మంత్రి పెద్దిరెడ్డికి కోపం! జగన్ రెడ్డి టీంలో కలవరం?
posted on Jun 12, 2021 @ 5:11PM
చిత్తూరు పెద్దారెడ్డికి కోపం వచ్చింది. పాపం అంతా తానై అప్పట్లో నడిపించారు. అంతా తనకే అనుకున్నారు. గద్దలా మరొకరు వచ్చి కళ్ల ముందే తన్నుకుపోతే తమాయించుకున్నారు. కాని లెక్కలేసుకుంటున్న కొద్దీ ఫ్రస్టేషన్ పెరిగిపోతోంది. అందుకే కోపం వస్తోంది. కాని పైకి చెప్పుకోలేరు.. బయటికి కక్కలేరు. పోనీలే అని సర్దుకోనూ లేరు. పాపం కదా..నిజంగా. ఇప్పుడీ న్యూస్ లో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు గాని.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ మీద కోపం వచ్చిందంట. బట్.. గౌరవం తగ్గలేదు సుమా. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటారు కదా..అలా అధికార వ్యాపారమే వ్యాపారమే.. నాయకుడు నాయకుడే.. అక్కడే అసలు తేడా కొట్టిందంట.
ఇసుక నుంచి తైలం పిండే ఘనులెవరా అనుకున్నారంతా..కాని జగన్ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ఆ విషయంలో క్లారిటీ వచ్చేసింది. అసలు ఇసుక కనపడుకుండానే కాసులు సంపాదించిన ఘనత వారికే దక్కిందనే ఆరోపణలు ప్రతిపక్షాలు చేశాయి. ఇసుక వ్యాపారం నుంచి టీడీపీ నేతలను కట్ చేయడానికి.. కొత్త పాలసీ అనే పేరుతో మూడు నెలలు కాలం గడిపి.. జనానికి ఇసుక దొరకకుండా చేసిన గ్రేట్ నెస్ వైసీపీది.. దాని అధినేత జగన్ గారిది.. ఆ తర్వాత సంబంధిత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే.
అసలు ఇసుక మన కంట్రోల్ లోకి తేవాలనుకున్నాం గాని.. అసలు దొరక్కుండా చేయాలని అనుకోలేదు కదా అని పాపం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డిని చాలాసార్లు అడిగారంట. అంతా సాఫ్ట్ వేర్ ప్రాబ్లెమ్..అధికారుల ప్రాబ్లెమ్.. లేదంటే వరదల సమస్య.. అంటూ చెప్పుకుంటూ వచ్చారు. బ్యాక్ గ్రౌండ్ లోకి వెళితే బ్లాక్ మార్కెటింగ్ ఓ రేంజ్లో జరుగుతున్న విషయం తెలిసేదని ప్రత్యర్ధులు కామెంట్లు చేశారు.
టీడీపీ వాళ్లను అడిగితే ఇలా చెప్పుకొస్తారు. ఇసుకను మంత్రి పెద్దిరెడ్డి జిల్లాల్లో బ్లాక్ చేసేశారు... తనకు సన్నిహితులైన మంత్రులకు, నేతలకు (వైసీపీ వాళ్లు అయితే సరిపోదు మళ్లీ) ఏరియాల వారీగా పంచిపెట్టేశారు. కొన్నిఏరియాలు కొడాలి నాని, మరికొన్నిఏరియాలు మాజీ మంత్రి పార్ధసారథి..ఇంకా తూగో, పగో, విశాఖ, విజయనగరం అలా డివిజన్ జరిగిపోయింది. ఎక్కువ భాగం మాత్రం పెద్దారెడ్డి మనుషులే పోయి వ్యాపారం చేసుకున్నారంట. రెడ్డిగారు జగన్ పాదయాత్ర అప్పుడు మొత్తం స్పాన్సరింగ్ చేశారు కాబట్టి వదిలేసుంటారులే అని మిగతావాళ్లు సర్దుకున్నారంట.
పెద్దారెడ్డి చల్లగా ఉంటే విజయసాయిరెడ్డికి నిద్ర పట్టదు కదా. అందుకే అన్నివిషయాలు తవ్వితీసి జగన్ కి ఏకరవు పెట్టేశారంట. అయితే పెద్దిరెడ్డిని కాదనలేరు..అలా అని అడ్డంగా వదిలేయలేరు..అందుకే జగన్, విజయసాయిరెడ్డి కలిసి ప్లాన్ చేసి.. రాష్ట్రమంతా ఒక్క కంపెనీకే ఇసుక తవ్వకం, సరఫరా కాంట్రాక్టు ఇప్పించేశారు. ఆ కంపెనీ మళ్లీ విజయసాయిరెడ్డి అల్లుడు తాలుకా .. చూశారా..లాగిపెట్టి కొడితే..ఆ చెంప మీద నుంచి ఈ చెంప మీదకు వాతలు మారాయన్నమాట. పెద్దిరెడ్డిగారిని ప్రసన్నం చేశాకే అన్నీ చేసుకున్నాగాని.. బాస్ కి నచ్చలేదు. ఎంతైనా బిర్యానీ తినేవాడిని.. రోటీలతో సరిపెట్టుకోమంటే నచ్చుతుందా చెప్పండి.అందుకే కోపం వచ్చింది. మరి ఆ కోపం ఎప్పుడు బయటపడుతుందో చూడాలి. గతంలో వచ్చిన రూమర్ లాగా .. జగన్ జైలుకెళితే నేనేకదా సీఎం అని సరిపెట్టుకుంటారో మరి.