ఆర్టీసీ బస్సుల తొలగింపు పై తల పట్టుకుంటున్నఆర్టీసీ అధికారులు.....
నగరంలో వెయ్యి ఆర్టీసీ బస్సుల తొలగించాలనీ నిర్ణయించింది సర్కారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో 29 డిపోలకు చెందిన 3,500ల బస్సులు సిటీలో తిరుగుతున్నాయి. వీటి వల్ల ఆర్టీసీకి ప్రతి నెలా 44 కోట్ల రూపాయల నష్టం వస్తోంది. నష్టాలను తగ్గించుకోవడానికి 1000 బస్సులు తొలగించాలని ఆదేశించింది సర్కార్. తొలగించిన బస్సులను కార్గో సేవలను వినియోగించుకోవాలని చెప్పింది. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కార్గో బస్సులను తయారు చేసే పనిలో ఉన్నారు. జనవరి ఒకటి నుంచి సిటీలో కార్గో సేవలు ప్రారంభం కానున్నాయి.
ఆర్టీసీ అధికారులకు బస్సుల తొలగింపు అధికారులకు సవాల్ గా మారింది. ఇప్పటి వరకు నగరం లోని అన్ని డిపోల నుంచి 600 ల బస్సులను క్యాన్సిల్ చేశారు. ప్రాధాన్యత లేని రూట్లు అదనపు సర్వీసులను రద్దు చేశారు. ఆదాయం రాని మార్గాల్లో బస్సులను తిప్పడం మానేశారు. ఇంత చేసినా వెయ్యి బస్సులు తొలగించడం సాధ్యం కావడం లేదంటున్నారు అధికారులు. సిటీలో ఒక కిలో మీటరు బస్సు నడిపేందుకు ఆర్టీసీకి 52 రూపాయల ఖర్చవుతుంది. వచ్చే ఆదాయం మాత్రం 44 రూపాయలే ఉంటోంది. కొన్ని రూట్లలో 18 రూపాయలు కూడా రావడం లేదు. ఈ పరిస్థితుల్లో డీజిల్, బస్సు మెయింటెనెన్స్ కూడా సరి తూగడం లేదు. లాభాలు రాని మార్గాల్లో ముందుగా బస్సులను తొలగించారు అధికారులు. ప్రస్తుతం కిలోమీటరుకు 25 నుంచి 30 రూపాయలు వచ్చే బస్సులను తొలగిస్తున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాలతో డీవీఎంలు, డిపో మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు ప్రధాన రోడ్ల పై నిఘా పెట్టారు.
కోటి, పటాన్ చెరువు, సికింద్రాబాద్ పటాన్ చెరువు, ఉప్పల్ మెహిదీపట్నం, ఉప్పల్ కొండాపూర్, ఉప్పల్ మెహిదీపట్నం వయా కోటి, కుషాయిగూడ ఉప్పల్, లింగంపల్లి ఉప్పల్, ఆరాంఘార్ సికింద్రాబాద్, అఫ్జల్ గంజ్ ఈసీఐఎల్, రాంనగర్ కాళిమందిర్, సికింద్రాబాద్ జియాగూడ వయా కోటి, కుషాయిగూడ అఫ్జల్ గంజ్, ఈసీఐఎల్ సుచిత్ర, చర్లపల్లి సికింద్రాబాద్ వయా సీతాఫల్ మండీ, ఈసీఐఎల్ మల్కాజ్ గిరి, పటాన్ చెరువు కోటి, లింగపల్లి ఎల్బీనగర్, పటాన్ చెరు సికింద్రాబాద్ మార్గాల్లోని సర్వీసులను తగ్గించారు. వీటితో పాటు నగర శివారు ప్రాంతాల్లో తిరిగే బస్సులను పూర్తిగా రద్దు చేశారు. బస్సుల తొలగింపుతో తీవ్ర ఇబ్బందుల పడుతున్నామంటున్నారు ప్రయాణికులు. ప్రాధాన్యత ఉండే రూట్లలో కూడా బసులను తొలగించడమేంటని మండిపడుతున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఆర్టీసీ అధికారులు.ఇప్పుడు ఈ అధికారులు బస్సులు తొలగింపు అంశం పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాలి.