రమణకు రమణీయ స్వాగతం.. కేసీఆర్‌ను చూసి నేర్చుకో జగన్!
posted on Jun 12, 2021 @ 2:18PM
ఆహా. ఏమి మర్యాద.. ఏమి గౌరవం.. అత్యున్నత న్యాయమూర్తికి అత్యున్నత గౌరవం. అడుగడుగునా అపూర్వ స్వాగతం. తెలంగాణ గడ్డపై కాలు మోపింది మొదలు.. రాజ్‌భవన్‌లో సేద తీరే వరకూ.. ఆతిథ్యంతో.. సాదర స్వాగతంతో అబ్బుపరిచింది తెలంగాణ సర్కారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణకు విచ్చేసిన జస్టిస్ ఎన్వీ రమణకు రమణీయ స్వాగతం లభించింది. రాజ్‌భవన్‌లో సీజేఐ ఎన్వీ రమణ దంపతులకు.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. 3 రోజుల పాటు రాజ్‌భవన్ అతిథి గృహంలో ఉండనున్నారు జస్టిస్ ఎన్వీ రమణ. అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయంలో.. హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీ, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి , ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్, పలువురు ఎమ్మెల్యేలు సీజేఐకు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. ఇలా తెలంగాణ ప్రభుత్వమంతా కదిలొచ్చి.. సీజేఐకు సాదర స్వాగతం పలకడం నిజంగా అపూర్వం. అ నిర్వచనీయం.
ఓ తెలుగువాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీఠం అధిష్టించడం తెలుగువారందరికీ గర్వకారణం. ఎన్వీ రమణ దేశ అత్యున్నత న్యాయ స్థానాన్ని అలంకరించి తెలుగుజాతికి వన్నె తీసుకొచ్చారు. ఆయన్ను అత్యుత్తమంగా ఆహ్వానించి తెలుగు సంస్కారాన్ని ఘనంగా చాటుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.
ఎంత తేడా. ఎంత తేడా. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎంత తేడా. సీఎం కేసీఆర్.. జస్టిస్ ఎన్వీ రమణకు ప్రభుత్వం తరఫున ఇంత సాదరంగా ఆహ్వానిస్తే.. అదే ఏపీ సర్కారు? ఏపీ సీఎం జగన్‌రెడ్డి ఏం చేశారు? తెలుగోడి కీర్తిని సుప్రీం పీఠంపై కూర్చోబెట్టిన జస్టిస్ ఎన్వీ రమణకు ఏమేరకు గౌరవించారు? మరి, ఇంతటి కుసంస్కారమా? మరీ ఇంతటి కుళ్లుబోతుతనమా? మరీ ఇంతటి దిగజారుడుతనమా? అంటూ సాటి తెలుగువారు ప్రశ్నిస్తున్నారు. సీజేఐ అయ్యాక జస్టిస్ ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. వెళ్లారు. అంతే. ఆయనకు ఏపీ ప్రభుత్వం తరఫున ఎలాంటి స్వాగతమూ.. సత్కారమూ చేయలేదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన సందర్భానికి ఎలాంటి ప్రత్యేకతను, విశిష్టతను కల్పించలేదు జగన్‌రెడ్డి ప్రభుత్వం. ఇది నిజంగా దారుణ విషయం అంటున్నారు. అతిథ్యానికి ఖ్యాతి గాంచిన ఆంధ్రుల్లో ఇంతటి నీచ సంస్కృతి ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదంటున్నారు. జగన్‌రెడ్డి పాలనలోనే ఇలా తెలుగు గౌరవం నానాటికి దిగజారిపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన ఎన్వీ రమణకు.. సాటి తెలుగువాడిగా తెలంగాణ సర్కారు ఘన స్వాగతం పలికింది. అదే, మన నేల మీదనే పుట్టిన ఆ న్యాయకోవిదుడికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తరఫున ఎలాంటి ప్రత్యేక గౌరవం లభించకపోవడం జగన్‌రెడ్డి నిష్టూరపు చర్యలకు నిదర్శనమని తప్పుబడుతున్నారు విజ్ఞులు. జస్టిస్ రమణపై జగన్‌రెడ్డి మొదటి నుంచీ ఇలాంటి వైఖరే అవలంభిస్తున్నారు. అసలు ఓ తెలుగువాడు సీజేఐ అవకుండా ఎంతగా కుట్ర చేయాలో అంతా చేశారు. రమణ లాంటి వ్యక్తికి సైతం కులాన్ని ఆపాదిస్తూ.. ఓ పార్టీతో, ఓ వ్యక్తితో ముడిపెడుతూ.. ఆయనపై అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం జగన్‌రెడ్డి దుర్నీతికి నిదర్శనం. ఎన్వీ రమణ సీజేఐ కాకుండా జగన్‌రెడ్డి ఆయనపై అపవాదు మోపినా.. న్యాయం మాత్రం ఆ న్యాయమూర్తి పక్షానే నిలిచింది. అందుకే, దేశ అత్యున్నత న్యాయస్థానంలో, అత్యున్నత పీఠాన్ని అధిరోహించి జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు జాతికే నిండు గౌరవం తీసుకొచ్చారు.
అంతటి వ్యక్తిపట్ల.. ఏపీ ప్రభుత్వం అంత ఉదాసీనంగా వ్యవహరిస్తే.. అదే సమయంలో తెలంగాణ సర్కారు ఆసాంతం కదిలొచ్చి.. సీజేఐ ఎన్వీ రమణకు ఘనస్వాగతం పలకడం.. తెలుగుజాతికంతటికీ గౌరవప్రదమే. అందుకే, నవ్విపోదురుగాక నాకేంటి.. అన్నట్టూ సీఎం జగన్‌రెడ్డి మూతిముడుచుకొని కూర్చోకుండా.. కనీసం సీజేఐ హోదాకైనా, తెలుగువాడు అయినందుకైనా.. ఎన్వీ రమణకు సముచిత సత్కారం చేసుంటే బాగుండేదని అంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చూసైనా నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. కానీ, ఇలాంటి మంచి మాటలు, మంచి చేష్టలు.. దుర్బుద్ది గలిగిన నేతల చెవులకు, కళ్లకు సోకుతాయా? జగమొండి ఘటాలు అంత ఈజీగా మారుతాయా? మరక మంచిదే అనుకునే నాయకులు.. మార్పు మంచికేనని గ్రహిస్తారా? అంటే కష్టమే అంటున్నారు.