సీఎం ఇలాఖాలో ఉద్యోగుల మందుపార్టీ.. కట్ చేస్తే....
posted on Jun 11, 2021 @ 10:33PM
అసలే కరోనా టైమ్. ఇద్దరు గుమ్మికూడితేనే డేంజర్. సామాజిక దూరం కంపల్సరీ. మాస్కులు మస్ట్. లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు పెట్టినా కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. ఇంతటి కల్లోల సమయంలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు.. ఇదే మంచి టైమ్ అనుకున్నారో ఏమో.. మామిడితోటలో మందు పార్టీ చేసుకున్నారు. ఓ జిల్లాలోని 22 మండలాల అధికారులు సామూహిక విందు భోజనం చేశారు. ఈ తతంగమంతా స్వయానా సీఎం ఇలాఖాలో జరగడం.. ఆ పార్టీ వీడియో వైరల్‌గా మారడంతో మేటర్ సీరియస్ అయింది. కట్ చేస్తే.. ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఓ అధికారిని సస్పెండ్ చేయగా.. మరో ఆఫీసర్‌పై బదిలీ వేటు పడటం కలకలంగా మారింది.
సిద్దిపేట జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు డ్యూటీకి డుమ్మా కొట్టి.. మందు పార్టీ చేసుకున్నారు. కొండపాకలోని ఓ మామిడితోటలో మందేసి, చిందేసి.. మస్తు ఎంజాయ్ చేశారు. కొవిడ్ నిబంధలను ఉల్లంఘిస్తూ అధికారులు పార్టీలో తాగి ఊగిపోయారు. విందు పార్టీలో మహిళా ఉద్యోగులు సైతం హాజరవడం మరింత ఇంట్రెస్టింగ్ పాయింట్.
ఆ పార్టీని హోస్ట్ చేసింది కొండపాక మండల పంచాయతీ కార్యదర్శులు. తలా ఇంత వాటా వేసుకొని.. జిల్లాలోని 22 మండలాల పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులందరికీ ఓ మామిడితోటలో గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశారు. జిల్లాలోని 22 ఎంపీఓలకు ఆహ్వానం అందగా.. డీఆర్‌డీ, ఓపీడీ, ఇన్‌ఛార్ట్ డీపీవో సైతం వచ్చి.. భోజనం చేసి వెళ్లినట్టు తెలుస్తోంది.
అయితే, ఆ పార్టీ వీడియో బయటకు రావడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. సీఎం కేసీఆర్ ఏరియాలోనే కొవిడ్ నిబంధనలు పాటించకుండా ప్రభుత్వ ఉద్యోగులు ఇలా మందు, విందు పార్టీలు చేసుకోవడమేంటని జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియో కాస్త వైరల్ అయి.. అది జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని చేరింది. పార్టీపై సీరియస్‌గా స్పందించిన కలెక్టర్ వెంటనే విచారణకు ఆదేశించారు. ప్రాధమిక నివేదిక ఆధారంగా కొండపాక ఎంపీవో నరసింహారావును సస్పెండ్ చేశారు. ఎంపీడీవో రాజేశ్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.