పథకాలకు ఫ్యామిలీ కాదు మహనీయుల పేర్లు కావాలి!
ఆంధ్రప్రదేశ్ లో పాలనంతా రివర్స్ గా సాగుతుందనే విమర్శలు వస్తున్నాయి. జగన్ అధికారంలోకి రాగానే.. రివర్స్ టెండరింగ్ మొదలుపెట్టారు. ఆయన ఏ సమయంలో అది ప్రారంభించారో తెలియదు కాని.. తర్వాత పాలనంతా రివర్స్ గానే సాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. దేశమంతా ఒకలా ఉంటే.. ఏపీలో మరోలా ఉంటోంది. దేశంలోని మిగితా రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాలకు స్వాతంత్ర సమర యోధులు. మహనీయులు, త్యాగమూర్తుల పేర్లు పెడుతుంటే.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జగనన్న కుటుంబ సభ్యుల జపం నడుస్తోంది. గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాలకు కూడా పేరు మార్చి.. వైఎస్సార్ కుటుంబం పేర్లు పెట్టారు.
ప్రస్తుతం ఏపీలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు జగనన్న తోడు, జగనన్న కాలనీలు, వైయస్ఆర్ కాపు నేస్తం, వైయస్ఆర్ కాపరి బంధం, వైయస్ఆర్ పశు నేస్త పరిహారం, వైయస్ ఆర్ చేయూత, వైయస్ ఆర్ మత్స్యకార భరోసా, వైయస్ ఆర్ ఆరోగ్య శ్రీ, జగనన్న గోరు ముద్ద, వైయస్ఆర్ పెన్షన్ కానుక, వైయస్ ఆర్ కంటి వెలుగు, వైయస్ఆర్ ఇబిసి నేస్తం, వైయస్ఆర్ సున్నా వడ్డి, వైయస్ఆర్ వాహన మిత్ర, వైయస్ఆర్ పెళ్ళి కానుక, వైయస్ఆర్ లా నేస్తం, వైయస్ఆర్ అమ్మ ఒడి, వైయస్ఆర్ రైతు భరోసా, వైయస్ఆర్ నేతన్న హస్తం, వైయస్ఆర్ భీమా అనే పేర్లు ఉన్నాయి. జగన్ సర్కార్ తీరుపై జనాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదేం పద్దతి అంటూ మండిపడుతున్నారు కొందరు.
ప్రభుత్వ పథకాలకు స్వాతంత్ర్య సమర యోధులు, మహనీయులు, త్యాగ పురుషుల పేర్లు పెట్టాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి.. కాపు ఉద్యమ నేత, సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేల్పూరి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన సామాజిక ఉద్యమ యోధులు మహాత్మా జ్యోతీరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే, బి.ఆర్.అంబేద్కర్, మహాత్మా గాంధీ, ఉక్కు మనిషి సర్థార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, సుభాష్ చంద్ర బోస్, బిర్సా ముండా, ఛత్రపతి శివాజీ, శ్రీ కృష్ణ దేవ రాయలు, బాబూ జగజ్జీవన్ రామ్, కాన్షీరామ్, రాష్ట్రంలో మచ్చ లేని మహనీయులైన దామోదరం సంజీవయ్య, పొట్టి శ్రీరాములు, ప్రకాశం పంతులు, పోతులూరి వీర బ్రహ్మంద్ర స్వామి, సర్థార్ గౌతు లచ్చన్న, తరిమెల నాగిరెడ్డి, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి, పుల్లరి ఉద్యమ వీరుడు కన్నెగంటి హనుమంతు, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు, డొక్కా సీతమ్మ, పుచ్చలపల్లి సుందరయ్య, మహాకవి గుర్రం జాషువా, ప్రగడ కోటయ్య కఠారి సత్యనారాయణ యాదవ్, జాతీయ జెండా రూప శిల్పి పింగళి వెంకయ్య, సంత్ సేవాలాల్ నాయక్, బుర్ర కథ నాజరు తదితరుల పేర్లు పెట్టాలని సూచించారు. మహనీయుల త్యాగాలు గుర్తు రావాలని, యువతకు మార్గదర్శకాలు త్యాగ పురుషులేనని అన్నారు.
ప్రభుత్వ పథకాలకు సీఎం కుటుంబ పేర్లు పెట్టడం తగదని, సొంత డబ్బు తో పెట్టే పథకాలకు ఈ పేర్లు పెట్టుకోవాలని వేల్పూరి ప్రభుత్వానికి తెలిపారు. వెంటనే జగన్ వైయస్ఆర్ పేర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజల ఆస్థి అని, అన్ని వర్గాల ప్రజలని అనుమానించడం తగదన్నారు. అన్ని కులాల, మతాలలో ఎందరో త్యాగధనులు ఉన్నారని గుర్తు చేశారు. అనేక అవినీతి ఆరోపణలు, సి బి ఐ, ఈడీ కేసులలో ముద్దాయిగా ఉండి, బెయిల్ పై ఉన్న వారి పేర్లు పెడితే యువత చెడు మార్గంలో పయనిస్తారని సీఎంను హెచ్చరించారు. 350 పథకాలలో ఒక్క పథకానికి కూడా ప్రధాని మోడీ తన పేరు పెట్టుకోలేదని సిఎం జగన్ కు గుర్తు చేశారు వేల్పూరి శ్రీనివాసరావు.