జగన్‌రెడ్డికి రఘురామరాజు లేఖాస్త్రం.. ముచ్చటగా మూడో బాణం..
posted on Jun 12, 2021 @ 10:13AM
రఘురామ మరింత దూకుడు పెంచారు. తనపై జరిగిన దాడిపై దేశవ్యాప్తంగా మద్దతు కూడగడుతున్నారు. పార్లమెంట్‌లో జగన్‌రెడ్డిని దోషిగా నిలబెట్టేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఓవైపు ఇలా తన వ్యక్తిగత రివేంజ్ తీర్చుకుంటూనే.. మరోవైపు ప్రజా సమస్యలపైనా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. లేఖాస్త్రాలతో సీఎంను కుళ్లబొడుస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయంటూ లేఖలతో నిలదీస్తున్నారు. రఘురామ రాస్తున్న లేఖలన్నీ ప్రజల గురించే కావడం.. అవన్నీ జగన్‌రెడ్డి మడమ తిప్పిన హామీలే కావడంతో.. వైసీపీ ప్రభుత్వం ఇరకాటంలో పడుతోంది. ఇప్పటికే రెండు అంశాలపై లేఖలు రాయగా.. తాజాగా ముచ్చటగా మూడో లేఖ ముఖ్యమంత్రికి సంధించారు రఘురామకృష్ణరాజు.
పెళ్లి కానుక, షాదీ ముబారక్ పథకాలపై నిలదీస్తూ జగన్‌రెడ్డికి లేఖ రాశారు రఘురామ. అధికారంలోకి వస్తే పెళ్లికానుక సాయం పెంచుతామని ఎన్నికలకు ముందు చెప్పిన విషయం గుర్తు చేశారు. పెళ్లికానుక సాయాన్ని రూ.లక్షకు పెంచుతామని ప్రకటించారని.. దానికి ప్రజల నుంచి మద్దతు లభించిందని.. అందుకే వెంటనే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు ఎంపీ రఘురామ.
ఇంతకుముందు ఇలాంటివే మరో రెండు లేఖలు రాశారు. ఇచ్చిన హామీ మేరకు.. వృద్ధాప్య పింఛనును రూ.2,750కు పెంచాలని.. ఏపీలో సీపీఎస్ విధానం రద్దు హామీని వెంటనే నిలబెట్టుకోవాలని.. ముఖ్యమంత్రిని లేఖలతో డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ఎంపీ రఘురామ సీఎం జగన్‌రెడ్డికి రాస్తున్న లేఖలు ఏపీలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. రఘురామ లేవనెత్తుతున్న సమస్యలపై ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. రఘురామ లేఖలతో జగన్‌రెడ్డి జనాల ముందు.. మాట తప్పిన, మడమ తిప్పిన నేతగా.. దోషిగా.. నిలబడాల్సి వస్తోంది. లేఖలతో జగన్‌రెడ్డి ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తిచూపడంలో రఘురామ విజయం సాధించినట్టే కనిపిస్తోంది.