2019 పార్లమెంట్ రిపోర్ట్... సంచలన చట్టాలకు ఆమోదం...
posted on Dec 31, 2019 @ 2:39PM
పలు కీలక చట్టాలను ప్రవేశపెట్టడానికి 2019 వేదికగా నిలిచింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం మొదలుకొని పౌరసత్వ సవరణ చట్టం దాకా ఎన్నో చట్టాలు వీటిలో ఉన్నాయి. విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించే 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు జనవరి 9న పార్లమెంట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చే పది శాతం కోటాని ఫిబ్రవరి నుంచే అమలు చేయడం ప్రారంభించారు. పలు విద్యాసంస్థల్లో కూడా ఈ రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును ఆగస్టు 5న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం కింద జమ్మూకశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలు గా విభజించారు. కంపెనీల చట్టం 2013ని సవరిస్తూ కంపెనీస్ బిల్ 2019ని పార్లమెంట్ ఆమోదించింది. దివాళా, అపరిష్కృత కోడ్ - ఐబీసీ రెండవ సవరణ బిల్లు-2019ని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 13న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. జులైలో మొదటి సవరణ జరిగింది. వేతనాల కోడ్ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. సమాచార హక్కు సవరణ బిల్లును జులై 19న లోక్ సభలో ప్రవేశపెట్టారు. చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించిన బిల్లును కూడా పార్లమెంట్ ఆమోదించింది. మోటార్ వాహనాల సవరణ బిల్లు కింద జరిమానాలను భారీగా పెంచారు. మానవ హక్కుల రక్షణ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. మధ్యవర్తిత్వం, సెంట్రల్ యూనివర్సిటీలు, ఇండియన్ మెడికల్ కౌన్సిల్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లాంటి మరెన్నో బిల్లులను కూడా పార్లమెంట్ ఆమోదించింది.
తాజాగా పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. ఈ విషయంలో దేశవ్యాప్తంగా నిరసనలు చోటు చేసుకున్నాయి. 2019లో పార్లమెంట్ లో 59 బిల్లులను ప్రవేశపెట్టారు. మొత్తం మీద 47 బిల్లులను పార్లమెంట్ ఆమోదించింది. మొత్తానికి 2019 సంవత్సరం పార్లమెంట్ పలు కీలక చట్టాల ఆమోదానికి వేదికైంది.