ప్రధాన న్యాయమూర్తి పర్యటన... ‘ప్రత్యేకం’
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సీజేగా బాధ్యతలు చేపట్టాక, తొలిసారి, తెలుగు రాష్ట్రాలకు వచ్చారు. ముందుగా సతీ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రధాన న్యాయమూర్తి, అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న జస్టిస్ రమణకు గవర్నర్ తమిళిసై,, ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ హిమా కోహ్లీ రాష్ట్ర మంత్రులు, ఘన స్వాగతం పలికారు.
నిజానికి జస్టిస్ రమణకు హైదరాబాద్ కొత్తకాదు. హైదరాబాద్ నగరంతో ఆయనకు దశాబ్దాల అనుబంధం ఉంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆయన అనేక హోదాలలో ఇక్కడనుంచే పని చేశారు. అలాగే, అనేక మార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఆయనకు, హైదరాబాద్, తిరుమల మాత్రమే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ప్రాంతం, ప్రతి క్షేత్రం ... ప్రతిది ఆయనకు సుపరిచితాలు ... ఈ నేల, ఈ గాలీ అన్నీ ఆయన ఉచ్వాస నిశ్వాసాలు. అలాగే, సర్వోన్నత నాయస్థానం ప్రధాన న్యాయమూర్తి స్థాయికి జస్టిస్ ఎన్వీ రమణ చేరుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణం.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పదవిని అలకరించిన రెండవ తెలుగు వెలుగు జస్టిస్ ఎన్వీ రమణ.
అంతటి అత్యున్నత పదవి స్వీకరించిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ సందర్శించారు. అందుకే ఈ పర్యటన ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన హోదాకు మాత్రమే కాకుండా తెలుగువారికి అయన తెచ్చిన గౌరవానికి తగిన విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ నిబంధనలతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత మర్యాదలు పాటిస్తున్నారు. హైదరాబాద్ చేరుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు విమానశ్రయంలో హై కోర్టు ప్రధాన న్యామూర్తి, ఇతర అధికారులతో పాటుగా మంత్రి కేటీఅర్ స్వాగతం పలికితే, ముఖ్యమంత్రి కేసీఆర్, రాజ్ భవన్’లో స్వాగతం పలికారు.అలాగే, ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్న అధికార కార్యక్రమాలు అన్నిటిలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రత్యేకంగానూ,కలుసుకున్నారు.అలాగే, యాదాద్రి సందర్శనకు ఆహ్వానించారు. అందుకు జస్టిస్ ఎన్వీ రమణ అంగీకరించారు. సీజేఐ జస్టిస్ రమణకు, ఆయన హోదాకు తగినట్టుగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు ఉండాలని సీఎం కేసీఆర్ యాదాద్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి.. శనివారమే కొండపై ఏర్పాట్లు చేశారు.
ముఖ్యమంత్రి జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్ర పర్యటనకు ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రాధాన్యత ప్రత్యేక శ్రద్ద విషయంలో రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిని వెంటాడుతున్న పాస్ పోర్ట్, ఈఎస్ఐ కుంభకోణం వంటి పాత కేసులతో పాటుగా, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల అస్తులకు సంబంధించి వినవస్తున్న తాజా ఆరోపణల నేపధ్యంలో, ముఖ్యమంత్రి ప్రధాన న్యాయ మూర్తి పర్యటనకు ప్రత్యేక ప్రధాన్యత ఇస్తున్నారని రాజకీయ వర్గాలో చర్చ మొదలైంది.
గత కొంత కాలంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నాయకులు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేయడంతో పాటుగా, ముఖ్యమంత్రి జైలుకు పోవడం ఖాయమని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ముఖ్యమంత్రి కుటుంబ అవినీతికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నామని, బండి సంజయ్ ప్రతి సందర్భంలో పేర్కొంటున్నారు. మరో వంక కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా, అటు కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పర్యటనలో ముఖ్యమంత్రి, అధికార పార్టీ నాయకులు చూపుతున్న అతి ఉత్సాహన్ని చూడవలసి ఉంటుందని రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. అయితే అందులో ఎంత నిజం వుందో, ఏమో కానీ, గతంలోనూ రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగానూ ... ఇలాంటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలే వినిపించాయి.