10 ఆవులు... 7 లేగ దూడలు... ఇవే ముఖ్యమంత్రి ఆస్తి...
posted on Jan 2, 2020 @ 9:53AM
2010 నుంచి ఏటా తన ఆస్తులను ప్రకటిస్తూ వస్తోన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్... 2019 సంవత్సరాంతంలో తన ఆస్తుల వివరాలను మీడియా ముందు పెట్టారు. 2018లో పోల్చితే... 2019లో ఒక్క రూపాయి కూడా పెరగలేదని ప్రకటించారు. తన ఆస్తిలో ఎలాంటి వృద్ధి జరగలేదని సీఎం నితీష్ వెల్లడించారు. 2018లో నితీష్ కుమార్ దగ్గర 42వేల నగదు ఉండగా... 2019 సంవత్సరాంతానికి దాదాపు నాలుగు వేలు తగ్గి 38వేల 39 రూపాయలున్నట్లు తెలిపారు. ఇక చరాస్తులు 16వేలు ఉండగా, స్థిరాస్తులు 40లక్షలు ఉన్నట్లు ప్రకటించారు. అయితే, నితీష్ కుమారుడు పేరిట కోటీ 39 లక్షలు ఉండగా... స్థిరాస్తులు మాత్రం కోటీ 48లక్షలుగా తెలిపారు.
అయితే, నితీష్ కుమార్ ఆస్తి ఒక్క రూపాయి కూడా పెరగకపోయినా, ఆయన పాడి సంపదలో మాత్రం భారీ పెరుగుదల కనిపించింది. నితీష్ పాడి సంపదలోకి కొత్తగా రెండు ఆవులు, ఒక లేగ దూడ చేరింది. ఏడాది క్రితం అంటే 2018 చివరి వరకు 8 ఆవులు మాత్రమే ఉండగా, 2018 ఎండింగ్ కి మరో రెండు ఆవులు జత కలిశాయి. అలాగే, గతంలో ఆరు లేగ దూడలు ఉండగా... ఇప్పుడు మరో బుల్లి లేగ వచ్చింది చేరింది. అయితే, నితీష్ కుమార్ తరహాలోనే 2011 నుంచి చంద్రబాబు కూడా తన ఆస్తులను ప్రకటిస్తూ వస్తున్నారు.
ఇక, నితీష్ కుమార్ ఆస్తులు పెరగకపోయినా, బీహార్ మంత్రుల ఆదాయంలో మాత్రం భారీ పెరుగుదల కనిపించింది. ఒకరిద్దరు మినహా అందరూ మంత్రుల ఆస్తులూ కోట్లల్లో ఉన్నాయి. అయితే, ఈ ఏడాదే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అండ్ మంత్రుల ఆస్తుల ప్రకటన ప్రజలపై ఎంతోకొంత ఇంపాక్ట్ చూపించే అవకాశముంది. ప్రస్తుతం మూడోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నితీష్ కుమార్.... నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.