ఇక సమరమే.. ఈటల రాజీనామా.. 14న కాషాయ కండువా...
posted on Jun 12, 2021 @ 11:47AM
హుజురాబాద్‌లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోందని.. కౌరవులకు.. పాండవులకు మధ్య యుద్ధంలో.. అంతిమంగా తెలంగాణ ప్రజలే గెలుస్తారంటూ.. సీఎం కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెబుతారంటూ.. సవాల్ చేస్తూ.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఈటల రాజేందర్. చట్టాన్ని అపహాస్యం చేసేలా తెలంగాణలో రాజకీయాలు సాగుతున్నాయన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన వారు రాజీనామా చేయకుండానే.. నిస్సిగ్గుగా మంత్రులుగా కొనసాగుతున్నారని ఈటల మండిపడ్డారు.
గన్‌పార్క్ దగ్గర అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించిన అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా సమర్పించారు ఈటల రాజేందర్. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన కోసం పోరాటం చేయడానికి ముందుకు పోతున్నానని ఈటల అన్నారు.
నిర్బంధాలు తనకు కొత్త కాదని.. వాటిని తొక్కి పడేస్తానంటూ సవాల్ విసిరారు ఈటల. నియంత నుంచి తెలంగాణను విముక్తి చేయడమే తన ఎజెండా అన్నారు. యావత్ తెలంగాణ ప్రజల కోసం తాను రాజీనామా చేస్తున్నానన్నారు. వందల కోట్ల రూపాయలు కేసీఆర్ దగ్గర ఉన్నాయని.. ఓడగొడతారని.. రాజీనామా చేయవద్దని చాలా మంది తనతో అన్నారని.. అయినా వెనక్కి తగ్గలేదని ఈటల తెలిపారు. మేధావులు తనకు మద్దతు ఇవ్వాలని.. హుజూరాబాద్ వచ్చి ప్రజలకు అండగా ఉండాలని ఈటల పిలుపిచ్చారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్.. శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. 14న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఈటలతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, రమేష్ రాథోడ్, తుల ఉమ, మరికొంతమంది నేతలు బీజేపీలో చేరనున్నారు.