ఉచితం టీకాపై రాజకీయ వివాదం ...
కొంచెం ఆలస్యంగానే కావచ్చును, కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాలు, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని, 18 ఏళ్ల వయసు పైబడిన ప్రతి ఒక్కరికీ, కొవిడ్ టీకా ఉచితంగా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. సరే, అది కూడా నిజమే కావచ్చును, కాంగ్రెస్ నాయకులు చెపుతున్నట్లుగా కోర్టు అక్షింతలకు భయపడే, ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నదీ నిజమే కావచ్చును. ఏది ఏమైనా కేంద్రం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. రాజకీయాలను పక్కన పెడితే, దేశ ప్రజలు అందరూ కోరుకుంటున్నది, అదే, కేంద్రం ఇచ్చిందీ అదే. ఉచిత వాక్సిన్’తో పాటుగా ప్రధానమంత్రి, దేశంలో 80 కోట్ల మంది పేద ప్రజలకు వచ్చే నవంబర్ వరకు ఉచిత రేషన్ కొనసాగిస్తామని, ప్రకటించారు. ఇది స్వాగతించవలసిన నిర్ణయం అయినా కాకపోయినా, అవసరమైన నిర్ణయం.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, కేరళ ముఖ్యమంత్రి, సిపిఎం నాయకుడు పినరయి విజయన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, తమిళనాడు సీఎం స్టాలిన్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ సహా పలు రాష్ట్రల ముఖ్యమంత్రులు స్వాగతించారు. మరో వంక కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రల ముఖ్యమంత్రులు పార్టీ లైన్ ఫాల్లో అయ్యారు. ఇందులో, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్’కూడా ఉన్నారు. నిజానికి కేసీఆర్ నెగిటివ్, పాజిటివ్ కాకుండా న్యూట్రల్’గా ఉండిపోయారు. అయితే, మంత్రి కేటీఅర్’ అనవసర వివాదానికి తెర తీశారు. కొన్ని నిజనాలు, కొన్ని అసత్యాలు,మరి కొన్ని అర్థ సత్యాలను కలిపి, అందరికీ ఉచిత వాక్సిన్ ఇవ్వాలన్న కేంద్ర నిర్ణయంలో బొక్కలు వెతికి విమర్శలకు దిగారు. కోడి గుడ్డుమీద ఈకలు పీకి బీజేపీ నాయకుల నోటికి పని చెప్పారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ సీనియర్ నాయురాలు విజయశాంతి కేటీఆర్’కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కేటీఅర్ వాస్తవాలు తెలుసుకోవాలని చురకలు అంటించిన విజయశాంతి కరోనా పేరిట కార్పొరేట్ ఆసుపత్రులు చేసిన కోట్ల ..కోట్ల రూపాయల దోపిడీలో తెరాస నాయకులకు, ముఖ్యమంగా కేసీఆర్ ఫ్యామిలీకి వాటా ఉందని ఎదురుదాడి చేశారు. అలాగే,రాష్ట్రానికి వచ్చిన 80 లక్షల వ్యాక్సిన్లను సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, వ్యాక్సిన్లను వృథా చేయడంలో ముందుందని ఆరోపించారు, బండి సంజయ్. ఫ్రీ వ్యాక్సిన్ కారణంగా రూ.2,500 కోట్లలో తమకు వచ్చే కమీషన్లు పోయాయనే బాధతోనే కేటీఆర్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ప్రతివిమర్శ చేశారు. ఒక రకంగా, అధికార పార్టీ ఇరకాటంలో పడింది.
ఇదలా ఉంటే, అందరికి ఉచిత వాక్సినేషన్ నిర్ణయం నేపధ్యంలో కేంద్రం ప్రకటించిన తాజా మార్గదర్శకాలు తెలంగాణకు ఇబ్బందికరంగా మారనున్నాయా? రాష్ట్రంలో కేసుల లెక్కను పరిగణనలోకి తీసుకుంటే టీకా సరఫరాలో కోత పడనుందా? వ్యాక్సిన్ వృథా కూడా తక్కువ డోసులు రావడానికి కారణం అవనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలిస్తామని ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో జాతీయ వ్యాక్సినేషన్ విధానంపై మంగళవారం కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రాల్లోని జనాభా, కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్‌లో పురోగతి వంటి అంశాల ఆధారంగా టీకాల కేటాయింపులు ఉంటాయని పేర్కొంది. టీకా వృథాను కూడా లెక్కలోకి తీసుకుంటామంది. ఈ నిబంధనలతో రాష్ట్రానికి చిక్కులు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా కేసుల సంఖ్యలో తెలంగాణ ప్రస్తుతం 16వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 5.93 లక్షల కేసులున్నట్లు కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో నమోదవుతున్న కేసులకు, వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేస్తున్న లెక్కలకు పొంతన ఉండడం లేదన్న ఆరోపణలున్నాయి.
ప్రజలు భయాందోళనకు గురికావొద్దనే ఉద్దేశంతో కేసులు తక్కువగా చూపించారనే వాదనలూ ఉన్నాయి. కానీ, ఆ లెక్కలే ఇప్పుడు రాష్ట్ర సర్కారుకు ఇబ్బందికరంగా మారాయి. కేంద్రం సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్య ఆధారంగా కేంద్రం రెమ్‌డెసివిర్, ఆక్సిజన్ కేటాయింపులు చేసింది. తక్కువ కేసులు ఉండడంతో రాష్ట్రానికి ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ కోటా తగ్గింది. ఇప్పుడు టీకాల విషయంలోనూ అదే జరిగే ప్రమాదముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. టీకా వృథా కూడా తెలంగాణలో ఎక్కువగా జరుగుతున్నట్లు కేంద్రం ఒకటి రెండుసార్లు ప్రకటించింది. ఈ నేపధ్యంలో, రాష్ట్రానికి అవసరం అయిన మేరకు వాక్సిన్ అందుతుందా లేదా ఆనం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇవ్వన్నీ ఎలా ఉన్నప్పటికీ, వైఎస్ షర్మిల అన్నట్లుగా ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు బురద చల్లుకునే ప్రయత్నాలు మానుకొని కరోనా మూడో దశ రాకముందే అందరికీ త్వరితగతిన వ్యాక్సిన్’ ఇచ్చే ప్రయత్నం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.