అమిత్ షాతో జగన్ ఏం మాట్లాడారు? రఘురామ పై వేటు పడనుందా?
posted on Jun 12, 2021 @ 4:09PM
లోపల ఏం జరిగిందో తెలియదు గాని..బయట మాత్రం మోత వీళ్లేమో పెద్దపెద్ద ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తారు.. వాళ్లేమో అసలే నోరు విప్పరు..లేదంటే ఓ ట్వీట్ మన మొహాన పడేస్తారు. అసలేం మాట్లాడుకున్నారు...ఏం చర్చించారు... ఎవరు ఎవరికీ డీల్ ప్రపోజల్ చేశారు.. ఎవరు ఓకె అన్నారు..ఎవరు కాదన్నారు.. అసలా డీల్ ఏంటి? ఇలా పాపం ఏపీ జనం తెగ ఊహించుకుంటూ అల్లాడిపోతున్నారు. రెండు వర్గాలుగా ఉన్న మీడియా కూడా ఎవరి గోల వారిది వినిపిస్తున్నారు. ఒకరు అమిత్ షా జగన్ ను ఎమ్మెల్సీ పదవులు అడిగారని చెబుతుంటే..మరొకరు జగనే అమిత్ షాను కేంద్ర మంత్రి పదవులు అడిగారని వినిపిస్తున్నారు. ఆయన ఈయనను ఏం అడిగారో..ఈయన ఆయనను ఏం అడిగారో..ఎవరికీ సమజే కావటం లేదు. వాళ్లు కలిసింది గంట అయితే..మీడియా మాత్రం రెండు రోజుల నుంచి నాన్ స్టాప్ గా వాయిస్తోంది.
అసలు జగన్, అమిత్ షా ఏం మాట్లాడుకున్నారు? ఏం డీల్ చేసుకున్నారు? అంటే కరెక్టు సమాధానం జగన్ కు, లేదంటే అమిత్ షాకు మాత్రమే తెలుస్తుంది. కాకపోతే వచ్చిన రూమర్ల వెనక లాజిక్ లాగీ..అది కరెక్టో కాదో తేలుద్దాం. ఒకటి అమిత్ షా జగన్ ను ఎమ్మెల్సీ పదవులు అడిగారని.. ఎమ్మెల్సీ పదవులు ఏం చేసుకుంటుంది బిజెపి. లోకల్ బిజెపి నేతలను ఆ పదవులిచ్చి సోపు వేయాల్సినంత అవసరం అమిత్ షాకు లేదు. వాళ్లకు అవసరమైంది రాజ్యసభ ఎంపీ పదవులు..అడిగితే గిడిగితే అవే అడుగుతారు. ఎందుకంటే బిజెపికి రాజ్యసభలో బలం పెరుగుతుంది కాబట్టి..వారనుకున్నవి ప్రశాంతంగా చేసుకోగలరు కాబట్టి. కాబట్టి ఈ రూమర్ రూల్డ్ అవుట్.
ఇక జగన్ మంత్రి పదవులు కావాలని అమత్ షాను అడిగారని. ఇది కూడా ఇల్లాజిక్కే. జగన్ కు ఇప్పుడు కేంద్రంలో మంత్రి పదవులు అవసరమే లేదు. కావాల్సింది మోదీ, అమిత్ షాల సపోర్ట్. మీక్కావాల్సింది ఇస్తా..నేననుకున్నవి నన్ను చేసుకోనివ్వండి..అంతే అడిగేది. ఇంకా కరెక్టుగా చెప్పాలంటే పోలవరం నిధులు, ప్రత్యేక హోదా ఇలాంటివేమీ ఇవ్వకపోయినా పర్వాలేదు.. నా ప్లాన్లు అమలు చేసుకోవడానికి మీ సపోర్టు కావాలి అంతే. మూడు రాజధానులు అమల్లోకి రావాలి.. ఎవరూ అడ్డం రాకూడదు. చంద్రబాబు అండ్ కో ను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతా.. నన్ను అడక్కూడదు..రఘురామకృష్ణరాజును వెంటనే సస్పెండ్ చేస్తే..ఆడి సంగతి చూసుకుంటా..ఇలా ఉండుంటుంది లిస్ట్ అని ప్రత్యర్ధులు నవ్వుతూ కామెంట్ చేస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే కేంద్రంలో మంత్రి పదవులు అమిత్ షా యే జగన్ కు ఆఫర్ చేసి ఉంటారు. ఎందుకంటే జగన్ రాజధాని, రఘురామ, చంద్రబాబు లాంటి విషయాల్లో సపోర్ట్ అడుగుతారు కాబట్టి.. మీరు మాకు సపోర్ట్ చేస్తామని ఊరికే చెప్పడం కాదు.. వ్యవసాయ బిల్లు విషయంలో సభలో మద్దతు ఇచ్చి తర్వాత వ్యతిరేకిస్తారు.. అలా కుదరదు.. మీరు గవర్నమెంటులో చేరితే.. మీరు కూడా అన్ని నిర్ణయాల్లో భాగస్వాములు అవుతారు..మీకు కూడా మేం ఏమన్నా చేయలగం.. అని అమిత్ షా వివరంగా చెప్పి ఉంటారు.
మరిప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో తెలిసిపోవటంలేదా..? రాజధాని షిఫ్టింగ్ కు ఓకె చెప్పేశారు..రఘురామకృష్ణరాజు సస్పెన్షన్ కు ఓకె చెప్పేసే ఉంటారు.. సో జగన్ బాబు కూడా కేబినెట్ లో చేరడానికి ఓకె చెప్పే ఉంటారు కదా.. జస్ట్ వెయిట్ అండ్ సీ