జగన్ ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది? అమిత్ షా క్లాస్ పీకారా?
posted on Jun 11, 2021 @ 9:24PM
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది? వైసీపీ నేతలు చెబుతున్నట్లు రాష్ట్రం గురించే మాట్లాడారా? జగన్ కేసుల గురించి అసలు చర్చే రాలేదా? అమిత్ షాతో జగన్ గంటన్నర సేపు సమావేశమైంది నిజమేనా? ఇవే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో.. సీఎం జగన్ దాదాపు 90 నిమిషాల సేపు సమావేశమయ్యారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే జగన్ , అమిత్ షా సమావేశానికి సంబంధించి సంచలన విషయాలు తెలుస్తున్నాయి. ఢిల్లీ వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం అమిత్ షా, జగన్ సమావేశం.. వైసీపీ నేతలు చెబుతున్నట్లుగా కాకుండా మరోలా సాగిందని తెలుస్తోంది. కొన్ని అంశాల్లో జగన్ కు అమిత్ షా క్లాస్ పీకారని అంటున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసానికి రాత్రి తొమ్మిది గంటలకు వెళ్లారు సీఎం జగన్. ఆయనతో పాటు ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. వైసీపీ నేతలు చెబుతున్నట్లు 90 నిమిషాల పాటు జగన్ టీమ్.. అమిత్ షా నివాసంలోనే ఉంది. అయితే అందులో జగన్ తో అమిత్ షా మాట్లాడింది కేవలం 25 నిమిషాలు మాత్రమే అని తెలుస్తోంది. 9 గంటలకు జగన్ వెళితే.. 9 గంటల 40 నిమిషాల వరకు అమిత్ షా వాళ్లకు కలవలేదట. అప్పటి వరకు జగన్ ఒక గదిలో... ఎంపీలు మరో గదిలో వెయిట్ చేశారట. తర్వాత సిగ్నల్ రావడంతో అమిత్ షాను జగన్ కలిశారట. మొదట ఇద్దరే మాట్లాడుకున్నారని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ సమస్యలకు సంబంధించి వినతి పత్రం ఇచ్చాక.. పూర్తిగా రాజకీయాల గురించే ఇద్దరి మధ్య చర్చ జరిగిందని సమాచారం.
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు విషయంపైనే అమిత్ షా, జగన్ మధ్య ఎక్కువ సేపు చర్చ జరిగిందని తెలుస్తోంది. ఎంపీ రఘురామ అరెస్టు, థర్డ్ డిగ్రీ పై జగన్ ను అమిత్ షా ప్రశ్నించారని తెలుస్తోంది. రఘురామ విషయంలో వివరణ ఇచ్చిన జగన్.. ఈ కేసులో తనకు మద్దతు ఇవ్వాలని కోరారట. కేంద్ర ప్రభుత్వానికి తాము మద్దతుగా ఉన్నందున రఘురామ విషయంలో సహకరించాలని విన్నవించారట జగన్. అయితే అమిత్ షా మాత్రం ఈ విషయంలో సీరియస్ గానే స్పందించారని పక్కా సమాచారం. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తేల్చి చెప్పారట. ఎంపీ విషయంలో అలా వ్యవహరించడమేంటని క్లాస్ తీసుకున్నారట. అంతేకాదు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారట. అమిత్ షా రియాక్షన్ తో జగన్ షాకయ్యారని తెలుస్తోంది. ఎంపీ రఘురామ కేసు విషయంలో జాతీయ స్థాయిలో దోషిగా నిలబడే పరిస్థితి రావడంతో.. కేంద్రంతో కాళ్లబేరానికి వెళ్లిన జగన్ కు అమిత్ షా నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో... వైసీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయని అంటున్నారు.
రాత్రి 10 గంటల తర్వాత ఇద్దరు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారట. ఈ సందర్భంగా విభజన హామీలు, పెండింగ్ సమస్యలపై చర్చ జరిగిందని తెలుస్తోంది. 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత అంటే 10 గంటల 15 నిమిషాలకే అమిత్ షా.. జగన్ టీమ్ దగ్గర నుంచి లోపలికి వెళ్లిపోయారని తెలుస్తోంది. అమిత్ షా వెళ్లిపోయిన తర్వాత కూడా లోపలే కాసేపు కూర్చుని 10 గంటల 30 నిమిషాలకు జగన్ .. ఆ ఇంటి నుంచి బయటికి వచ్చారని సమాచారం. అమిత్ షా నివాసంలో జరిగింది ఇదైతే.. వైసీపీ నేతలు మాత్రం గంటన్నర సేపు జగన్ తో అమిత్ షా మాట్లాడారని, తమ పర్యటన సక్సెస్ అని చెప్పుకుంటున్నారు. జగన్ పర్యటన మొత్తం ఆయన వ్యక్తిగత అంశాలపైనే సాగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర సమస్యలపైనే కేంద్ర మంత్రులతో చర్చిస్తే.. వాళ్ల నుంచి ఎలాంటి హామీలు వచ్చాయో ఎందుకు చెప్పడం లేదనే ప్రశ్న విపక్షాల నుంచి వస్తోంది.