ఆర్టీసీ ఇకపై ప్రజా రవాణా శాఖ.. జనవరి 1 నుండి ప్రభుత్వంలోకి పూర్తిగా విలీనం
posted on Dec 31, 2019 @ 1:07PM
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ప్రజా రవాణా శాఖగా మారిపోయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 1 వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. బుధవారం నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. అధికారుల హోదాలను కూడా ప్రభుత్వం మార్చేసింది. ఆర్టీసీ ఎండీ హోదాను పీటీడీ కమిషనర్ లేదా డైరెక్టర్ గా.. ఈడీలను అడిషనల్ కమిషనర్లుగా.. ఆర్ఎంలు జాయింట్ కమిషనర్లుగా.. డీవీఎంలు డిప్యూటీ కమిషనర్లుగా.. డిపో మేనేజర్లను అసిస్టెంట్ కమిషనర్లుగా.. వ్యవహరించాలని జీవోలో తెలిపింది. ఆర్టీసీ సిబ్బందికి సీఎంఎఫ్ఎస్ నుంచి జీతాల చెల్లింపు జరుగుతుందని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ జరిగే వరకు ఆర్టీసీ సిబ్బందికి ప్రస్తుతమిస్తున్న అలవెన్సులు కొనసాగుతాయని తెలిపింది. పీఆర్సీ వచ్చాక వీటిని కొనసాగిస్తారా లేదా అనే విషయమై స్పష్టత లేకపోవటంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.
జనవరి 2020 నుంచి ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసి తీరుతామని చెప్పిన అధికారులు అందుకు అనుగుణంగానే ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో మొత్తం 51,488 మంది ఆర్టీసీ సిబ్బంది టీటీడీలో విలీనం కాబోతున్నారు. కార్పొరేషన్ గా కొనసాగుతున్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే విలీన కమిటీ ఇచ్చిన నివేదికలో ఆర్టీసీలో కేంద్రం వాటా 31 శాతం ఉన్నందున పార్లమెంటు ఆమోదం లేకుండా సాధ్యం కాదని స్పష్టం చేసింది. దీంతో సిబ్బంది వరకే విలీనం చేసేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. దీనిపై రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ 2 నెలలకు పైగా కసరత్తులు చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతి నిధుల అభిప్రాయాలు తీసుకుని విలీన ప్రక్రియను కొలిక్కి తీసుకు వచ్చింది.
కాగా పెన్షన్ లేనపుడు విలీనం జరిగిన ప్రయోజనం ఉండదని ఆర్టీసీ సిబ్బంది పెదవి విరుస్తున్నారు. పెన్షన్ ఇస్తేనే తమకు అసలైన విలీన పండుగ అని చెబుతున్నారు. ప్రభుత్వంలో విలీనం పేరుతో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం మోసగించే ప్రయత్నం చేస్తోందని టీడీపీ విమర్శించింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు సౌకర్యాలకు సంబంధించి స్పష్టత ఇవ్వకుండా కేవలం విలీనం జపం చేస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ నేతలంటున్నారు.
అటు ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ ను ప్రభుత్వం నియమించింది. సెప్టెంబర్ లో సురేంద్రబాబును బదిలీ చేసిన ప్రభుత్వం రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుకు ఆర్టీసీ ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించింది. అయితే కొత్త సంవత్సరం నుంచి కార్పొరేషన్ సిబ్బంది మొత్తం ప్రజా రవాణా శాఖలోకి మారుతున్న తరుణంలో 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రతాప్ ను పూర్తిస్థాయిలో ప్రభుత్వం నియమించింది.