ఆర్ఎస్ఎస్, ఎంఐఎంకు అనుమతి... కాంగ్రెస్ కు మాత్రం నిరాకరణ...

  పౌర బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్‌ తలపెట్టిన ర్యాలీపై రగడ జరుగుతోంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఏఏకి వ్యతిరేకంగా టీకాంగ్రెస్ తలపెట్టిన తిరంగా ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కవాతుకు, ఎంఐఎం సభలకు అనుమతిచ్చిన ప్రభుత్వం.... తమ శాంతియుత ర్యాలీకి ఎందుకు పర్మిషన్ ఇవ్వరంటూ కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. అనుమతి ఇచ్చినా... ఇవ్వకపోయినా... ర్యాలీ నిర్వహించి తీరుతామని తెగేసి చెబుతున్నారు. అయితే, పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ ర్యాలీపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్... ఇలా ఇటీవల మోడీ సర్కారు తెరపైకి తెచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఢిల్లీలో అయితే పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టింది. అలాగే భారీ బహిరంగ సభను సైతం ఆర్గనైజ్ చేసి సక్సెస్ అయ్యింది. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ ఆందోళనలతో కాంగ్రెస్ కు కొంత మైలేజ్ కూడా వచ్చింది. దాంతో, ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి ఆందోళనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. అయితే, తెలంగాణలో గాంధీభవన్ నుంచి ట్యాంక్ బండ్ వరకు టీకాంగ్రెస్ తలపెట్టిన ర్యాలీకి మాత్రం పోలీసులు అనుమతి నిరాకరించారు. సేవ్ డెమోక్రసీ-సేవ్ కానిస్టిట్యూషన్ పేరిట శాంతియుత ర్యాలీకి అనుమతి కోరినా డీజీపీ అండ్ హైదరాబాద్ సీపీ పర్మిషన్ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కవాతుకు, ఎంఐఎం సభలకు అనుమతిచ్చిన పోలీసులు.... తమ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకపోవడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే అనుమతి నిరాకరించారని ఫైరవుతున్నారు. ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై టీకాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఇండియన్ పోలీస్ సర్వీసును ... కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ గా మార్చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున ఆర్ఎస్ఎస్ కవాతుకు అనుమతిచ్చిన పోలీసులు... శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే తమకెందుకు పర్మిషన్ ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. ఎవరికీ ఇబ్బంది లేని చోట సభ నిర్వహించుకుంటామన్నా వినిపించుకోవడం లేదని మండిపడుతున్నారు. అయితే, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ర్యాలీ నిర్వహించి తీరుతామంటోన్న కాంగ్రెస్ నేతలు.... పెద్దఎత్తున హైదరాబాద్ తరలిరావాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరి, కాంగ్రెస్ ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీస్తుందో... లేక ప్రశాంతంగా సాగుతుందో చూడాలి.  

జగన్-బాబు ఇన్ సైడర్ ఫైట్... చివరికి గెలిచేదెవరు?

రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని పదేపదే ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం... సీబీఐ విచారణ దిశగా అడుగులేస్తోంది. రాజధానిగా అమరావతిని ప్రకటించకముందు జరిగిన భూ కొనుగోళ్లపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇవ్వడంతో సీబీఐ విచారణ కోరాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే, న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే సీబీఐ విచారణపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. రాజధానిగా అమరావతిని ప్రకటించడానికి కొద్దిరోజులు ముందు 4వేలకు పైగా ఎకరాలను టీడీపీ నేతలు కొనుగోలు చేసినట్లు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది. అమరావతి ప్రకటనకు ముందే తెలుగుదేశం లీడర్లు, బినామీలు పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారని తేల్చారు. ఎవరెవరు ఎన్ని ఎకరాలు కొనుగోలు చేశారో ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించిన ప్రభుత్వం ఆ వివరాలనే నివేదికలో పొందుపర్చింది. అయితే, ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై మండిపడ్డ టీడీపీ.... దమ్ముంటే నిరూపించాలని వైసీపీ ప్రభుత్వానికి సవాలు విసిరింది. చంద్రబాబు అండ్ టీడీపీ నేతలు పదేపదే సీబీఐ విచారణ కోరడం, ఇన్ సైడర్ ట్రేడింగ్ ను నిరూపించాలని సవాలు విసురుతుండటంతో ఇక వెనక్కి తగ్గకూడదని జగన్ సర్కారు భావిస్తోంది. అయితే, అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారంటూ పలువురి టీడీపీ నేతల పేర్లను మంత్రివర్గ ఉపసంఘం తమ నివేదికలో చేర్చింది. ముఖ్యంగా బాబు అండ్ లోకేష్ కి అత్యంత సన్నిహితుడైన వేమూరు రవికుమార్... పరిటాల సునీత... జీవీఎస్ ఆంజనేయులు... లింగమనేని రమేష్.... పయ్యావుల కేశవ్ పేర్లను ప్రస్తావించింది. అలాగే, లంకా దినకర్, దూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్‌రావు, పుట్టా మహేష్ యాదవ్, మాజీ మంత్రి నారాయణ, కొమ్మాలపాటి శ్రీధర్, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు, నారా లోకేష్, కోడెల శివప్రసాదరావు పేర్లను చేర్చింది. సీఆర్డీఏ సరిహద్దులను మార్చడం ద్వారా టీడీపీ నేతలకు, కంపెనీలకు లబ్ధి చేకూర్చారంటూ మరో లిస్టును రూపొందించారు. అలాగే, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదు సంస్థలకు కేటాయించిన 850 ఎకరాల్లోనూ భారీ అవకతవకలు జరిగినట్లు కేబినెట్ సబ్ కమిటీ తేల్చింది.

Right people for wrong reasons

Guntur has Tobacco board’s National Headquarters Data scientist Sekhar Dama suggests to Capital region farmers, to fight for exclusive Agri Products based SEZ, instead of voicing their protest against shifting the Capital from Velagapudi to Visakhapatnam As per the statistics of Ministry of Commerce and Industry, the 238  SEZs across the country have registered Rs.5,23,637 Crore value of exports, for the year 2016-17, Sekhar Dama said and added that even if the Velagapudi is transformed as a SEZ, it also will value addition to the States and Country’s economy Two million plus job are being generated by SEZs across the Country Farmers from Guntur, the present Capital region area, known for their industrious and intellectual farming skills are now fighting for the wrong reasons. Having high standards of entrepreneurship in agriculture sector, they have conveniently forgotten to demand rightful share, from the Chandrababu Naidu led TDP Government. In fact, the Amaravati Capital region farmers have given away 33,000 acres of land, for the purpose of constructing a world class Capital, and, however, have conveniently forgotten to seek a SEZ, related to agri products processing, or an Information Technology SEZ, within the Core Capital region, i.e. in and around Velagapudi Secretariat. Analyzing the same, senior data scientist Sekhar Dama, has suggested to look at the Madhya Pradesh and Kerala examples. “Madhya Pradesh has five operational SEZs, where in four SEZs are located in Indore. Though Bhopal is Capital, the State Government, in anticipation of decentralized development, opted Indore, and accordingly four SEZs are operational there now,” he elaborated and added that same kind of decentralization can be seen in Kerala. “Out of the 19 SEZs in operation in Kerala, 9 SEZs are located in Ernakulam district, which are away from the State Capital Thiruvanathapuram,” Sekhar Dama said and added that the same way Andhra Pradesh has total 27 notified SEZs, out of which 20 are operational SEZs, as per the information updated on 14th November, this year, according to sezindia.nic.in. Elaborating the same, Sekhar Dama said that Visakhapatnam has 7 operationalized SEZs, out of the 9 notified, similarly, East Godavari has three, Krishna, Prakasham and Srikakulam districts have one SEZ each, Nellore has 5, and Chittoor has 2 operationalized SEZs. “Kurnool and Guntur districts, have so far no single SEZ,” Sekhar Dama said and has suggested to the farming community to exert pressure over the Government, to allot a SEZ in Guntur district, that too, in the Core Capital region of Amaravati. Guntur district, the present Capital region of Andhra Pradesh, has 404 cold storages, and it may be noted that the 14 States, and 8 Union territories even didn’t cross this Guntur distrit’s figure in cold storages, Sekhar Dama said and urged the farmers of the Guntur district, to look at the strength of the district. “Why can’t you fight for a right cause like demanding for a food processing SEZ or an Information Technology SEZ,” he asked and advised them to showcase their strength in a right way. “ I urge the farmers of 29 villages to exert pressure over the State Government, to transform the lands given away to the Government, for Capital, into an unique SEZ meant for agri products processing, which in turn yield monetary benefits to the region, in both ways,” data scientist Sekhar Dama explained. “Leave the Capital demand for Amaravati. Instead, you can develop real estate as well claim employment opportunities in this region, even though Capital is shifted to Visakhapatnam,” Sekhar Dama suggested. “Give up blaming Naidu or Jagan. Stand up and fight for the right cause,” he has suggested to them and also urged the Government to consider his views in addressing the issue in an amicable way.

మునిసిపల్ ఎన్నికలకు సై అంటున్న యువత!!

సంగారెడ్డి జిల్లాలో మునిసిపల్ ఎన్నికల సందడి మొదలైంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి నేతలు గెలుపుపై ఎవరికివారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. టిడిపి, వామపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నాయి. జిల్లాలో ఈసారి ఎన్నికల్లో యువత పోటీకి ఎక్కువగా ఉత్సాహం చూపుతోంది. అన్ని పార్టీల నేతలు కొత్త ముఖాలను బరిలోకి దించాలని యోచిస్తున్నాయి.  జిల్లాలో గతంలో ఉన్న సంగారెడ్డి, సదాశివపేట, ఆందోల్, జోగిపేట పురపాలక సంఘాలతో పాటు కొత్తగా ఏర్పడిన నారాయణఖేడ్, అమీన్ పూర్, బొల్లారం, తెల్లాపూర్ మునిసిపాలిటీల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. పరిధిల విలీనం వార్డుల విభజన వంటి సమస్యలూ కోర్టు పరిధిలో ఉన్నందున జహీరాబాద్ మునిసిపల్ ఎన్నికలకు బ్రేక్ పడింది. మిగిలిన ఏడు పురపాలకల్లో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. కానీ అందరి దృష్టీ పటాన్ చెరువు నియోజక వర్గం పైనే పడింది ఇక్కడ మేజర్ పంచాయతీలు ఈసారి మునిసిపాలిటీలుగా మారాయి. దీంతో రాజకీయ పార్టీల నేతలతో పాటు చాలా మంది ఔత్సాహికులు సయ్యంటూ సవాలు విసురుతున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన పటాన్ చెరువు నియోజక వర్గం హైదరాబాద్ కు కూతవేటు దూరంలో వుంటుంది. ఈ ప్రాంతమంతా దాదాపుగా హైదరాబాద్ లో కలిసినట్టే ఉంటుంది. చాలా మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు పటాన్ చెరువు నియోజక వర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తుంటారు. భూములు కూడా కోట్లలో ధర పలుకుతాయి. ఈ ప్రాంతమంతా హైదరాబాద్ వాతావరణమే కనిపిస్తుంది. ఇక గతంలో ఉన్న గ్రామ పంచాయతీలు పురపాలక సంఘాలగా మారి హోదా పెరిగింది. దీంతో అమీన్ పూర్, తెల్లాపూర్, బొల్లారం ప్రాంతాల్లో భూముల విలువ అమాంతం పెరిగింది. అదే సమయంలో గ్రామ స్థాయి నేతలంతా పట్టణ స్థాయి నేతలుగా ప్రమోట్ అయ్యారు. హైదరాబాద్ కు దగ్గరగా ఉండటం పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఎన్నికల్లో పోటీకి చాలా మంది ఔత్సాహికులు ముందుకొస్తున్నారు.  ఇక ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య కనిపిస్తుంది. బిజెపి కూడా అన్ని చోట్లా పోటీకి సై అంటున్న ఈ రెండు పార్టీలను ఢీకొని క్యాడర్ మాత్రం కమలనాథులకు లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మునిసిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన మహిపాల్, మూడు మునిసిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తామన్న ధీమాతో ఉన్నారు. అధికార పార్టీ కావడం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కూడా టీఆర్ఎస్ కు కలిసి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ నేతలు కాట శ్రీనివాస్ గౌడ్, గాలి అనిల్ కుమార్ లు పార్టీ అభ్యర్ధుల ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధినే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికీ మునిసిపల్ ఎన్నికలు చలికాలంలో వేడి పుట్టిస్తున్నాయి.

పదో ఎక్కమే చెప్పకపోతే పదో తరగతి ఎలా పాసవుతారు?

సంగారెడ్డి జిల్లా కంది జెడ్పీ హైస్కూల్ లో మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్న భోజన ఏర్పాట్లు పరిశీలించి... పదో తరగతి స్టూడెంట్స్ తో ముచ్చటించారు. ఆర్ధికమంత్రి కాస్తా... మ్యాథ్స్, సోషల్, సైన్స్ టీచర్ గా మారి.... విభిన్న ప్రశ్నలతో విద్యార్ధుల సామర్ధ్యాన్ని పరీక్షించారు. టెన్త్ విద్యార్ధులను పలు ప్రశ్నలు అడిగారు. ఎక్కాలు చెప్పాలన్నారు... కాలాల గురించి అడిగారు... సంవత్సరంలో ఎన్ని రోజులో చెప్పాలన్నారు.... బోర్డుపై రాసి చూపించాలంటూ పలు రకాలుగా ప్రశించారు. అయితే, హరీష్ రావు ప్రశ్నలకు విద్యార్ధులు తెల్లముఖం వేశారు. హరీష్ ప్రశ్నలకు స్టూడెంట్స్ నీళ్లు నమిలారు. కనీసం పదో ఎక్కం కూడా చెప్పలేకపోవడంతో హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సంవత్సరానికి ఎన్ని రోజులో చెప్పలేకపోతే ఎలాగంటూ మండిపడ్డారు. పదో ఎక్కం కూడా చెప్పకపోతే పదో తరగతి ఎలా పాసవుతారంటూ మందలించారు. ఏం పాఠాలు చెబుతున్నారంటూ టీచర్లపై సీరియస్ అయ్యారు. విద్యార్ధులు వెనుకబాటుపై ఉపాధ్యాయులకు క్లాస్ తీసుకున్నారు. మరో రెండు మూడు నెలల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఉన్నందున ఇప్పుడైనా స్టూడెంట్స్ ను సంసిద్ధం చేయాలని సూచించారు.

మోనోరైల్ అన్నారు..మౌనంగా ఉన్నారు : ఏడాది నుండి పడిగాపులు కాస్తున్న వరంగల్ ప్రజలు

  మోనోరైల్ తో వరంగల్ కు కొత్త శోభ సంతరించుకోబోతుందని ఏడాది క్రితం తెలియజేశారు. ప్రపంచ శ్రేణి నగరాల సరసన వరంగల్ ను నిలిపేందుకు కృషి జరుగుతోందని ప్రచారం చేశారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాల సమాహారంగా స్విట్జర్లాండ్ కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఇంటమిన్ ట్రాన్స్ పోర్టేషన్ కంపెనీ మోనో రైలు ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు ముందుకు వచ్చినట్టు చెప్పారు. ఆ మేరకు వారిని వరంగల్ నగరంలో తిప్పి సర్వే కూడా చేయించారు. కాజీపేట నుంచి వరంగల్ వరకు పన్నెండు కిలో మీటర్ లకు దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు కు రూపకల్పన జరిగిందని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. గతేడాది ఫిబ్రవరి 22న స్విట్జర్లాండ్ ప్రతినిథులను ఓరుగల్లు గల్లీల్లో తిప్పుతూ మోనోరైల్ రాబోతోందని ఊరించారు. కానీ కొన్నాళ్లకు అది మరిచిపోయి ఆ ఊసే ఎత్తలేదు. తాజాగా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రో హెచ్ఎండీఏ అధికారులతో వరంగల్లో పర్యటించారు.మెట్రో రైలు నిర్మించాలన్న ప్రతిపాదన పై సమీక్ష నిర్వహించారు.సాధ్యాసాధ్యాలపై చర్చించారు మెట్రో రైలు ప్రతిపాదన మార్గాలు డీపీఆర్ తయారీ తదితర అంశాల పై స్థానిక ప్రజా ప్రతినిధులతో అధికారులు సమీక్ష జరిపారు. దీంతో వరంగల్ కు మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయని ఏడాదిలోగా పనులు ప్రారంభమవుతాయని చర్చ జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో గతేడాది మోనోరైల్ పై జరిగిన సర్వేను నగర వాసులు గుర్తు తెచ్చుకుంటున్నారు. గతేడాది ఫిబ్రవరిలో మోనో రైలు కోసం జరిగిన సర్వే ఏమయిందని ప్రశ్నిస్తున్నారు. మోనోరైలుకు,మెట్రో రైల్ కు ఉన్న తేడాల పై తీవ్రమైన చర్చ సాగుతోంది. మెజారిటీ ఓరుగల్లు వాసుల మాత్రం మోనోరైల్ పైనే మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ తర్వాత వేగంగా విస్తరిస్తున్న మహానగరం వరంగల్ అని అందరికి తెలిసిందే.దినదినాభివృద్ధి చెందుతూ మెట్రో పాలిటన్ నగరాల సరసన నిలిచేందుకు పోటీ పడుతోంది ఓరుగల్లు నగరం.హైదరాబాదుకు 150 కిలోమీటర్ల దూరమే ఉండటంతో పరిశ్రమలు పుట్టుకొస్తున్నాయి.రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇతర వ్యాపార సంస్థలు నగరం పై కన్నేశాయి.ఉద్యోగం ఉపాధి అవకాశాలు కూడా రోజు రోజుకూ పెరుగుతుండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉండే యువత ఓరుగల్లు పై ఆసక్తి పెంచుకుంటున్నారు.దీంతో నగరంలో జనం రద్దీ పెరుగుతోంది. ఇప్పటి వరకు వరంగల్ జనాభా 10 లక్షలు దాటింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట కలిసి ట్రై సిటీస్ గా అవతరించాయి. ఈ ట్రై సిటీస్ లో ప్రయాణించాలంటే గగనమే. వరంగల్ నుంచి కాజీపేటకు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 12 కిలో మీటర్లు ప్రయాణించాలంటే గంటకి పైనే పడుతోంది. నిత్యం ట్రాఫిక్ పెరుగుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు గతేడాది మోనో రైలు ప్రతిపాదన వచ్చింది. ఈ మేరకు సర్వే కూడా నిర్వహించారు.ఈ లోగా ఎలక్షన్లు రావడంతో అదంతా వదిలేశారు. వరంగల్ మహానగరంలో జనాభా కేవలం 10 లక్షలు మాత్రమే. రాజధాని నగరంలో చివరి నుంచి మరోవైపుకు వెళ్లాలంటే 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాని వరంగల్లులో 12 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. కాబట్టి మెట్రో రైల్ కోసం రిస్కు పడకుండా మోనోరైల్ అందుబాటులోకి తేవాలని నగర వాసులు కోరుతున్నారు.

జగన్ పై శేఖర్ గుప్తా తీవ్ర వ్యాఖ్యలు... కేంద్రం కల్పించుకోవాలని డిమాండ్...

ఏపీ రాజధాని వివాదంపై ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అమరావతి నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం నిలిపివేయడాన్ని... అలాగే మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తేవడాన్ని పిచ్చి తుగ్లక్ చర్యగా ప్రముఖ పాత్రికేయుడు, ద ప్రింట్ ఎడిటర్ ఇన్ చీఫ్ శేఖర్ గుప్తా అభివర్ణించారు. దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకుని మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనుకోవడం జాతీయ విషాదమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వ పిచ్చి చర్యలను అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. అమరావతి నిర్మాణాన్ని కొనసాగించేలా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోడీ సూచించాలని అభిప్రాయపడ్డారు. ఒకవేళ జగన్ స్థానంలో ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండి ఉంటే ఇలా చేసేవారు కాదని అన్నారు. చంద్రబాబు కలలుగన్న దానికంటే మరింత గొప్పగా అమరావతిని నిర్మించి ఉండేవారని శేఖర్ గుప్తా అభిప్రాయపడ్డారు.  మూడు రాజధానుల ఆలోచన ఆచరణీయం కాదన్న శేఖర్ గుప్తా....  అమరావతి నిర్మాణం దేశానికి ఎంతో అవసరమన్నారు. రాజకీయ పార్టీల మధ్య పోటీ శత్రుత్వంగా మారుతోందని, ఇది మంచిది కాదన్నారు. అలాగే, కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీలు.... గత ప్రభుత్వాలు చేపట్టిన పనులను, కార్యక్రమాలను నిలిపివేస్తున్నాయని... ఒక ప్రభుత్వం ఒక ఆలోచన చేసి... ఒక స్థాయికి తెచ్చిన తర్వాత... దాన్ని నాశనం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. అయితే, ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగుతుందని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. కేంద్రం వైఖరి కూడా ఇదేనని, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెబుతున్నారు. అయితే, కేంద్ర పెద్దలు, బీజేపీ అగ్రనేతల నుంచి అమరావతికి అనుకూలంగా ప్రకటనలైతే రాలేదు. కానీ, ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్నదే బీజేపీ ఉద్దేశమంటూ రాష్ట్ర నేతలు అంటున్నారు.

ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా సభ :- టీఆర్ఎస్ పార్టీ మజిలిస్ కు మద్దుతు ఇవ్వనుందా ?

  ఎన్పీఆర్ ను అమలు చేయబోమన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చేరనుందా అనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఐఐ తరవాత దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఆ తర్వాత ఎన్పీఆర్, ఎన్ఆర్సీలను తీసుకువచ్చేందుకు సీఐఐ అన్న వాదనలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, కేరళ సీఎంలు,ఎన్పీఆర్ తమ రాష్ట్రంలో అమలు చేయమని ప్రకటించారు. ఎన్పీఆర్ ను వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు చేపడుతోంది. ఇటు తెలంగాణ లోనూ ఎంఐఎం పార్టీ ఎన్పీఆర్ ను వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు చేపడుతోంది. సీఎం కేసీఆర్ ను కలిసిన ఓవైసీ సీఐఐ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీ లను అమలు చేయొద్దని కోరారు. ఇవాళ నిజామాబాద్ లో వీటికి వ్యతిరేకంగా ఎంఐఎం బహిరంగ సభను నిర్వహించింది. పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్లమెంటులో ఓటు వేసింది అన్నారు కేసీఆర్. సీఐఐ విషయంలో ఇంతకన్నా చెప్పాల్సిన విషయం లేదన్నారు కేటీఆర్. ఎన్పీఆర్ పై రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటుంది అని కేటీఆర్ వల్లడించారు. ఎన్పీఆర్ సమయం వచ్చినప్పుడు పార్టీలో ప్రభుత్వంలో చర్చించి నిర్ణయం చెబుతామన్నారు పార్లమెంటరీ పార్టీ నేత కేకే.ఎన్పీఆర్ పై పూర్తి వివరాలు అందిన తర్వాతే టీఆర్ ఎస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కాని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని టీఆర్ ఎస్ విమర్శల ఆరోపణలు చేస్తొంది.

మూడు రాజధానులు వద్దు..అమరావతే ముద్దు.. రైతుల నినాదాలతో హోరెత్తుతున్న అమరావతి

అమరావతిలో రైతుల ఆందోళనలు వరుసగా 11వ రోజు కొనసాగుతున్నాయి. 3 రాజధానుల పై ప్రభుత్వ ప్రకటన విరమించుకునే వరకు వెనక్కి తగ్గేదిలేదంటున్న అన్నదాతలు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి కేంద్ర హోంమంత్రిని కలిసి విజ్ఞాపనలు ఇవ్వాలని నిర్ణయించారు. ఢిల్లీలో మేధావి వర్గాన్ని , పత్రిక సంపాదకులని కలిసి దేశం దృష్టికి సమస్యను తీసుకువెళ్లేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. క్యాబినేట్ భేటీలో జీఎన్ రావు కమిటీ నివేదిక సిఫారసులపై నిర్ణయం వాయిదా పడినా సర్కారు వాటిని అమలు చేసే ఉద్దేశంతోనే ఉన్నందున పోరాటానికి విరామం ప్రకటించరాదని రైతులు నిర్ణయించారు. శుక్రవారం ( డిసెంబర్ 27న ) రాజధాని గ్రామాల్లో అక్కడికక్కడ విభిన్న రీతుల్లో ఆందోళనలు కొనసాగాయి. కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకోవటం.. రైతులు ప్రతిఘటించటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సచివాలయానికి సీఎం వెళ్లే సమయంలో పోలీసులు గ్రామస్థులను అదుపులోకి తీసుకోవడాన్ని రైతులు తప్పుబట్టారు. రహదారి పైకి రాకుండా నిర్భంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసులు కట్టడి చేసినా ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు. రైతులతో పాటు రాజకీయ పక్షాలూ, న్యాయవాదులు కూడా ఆందోళనల్లో పాల్గొన్నారు. అమరావతిలో రాజధాని కొనసాగించాలని మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఆపడంలో విజయం సాధించినట్టుగా రైతులు భావిస్తున్నారు. ఆందోళనలు కొనసాగించేలా రైతులు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. మందడంలో మహాధర్నా, వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు యథాతథంగా కొనసాగుతాయని రైతులు పేర్కొన్నారు. తుళ్లూరులో మహాధర్నాతో పాటు వంటా వార్పు కార్యక్రమం తలపెట్టారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షలు కొనసాగుతాయని రాజధాని రైతుల పరిరక్షణ సమితి సభ్యులు తెలిపారు. సోమవారం నుంచి గుంటూరు నగరంలో రిలే దీక్షలు ప్రారంభించాలని నిర్ణయించారు. రాజధాని కోసం రైతులు చేస్తున్న నిరసనల్లో మీడియా ప్రతినిధులపై జరిగిన దాడి దురదృష్టకరమని అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తెలిపింది. మీడియా ప్రతినిధులు రైతుల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడటం సరి కాదని పేర్కొన్నారు. రాజధాని అమరావతిపై స్పష్టమైన ప్రకటన చేయకుండా ప్రజల్లో మరింత అయోమయం గందరగోళం సృష్టించేలా మంత్రిమండలి నిర్ణయం ఉందనీ అమరావతి రాజధాని పరిరక్షణ కమిటీ ఆక్షేపించింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 30 న గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రిలే నిరహార దీక్షలు చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. రాజధానిపై ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ కడప జిల్లా రాజంపేటలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. 3 రాజధానులు వొద్దు అమరావతే ముద్దు అంటూ నినదించారు. ఒక రాష్ట్రం 3 రాజధానులు ప్రజలకు వరమా భారమా అన్న అంశంపై తిరుపతి ప్రెస్ క్లబ్ లో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాజధాని అమరావతిలో కొనసాగాలని..అలా కాకుండా మార్చాలని ప్రభుత్వం నిర్ణయిస్తే రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని వివిధ పార్టీల నేతలు మేధావులు అభిప్రాయపడ్డారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అఖిల పక్ష కమిటీ తీర్మానం చేసింది.  

గడ్డం ఒకటే మిగిలింది...ఉత్తముడిగా మారిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల తరువాతే పీసీసీ నుంచి తప్పుకోవాలని అనుకున్నారు. కానీ ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో అలానే కొనసాగించారు. కానీ దేశమంతా పార్టీ పరిస్థితి ఇదే విధంగా ఉండటంతో మళ్ళీ సైలెంటయ్యారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగా హర్ట్ అయ్యారు. ఉప ఎన్నికల్లో ఓటమిని అవమానంగా ఫీలవుతున్నారు. తాను నమ్ముకున్న చోటే భారీ తేడాతో ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. ఫలితాల వెంటనే ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. పీసీసీ చీఫ్ గా ఉంటూ ఉప ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో ఓటమి ఆయనని మరింత కుంగదీసింది. ఇప్పుడు కొత్త పిసిసి చీఫ్ ను ఎంపిక చెయ్యమంటూ అధిష్ఠానానికి సూచించారు. ఇటీవల రాహుల్ గాంధీకి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలిసింది. త్వరలోనే అందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాబోతోందని సమాచారం. వీటన్నింటి నుంచి బయటకు రావాలని బెంగుళూరు ప్రకృతి వైద్యానికి వెళ్లారు ఉత్తమ్. అతిగా హడావుడి చేయడం కంటే ఉన్న ఎంపీ పరిధిలో పనులు ప్రశాంతంగా చేసుకుంటూ హాయిగా గడిపేయాలనుకుంటున్నారు ఉత్తమ్. బెంగుళూరు ప్రకృతి వైద్యం తరువాత నిత్యం 30 కి పైగా సిగరెట్లు తాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మొత్తానికే మానేశారు. మద్యం అలవాటు కూడా ఉత్తమ ఉండేది, కార్గిల్ యుద్ధం సమయంలో వెన్నుకు గాయమవడం ఆ నొప్పి ఇంకా వేధిస్తోంది. దాని నుంచి రిలీఫ్ అవ్వడానికి కొంత ఆల్కహాల్ తీసుకునే వారు. కానీ ఇప్పుడు ఆల్కహాల్ ని కూడా మానేశారు. ఇక మాంసాహారం కూడా ఇష్టంగా తినే ఉత్తమ్, ఇప్పుడు కాయగూరలకు పరిమితమయ్యారు. ఉడికించిన కూరగాయలు తక్కువ కారంతో వండిన కూరలను అలవాటు చేసుకున్నారు. ఎన్నికలకు ముందు ఉన్న ఉత్తమ్ ఇప్పుడు మొత్తానికీ మారిపోవాలని డిసైడ్ అయ్యారు. అందుకే మనసే కాదు ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. పీసీసీ నుంచి తప్పుకొని ఢిల్లీ నియోజకవర్గానికే పరిమితమవ్వాలని నిర్ణయించుకున్నారు ఉత్తమ్. మొత్తానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మారిపోయారు. రాజకీయాల్లో కేవలం తన పార్లమెంటు సీటు వరకే పరిమితం కావాలనుకుంటున్నారు.  

దొంగలు దొరుకుతారా?.. రాజధాని అవకతవకలపై నివేదిక సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత సీఆర్డీఏ అవినీతిపై నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది. 2019 అసెంబ్లీ సమావేశాల్లో బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఆ వివరాలను చివరి రోజున ప్రకటించారు. నివేదికలో ఆరోపణలు ఎదుర్కొన్న నేతలు కూడా అందుకు స్పందించారు. కొంత మంది తాము ఎప్పుడు కొన్నామో చెప్పగా.. మరికొంతమంది ఆ భూములు మీరే తీసుకోవాలంటూ బుగ్గనకు సవాల్ చేశారు. సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని సిబిఐ విచారణకు ఇచ్చే ఆలోచన చేస్తున్నామని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సిబిఐ విచారణ జరిపిస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై చంద్రబాబు స్పందించారు. హై కోర్టు జడ్జితో అయినా సిబిఐతోనైనా విచారణ చేయించాలన్నారు. సీబీఐ విచారణను 3 నెలల్లో పూర్తయ్యేలా కేంద్రాన్ని కోరాలన్నారు. అదే సమయంలో విశాఖలో మీ అవకతవకలపై కూడా సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ చేశారు. విశాఖలో వైసీపీ నేతలు ఇన్ సైడ్ ట్రేడింగ్ చేశారని బయటపెడుతుంటే అమరావితిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందంటున్నారని విమర్శలు గుప్పించారు. సీబీఐ విచారణపై జగన్ కు అంత గౌరవం ఉంటే శుక్రవారం కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. గత ఏడు నెలలుగా తవ్వుతున్నామంటున్నారు కానీ ఏం బయటపెట్టారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారని అన్నారు చంద్రబాబు. అందుకు అనేక విచారణ కమిటీలు వేశారని కూడా గుర్తుచేశారు. పోలవరం పీపీఏలపై నిపుణుల కమిటీలు నియమించారు కానీ చివరికి తామే పోలవరంలో అవినీతి జరగలేదని కేంద్రానికి చెప్పాల్సి వచ్చిందన్నారు. రాజధాని భూములపై పలు రకాల విచారణలు వేశారు. మొదట రిజిస్ర్టేషన్ శాఖ ద్వారా వివరాలు మొత్తం బయటకు తెప్పించారన్నారు. ప్రతి రైతు ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లి విచారణ జరిపడమే కాకుండా మధ్యలో క్యాబినెట్ సబ్ కమిటీని కూడా నియమించారు. నిజంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు ఎవరైనా పాల్పడి ఉన్న బినామీ పేర్లతో భారీగా భూములు కొనుగోలు చేసి ఉన్న సులువుగా దొరికిపోతరని వెల్లడించారు. అలా తమ నేతలు ఎవరైనా దొరికివుంటే ప్రభుత్వం ఇప్పటి వరకు వేచిచూసేది కాదన్నారు. ఇప్పుడు రాజధానిని తరలించాలనుకునే నిర్ణయం తీసుకోవటానికి సిద్ధమై వాయిదా వేసుకున్న తరువాత ఈ క్యాబినెట్ సబ్ కమిటీ నివేదికను తెరపైకి తీసుకువచ్చారని తెలిపారు చంద్రబాబు.  రాజధానిని ఎందుకు మార్పు చేస్తున్నామో ప్రజలకు పూర్తిగా వివరించి వారిలో సానుకూలత వచ్చాకే ముందడుగు వేద్దామని ఈలోగా ఇన్ సైడర్ ట్రేడింగ్ ఇతర అవకతవకలపై ముందుకెళ్లాలని సీఎం జగన్ సూచించారు. రాజధాని భూములపై సీఐడీ విచారణ ఇప్పటికే జరిగింది. లోకాయుక్తకు ఇలాంటి కేసులను విచారించడానికి అధికారం ఉండదని అంటున్నారు విశ్లేషకులు. ఇక సిబిఐ ప్రభుత్వ సిఫార్సు చేయడమే మిగిలిందన్న చర్చ జరుగుతోంది.

ఎన్నికల్లో విజయానికి కారు గుర్తు చాలు : కాంగ్రెస్ కి కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

  మునిసిపల్ ఎన్నికల కసరత్తులో టిఆర్ఎస్ దూకుడు పెంచింది. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్య వర్గం భేటీ అయ్యింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు అనుబంధ సంఘాల అధ్యక్షులు హాజరయ్యారు. ఎన్నికల ఇన్ చార్జిలను కూడా నియమించింది టీఆర్ఎస్ పార్టీ. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశా నిర్దేశం చేశారు కేటీఆర్. రిజర్వేషన్లు కలిసొచ్చిన చోట తెలంగాణ ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ నిర్ణయించారు. ఎమ్మెల్యేలతో స్థానిక నాయకత్వానికీ ఇబ్బందులుంటే సమన్వయం చెయ్యాలని మునిసిపల్ ఇన్ చార్జిలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. మున్సిపల్ చైర్మన్లు , కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు కేటీఆర్. మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధులు కరువయ్యారా అంటూ చురకలంటించారు. రిజర్వేషన్ ఏదైనా ఎన్నికల పార్టీ గుర్తు మీద జరుగుతాయని ఎద్దేవా చేశారు కేటీఆర్. మరోవైపు అధికార పార్టీ ఎంత హడావుడి చేస్తున్న ప్రతిపక్షాలు మాత్రం మల్లగుల్లాలు పడుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక ఎన్నికల కసరత్తులో అంత ఉత్సాహాన్ని చూపడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. నామినేషన్ కు ఒక్క రోజు ముందు రిజర్వేషన్ లు ప్రకటిస్తే ఎలా అని పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రశ్నిస్తున్నారు. ఓటర్ల జాబితా పూర్తి కాకుండా ఎవరైనా షెడ్యూల్ ఇస్తారా అని ప్రశ్నించారు. ఇక బిజెపి కూడా ఎన్నికల కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్టు కనిపించటంలేదు. జనవరి 22 న జరకాబోయే మునిసిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. జనవరి 5 న పోలింగ్ స్టేషన్ ల జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 7 మునిసిపాలిటీల్లోని ఆయా పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. పోలింగ్ స్టేషన్ ల జాబితాపై 8 వరకు సలహాలు అభ్యంతరాలను స్వీకరిస్తారు. 9 న సాయంత్రం జాబితాను కలెక్టర్లకు అందజేయాలి. 10 న పోలింగ్ స్టేషన్ ల జాబితాను కలెక్టర్లు ఖరారు చేస్తారు. 13 న తుది జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు.  

కాంగ్రెస్ కొత్త తరహా ఆలోచన : ప్రామిసరీ నోటుపై సంతకం పెడితేనే సీటు

  అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తర్వాత లోకల్ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత అధికార పార్టీ లోకి జంప్ కావడం ఫ్యాషన్ గా మారింది. ఒకానొక సమయంలో ఈ జంపింగ్ జపాంగ్ ల ఎఫెక్ట్ తో మున్సిపల్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ కోల్పోయింది. దీంతో ఇప్పుడు గోడ దూకే నేతలకు చెక్ పెట్టేందుకు ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కొత్త ఫార్ములాను వర్కౌట్ చేయాలని చూస్తుంది. గెలిచిన అభ్యర్థులు పార్టీ జారిపోకుండా కాంగ్రెస్ ఇప్పుడు జాగ్రత్తపడుతోంది. ఇందులో భాగంగా పార్టీ టికెట్ ఇచ్చే ముందే అభ్యర్థుల దగ్గర నుంచి ఓ హామీ తీసుకోవాలనే ఆలోచనతో ఉంది. గెలిచిన అభ్యర్థులు పార్టీ మారబోమని ప్రామిసరీ నోట్ , బ్లాంక్ చెక్కులు అనుమతి పత్రాలపై సంతకం చేశాకనే టికెట్ అంటూ కొత్త రూల్ పాస్ చేసింది. కనీసం ఇలానైనా గెలిచిన నేతలను కాపాడుకోవాలని కాంగ్రెస్ తిప్పలు పడుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించేవారు అఫిడవిట్ ఇవ్వాల్సిందేనని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అధిష్టానం కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ బలంగా ఉన్న నిర్మల్ , మంచిర్యాల జిల్లాలో కొత్త మున్సిపాల్టీల్లో ఈ ఫిట్టింగ్ ను అమలు చేస్తోంది. మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ టికెట్ కోసం వెయ్యి మందికి పైగా నేతలు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇందులో సగం మందికి పైగా నేతలు అఫిడవిట్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు ఖరారు కావడమే ఆలస్యం అఫిడవిట్ లో బాండ్ పేపర్లు నింపి పార్టీ మారబోమని సంతకాలు చేసి టికెట్ తీసుకునేందుకు నేతలు రెడీ అవుతున్నారు. మొత్తానికి జంపింగ్ అభ్యర్థులకు అడ్డుకట్ట వేయాలంటే ఈ ప్రక్రియ అవసరమనేది కాంగ్రెస్ నేతల వాదన. ఈ బాండ్ల గోల ఏ మేరకు కాంగ్రెస్ కు కలిసొస్తుందో ప్రామిసరీ నోట్లు గెలిచాక జంపింగ్ లను ఎంత మేర పార్టీ మారకుండా ఆపగలుగుతుందో వేచి చూడాలి.

 మునిసిపల్ ఎన్నికలే టార్గెట్ :-ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఊపందుకున్న రాజకీయం

రాజకీయ చైతన్య కేంద్రమైన ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరోసారి పొలిటికల్ హీట్ పెరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న తొమ్మిది మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు తేదీ ఖరారు కావడంతో ప్రజాప్రతినిధులు అందుకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించడంలో తలమునకలయ్యారు. మున్సిపాలిటీలల్లో తెగ తిరుగుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నారు. మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అభివృద్ధి పనుల్లో , శంకుస్థాపనలు చేసే పనుల్లో ఎమ్మెల్యేలు తెగ బిజీ అయిపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 9 మునిసిపాలిటీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా మంత్రులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నర్సంపేట , భూపాలపల్లి , పరకాల మునిసిపాలిటీల్లో అభివృద్ధి పనుల పై సమీక్షించారు. మరో మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లాలో వరుస పర్యటనలకు సంసిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలపై పూర్తిగా దృష్టి సారించారు. ఒక వైపు జిల్లాలోని కీలక నేతలతో కలిసి వ్యూహ రచన చేస్తూనే మరోవైపు ఆయా మున్సిపాలిటీలలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను ఆరా తీస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఉదయం వేళల్లో మునిసిపాలిటీల్లోనే ఆయా కాలనీల్లో పర్యటించి పారిశుధ్య పనులు స్వయంగా పరిశీలిస్తున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలైతే ఏకంగా డ్రైనేజ్ మోరీలు శుభ్రం చేసి ఓటర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. మరో పక్క జిల్లాలోని అధికార పార్టీ కీలక నేతలు గెలుపు అంచనాలపై లెక్కలు వేసుకుంటూ పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో వారు నిమగ్నమయ్యారు. సామాజిక వర్గాల వారీగా ఓటర్ల లెక్కలు తీస్తూ వారిని ఆకట్టుకునేందుకు సమాలోచనలు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్ చార్జిలను నియమించి క్యాడర్ లో జోష్ పెంచుతున్నారు. మున్సిపాల్టీల్లో టిఆర్ఎస్ తరుపున పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న ఆశవహులు ఇప్పట్నుంచే వార్డుల్లో సందడి చేస్తున్నారు. తమకు పార్టీ టికెట్ ఖరారు కాక ముందే వారు అంతర్గతంగా ప్రచారం మొదలు పెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పుర పోరుకు టీఆర్ఎస్ తరవాత బీజేపీలో జోరు ఎక్కువగా కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు లోక్ సభ స్థానాలను బిజెపి గెలుచుకుంది. ఈ నేపథ్యంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలపై కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో కసరత్తు ప్రారంభించారు. పరకాల , వర్థన్నపేట నియోజకవర్గాల్లో గతంలో బిజెపి నేతలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.కనుక ఈ రెండు మునిసిపాలిటీల్లో తమ పార్టీ మార్పు చూపాలని బిజెపి నేతలు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. అలాగే మహబూబాబాద్, జనగాం మునిసిపాలిటీలపైన ప్రత్యేక దృష్టి సారించినట్లు వినికిడి. ఇదిలా వుంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం ఇంకా తడబడుతూనే ఉందని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇప్పటి వరకు మునిసిపాలిటీలపై హస్తం పార్టీ ఎలాంటి ప్రణాళిక రూపొందించుకోలేదని సమాచారం. కేవలం పార్టీ స్థానిక నేతలు కొంత హడావుడి కనిపిస్తోంది. ఇక ఉమ్మడి జిల్లాలో వామపక్షాలు సైతం పూర్వ పోరు బరిలో దిగేందుకు సై అంటున్నాయి. ప్రధానంగా మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, డోర్నకల్, నర్సంపేట మున్సిపాల్టీల్లో సిపిఐ, సిపిఎం పోటీ చేయనున్నట్టు తెలిసింది. అలాగే తొర్రూరు, మరిపెడ, నర్సంపేట తదితర మున్సిపాలిటీలపై దృష్టి సారించాయి. ఈసారి మున్సిపోల్స్ లో వామపక్షాల పొత్తు పెట్టుకుని పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తుంది.

ఆ మూడు జిల్లాలు మావే.. మునిసిపల్ ఎన్నికలపై ధీమాతో ఉన్న బీజేపీ

  పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ స్థానాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున మెజార్టీ సీట్లు గెలవాలనే పట్టుదలతో ముందుకు పోతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పర్సనల్ ఎజెండాపై వీరు గెలిచారు అనే వాదన ఉంది. దీంతో ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి తమ సత్తా చాటాలని ఈ నేతలు భావిస్తున్నారు. మునిసిపల్ ఎన్నికలు కరీంనగర్ ఎంపీ సంజయ్ కు మరింత కీలకంగా మారాయి. మోదీ హవా..సంజయ్ ఇమేజ్ తో.. కరీంనగర్ ఎంపీగా విజయం సాధించారు. అయితే ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో బిజెపి ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఇప్పుడు జరిగే మునిసిపల్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని సంజయ్ భావిస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో వేములవాడ మినహా ఎక్కడా బీజేపీ పెద్దగా సీట్లు సాధించలేదు. కౌన్సిలర్ నుంచి ఎంపీగా విజయం సాధించిన సంజయ్ పై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేస్తామని ధీమా బీజేపీలో కనిపిస్తోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కి మొన్నటి ఎన్నికల్లో కాలం కలిసొచ్చింది. పసుపు బోర్డు విషయం తేలక పోవడంతో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీనితో ఈ సారి ఆయన లోకల్ సెంటిమెంట్ ప్లే చేసే పనిలో పడ్డారు. కార్పొరేషన్ గెలిస్తే నిజామాబాద్ పేరు మారుస్తామని ప్రచారం చేస్తున్నారు. అయితే లోకల్ సెంటిమెంట్ అరవింద్ కు కలిసి వస్తుందా లేదా అనేది ప్రశ్నగా మారింది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తుడుం దెబ్బ అధ్యక్షుడు, ఎన్నికల ముందు కాంగ్రెస్ నుండి బిజెపికి మారిన ఆయన ఆదివాసీ సెంటిమెంట్ తో ఎంపీ అయ్యారు. ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్ లో బలమైన ఓటు బ్యాంకు సోయం సొంతం. లోకల్ ఎలక్షన్స్ లో పట్టుమని పది సీట్లు కూడా బీజేపీ గెలవలేకపోయింది. అయితే ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని సోయం బాపురావు ప్రయత్నిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో కీలకమైన మూడు నియోజక వర్గాల నుంచి ఎంపీలుగా తెచ్చిన ఈ ముగ్గురు నేతలు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సానుకూల ప్రకటనలకు తీసుకోలేక పోయారు. విమర్శలను ఎదుర్కొని.. ఈ ముగ్గురు ఎంపీలు మునిసిపాలిటీల్లో ఎలా నెగ్గుకొస్తారో వేచి చూడాలి.  

కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యేపై తిరగబడ్డ కార్యకర్తలు!!

కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, తమను పట్టించుకోవడం లేదంటూ స్థానిక వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆగ్రహంతో ఎమ్మెల్యే ఫ్లెక్సీలకు కార్యకర్తలు నిప్పు పెట్టి తగులబెట్టారు. కల్లూరు మండలం, తాండ్రపాడు గ్రామంలో నాడు- నేడు కార్యక్రమానికి ఆయన వెళ్లారు. ఇందిరా గాంధీ కాలనీకి చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యేని తమ కాలనీకి రావాలని ఆహ్వానించగా.. ఆయన అక్కడికి వెళ్లకుండా పక్కకాలనీ లోకి వెళ్లారు. దీంతో కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే ఎమ్మెల్యే ప్లెక్సీలను దగ్ధం చేశారు. కొత్తగా పార్టీ లోకి వచ్చిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నారని.. కొన్నేళ్లుగా పార్టీలో ఉంటున్న తమను పట్టించుకోవడం లేదని పాత క్యాడర్ విమర్శిస్తోంది. ఈ ఘటన జిల్లా వైసీపీలో పెను దుమారమే రేపింది. జిల్లాలోని ముఖ్య నేతలు జోక్యం చేసుకొని తాండ్రపాడులో ఫ్లెక్సీలను దగ్ధం చేసిన కార్యకర్తలతో.. కొత్తగా పార్టీలోకి వచ్చిన కార్యకర్తలతో మాట్లాడి అందరి మధ్య రాజీ కుదిర్చి వివాదానికి తెరదించినట్లు సమాచారం.  ప్రస్తుత ఎమ్మెల్యే సుధాకర్ కి మాజీ ఎమ్మెల్యేలు మురళీ కృష్ణ , మణిగాంధీ మధ్య వైరం ఉంది. ముగ్గురు నేతలు ఎవరి దారిలో వారు వెళ్తున్నారు. దీంతో కోడుమూరు వైసీపీ క్యాడర్ లో చీలికలు ఏర్పడ్డాయి. చివరకు పార్టీ కార్యక్రమాల్లో కూడా ముగ్గురు కలిసి పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. కోడుమూరు నియోజక వర్గం వైసీపీ ఇన్ చార్జి కోట్ల హర్షవర్దన్ రెడ్డి కూడా ఎన్నికల ఫలితాల నాటి నుంచి సుధాకర్ కు దూరంగా ఉన్నారు. అయితే పార్టీ పెద్దల ఆదేశాల ప్రకారం ఇద్దరూ రాజీకొచ్చి జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. అప్పటి నుంచి వీరి క్యాడర్ కూడా ఏకమయ్యారు. అయితే ఎమ్మెల్యే సుధాకర్ తో కలిసి పని చేసేందుకు మాజీ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపడం లేదని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు వర్గపోరును వీడకపోవడంపై చర్చ జరుగుతోంది. వీరి వ్యవహారాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు జిల్లా ముఖ్య నేతలు సిద్ధమవుతున్నారు.

అమరావతిలో యుద్ధ వాతావరణం... పెద్దఎత్తున బలగాల మోహరింపు

  అమరావతిలో వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రాజధాని గ్రామాల ఆందోళనలతో అమరావతి అట్టుడుకుతోంది. మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో అమరావతి అంతటా పోలీసులు మోహరించారు. మూడు రాజధానులపై కేబినెట్ లో చర్చించి అధికారికంగా ప్రకటన చేయనున్న నేపథ్యంలో అమరావతి 29 గ్రామాల్లో అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. అధికారిక ప్రకటన తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ పెద్దఎత్తున బలగాలను మోహరించారు. దాంతో, అమరావతి మొత్తం పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా సచివాలయానికి చుట్టుపక్కల గ్రామాల్లో పోలీసులు కవాతు కూడా నిర్వహించారు. తుపాకులు, లాఠీలు, టియర్ గ్యాస్, వాటర్ క్యాన్, అగ్నిమాపక వాహనాలతో సచివాలయం చుట్టూ భద్రత కల్పించారు. దాంతో, రాజధాని ప్రాంతంలో అప్రకటిత యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.  అయితే, రాజధాని గ్రామాల్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించడంపై రైతులు మండిపడుతున్నారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న తమను రెచ్చగొట్టేవిధంగా పోలీసుల చర్యలు ఉన్నాయని ఫైరవుతున్నారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా, లాఠీఛార్జీలు చేసినా అమరావతిని రాజధానిగా కొనసాగించేవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు. అయితే, పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినాసరే యువత మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ బైకులు, ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, అమరావతిలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించారని టీడీపీ సీనియర్ లీడర్ యనమల ఆరోపించారు. రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చేసి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. తనకు ఓట్లేసిన వాళ్లనే తొక్కుకుంటూ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారని, తన పని తీరును విమర్శించినా ప్రశ్నించినా తట్టుకోలేకపోతున్నారని అన్నారు. భూములిచ్చిన రైతులను దొంగలుగా చూస్తారా? రైతుల ఇళ్లకు నోటీసులు అంటిస్తారా? ఇంటింటికీ నోటీసులంటించే తప్పులు వాళ్లేం చేశారో చెప్పాలన్నారు. అయినా, రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన రాజధానిని ఏవిధంగా మారుస్తారని యనమల ప్రశ్నించారు. జగన్ తన స్వార్ధం కోసమే సచివాలయాన్ని విశాఖకు తరలిస్తున్నారని, ఆర్నెళ్ల ముందు నుంచే విశాఖలో వైసీపీ రౌడీలు భూదందాలు మొదలుపెట్టారని, ఇటీవల విశాఖలో జరిగిన భూ కొనుగోళ్లను బయటపెడితే గుట్టు మొత్తం బయట పడుతుందన్నారు.

ఏపీ రాజధాని ఏదో చెప్పని బొత్స... మీడియా ప్రశ్నలకు తత్తరపాటు... 

  అమరావతి రైతులకిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. అమరావతి రైతులకు వచ్చిన నష్టమేమీ లేదని, ఇక్కడ్నుంచి ఒక్క సచివాలయం మాత్రమే తరలుతోందని అన్నారు. అయితే, అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రతి అంశంలోనూ బాధ్యతగా పనిచేస్తున్నామని... గత టీడీపీ ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వం ఎక్కడా ఇన్ సైడర్ ట్రేడింగ్ చేయబోదని తేల్చిచెప్పారు. గ్రాఫిక్సూ, సినిమాలు అసలేం చూపించబోమన్నారు. అన్ని వాస్తవాలే చెబుతామన్న బొత్స...  అమరావతిలో 50శాతం దాటిన నిర్మాణాలను పూర్తి చేస్తామని స్పష్టత ఇచ్చారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని... అందరికీ న్యాయం చేస్తామన్నారు. అయితే, రైతులిచ్చిన 33వేల ఎకరాలను ఏం చేయబోతున్నామో త్వరలో చెబుతామన్నారు.  ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ...చంద్రబాబు అమరావతిలో ఇల్లు కట్టుకోలేదని... రాష్ట్రాభివృద్ధిపై ఆయకున్న చిత్తశుద్ధి ఏంటో దీన్నిబట్టే అర్ధమవుతుందన్నారు. చంద్రబాబులాగా రైతులను మోసం చేయబోమయని అన్నారు. మూడు ప్రాంతాల్లో రాజధానుల ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుందో మంత్రివర్గ సమావేశం తర్వాత చెబుతామన్నారు. అమరావతిలో గత టీడీపీ ప్రభుత్వం దాదాపు 6వేల కోట్లు ఖర్చు చేసిందని... ఇందులో సుమారు 350కోట్లు కన్సల్టెంట్లకే కట్టబెట్టిందని బొత్స అన్నారు. రాజధానిని పూర్తిగా నిర్మించి ఇస్తామని విభజన చట్టంలో ఎక్కడా చెప్పలేదని... అందుకే ఐదేళ్లలో కేంద్రం 1500కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్ర ఆదాయం, కేంద్రంతో సంబంధాల ఆధారంగా ముందుకెళ్తోందన్నారు. నిధులన్నీ ఒక్క రాజధానికే ఖర్చు చేస్తే విద్య వైద్యం ఇతర సంక్షేమ కార్యక్రమాలకు డబ్బు ఎక్కడ్నుంచి తేవాలన్నారు. అయితే, అమరావతి, కర్నూలు, విశాఖల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సమాధానం దాటవేశారు.  

రాజధానిని మార్చే అధికారం ఎవరిచ్చారు?.. ఎప్పటికైనా అమరావతే రాజధాని!

ఏపీ రాజధాని వివాదం గురించి ప్రతిపక్ష నేత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. రాజధానిని మార్చే అధికారం ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. దేశ చరిత్రలో రాజధాని మార్పు ఎక్కడా జరగలేదని తెలిపారు. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు, కుప్పం నుంచి తడ వరకు అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండేలా రాజధానిని ఏర్పాటు చేశామని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యంగా రాజధానిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు చేశాం.. విశాఖను ఐటీ, ఫార్మా హబ్‌గా అభివృద్ధి చేయాలనుకున్నామని వివరించారు. విశాఖపై మీకు ప్రేమ ఉంటే డేటా సెంటర్‌ను ఎందుకు రద్దు చేశారని జగన్ సర్కార్ ని ప్రశ్నించారు. ఆదానీ గ్రూప్‌ వచ్చి ఉంటే నాలుగైదు ఏళ్లలో విశాఖ హైదరాబాద్‌కు సమానంగా అభివృద్ధి చెందేది అన్నారు. ఓ కంపెనీని తేవడం చాలా కష్టం, వెళ్లగొట్టడం ఈజీ అని విమర్శించారు. అంతర్జాతీయ కంపెనీ లులుని కూడా వెళ్లగొట్టారని, ఆ కంపెనీకి కేటాయించిన భూములు కొట్టేద్దామనుకున్నారా? అని చంద్రబాబు మండిపడ్డారు. బోగాపురంలో 2వేల ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూసేకరణ చేస్తే దానికి కూడా అడ్డుపుల్లలు వేశారని విమర్శించారు. అమరావతికి బోలెడు ఖర్చవుతుందని, అంత డబ్బులతో రాజధాని కట్టలేమని ప్రభుత్వం చెప్పడం సాకు మాత్రమేనని చంద్రబాబు ఆరోపించారు. అన్ని అవసరాలు పోగా 10 వేల ఎకరాల భూమి ప్రభుత్వం వద్ద ఉంటుందని తెలిపారు. ఈ భూమిని అమ్మగా వచ్చిన డబ్బుతో మహానగరం నిర్మించవచ్చని చెప్పారు. ఎప్పటికైనా అమరావతే ప్రజా రాజధాని అని చంద్రబాబు అన్నారు. 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన.. ఆదాయ వనరుల్ని సమకూర్చే రాజధాని అమరావతి అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.