తెలంగాణలో రాజకీయ శూన్యత ?
తెలంగాణలో రాజకీయ శూన్యత వుందా? ఏడేళ్ళ తెరాస పాలనాలో తెలంగాణ ఉద్యమ స్పూర్తి మరుగునపడి, ప్రజలు సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేసే మరో రాజకీయ వేదిక కోసం ఎదురు చూస్తున్నారా, అంటే, అవుననే సమాధానమే వస్తుంది. ఒక్క సామాజిక కోణంలోనే కాదు, ఇతరత్రా కూడా తెరాస ఏడేళ్ళ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత వుంది. అది రోజు రోజుకు పెరుగుతోంది. ఆ విధంగా చూసినప్పుడు, రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందనిపిస్తుంది. అయితే,ఈ రాజకీయ శూన్యతను ఎవరు భర్తీ చేయాలి? మరో ప్రాతీయ పార్టీనా లేక జాతీయ పార్టీనా?
మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ఉద్వాసన నేపధ్యంగా, రాష్ట్రంలో వివిధ కోణాల్లో జరుగుతున్న రాజకీయ చర్చల్లో, ఈ కోణంలోనూ లోతైన చర్చ జరుగుతోంది. అందులో భాగంగా ప్రత్యాన్మాయ ప్రాంతీయ పార్టీ ఏర్పాటు అంశం చాలా ప్రముఖంగా వినిపిస్తోంది.తెలంగాణ ఉద్యమ స్పూర్తితో, సామాజిక తెలంగాణ లక్ష్యంగా, బడుగు బలహీన వర్గాల వేదికగా మరో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన, ఒక్క బడుగు బలహీన వర్గాల నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచి వినవస్తోంది. ముఖ్యంగా కొండా విశ్వేశ్వర రెడ్డి, ప్రొఫెసర్ కోదండ రామ్ వంటి అగ్రవర్ణ కులాలకు చెందిన నాయకుల నుంచి చాలా బలంగా వినవస్తోంది. బర్తరఫ్’కు గురైన ఈటల రాజేందర్, ఆ దిశగా అడుగులు వేస్తారని అనేక మంది ఆశించారు. అయితే, ఈటల చాంతాడంత రాగంతీసి, చివరకు బీజేపీ గూటికి చేరారు. ఈ నేపధ్యంలోనే, ప్రొఫెసర్ కోదండ రామ్’ “ఈటల మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారు” అని వ్యాఖ్యానించారు.అంటే సొంత పార్టీ పెట్టి, కేసీఆర్’ను నేరుగా ‘ఢీ’ కొనే సువర్ణ అవకాశాన్ని ఈటల చేజార్చుకున్నారనేది, వారి అభిప్రాయం కావచ్చును.
అయితే, ఒక్క సారి చరిత్రను చూస్తే, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్’లో అలాగే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు ఏవీ బతికి బట్టకటలేదు. ఇందులో, కోదండరామ్ ఏర్పాటు చేసిన, తెలంగాణ జన సమితి (టీజేఎస్) కూడా వుంది. తెలంగాణ మలి దశ ఉద్యమం చాలా వరకు ఆయన చేతుల మీదుగానే నడిచింది. అయినా, ఆయన పార్టీని ప్రజలు ఆదరించలేదు. పార్టీనే కాదు, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పోటీచేసినా ప్రజలు ఆయన్ని గెలిపించలేదు. ఇప్పడు తెలంగాణలో తెలంగాణా ఉద్యమం పేరున నడుస్తున్న పార్టీలే నాలుగైదున్నాయి. నిజానికి ఇన్ని పార్టీలు, ఇన్ని వేదికలు ఉండడమే తెరాస ప్రధాన బలం, అని పలు సందర్భాల్లాలో రుజువైంది.ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలను ఉదాహరణగా తీసుకుంటే, కోదండరామ్, తీన్మార్ మల్లన్న, చెరుకు సుధాకర, రాణి రుద్రమ, అలాగే, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులు అందరూ తెరాస వ్యతిరేకులే, ఇంకా, పోటీచేసిన స్వతంత్ర అభ్యర్ధులు అందరూ తెరాసను వ్యతిరేకించారు. కానీ, ఎవరి జెండా వారిదే, అందుకే అందరు ఓడి పోయారు. ఉమ్మడి శత్రువు విజయ కేతనం ఎగరేశారు. ఈటల గానీ మరొకరు కానీ, కోదండరామ్ కంటే గొప్ప ఉద్యమనాయకులు కాదు. సో .. ఈటల పార్టీ పెట్టినా ఫలితం ఇలాగే, ఉంటుంది.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెరాసకు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీలే కాదు, ఉద్యమ సమయంలో ఏర్పడిన, పార్టీలు కూడా చరిత్రలో కలిసి పోయాయి. ఆలే నరేంద్ర, విజయశాంతి, చివరకు బడుగు వర్గాల నేతగా మంచి పేరు తెచ్చుకున్న దేవేదర్ గౌడ్, ఇలా నేక మంది, సొంత పార్టీ పెట్టి చేతులు కాల్చుకుని చివరకు ఎవరి సొంత గూటికి వారు చేరున్నారు.. చివరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని నమ్ముకుని, పార్టీ పెట్టిన చిరంజీవి, మధ్యలోనే కాడి వదిలేసి, ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్’లో కలిపేశారు. అలాగే, లక్మీ్ట పార్వతి, నందమూరి హరికృష్ణ, ఇంకా అనేక మంది పార్టీలు పెట్టి, ఎత్తేశారు.
కాబట్టి, ఈటల బీజేపీలో చేరడం కొందరికి నచ్చక పోతే నచ్చక పోవచ్చును, కానీ, సొంత పార్టీ ఆలోచన పక్కన పెట్టడం వరకు మాత్రం గత అనుభావాల దృష్టా ... విజ్ఞతతో తీసుకున్న మంచి నిర్ణయంగానే భావించవలసి ఉంటుంది.