టైమప్ జగన్ జీ...టైమప్!
posted on Jun 12, 2021 @ 5:16PM
జగన్ ప్రత్యర్ధులు ఎదురు చూస్తున్న సమయం వచ్చేసిందా? నవరత్నాల జగన్ బాబు నవరత్న ఆయుల్ రాసుకునే టైమ్ అయిందా? పైకి జనం కోసమంటూ ఏతులు.. సంక్షేమం అంటూ కోతలు.. ఇవన్నీ అధికారం నిలబెట్టుకోవడానికేనన్నది అసలు గీతలు. ఓటు బ్యాంక్ రాజకీయాన్ని సింగిల్ ఎజెండా గా అమలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బ్రేక్ పడుతుందా? ఆయన అప్పుడప్పుడు ఏదో ఒక పేరుతో డబ్బులు వేసేది.. ఆయన కోసమేనని.. జనం కోసం కాదని.. పైగా ఆ డబ్బు కూడా తమదేనని.. ఈ ప్రజలు అర్ధం చేసుకుంటారా?
అవును.. సంవత్సరమంతా ఏదో ఒక పేరుతో ఒక ఫ్యామిలీకి 10 వేలు మూడు నెలలకొకసారి అకౌంట్లో పడుతుంటే ఆ సంతృప్తి వేరేగా ఉంటుంది.. అప్పుడు వాళ్లు చూపించే అభిమానం కూడా వేరే రేంజ్లో ఉంటుందని.. సరిగ్గా ఇదే ఫార్ములాతో నవరత్నాలు అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి కాలం ఎదురొస్తుందా? అవుననే అనిపిస్తోంది. ఇప్పటివరకు డబ్బులున్నా లేకపోయినా.. డబ్బులు ఏ అకౌంట్లో ఉంటే .. వాటిని లాగేసి ఈ పథకాలకు ఇచ్చేయడమే అధికారులకు ఇచ్చే సింగిల్ టార్గెట్. ఇప్పటివరకు రకరకాల పేర్లతో ఉన్న పథకాలు, వాటి నిధులు అన్నీ.. ఈ నవరత్నాల్లోకి తోసేశారు. ఇష్టమొచ్చినట్లు డ్రా చేసేశారు.. ఆఖరికి కార్పొరేషన్లకు ఇచ్చిన నిధులు, ఎస్సీ ఎస్టీ నిధులు కూడా దారి తప్పించేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా..అవి దేని కోసం వచ్చినా సరే..వీరనుకున్న దానికి వాడేసుకోవడమే తక్షణ కర్తవ్యం అన్నట్లే వ్యవహారం నడుస్తోంది.
ఇప్పుడు లేటెస్టుగా.. అవన్నీ అయిపోయి.. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేపనిలో పడింది జగన్ ప్రభుత్వం. విశాఖలోని కొన్ని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడానికి లిస్టు తయారు చేసి..కేవలం 1600 కోట్ల కోసం వాటిని బ్యాంకులకు తనఖా పెట్టడానికి సిద్ధమైపోయింది ప్రభుత్వం. అంటే ఎలా తెస్తారో తెలియదు.. డబ్బు కావాలి.. పథకాలకు ఇచ్చేయాలి ఇదే జగన్ అజెండా. ఇదంతా ప్రజల సంక్షేమం కోసం అనుకుంటే పొరపాటే. జనానికి డబ్బులేయాలి.. వీరు జైలుకెళ్లినా సరే..మళ్లీ వైసీపీయే అధికారంలోకి రావాలంటే.. అలా డబ్బులు వేస్తూ ఉండాలి..జనం దండాలు పెడుతూ ఓట్లు వేస్తూ ఉండాలి..అదే జగన్ స్ట్రాటజీ.
ఇప్పుడు నిధుల మళ్లింపు నుంచి తాకట్టు దాకా వచ్చారంటే.. బాస్ నవరత్నాల కథ క్లయిమాక్స్కు చేరిందా అనే కామెంట్లు వినపడుతున్నాయి. కోవిడ్ కు ముందే దేశాన్ని ఆర్ధిక సంక్షోభం పట్టి పీడిస్తుంది. అందుకే పైన మోదీగారు స్టీల్ ప్లాంట్ వంటివాటిని కూడా అమ్మేస్తున్నారు. అమ్మితే డబ్బులు.. కొనేది మనోడైతే వేరే బెనిఫిట్..అలా ఆయన కంటిన్యూ అయిపోతున్నారు. కోవిడ్ దెబ్బకు సంక్షోభం ముదిరింది. కేంద్రం నిధులు ఇచ్చే పరిస్ధితిలో లేదు. రాష్ట్రంలో రావాల్సిన పన్నుల ఆదాయం రావాల్సినంత వచ్చే పరిస్ధితీ లేదు. మరేం చేయాలి? అందుకే తాకట్టు పెట్టేద్దాం.. అప్పులు తీసుకుందాం..పంచిపారేద్దాం.. ఇదే అజెండాతో జగన్ బాబు ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సంక్షోభం ఇప్పట్లో ముగిసేది కాదు. కాబట్టి ముందు ముందు జగన్ సంక్షేమ పథకాలు అమలు చేయటం కష్టం. అవి ఆగాయంటే వీరి అరాచక పాలన అంతా భ్రమల నుంచి బయటపడే జనం త్రీడీ ఎఫెక్టులో చూడగలుగుతారు.. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేకతను తట్టుకోవడం కష్టం. ఆ టైమ్ ఇప్పుడొచ్చిందనే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.