మహా కూటమిలో మరో ముసలం! ఉద్దవ్ ఊస్టింగేనా..?
మహారాష్ట్రలో మూడు పార్టీల కూటమి, మహా వికాస్ అఘాడి ప్రభుత్వం, నిండా ఐదేళ్ళు అధికారంలో కొనసాగుతుందా?ఈ ప్రశ్న ఇప్పటిది కాదు, 2019లో అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి, శివసేన నేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన, క్షణం నుంచి రాజకీయ వర్గాల్లో ఈ చర్చ సాగుతూనే వుంది. అప్పట్లోనే మహా అయితే ఆరు నెలలు, అంతకు మించి ఏమ్వీఏ అధికారంలో కొనసాగడం అయ్యే పనికాదాని కొందరు రాజకీయ పండితులు జోస్యం కూడా చెప్పారు. ఇక, బీజేపీ అయితే, అంతర్గత వైరుధ్యాలతో, ఏమ్వీఏ పేకమేడ ఎప్పుడైనా కూలి పోతుందని, ఎన్నో ఆశలు పెట్టుకుంది. బట్, అయితే, మూడు పార్టీల మధ్య ఎన్ని వైరుధ్యాలున్నా, అధికారం ఫెవికాల్’ లా పనిచేసింది. ఆరు నెలలు అనుకున్న ప్రభుత్వం రెండేళ్ళు పూర్తి చేసుకుంది.
అయితే ఇప్పుడు మళ్ళీ మహా కూటమిలో మరో సంక్షోభం తలెత్తింది. మూడు పార్టీలు మూడు దారుల్లో, అడుగులు వేస్తున్నాయి. నిజానిజాలు ఎలా ఉన్నా,మహా కూటమిలో ముసలం పుట్టిందన్నవార్త ముంబై నుంచి ఢిల్లీ దాకా వినవస్తోంది.ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కలవడం, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’తో ఎన్నికల వ్యూహహకర్త భేటీ కావడంతో, రాజకీయ సమీకరణలు మారుతున్నాయన్న ఊహగానాలు మొదలయ్యాయి.
ఇప్పడు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, మరో బాంబు పేల్చారు. మరో మూడేళ్ళలో 2024లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. అంతే కాదు, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని, పార్టీ అంగీకరిస్తే తానే కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్ధిని అని కూడా పటోలే ప్రకటించుకున్నారు. అలాగే,త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. దీంతో ముడు పార్టీలు, మూడు దారుల్లో పోతున్నాయా? ఎవరి దారి వారు చూసుకుంటున్నారా, అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నిజానికి, కాంగ్రెస్ పార్టీకి చెందిన హోంమంత్రి అనీల్ దేశ్ ముఖ్, అవినీతి ఆరోపణల నేపధ్యంలో రాజీనామా చేసినప్పటి నుంచి, కాంగ్రెస్ పార్టీ గుర్రుగానే వుంది.ముంబై మాజీ పోలీస్ కమిషనర్ ఆయనపై చేసిన అవినీతి ఆరోపణల నేపధ్యంలో, హై కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంతో ఏప్రిల్ లో దేశ్ ముఖ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కూటమిలో తమకు సముచిత గౌరవం దక్కడం లేదని ఆపార్టీ నాయకులు బహిరంగంగానే అవేదన, అగ్రహం వ్యక్త పరిచారు.
జాతీయ స్థాయిలో వేగంగా మారుతున్నట్లు కనిపిస్తున్న మార్పుల నేపధ్యంలో, శివసేన, మాజీ మిత్రపక్షం బీజేపీతో మళ్ళీ చేతులు కలిపేందుకు, అలాగే ఎన్సీపీ, ప్రశాంత్ కిషోర్, ‘మిషన్ 2024’ ప్లాన్’లో భాగంగా ఏర్పాటు చేస్తున్నప్రాంతీయ పార్టీల జాతీయ కూటమిలో ‘కీ’ రోల్ ప్లే చేసేందుకు సిద్దమవుతున్నాయి.ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా ఒంటరిగా పోటీచేయాలనే నిర్ణయానికి వచ్జిందని ,పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఏమ్వీఏలో ఎన్ని లుకలుకలు ఉన్నా, ప్రస్తుతానికి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వానికి వచ్చిన ముప్పు లేదని, ఎన్సీపీ భరోసా ఇస్తోంది. ఏమ్వీఏ ప్రభుత్వం ఐదేళ్ళు అధికారంలో ఉంటుంది,అయితే, 2024 లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలా, లేదా అనే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, పార్టీ అధికార ప్రతినిధి, నవాబ్ మాలిక్ స్పష్తం చేశారు.
అలాగే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని చేసిన ప్రకటనను కూడా మాలిక్ సమర్ధించారు. ప్రతి పార్టీ తమ కార్యకర్తలలో మనోధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. రాజకీయాల్లో ఉన్న వారు పదవులు ఆశించడం కూడా సహజమే. అలాగే. పటోలేముఖ్యమంత్రి కావాలనుకోవడం కూడా తప్పులేదని అంటున్నారు. అయితే, జాతీయ స్థాయిలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే, ఒక్క మహారాష్ట్రలోనే కాదు, ఎక్కడైనా, ఎప్పుడైనా రాజకీయాలు ఏదైనా జరగ వచ్చును అన్నట్లుగానే విచిత్ర పోకడలు పోతున్నాయి.