నాలుగు రోజులే పని.. మూడు రోజులు సెలవులు

హెక్టిక్ షెడ్యూల్ స్ట్రెస్ ఫుల్ లైఫ్ తో వారం రోజులు గట్టిగా పని చేయగానే శరీరం మనసు డీలాపడిపోతుంది. వీక్లీ ఆఫ్ కోసం మనసు ఆశగా ఎదురు చూస్తోంది. సెలువు రోజు ఫుల్ గా తినేసి హాయిగా నిద్రపోతే తప్ప మళ్లీ వారానికి సరిపడే పని చేసేంత శక్తి రావటం లేదు. దీంతో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, హాబీలు ఇష్టాయిష్టాలు లాంటివి ఏనాడో అటకెక్కేశాయి. మనమంతా మరమనిషిలా మారిపోతున్నాము. అయితే మల్టీనేషనల్ కంపెనీల్లో పని చేసే వాళ్లకు మాత్రం వారానికి రెండు రోజులు సెలవులు దొరుకుతున్నాయి. ఒకరోజు రెస్టు తీసుకున్న ఇంకో రోజు ఫ్యామిలీతో గడుపుతున్నారు. కానీ ఆ రెండు రోజులు కూడా అప్పుడప్పుడు సరిపోవటం లేదు. పెండింగ్ పనులు ఉంటే అవి చక్కబెట్టుకోవడానికే ఆ వీకెండ్స్ కూడా సరిపోతుంది. దీంతో వారానికి నాలుగు రోజులే వర్కింగ్ డేస్ ఉంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. వారంలో నాలుగు రోజులు పనికి మూడు రోజులు పర్సనల్ లైఫ్ కి కేటాయించేలా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు సీరియస్ గా సాగుతున్నాయి. ఉద్యోగులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో గడిపే వాళ్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడి క్వాలిటీ ఔట్ పుట్ వస్తుందని శాస్త్రీయంగా నిర్ధారణ కావటంతో ఈ విషయం పై ఇప్పుడు సీరియస్ గా ఆలోచిస్తున్నారు. పనిదినాలు తగ్గే కొద్దీ ప్రొఫెషనల్ లైఫ్ కి పర్సనల్ లైఫ్ కి సమన్యాయం ఏర్పడి 20 శాతం మెరుగైన ఉత్పత్తి వస్తుందని సర్వేలో తేలింది. అందుకే ఆలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు జాక్ మా కూడా వారానికి నాలుగు పనిదినాలపై సీరియస్ గా ఆలోచిస్తున్నారు. గేట్ వే కాన్ఫరెన్స్ లో ఆయన ఓసారి మాట్లాడుతూ మా తాతయ్య పొలంలో రోజుకు 16 గంటలు పనిచేసేవారు, మనం ఇప్పుడు రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తున్నాము. వచ్చే 30 ఏళ్లల్లో ప్రజలు రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే పని చేస్తారు. అది కూడా వారానికి నాలుగు రోజులు మాత్రమే అని ఆయన జోస్యం చెప్పారు.  సరే ఒక కంపెనీ యజమాని ఈ నియమాన్ని అమలు చేస్తే అది ఆ సంస్థలో పనిచేసే వాళ్లకే వర్తిస్తుంది. మరి ఇదే ఆలోచన ఓ దేశ ప్రధాని చేసి ఆచరణలోకి తీసుకు వస్తే ఎలా ఉంటుంది, ఫిన్ లాండ్ ప్రధాని సరిగ్గా ఇప్పుడు అదే చేస్తున్నారు. 34 ఏళ్లకే ఫిన్లాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సనా మ్యారిన్ రోజుకు ఆరు గంటల చొప్పున వారానికి నాలుగు రోజుల పనిదినాల పై సీరియస్ గా ఆలోచిస్తున్నారు. వారానికి 24 గంటలు పని చేస్తే సరిపోతుందా, తద్వారా వచ్చే లాభ నష్టాలు ఏంటనే దానిపై మేధో మథనం చేస్తున్నారు. సమాజం లోని అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే ఈ విధానం అమలు లోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక మన దగ్గిర అంటారా అంత సీన్ లేదు అండి మన దగ్గర అనార్గనైజ్డ్ సెక్టార్ లో పనిచేసే వాళ్లే రూ.50 కోట్ల మందికి పైగా ఉన్నారు. వీళ్లంతా రోజుకు 12 గంటలకు పైగా మండేటి ఎండలో దుమ్మూదూళి మధ్య పనిచేస్తున్నారు. ప్రతి ఆదివారం సెలవు కాదు కదా కనీసం నెలకు ఓ రెండ్రోజులు సెలవులు దొరికితే అదే మహాభాగ్యం, కనీస వేతనం కింద నెలకు రూ.15000 చెల్లించాల్సిందే అని చట్టం చేసినా ఎక్కడ అమలవుతుంది. ఐదారు వేల జీతానికి కోట్ల మంది పనిచేస్తున్నారు. ఇక మన దేశానికి వస్తే నిన్న ప్రధాని మోదీ కూడా దేశ ఆర్థిక ప్రగతి రథచక్రాలను నడిపిస్తున్న పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. భారత ఎకనామీ ఐదు ట్రిలియన్ డాలర్ లకు చేర్చడంపై కసరత్తు చేశారు. మనము ఏదో ఒక రోజు పాశ్చాత్య దేశాల స్థాయికి చేరుకుంటాం అయితే అది ఎప్పుడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న, ఇప్పటికీ ఇప్పుడు మన ముందున్న టాస్క్ అల్లా జిడిపితో పాటు తలసరి ఆదాయం పెంచడం, సమాజం ఆర్థికంగా పరిపుష్టిగా ఉండటంతో పాటు పేద ధనిక మధ్య అంతరాలు ఎంత తక్కువగా ఉంటే ఆ సొసైటీ అంత హెల్దీగా ఉంటుంది.

ఓటమి నేర్పుతున్న పాఠాలు.. తుమ్మల నాగేశ్వరరావు కష్టాలు!!

తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగిన తుమ్మల నాగేశ్వర్ రావు ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేక పోయారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు వద్ద నెంబర్ 2 గా ప్రాచుర్యం పొందారు. ఓ దశలో రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలక వ్యక్తిగా నిలిచారు. జలగం వెంగళరావు కుటుంబాన్ని రాజకీయంగా ఎదిరించడంతో బాగా గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పార్టీ మారారు. 2014 ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసి ఓడిపోయినా.. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో నేరుగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చెందిన కొందరు మంత్రులలో తుమ్మల కూడా ఉన్నారు. తన రాజకీయ జీవితంలో ఆయన ఏ రోజూ పోలీసులను ఆశ్రయించలేదు. కొందరు పోలీసు అధికారులే ఆయన కను సైగల్లో నడిచేవారని ఉదంతాలు ఉన్నాయి. అలాంటి కాకలు తీరిన రాజకీయ నేత మొట్టమొదటి సారి తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతోందని.. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తన కనుసైగలతోనే దశాబ్దాల తరబడి రాజకీయాలను శాసించిన తుమ్మల నాగేశ్వర్ రావు పోలీసుల తీరుపై ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల మాజీ సర్పంచ్ బండి జగదీశ్ పై కేసు నమోదుకు సంబంధించి తుమ్మల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేశారు. తుమ్మల వాయిస్ తో వైరల్ అవుతోన్న ఆడియో ఖమ్మంలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నడూ లేని విధంగా తుమ్మల పోలీసులను ఆశ్రయించడం చర్చకు దారి తీసింది. తుమ్మల తన రాజకీయ జీవితంలో తొలిసారి పోలీసులను ఆశ్రయించారు. తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ ఆడియో గురించి పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని అభ్యర్థించారు. తన సంతకంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉదంతం ఇదే మొదటిది.  వాస్తవానికి గత ఎన్నికల్లో పాలేరు నుంచి అనూహ్యంగా ఓటమి చెందిన తుమ్మల తాజా రాజకీయాల్లో యాక్టివ్ గా కూడా లేరు. గండుగలపల్లిలో వ్యవసాయం చేసుకుంటున్నారు, పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు, కానీ ఆయన గొంతును పోలిన స్వరంతో ఓ ఆడియో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది, యూట్యూబ్ లోనూ వైరల్ గా మారింది. అమరావతి రాజధాని తరలింపునకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణను తుమ్మలకు ఆపాదిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ విషయంపైనే తుమ్మల ఖమ్మం పోలీసులను ఆశ్రయించారు. ఆడియోలో ఉన్నది తన వాయిస్ కాకపోయినా తన వాయిస్ గా చిత్రీకరించి వాట్సప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వ్యక్తులపై.. వారి వెనక ఉండి నడిపిస్తున్న శక్తులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తుమ్మల కోరుతున్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు కానీ పార్టీ నేతలు కానీ స్పందించడం లేదు. అందుకు అధికార పార్టీలో.. ప్రజల్లో.. విపక్షాల్లో.. కూడా తుమ్మలను టిఆర్ఎస్ పార్టీ పక్కన పెడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది తన గొంతు కాదు బాబోయ్ అంటున్న మద్దతుగా నిలిచినచేవారే కనిపించటం లేదు. ఈ విషయంలో తనకు మద్దతుగా నిలిచి ఖండించే నాయకుడే లేకపోవటంతో తుమ్మల బాగా ఫీలవుతున్నారు.

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి!!

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.అమరావతి ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టగా ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు,మరికొందరు గాయపడ్డారు. కాశిపెంట్ల దగ్గర పూతలపట్టు రహదారి పై ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద క్షతగాత్రులను తిరుపతి రియా ఆసుపత్రికి తరలించారు.రెండు బస్సుల్లోనూ వాళ్ళందరికీ కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. ఇప్పటి వరకు ఇద్దరు చనిపోగా మరో 30 మందికి తీవ్రమైన గాయాలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.ఆసుపత్రి మొత్తం కూడా బాధితులతో నిండిపోయి క్యాజువాల్టీ అంత కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్న బస్సు ప్రమాద బాధితులతో కొంతమందికి చేతులు విరిగితే మరికొంత మందికి కాళ్లు విరిగాయి. గాయాల పాలైన వారందరు కూడా నొప్పులు తట్టుకోలేక రోదిస్తున్నారు.దెబ్బలు తిన్న వాళ్లలో ఎక్కువ మంది మహిళలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అయ్యప్ప స్వామి భక్తులతో వెళ్తున్న బస్సును మరొవైపు నుంచి వస్తున్న అమరావతి బస్సు రెండు ఎదురెదురుగా మంచు కారణంగా రోడ్లు సరిగా కనిపించక ఢీ కొన్నట్టుగా సమాచారం. రెండు బస్సుల్లో ఉన్న ప్రయాణికులందరికీ కూడా తీవ్రమైన గాయాలు అయ్యాయి.అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్న నేపధ్యంలో ఎవరికి వాళ్లును కాపాడూకోవడమే కష్టతరంగా మారింది.చివరికి  రెండు బస్సులు పూర్తిగా ధ్వంసం కాగా  బస్సులోంచి గాయాల పాలైన వారిని బయటికి తీయడం కూడా చాలా కష్టంగా మారింది.బస్సు ముందుభాగాలు పూర్తిగా నుజ్జునుజ్జైపోవటంతో లోపల చిక్కుకున్న బాధితులను బయటకు తెచ్చే ప్రయత్నంలో గ్యాస్ కట్టర్ల సాయంతో కట్ చేసి స్థానికులందరూ అప్రమత్తమై 108 వాహనాన్ని పిలిచి ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.మొత్తం మీద ప్రమాదంలో అందరికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచామృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మహబూబాబాద్ పెద్దాయన స్కెచ్.. సత్యవతి రాథోడ్ పతనానికి ప్లాన్ చేస్తున్న పెద్ద మనిషి అతనేనా?

టీఆర్ఎస్ పార్టీలో అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్న వారిలో ఒకరు సత్యవతి రాథోడ్. గులాబీ పార్టీలో చేరినప్పటి నుంచి కేసీఆర్ సూచనలను పాటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యం లోనే పార్టీలో పలువురు ముఖ్యనేతల అంచనాలను తారుమారు చేస్తూ తొలుత ఎమ్మెల్సీ పీఠం దక్కించుకున్నారు. అనంతరం కేసీఆర్ మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్నారు. అయినప్పటికీ సత్యవతి రాథోడ్ ను ఉమ్మడి వరంగల్ జిల్లాని టీఆర్ఎస్ నేతలు లైట్ తీసుకుంటున్నారు. కేవలం మహబూబాబాద్ జిల్లాకే ఆమె పరిమితం అయినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎర్రబెల్లి దయాకరరావు మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. వినయ్ భాస్కర్ కి చీఫ్ విప్ పదవి వచ్చినప్పుడు బాగా హడావుడి చేశారు. పల్ల రాజేశ్వర్ రెడ్డిని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా చేసినప్పుడు కూడా ఉమ్మడి జిల్లాలో భారీ సన్మాన సభ ఏర్పాటు చేశారు. కానీ మంత్రి సత్యవతి రాథోడ్ ని మాత్రం పట్టించుకొనేవారే కన్పించడం లేదు. ఈ జిల్లా నేతలు కాకపోయినా ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లు వరంగల్ కు వచ్చినప్పుడు వారికి కూడా ఘనమైన రీతిలో గౌరవ మర్యాదలు జరిగాయి. నిన్న మొన్నటి వరకు ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పల్ల రాజేశ్వర్ రెడ్డికి జరిగిన సన్మాన సభ తర్వాత సత్యవతి రాథోడ్ అంశం అందరి దృష్టిలోకి వచ్చింది. గిరిజన సామాజిక వర్గం నుంచి ఎదిగిన సత్యవతి రాథోడ్ ను ఉమ్మడి వరంగల్ నేతలు చిన్నచూపు చూడడానికి ఆధిపత్యపోరే కారణం కావచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బతుకమ్మ వేడుకలను అధికారికంగా వరంగల్ లో ప్రారంభించిన సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మొదటి సారి సత్యవతి రాథోడ్ వరంగల్ కు వచ్చారు. మంత్రులు దయాకరరావు, శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి ఈ వేడుకలను ప్రారంభించారు. మొదటిసారి వరంగల్ కు వచ్చినప్పుడు ఒక వైపు పండుగ సందడి మరోవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగుతున్నాయి. అందువల్లే ఆమెకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయలేదేమోనని అందరూ భావించారు. అత్యాచారం ఆపై హత్యకు గురైన ఓ మైనర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు మంత్రి సత్యవతి రాథోడ్ మరోసారి జిల్లాకు వచ్చారు. అప్పుడు కూడా ఆమె రాకపోకల సందడే లేదు. వరంగల్ జిల్లాలో గవర్నర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎంవో ఆదేశాలతో మరొకసారి వరంగల్ జిల్లాకు సత్యవతి రాథోడ్ విచ్చేశారు. అప్పుడు కూడా ప్రత్యేకంగా హడావిడి కనిపించలేదు. ఇటీవలే వరంగల్ నగరంలో జరిగిన అతి రుద్ర యాగంలో పాల్గొనేందుకు వచ్చారు మంత్రి సత్యవతి రాథోడ్. పూజాకార్యక్రమాలు ముగిశాక ములుగుకు వెళ్లారు మేడారం జాతర పనుల సమీక్ష సమావేశం నిర్వహించి నేరుగా వరంగల్ కు వచ్చినప్పుడు కూడా మంత్రిని ఎవరూ పట్టించుకోక పోవడం గమనార్హం. మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మహబూబాబాద్ జిల్లాలో సత్యవతి రాథోడ్ తొలి పర్యటన చేశారు. నాటి పర్యటనలో కేవలం శంకర్ నాయక్ మహబూబాబాద్ ఎంపీ కవిత మినహా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొనలేదు. హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ జిల్లాకు వెళ్లే దారిలో పలు నియోజకవర్గాలోని ప్రజాప్రతినిధులు కూడా ఆమెను కలిసి శుభాకాంక్షలు చెప్పలేదు. ఇలా ఎందుకు జరుగుతోందని అందరిలో ప్రశ్న మెదులుతుంది. సత్యవతి రాథోడ్ కి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య గ్యాప్ ఏర్పడిందన్న అభిప్రాయం గులాబి వర్గాల్లో ఏర్పడింది. మొన్నటి ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లా బాధ్యతలు చూసిన ఓ పెద్దమనిషి పాత్ర ఇందులో ఉందనే అనుమానాలు సైతం కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం పార్టీ పెద్దల దృష్టికి వెళితే ఎలా స్పందిస్తారో చూడాలి.

ప్లాన్ అదిరింది.. రాజధాని విషయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలనే బలి చేసిన జగన్!!

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణాలను నిలిపివేసింది. ఈ మేరకు కాంట్రాక్టర్ లకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ చర్యపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో రైతులకు కౌలు మాత్రం చెల్లించారు. కానీ అక్కడి నుండే అస్సలు స్కెచ్ మొదలైంది. కృష్ణా నదికి వరదలు రాగానే రాజధాని మునిగిపోతోందని ప్రచారాలు చేశారు. 2009 లో 11,75,000 క్యూసెక్కుల వరద ముంచెత్తిన మునగని రాజధాని ప్రాంతం 2019 లో 8,00,000 క్యూసెక్కుల వరదకి ఎలా మునిగిపోతుందని  గట్టిగా ప్రశ్నించారు రైతులు. కరకట్ట దాటి చుక్క నీరు కూడా బయటి పొంగలేదు.  చంద్రబాబు అద్దె ఇంటిలో కూడా నీళ్లు ప్రవేశించలేదు. ఇలా వైసీపీ పెద్దల ప్లాన్ విఫలమవ్వడంతో.. ప్లాన్ బి ని తెరపైకి తెచ్చారని అంటున్నారు.  రాజధాని అమరావతిలో అవినీతి జరిగినట్టు అధికార పక్ష మంత్రులు గొడవ చేశారు. అమరావతి భూములు నిర్మాణాలకు పనికి రావని కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు. అయితే రాజధాని ప్రాంతానికి చెందిన 29 గ్రామాల్లో లక్షలాది మంది ప్రజలు బ్రహ్మాండమైన ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివసిస్తున్నారు.కానీ ఇలా అమరావతిపై రభస సృష్టిస్తూనే ఉన్నారు. ఈ సమయంలోనే అసెంబ్లీ సమావేశాల్లో  తనంతట తానుగా అమరావతిపై స్వల్ప కాలిక చర్చను లేవదీసింది వైసీపీ. ఇన్ సైడర్ ట్రేడింగ్ పనులను మరోసారి పునరుద్ఘాటించారు వైసీపీ పార్టీ నేతలు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు కావాలని అంత బడ్జెట్ తమ వద్ద లేదని మరోరకంగా మొదలు పెట్టారు. దీంతో పాటు ప్రజలను మానసికంగా సిద్ధం చేసేందుకు అసెంబ్లీ సాక్షిగా ముఖ్య మంత్రి జగన్ రాజధానిని మూడు భాగాలు చేయవచ్చని స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఆనాడు సిఎం జగన్ చేసిన ప్రకటన సంచలనం రేకెత్తించింది. ఆయన కోరుకున్న విధంగానే జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. రాజధాని గ్రామంలో ఒక్క రోజు కూడా పర్యటించని జీఎన్ రావు కమిటీ అమరావతిని మార్చాలంటూ నివేదిక ఎలా ఇచ్చిందని రైతులు నిలదీసారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు రాజధాని సమగ్రాభివృద్ధి కోసం నివేదిక ఇవ్వాలని జిఎన్ రావ్ కమిటీ నియమిస్తూ ఇచ్చిన జీవోలు ప్రభుత్వం పేర్కొనగా ఆ కమిటీ అభివృద్ధి అవసరాన్ని మర్చిపోయి ఏకంగా రాజధానిని విడదీయాలని తేల్చేసింది. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కూడా దాదాపు ఇదే తరహా నివేదికను ఇచ్చింది. రాష్ట్రంలో ఒక్క రోజు కూడా పర్యటించని బిసిజి కమిటీ కేవలం భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ మ్యాప్ తో పాటు అధికారులు ఇచ్చిన లెక్కల ఆధారంగానే ఈ నివేదిక ఇచ్చిందని కొందరు చెబుతున్నారు.  ఈ మొత్తం వ్యవహారాన్ని మొదటి నుండి నిశితంగా గమనిస్తూ వచ్చిన రైతులకి వైసీపీ పన్నుతున్న పన్నాగం అర్థమైపోయింది. దీనికి తుది ఘట్టంగా హైపవర్ కమిటీ నియమించడం సిఫార్సులను ఆమోదించటం.. క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం.. అదేరోజు ( జనవరి 18వ తేదీన ) అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద వ్యవహారాన్ని ఇటు ప్రతిపక్షాలకు గాని చివరకు వైసీపీలోని ఎమ్మెల్యేలకు కూడా తెలియకుండా అధికార పక్ష వ్యూహకర్తలు అమలు చేయడం విడ్డూరంగా మారింది. రాజధాని పరిధిలో ఉన్న గుంటూరు ,కృష్ణా జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్నారు. రాజధాని మార్పు నిర్ణయం తరువాత ప్రజల నుంచి వ్యక్తమవుతున్న నిరసనలను అధినేతకు చెప్పలేక తమను నిలదీస్తున్న ప్రజానీకానికి సరైన సమాధానం చెప్పలేక అధికార పార్టీ ఎమ్మెల్యేలు నలిగిపోతున్నారు. దీంతో కొంత మంది ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయి సన్నిహిత అనుచరుల వద్ద తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం మూడు రాజధానులు ప్రకటన చేసిన తర్వాత తమను పిలిచి మాట్లాడడంలో లాభమేంటని గుర్రుగా ఉన్నారు. పథకం ప్రకారమే ఇదంతా జరిగిందని వైసీపీ ప్రజాప్రతినిధులు నమ్ముతున్నారు. ఈ అంశాన్ని ప్రజలు మనసులో పెట్టుకుంటే మాత్రం తమకు భవిష్యత్తు ఉండదని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఈ విధంగా మూడు రాజధానుల ఆటలో ప్రజలనే కాదు సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా జగన్ పావులుగా మార్చడం విడ్డూరమనే చెప్పుకోవాలి.

నిర్భయ దోషులకు జనవరి 22న ఉరిశిక్ష

దేశమంతటా ఎదురు చూసే తీర్పుకు తెర పడింది. బాధిత కుటుంబ పోరాటం ఫలించింది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారైంది. ఈ నెల 22 న నిర్భయ దోషులకు మరణశిక్షను అమలు చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టు నిర్భయ దోషులకు ఉరిశిక్షకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 22 వ తేదీన ఉదయం ఏడు గంటలకు ఉరి తీయాలని పాటియాలా కోర్ట్ ఆదేశించింది. ఈ తీర్పు కోసం నిర్భయ తల్లిదండ్రులు.. బాధితురాలి తరపున ఉన్నవారందరూ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. 2012 డిసెంబర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు స్థానికంగా జరిగిన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో.. సుప్రీంకోర్టులో.. వరుసగా వాదనల తర్వాత వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఉన్న ఐదుగురు నిందితులను దోషులుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒకరు కోర్టు శిక్ష అనుభవిస్తూ తీహార్ జైలులోనే ఆత్మహత్య చేసుకున్నారు. మిగతా నలుగురు కూడా దోషులుగా నిర్ధారిస్తూ వారికి ఉరిశిక్షను ఖాయం చేసింది. ఉరిశిక్ష అమలుకు సంబంధించి మరింత ఆలస్యం చేస్తున్నారని నిర్భయ తల్లిదండ్రులు మొదట పాటియాల కోర్టులో తమ పిటీషన్ వేయడం జరిగింది. అందులో జరిగిన రివ్యూ పిటిషన్లలో సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పుని.. అలాగే ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును.. పునఃసమీక్షించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ సుప్రీం కోర్టు కూడా రివ్యూ పిటిషన్ ని కొట్టిపారేసింది.