జగన్‌కంటే సోనూసూద్ బెటర్.. ముఖ్యమంత్రి అభినవ నీరో చక్రవర్తి..
posted on Jun 12, 2021 @ 3:03PM
ఎన్నో విపత్తులను చూశానని.. కరోనా వంటి సంక్షోభం చూడటం ఇదే తొలిసారి అని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజాసేవే టీడీపీ అజెండా అని స్పష్టం చేశారు. కరోనా విపత్తులోనూ టెలిమెడిసిన్ ద్వారా సాయం చేస్తున్నట్టు చెప్పారు. సేవ చేయడానికి ప్రభుత్వానికి ఎన్నో అధికారాలు, అవకాశాలు ఉంటాయని.. మూడో దశ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని మరింత బాధ్యతగా వ్యవహరించాలని సర్కారుకు సూచించారు చంద్రబాబు.
కొవిడ్‌పై పోరాటంలో కుటుంబ సభ్యులు కూడా బాధితుల వద్దకు వెళ్లడం లేదని.. ఇదే సమయంలో కరోనా బారిన పడినవారికి ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలు అందిస్తుండటం అభినందనీయమని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందుతున్న వైద్య సేవలపై వివిధ రంగాల నిపుణులతో ఆయన వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌లో నటుడు సోనూసూద్ కూడా పాల్గొన్నారు. సోనూసూద్ సేవలను చంద్రబాబు కొనియాడారు. కరోనా విపత్తులో సోనూసూద్ అపార సేవలందించారన్నారు. ప్రజాసేవకు ఐక్య కార్యాచరణ రూపొందిద్దామని చంద్రబాబు సూచనకు సోనూసూద్ అంగీకరించారు.
సోనూసూద్ మాట్లాడుతూ... విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేయడం బాధ్యతగా భావిస్తున్నానన్నారు. ''తెలుగు రాష్ట్రాలు నాకు రెండో ఇల్లు లాంటివి. నా భార్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కావడం సంతోషం. సేవ చేయడానికి కులం, మతం, ప్రాంతం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో 18 ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నాను. ప్రజా సేవకు స్పందించే ప్రతి ఒక్కరూ నిజమైన హీరోలే. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ప్రత్యక్షంగా చూశా. కొవిడ్‌పై పోరులో ఇద్దరి ఆలోచనలు కలవడం ఎంతో సంతోషం'' అని సోనూసూద్ అన్నారు.
అటు, సీఎం జగన్‌రెడ్డి అభినవ నీరో చక్రవర్తి అంటూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఘాటుగా విమర్శించారు. కరోనా కారణంగా చితికిపోయిన పేదకుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10లక్షలు పరిహారం చెల్లించాలని కోరారు. ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు రూ.10 వేల ఆర్థికసాయం చేయాలని, ఉచితంగా సరుకులు అందించాలని కూన రవికుమార్ డిమాండ్ చేశారు.
ఇక, సీఎం జగన్.. నవరత్నాల పేరుతో ప్రజలకు నవరత్న ఆయిల్ రాశారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. పన్నుల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉండగా పెట్రోల్, డీజిల్ ధరలపై అసెంబ్లీలో మొసలి కన్నీరు కార్చారని... మరి ఇప్పుడు ఎలా పెంచారని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసి గెలించారని వారికి పన్నుల బాదుడు బహుమతిగా ఇస్తున్నారా అని ఎద్దేవా చేశారు. పథకాల పేరుతో ప్రజలకు ఎర వేసి.. పన్నుల పేరుతో లూటీ చేస్తున్నారని మండిపడ్డారు కొల్లు రవీంద్ర.
మరోవైపు, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు లేఖ రాశారు. ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పేపర్ డిజిటల్ వాల్యుయేషన్, ఫలితాలపై అనుమానాలను వివరిస్తూ లేఖ రాశారు. గ్రూప్ 1లో అవకతవలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థులకు న్యాయం జరిగేలా గవర్నర్ జోక్యం చేసుకుని ప్రభుత్వానికి తగు ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు.
ఇలా ప్రజా సమస్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి తెలుగు యువత అధ్యక్షుని వరకూ.. జగన్‌రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిత్యం ప్రజల శ్రేయస్సు కాంక్షించే టీడీపీ నాయకులు. ఇలా ఎప్పటికప్పుడు జగన్‌రెడ్డి సర్కారును నిలదీస్తూ.. ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజాభిమానం పొందుతున్నారు.