మోడీ తో ‘డీ’ అంటున్న ప్రశాంత్ కిశోర్
ఒక్క తెలుగు రాష్ట్రలోనే కాదు, దేశ వ్యాప్తంగా రాజకీయాలు అనూహ్యంగా వేడెక్కు తున్నాయి. యూపీలో వచ్చే సంవత్సరం మార్చిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఇప్పటికే అగ్గి రాసుకుంది. అధికార బీజేపీ ఓటమి భయంతో కిందామీదా అవుతోంది. బెంగాల్లో ఎన్నికల క్రతువు ముగిసినా, రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మమతా బెనర్జీ, వేడి చల్లారక ముందే, రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్షంగా ఎదిగిన బీజేపీని మొగ్గలోనే తుంచేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఘర్ వాపసీకి గేట్లు తెరిచారు. ఎన్నికలకు ముందు బీజేపీలోకి వెళ్ళిన నాయకులు తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. రాజస్థాన్’లో అధికార కాంగ్రెస్ పార్టీలో సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గాల మధ్య రగిలిన చిచ్చు, అప్పటికి సర్దుకున్నా ఇప్పుడు మళ్ళీ మొదటి కొచ్చింది. పైలట్ ఢిల్లీ చేరుకున్నారు. అయన వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు రాజీనామ చేశారు. యూపీలో జితిన్ ప్రసాద కాంగ్రెస్’ను వదిలి కమల గూటికి చేరిన నేపధ్యంగా తెరపై కొచ్చిన రాజస్థాన్’ డ్రామా ఏ మలుపు తిరుగుతుందో తెలియదు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మెడ మీద కత్తి వేలాడుతోంది, ఎప్పుడైనా ఆయన మాజీ అయ్యే ముహూర్తం పొంచి వుందని అంటున్నారు. ఆయన వ్యతిరేక వర్గం, ఆయన్ని గద్దె దించేందుకు చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆయన వర్గం కుర్చీ కాపాడుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇలా ఎక్కడిక్కడ ప్రతి రాష్టంలో ఎదో ఒక రాజకీయ అలజడి చోటు చేసుకుంటోంది. మరోవంక జాతీయ స్థాయిలో 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహలకు ప్రధాన పార్టీలు పదును పెడుతున్నాయి.
ఆ అన్నిటికంటే, మహా రాష్ట్ర పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వ్యుహకర్త’ ప్రశాంత్ కిషోర్ శుక్రవారం ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ను కలవడం, ఆయనతో సుమారు మూడు గంటలకు పైగా చర్చలు జరపడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత్ కిషోర్ ఎందుకు పవార్’ను కలిశారు, ఆ ఇద్దరు అన్ని గంటలు ఏమి చర్చించారు, అనేది మహా రాజకీయాల్లోనే కాకుండా, దేశ రాజకీయాలలోనూ ఆసక్తి రేకిస్తోంది.ఇటీవల శాసనసభ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ, తమిళనాడులో డిఎంకే’ను గెలిపించిన ప్రశాంత్ కిషోర్, ‘ఎన్నికల వ్యుహకర్త’ అవతారాన్ని ఇక చాలిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదని, అన్నారు. గతంలో కొద్ది కాలంపాటు, జనతా దళ్ (యు) ఉపాధ్యక్షుడిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్’తో కలిసి ప్రయాణించిన ప్రశాంత్ కిషోర్, ‘ తనను తాను ‘ఫెయిల్డ్ పోలిటిషియన్’ పేర్కొన్నారు. అయినా, ఆయన శరద్ పవార్’ను కలవడం ఇటు మహా రాష్ట్ర రాజకీయాల్లో అటు జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. బెంగాల్, తమిళనాడులో తమ ‘ క్లైంట్స్’ గెలుపుకు సహకరించిన నాయకులకు కృతజ్ఞలు చెప్పేందుకే తాను వివిధ పార్టీల నాయకులను కలుస్తున్నానని,అందులో భాగంగానే శరద్ పవార్’ను కలిశానని, ప్రశాంత్ కిషోర్ పైకి చెప్పినా, 2024 ఎన్నికల వ్యూహరచనలో భాగంగానే ఈ ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
అదలా ఉంటే, మహారాష్ట్ర రాజకీయాలలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా, జాతీయ రాజకీయాలతో ముడిపడినవి కావడంతో ఏమి జరుగుతోందనం ఆసక్తి వేడిని మరింత పెంచుతోంది. సుమారు పక్షం రోజుల క్రితం బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్’ ఎన్సీపీ అదినేత శరద్ పవార్’ను అయన నివాసంలో కలిశారు. ఇక అక్కడి నుంచి రాజకీయ ఊహాగానాలు మొదలయ్యాయి.అయితే, ఆ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత లేదని, అటు పవార్, ఇటు ఫడ్నవిస్’ పేర్కొన్నారు. అయినా, ఏదో ఉందనే ఊహాగానాలు మాత్రం ఆగలేదు. ఇక ఆ తర్వాత మహా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రధాని నరేంద్ర మోడీని అధికారికంగా కలిశారు. ఆయన వెంట ఉపముఖ్యమంత్రి ఎన్సీపీ నాయుడు, అజిత్ పవార్, కాబినెట్ మంత్రి కాంగ్రెస్ నాయకుడు అశోక్ చవన్ కూడా ఉన్నారు. అయితే అధికారిక చర్చలు ముగిసిన తర్వాత ఉద్ధవ్ థాకరే ఒక్కరే ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా, సమావేశమయ్యారు. ఈ పది నిముషాల్లో ఏమి జరిగింది, అనే విషయంలో ఉత్ఖంట చోటు చేసుకుంది. అది చాలదు అన్నట్లుగా ఉద్ధవ్ థాకరే, “నేను కలిసింది, పాక్ ప్రదాని ఇమ్రాన్ ఖాన్’ను కాదు భారత ప్రధాని మోడీని” అంటూ చేసిన వ్యాఖ్య, రాజకీయ ఉత్ఖంటను మరింతగా పెంచింది.
మరోవంక, బీజేపీ, మోడీని విమర్శించడంలో ముందుండే, శివసేన ఎంపీ, సంజయ్ రౌత్, ప్రధాని మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. మీడియా సమావేశంలో, మోడీ పాపులారిటీ తగ్గిపోయిందని, అనుకుంటున్నారా,అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ . మోడీ బీజేపీకి మాత్రమే కాదు దేశానికే మహా నాయకుడు, అని పేర్కొన్నారు. దీంతో మహారాష్ట్రలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయా? మళ్ళీ మరో మారు పాత మిత్రులు దగ్గరవుతున్నారా? అనే అనుమానాలు వినవస్తున్నాయి.మరో వంక, ప్రశాంత్ కిశోర్’ 2024 నాటికి జాతీయ స్థాయిలో బీజేపీ, మోడీకి ప్రత్యాన్మాయంగా మమత బెనర్జీని నిలిపేందుకు, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందు సంబంధించి మమతా బెనర్జీని ప్రస్నించినప్పుడు అవునని కాదనీ అనకుండా, 2024 ఎన్నికలలో అందరం కలిసి మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని అనుకుంటున్నాను” అని సమాధాన మిచ్చారు. మరో వంక ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన మమతా బెనర్జీ, మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని ప్రకటించారు. సో ... ఎన్నికలకు మూడేళ్లున్నా, ఇప్పటి నుంచే ప్రశాంత్ కిషోర్, మోడీని ఓడించడమే లక్ష్యంగా రంగంలోకి దిగారు..అయితే, ఆయన స్వయంగా ఈ బాధ్యతను నెత్తికి ఎత్తుకున్నారా? లేక జాతీయ, అంతర్జాతీయ క్లైంట్స్ కోసం ఆయన పనిచేస్తున్నారా, అనేది తేలాలంటే ఇంకొంత కాలం ఆగవలసి ఉంటుంది.