టీఎస్’లో బెంగాలీ సినిమా అడిద్డా ? అవుటయిద్డా?
posted on Jun 12, 2021 @ 4:18PM
ఇది యాదృచ్చికమే కావచ్చును, కానీ, బెంగాల్ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు, రాష్ట్రంలో తృణమూల్ నుంచి బీజేపీలోకి వలసలకు శ్రీకారం చుట్టిన,ముకుల్ రాయ్, బీజేపీని వదిలి సొంత గూటికి చేరడం, అదే సమయంలో ఉద్యమ సమయం నుంచి తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన మాజీ మంత్రి ఈటల రాజేందర్, తెరాసను వదిలి బీజేపీలో చేరడం నడుస్తున్న చరిత్రలో నిలిచిపోయే కీలక రాజకీయ పరిణామాలు. ముఖ్యంగా, తెలంగాణలో బెంగాల్ దూకుడు చుపుతామని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా, స్పష్టం చేసిన నేపధ్యంలో, రాన్నున్న రోజుల్లో తెలంగాణా రాజకీయాలు కొత్త రూపును సంతరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ముకుల్ రాయ్, ఈటల రాజేందర్ మధ్య ఒక చిన్న పోలిక కూడా వుంది. ఒకప్పుడు కేసీఆర్’కు ఈటల కుడి భుజంగా ఉన్నారు, ఆ విషయాన్ని కేసీఆర్ కూడా అనేక సందర్భాలలో చెప్పారు. అలాగే,ముకుల్ రాయ్ 2017లో పార్టీ వదిలి పోయే వరకు, మమతా బెనర్జీకి కుడి భుజంగా నిలిచారు. అలాగే, అక్కడ ముకుల్ రాయ్, ఇక్కడ ఈటల కూడా ఒక విధంగా అవమానకర పరిస్థితులలోనే సొంత పార్టీ నుంచి బయటకు వచ్చారు.అయితే ఎంతవరకు నిజమో గానీ, అక్కడ ముకుల్ రాయ్ పట్ల మమతకు, ఇక్కడ ఈటల పట్ల కేసీఆర్’కు మనసులో కాసింత సాఫ్ట్ కార్నర్’ ఉందనే మాట కూడా అక్కడా ఇక్కడా వినిపిస్తుంది.
అయితే, బెంగాల్లో సాగిన రీతిలో తెలంగాణలో వలసలు, ముఖ్యంగా అధికార పార్టీ నుంచి ఫిరాయింపులు సాధ్యమా? అంటే, ముందుముందు ఏమో కానీ, ప్రస్తుతానికి అయితే. బెంగాల్లా బారులు తీరే పరిస్థితి లేదు. ఈటలకు ఉద్యమ నాయకుడు అన్న ట్యాగుంది, బీసీ నాయకుడిగా గుర్తింపు వుంది. సామాజికంగానే కాకుండా, ఆర్థికంగా ఇతరత్రా కేసీఆర్’ను ఎదుర్కునే సామర్ధ్యం (ఇతరులతో పోల్చుకుంటే) కొంచెం ఎక్కువగానే వుంది. పార్టీలో మంచి పేరుంది. ఎమ్మెల్యేలకు ఆయన పట్ల గౌరవం కొంచెం ఎక్కువగానే ఉందని అంటారు.అయినా, వందకు పైగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలలో కనీసం ఒక్కరు కూడా, ఆయనకు మద్దతుగా బయటకు రాలేదు. ఒక మంచి మాట మాట్లాడలేదు. ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక జిల్లా పరిషత్ మాజీ, చైర్ పర్సన్ మినహ గుర్తింపుగల నాయకులు ఎవరూ ఈటల వెంట రాలేదు. అఫ్కోర్స్, ఆట ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు కాబట్టి, ఇప్పటికిప్పుడు బలాబలలాను బేరీజు వేయడం సమంజసం కాదు. అయినా, బెంగాలీ సినిమా తెలంగాణలో ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది అనుమానమే అంటున్నారు రాజకీయ పండితులు.
అయితే, ఈటల రాజీనామా చేసిన హుజురాబాద్’ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఏన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో పాటుగా, కేసీఆర్’ పట్టాభి షేకం వంటి అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటే తప్ప అధికార పార్టీ నుంచి బీజేపీలోకి వలసలు పరుగులు తీసే అవకాశం ఉండదని కమలం పార్టీ కీలక నేతల భావిస్తున్నారు. ఒక వేళ కేటీఆర్’కు పట్టాభిషేకం జరిగితే మాత్రం, అప్పుడు పార్టీలో చీలిక అనివార్యం అవుతుందని పార్టీ వర్గాల్లో వినవస్తోంది. అందుకే, ముఖ్యమంత్రి ఇంతకాలం దూరం పెట్టిన హరీష్ రావును దగ్గర చేస్తున్నారని కూడా పార్టీ వర్గాల్లో వినవస్తోంది.
అదలా ఉంటే, ఈటల బీజేపీలో చేరడం వలన తెరాసకు జరిగే నష్టం ఎలా ఉన్నా, ప్రస్తుతానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మాత్రం, ఈటల పోటు గట్టిగా ఉంటుందని పిస్తోంది. ఓ వంక జాతీయ స్థాయినుంచి, రాష్ట్ర స్థాయి వరకు అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న హస్తం పార్టీకి ఈటల బీజేపీ ఎంట్రీ అదనపు కష్టాలు తెచ్చిపెడుతుందని, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు మొదలవుతాయని అంటున్నారు.ఇప్పటికే డీకే అరుణ మొదలు అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల బీజేపీలో చేరి కీలక బాధ్యతల్లో ఉన్నారు. అదే విధంగా,ఈటల చేరిక తర్వాత మరి కొందరు నాయకులు కూడా బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ వంటి సీనియర్ నాయకులూ కూడా ఉన్నారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన తమ అనుచరులు, అభిమానులతో మాట్లాడిన అనంతరం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రమేష్ రాథోడ్ బీజేపీలో చేరితే తెలంగాణలో కాంగ్రెస్‌కు ఆమేరకు నష్టం జరుగుతుంది. అంతేకాదు,మరి కొందరు అయన బాటలో పయనించినా ఆశ్చర్యపోనవసరం లేదు. రమేష్ రాథోడ్ బీజేపీలో చేరికపై పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వారి అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీ మారాలనే యోచనలో రమేష్ రాథోడ్ ఉన్నారు. రమేష్ రాథోడ్ చేరికతో ఆదిలాబాద్‌లో కాషాయం బలపడనుంది. గతంలో రమేష్ రాథోడ్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
రమేష్ రాథోడ్ తొలుత తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్‌లో కూడా తనకు సరైన ప్రాధాన్యం దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీలోక చేరారు. కాంగ్రెస్‌లో కూడా ఆయనకు సరైన గుర్తింపు దక్కక పోవడంతో బీజేపీ వైపు చూస్తున్నారు. ఈటల రాజేందర్ నివాసంలో గురువారం భోజనానికి హాజరైన బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జీ తరుణ్ చుగ్‌ని కలిసిన రాథోడ్ తమ అభిప్రాయాన్ని తెలిపినట్లు సమాచారం. అయితే అయన ఈటలతో పాటుగా కాషాయ కడువా కప్పుకుంటారా ..లేక మరో ఈవెంట్ ప్లాన్ చేస్తారా అనేది చూడవలసి వుంది.