నన్ను చూస్తే వైఎస్ భయపడేవారు... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
posted on Jan 2, 2020 @ 9:44AM
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనను చూస్తే భయపడేవారని, గౌరవించేవారని పాత రోజులను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తానొస్తున్నప్పుడు లేచి నిలబడుతుంటే.... రాజశేఖర్ రెడ్డీ తప్పు చేస్తున్నావ్ జాగ్రత్త అంటే... గమ్మున కూర్చునేవారని అన్నారు. కానీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారో ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని మండిపడ్డారు. తనను చూసి జగన్ వెకిలి నవ్వులు నవ్వుతున్నారని అన్నారు. అలాగే, జగన్ పక్కనుండే వాళ్లంతా ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతల చేష్టలను చూస్తుంటే అసహ్యమేస్తోందని... కానీ, ఇవన్నీ ప్రజల కోసమే భరిస్తున్నానంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.
ఆనాడు అమరావతిలో రాజధాని నిర్మాణానికి ఒప్పుకుని ఇఫ్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారని జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు ప్రశ్నించారు. మాట తప్పను మడమయ తిప్పను అంటే ఇదేనా అన్నారు. రాష్ట్రానికి మధ్యలో ఉంటుందనే అమరావతిని ఎంపిక చేశామని... కానీ, ఒక సామాజిక వర్గానికి లబ్ధి చేసేందుకు చూశామని, అలాగే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బాబు మండిపడ్డారు. అమరావతి రైతులు కారుణ్య మరణాలు కావాలని అడిగారంటే అసలు ఈ సీఎంకు సిగ్గుందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులు ఇదే విధంగా పోరాడి ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి పులివెందుల పారిపోవడం ఖాయమన్నారు.
అమరావతి జోలికొస్తే ఎవరైనాసరే కాలిపోతారని చంద్రబాబు హెచ్చరించారు. విశాఖ ప్రజల ఆస్తులను కొట్టేయడానికే అక్కడ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటున్నారని బాబు ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చాక విశాఖ అభివృద్ధే ఆగిపోయిందన్న చంద్రబాబు.... ఇక, రాజధానిని అక్కడికి తరలిస్తే... ఇంకెన్ని దారుణాలు జరుగుతాయోనని అన్నారు. అమరావతి రైతుల తరపున పోరాడతానన్న చంద్రబాబు.... అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమేనన్నారు
ఊరూరా తిరిగి ముద్దులు పెట్టి... అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజలను పిడిగుద్దులు గుద్దుతున్నారని చంద్రబాబు విమర్శించారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తనతోనే జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నాడని బాబు మండిపడ్డారు. ఒక్కసారి సీఎం కావాలన్న జగన్ కోరిక తీరిందని, రెండోసారి ముఖ్యమంత్రి కాడని అన్నారు.