సీఎం జగన్ కు గవర్నర్ ఝలక్! వైసీపీలో బెయిల్ టెన్షన్.. 

ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో జగన్ సర్కార్ కు గవర్నర్ ఝలక్ ఇచ్చారని తెలుస్తోంది. మూడు రోజుల క్రితమే గవర్నర్ కు ప్రతిపాదిత పేర్లను ప్రభుత్వం పంపినా.. గవర్నర్ ఆమోదించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం పంపిన పేర్లపై గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారని తెలుస్తోంది. జాబితాలోని నలుగురిలో ఇద్దరి పేర్లపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ ను కలవబోతున్నారు.   ఏపీలో నామినేటెడ్‌ కోటాలో గవర్నర్‌ నియమించే 4 ఎమ్మెల్సీ స్థానాలుఖాళీ అయ్యాయి. వీటి భర్తీకి  లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్‌ రాజు, రమేశ్‌ యాదవ్‌ పేర్లను గవర్నర్‌కు పంపింది జగన్ సర్కార్. సాధారణంగా ప్రభుత్వం నుంచివచ్చిన ఫైళ్లను వెంటనే ఆమోదించి పంపిస్తారు గవర్నర్. కానీ ఎమ్మెల్సీల నియామకం ఫైలు వెళ్లి 4రోజులైనా ఇంతవరకూ ఆమోదం పొందలేదు. ఇందులో లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులుపై క్రిమినల్‌ కేసులు న్నట్లు గవర్నర్‌కు ఫిర్యాదులు అందాయని... అందుకే ఆ పేర్లపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారని రాజ్ భవన్ వర్గాల సమాచారం. తోట త్రిమూర్తులుపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదై ఉంది. అప్పిరెడ్డిపై పలు క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అంటున్నారు. తన కోటా కింద జరుగుతున్న నియామకాలు కావడంతో గవర్నర్‌ వీరి పేర్లను క్షుణ్ణంగా పరిశీలించారని.. నామినేటెడ్‌ కోటాలో నియమితమయ్యేవారు వివాదరహితులై ఉండాలని, నేర చరితులై ఉండకూడదని ఆయన ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.దీంతో స్వయంగా సీఎం జగనే గవర్నర్ ను కలిసి వివరణ ఇవ్వబోతున్నారని చెబుతున్నారు. ఆయన గవర్నర్‌కు నచ్చజెప్పి ఆమోదం పొందగలుగుతారా లేక ఆ రెండుపేర్లు తప్పించి వేరే పేర్లు ఇస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఇది ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇది మర్యాదపూర్వక భేటీయేనని  అంటున్నాయి. తన ఢిల్లీ పర్యటన వివరాలను గవర్నర్‌కు తెలియజేయడానికే ఆయన రాజ్‌భవన్‌కు వెళ్తున్నారని చెబుతున్నాయి. ఇటీవలే సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులను కలిశారు. అయినా ఎమ్మెల్సీ సీట్ల భర్తీలో గవర్నర్ కొర్రిలు వేయడం చర్చగా మారింది. కేంద్రం డైరెక్షన్ లోనే గవర్నర్ ఇలా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఢిల్లీ పర్యటన సాఫీగా సాగిందని వైసీపీ నేతలు చెబుతుండగా.. సీఎం జగన్ కు అమిత్ షా క్లాస్ పీకారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ వైఖరి కీలకంగా మారింది. మరోవైపు జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ రాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. తాజా పరిణామాలతో సీబీఐ కోర్టులో ఏం జరుగుతుందున్నది ఆసక్తిగా మారగా... వైసీపీ నేతల్లో మాత్రం టెన్షన్ పెంచుతుందని తెలుస్తోంది.    

ముంబైలో రూపాయికే లీటర్ పెట్రోల్.. బారులు తీరిన వాహనాలు..

దేశంలో ప్రస్తుతం పెట్రోల్ రేట్లు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ రేట్ సెంచరీ దాటేసింది. లీటర్ డీజిల్ ధర కూడా వందకు దగ్గరలోనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ లీటర్ పెట్రోల్ రేట్ హండ్రెడ్ మార్క్ దాటేసింది. రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ రేట్లతో వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయి. పెట్రోల్ కే తమ సంపాదన పోతుందనే ఆగ్రహం వాహనదారుల్లో వ్యక్తమవుతోంది. అయితే వంద రూపాయలు దాటిన లీటర్ పెట్రోల్.. కేవలం ఒక్క రూపాయికే వస్తే.. అది సంచనమే కదా.. ముంబైలోని ఓ ప్రాంతంలో అదే జరుగుతోంది. దీంతో వాహనదారులంతా అక్కడికి క్యూ కట్టారు. వాహనార రద్దీతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  మహారాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య థాకరే పుట్టిన రోజును పురస్కరించుకుని శివసేన మద్దతుదారులు డోంబివిలిలో రూపాయికే లీటరు పెట్రోలును పంపిణీ చేశారు. డోంబివిలి ఎంఐడీసీ ప్రాంతంలోని ఉస్మా పెట్రోలు పంపు వద్ద డోంబివిలి యువసేన నేత యోగేశ్ మహాత్రే వాహనదారులకు రూపాయికే పెట్రోలు అందించారు.  ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రెండు గంటలపాటు ఈ కార్యక్రమం జరిగింది. పెట్రోలు పోయించుకునేందుకు జనం రోడ్డుపై క్యూకట్టారు. అంబర్‌నాథ్‌లో శివసేన నేత అరవింద్ వాలేకర్ కూడా 50 రూపాయలకే పెట్రోలును పంపిణీ చేశారు. విమ్కో నాకా పెట్రోలు పంపులో పెట్రోలు పంపిణీ చేయడంతో.. అక్కడ కూడా వాహనాలు కిక్కిరిసిపోయాయి. 

గ‌డీని వీడి గ్రామాల్లోకి..  దొరకు ఈటల భయమా? 

తెలంగాణ‌లో దొర‌ల రాజ్యం. గ‌డీల పాల‌న‌. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే ప‌రిమితం. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కే అంకితం. స‌చివాల‌యానికి రాని ఏకైక ముఖ్య‌మంత్రి. మంత్రులు, ఎమ్మెల్యేల‌నే క‌ల‌వ‌డు. ఇక ప్ర‌జ‌ల‌నేం పట్టించుకుంటాడు. ఇలా సీఎం కేసీఆర్‌పై అనేక విమ‌ర్శ‌లు. అవ‌న్నీ అటు తిరిగి, ఇటు తిరిగి.. ఫామ్‌హౌజ్, ప్ర‌గ‌తి భ‌వ‌న్ ద‌గ్గ‌ర‌కే వ‌స్తాయి. చివ‌రాఖ‌రికి ఈట‌ల రాజేంద‌ర్ సైతం పార్టీని వీడుతూ ప్ర‌గ‌తి భ‌వ‌న్ మీదే దుమ్మెత్తిపోశారు. త‌న‌ను గేటు కూడా దాట‌నీయ‌లేదంటూ.. అది బానిస భ‌వ‌న్ అంటూ మాంచి మ‌సాలా డైలాగ్ పేల్చి పోయారు. ఏడేళ్లుగా కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లోనే ఉంటున్నా.. ఇటీవ‌ల ఆయ‌న టార్గెట్‌గా మాట‌ల తూటాలు డైన‌మైట్లా పేలుతుండ‌టంతో.. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ప్ర‌కంప‌ణ‌లు... గులాబీ బాస్‌లో అంత‌ర్మ‌థ‌నం...  అవును, నిజ‌మే.. ఉక్కు మ‌నిషి.. నిండు కుండ‌లా.. తొన‌గ‌ని ముఖ్య‌మంత్రి.. పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌. ఇటీవ‌ల క‌రోనా వ‌చ్చి ఫామ్‌హౌజ్‌లో రెస్ట్ తీసుకున్న‌ప్పుడు.. ఈ ఏడేళ్ల రాజ‌కీయాన్ని రివైండ్ చేసుకున్నార‌ట‌. త‌న పాల‌న‌లో త‌ప్పొప్పుల‌న్నిటినీ ఓ పేప‌ర్ మీద రాసుకున్నార‌ట‌. త‌న‌పై వ‌చ్చిన‌, వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌న్నిటి వీడియోలు తెప్పించుకొని చూశార‌ట‌. వాట‌న్నిటినీ క్రూడిక‌రిస్తే.. విమ‌ర్శ‌ల‌న్నీ.. త‌న‌పై వేలెత్తి చూపుతున్న అంశాల‌న్నీ.. ఒకే ఒక్క అంశం చుట్టూ తిరుగుతున్నాయ‌ని గుర్తించార‌ట‌. అందుకే.. ఆ ఒక్క ఇష్యూను సెట్ చేస్తే.. ఇక త‌న‌ను టార్గెట్ చేసే నోళ్ల‌న్నీ మూత‌ప‌డ‌తాయ‌ని డిసైడ్ అయ్యార‌ట‌. ఇంత‌కీ కేసీఆర్ చేస్తున్న ఆ మెయిన్‌ మిస్టేక్ ఏంటంటే.. ప్ర‌గ‌తిభ‌వ‌న్ వీడి ప్ర‌జ‌ల్లోకి రాక‌పోవ‌డం. ఏ రాజ‌కీయ స‌భ‌లో మిన‌హా.. ముఖ్య‌మంత్రిని క‌ళ్లారా చూసే, క‌లిసే అవ‌కాశం.. మంత్రి నుంచి సామాన్య జ‌నం వ‌ర‌కూ ఏ ఒక్క‌రికీ ద‌క్క‌క‌పోతుండ‌టంతో వారిలో అస‌హ‌నం, అసంతృప్తి చెలరేగుతోంద‌ని సీఎం గుర్తించార‌ని తెలుస్తోంది. అందుకే, క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత.. కేసీఆర్ వ‌ర్కింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింద‌ని గుర్తు చేస్తున్నారు.  గాంధీ హాస్పిట‌ల్‌ను సంద‌ర్శించ‌డం.. పీపీఈ కిట్ లేకుండానే కొవిడ్ వార్డులో క‌లియ తిర‌గ‌డం.. బాధితుల‌తో నేరుగా మాట్లాడ‌టం.. గాంధీ త‌ర్వాత వ‌రంగ‌ల్ ఎమ్‌జీఎమ్‌కు వెళ్ల‌డం.. అక్క‌డా క‌రోనా చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించ‌డం.. ఇలా ఎప్పుడూ లేని విధంగా.. సీఎం కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ వీడి.. ప్ర‌జా స‌మ‌స్య‌లపై బ‌య‌ట‌కి రావ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. అది ఆయ‌న‌లో వ‌చ్చిన మార్పున‌కు నిద‌ర్శ‌నం అంటున్నారు. ఈలోగా త‌న రైట్‌హ్యాండ్ ఈట‌ల రాజేంద‌ర్‌.. వెళ్తూ వెళ్తూ త‌న‌పై బ‌ట్ట‌కాల్చి మీదేసి పోయార‌నేది ఆయ‌న భావ‌న‌. నిజాలే అయినా.. అంత నిఖ్ఖ‌చ్చిగా చెప్ప‌డంతో.. గులాబీ బాస్ ఉలిక్కిప‌డ్డార‌ట‌. మంత్రినైన త‌న‌నే ప్ర‌గ‌తిభ‌వ‌న్ గేటు దాట‌నీయ‌లేదంటే.. ఇక సామాన్యుల మొర ముఖ్య‌మంత్రి ఏం వింటారంటూ ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే ధోర‌ణిలో ఈట‌ల.. ఈటెల్లాంటి మాట‌లు అనేసి.. త‌న ఇమేజ్‌ను మ‌రింత డ్యామేజ్ చేయ‌డంతో.. కేసీఆర్‌లో కంగారు మ‌రింత పెరిగింద‌ట‌. అందుకే, న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌ను ఇమ్మిడియేట్‌గా స్టార్ట్ చేశార‌ని చెబుతున్నారు. అదే, ఆక‌స్మిక త‌నిఖీలు..... తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 19 తర్వాత ఆకస్మిక తనిఖీలు చేసి పంచాయతీరాజ్‌, మున్సిపాలిటీ అధికారుల పనితీరును పరిశీలిస్తానని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించడం సంచ‌ల‌నం రేపుతోంది. అప్పుడెప్పుడో రెండు ద‌శాబ్దాల క్రితం చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు విన్న ప‌దం- ఆక‌స్మిక త‌నిఖీలు. అప్ప‌ట్లో సీఎం చంద్ర‌బాబు వివిధ ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను స‌డెన్‌గా విజిట్ చేసి.. పెండింగ్ ఫైళ్ల‌తో పాటు.. తోలుమందం అధికారుల దుమ్ముకూడా దులిపేసేవారు. ఆ ఆక‌స్మిక త‌నిఖీలు చంద్ర‌బాబుకు ఫుల్ పాపులారిటీ తీసుకొచ్చాయి. ఇన్నేళ్ల త‌ర్వాత‌.. ఇప్పుడు మ‌ళ్లీ కేసీఆర్ నోటి నుంచి ఆక‌స్మిక త‌నిఖీల మాట వినిపించ‌డం ఆస‌క్తికరంగా మారింది.  కేసీఆర్ ఆక‌స్మిక త‌నిఖీల నిర్ణ‌యంపై ఈట‌ల రాజేంద‌ర్ ఎఫెక్ట్ బాగానే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. త‌న‌పై త‌రుచూ వినిపించే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను వీడి ప్ర‌జ‌ల్లోకి రాడు.. అనే విమ‌ర్శ‌కు ఈ ఆక‌స్మిక త‌నిఖీల‌తో శాశ్వ‌తంగా చెక్ పెట్టొచ్చ‌నేది కేసీఆర్ స్ట్రాట‌జీగా భావిస్తున్నారు. ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌ను ప‌రిశీలించేందుకు గాను.. ముఖ్య‌మంత్రి గ్రామాలు, పట్ట‌ణాలు ప‌ర్య‌టిస్తే.. అది ప్ర‌జ‌ల్లో మాంచి ఊపు తీసుకొస్తుంద‌నేది కేసీఆర్ ఆలోచ‌న‌లా ఉంది. అస‌లే మాయ‌ల‌మ‌రాఠీలా రాజ‌కీయ గారెడీలు చేసే కేసీఆర్ క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తే.. ఆయ‌న క్రేజ్ అమాంతం పెర‌గ‌డం ఖాయం.. ఆ మేర‌కు ప్ర‌తిప‌క్షాల‌కే న‌ష్టం.. అనే వాద‌నా వినిపిస్తోంది. ఏదిఏమైనా.. ప్ర‌జ‌ల్లో సీఎం కేసీఆర్ గ్రాఫ్‌ దారుణంగా ప‌త‌న‌మైన వేళ‌.. ఫామ్‌హౌజ్‌ పాల‌న, దొర‌ల రాజ్య‌మంటూ జ‌నం విసుక్కుంటున్న వేళ‌.. త్వ‌ర‌లోనే కేసీఆర్ చేబ‌ట్ట‌బోయే ఆక‌స్మిక త‌నిఖీలు ఆయ‌న పొలిటిక‌ల్ ఇమేజ్‌పై ఎలాంటి ఎఫెక్ట్ చూపనుందో చూడాలి..

గులాబీ గూటికి ఎల్ రమణ! బీజేపీకి అంత సీన్ లేదట...

తెలుగు దేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్ . రమణ, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం ఖరారై పోయింది. రమణ పార్టీ మారతారని  ముందు నుంచి ఉహాగానాలు వినవస్తుండగా.. తాజాగా ఆయన నుంచి అదే సంకేతం వచ్చేసింది.  ఆదివారం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమైన రమణ.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమీ ఆశించకుండా, ఎలాంటి షరతులు లేకుండా, స్వచ్చందంగానే, పార్టీ మారుతున్నానని చెప్పుకొచ్చారు. వినిటోడు వెర్రోడైతే, చెప్పెటోడు సత్య హరిచంద్రుడే అవుతాడు. ముఖ్యంగా ఇలాంటి సందర్భాలలో, రాజకీయ నాయకుల నోటి నుంచి నిజాలను ఆశించడమే పెద్ద తప్పు. అది మన అమాయకత్వానికి పరాకాష్ట. అందుకు రమణ మినహాయింపు కాదు.  ఒక్క రమణ మాత్రమే కాదు, ఇంకెవరైనా దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుని, పార్టీ ఫిరాయించడం అంటే అది ఒక విధంగా ఆత్మను అమ్ముకోవడమే అవుతుంది. అయితే, గొంగళిలో  తింటూ వెంట్రుకలు ఏరుకోవడం ఎలాంటిదో, ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుకోవడం కూడా అలాంటిదే. అయితే, ఆత్మ వంచన లేకుండా, నిజాయతీగా నిజం చెప్పి, తమ దారిన తాము వెళ్ళిపోతే,అది కొంత హుందాగా ఉంటుంది. ఇంత చర్చ, ఇంత రచ్చ అవసరం ఉండదు .    ఇక రమణ చెప్పిన సూక్తులు వింటే, వార్నీ ... అనిపించక మానదు. మంత్రి పదవి మీదనే కాదు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ... ఆసలు ఏ పదవినీ తాను ఆశించలేదని, తనతోపాటు కారెక్కే కార్యకర్తలు కూడా, ఏమీ అశించవద్దని, అశించరాదని అన్నారు. అంతే కాదు ఆశించి భంగ పడేకంటే, ఏదీ అశించకుండా, పార్టీ మారిపోతే కనీసం భంగపాటు  ఉండదని  ... చక్కటి ధర్మోపన్యాసం దంచి కొట్టారు రమణ. నిజానికి ఆయన ఏమి ఆశించి పార్టీ మారుతున్నారో , ఎవరికీ తెలియదు. ఈటల రాజేందర్  కు ఉద్వాసన పలికిన నేపధ్యంలో కేసీఆర్ కేవలం తమ అవసరం కోసం రమణను పార్టీలోకి ఆహ్వానించారే తప్ప, ఈయనలోని నాయకత్వ లక్షణాలకు మురిసిపోయి పిలవలేదు. సో .. పార్టీ మారడం వలన రామణకు అధికార పార్టీ నాయుడు అన్న ట్యాగ్ తప్ప ఇంకేమి దక్కదు.    రమణ ఏమీ అశించ నప్పుడు, ఏ ఆశలు లేనప్పుడు ఇక పార్టీ మారడం ఎందుకు ? వ్రతం చెడ్డా ఫలితం దక్కని విధంగా, పార్టీ మారినా ఫలితం దగ్గదని తెలిసినప్పుడు, ఈ క్రతువు కంగాళీ ఎందుకు? అంతే కాకుండా, తా చెడ్డ కోతి వనమంతా చరిచింది అన్నట్లు, తమతోపాటు, కార్యకర్తలను కారెక్కించడం ఎందుకు?అనే ప్రశ్నలు ఆయన అనుచరుల నుంచే వినవస్తున్నాయి. రమణ ఈ సందర్భంగా చేసిన మరో ఒకటి రెండు వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. టీఆర్ఎస్‌ పార్టీలో 70 శాతం మంది నాయకులు తనకు తెలుసని, ఎక్కువ మంది సన్నిహితులేనని రమణ చెప్పారు. అది నిజమే, కేసీఆర్ నుంచి తలసాని వరకు మంత్రి వర్గంలోనే, అరడజను మందికి పైగా, టీడీపీ నుంచి వెళ్ళిన వారే ఉన్నారు. ఒక విధంగా చూస్తే ఒకప్పటి తెలంగాణ టీడీపీనే ప్రస్తుత తెరాస. ఈ అన్నిటినీ మించి ఎల్.రమణ ఎంత చేసినా.. రాష్ట్రంలో టీడీపీ ముందుకు వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇది పార్టీ పెద్దలు ఆలోచించవలిసిన సమస్య.

ప్రెసిడెంట్ రేసులో పవార్? పీకే ఆపరేషన్ ఫలించేనా..

ఎన్సీపీ అధినేత, శరద్ పవార్ పేరు మళ్ళీ మరో మారు,రాష్ట్రాపతి రేసులలో ప్రముఖంగా వినవస్తోంది. పవార్, ప్రస్తుత తరం జాతీయ నేతలలో సీనియర్ అయినా కాక పోయినా, పెద్దరికం పుణికి పుచ్చుకున్న నాయకుడు. ఆయన అధికార కూటమిలో ఉన్నా ప్రతిపక్ష ఫ్రంట్’లో ఉన్నా, రాజకీయాలతో సంబంధం లేకుండా, అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు పెట్టుకుంటారు. అందుకే అన్ని పార్టీలలోనూ ఆయనకు మంచి మిత్రులున్నారని, ఆయన్ని గౌరవించే వాళ్ళు, ఆయన గౌరవించే వాళ్ళు అన్నిపార్టీలలో ఉన్నారని,రాజకీయ వర్గాల్లో వినిపించే మాట. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రతిపక్ష  నాయకుల్లో పవార్ ‘ కు ప్రత్యేక ప్రధాన్యత, గౌరవం ఇస్తారని కూడా పవర్ కారిడార్స్’లో ప్రముఖంగా వినిపిస్తుంది.   రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఆయన్ని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధిగా తెరమీదకు తెచ్చారు. కొద్ది రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్, ముంబైలో పవార్’ తో భేటి అయ్యారు. ఈ భేటీలో ఆ ఇద్దరు  ఏమి చర్చించారో, ఏమో గానీ, ఈ భేటీ అనతరం శరద్ పవార్ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలు ఒక్కసారిగా మీడియాలో వినిపించాయి. జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. నిజానికి, రాష్ట్రపతి రేసులో పవార్’ చాలా పాత హెడ్లైన్. 2017 రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కూడా పవార్ పేరు ప్రముఖంగా వార్తల్లో వినిపించింది. కాంగ్రెస్ సారధ్యంలోని, యూపీఏ కూటమి సమావేశంలో, కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, పవార్ పేరును ప్రతిపాదించారు. అయితే అప్పట్లో పవార్, ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.అప్పట్లో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎ కూడా పవార్ పేరును పరిశీలనకు తెసుకుందని వార్తలొచ్చాయి. నిజానికి, ప్రధాని మోడీ శరద్ పవర్ మధ్య మంచి సంబదాలే ఉన్నాయని, మోడీ ప్రతిపక్ష నేతలు అందరిలో పవార్’కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారని అంటారు.  కొంత కాలం క్రితం శివసేన నేత, సంజయ్ రౌత్, కూడా, రాష్ట్రపతి ఎన్నికల్లో  పవార్  విపక్షాల అభ్యర్ధిగా బరిలో నిలవాలని సూచించారు. పార్టీ అధికార పత్రిక సామ్నాలో సంపాదకీయం రాశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా రౌత్, 2022 లో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో పవార్ విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేయాలని సూచించారు. అప్పటికి, విపక్షాల సంఖ్యా బలం పెరిగి, పవార్ గెలుపు సులువుతుందని రౌత్, జోస్యం కూడా చెప్పారు. అయితే, శరద్ పవార్ కానీ, ఎన్సీపీ కానీ, రౌత్ సూచనను పట్టించుకోలేదు.  అదలా ఉంటే, ఇప్పుడు ఇటీవల పవార్’తో సుదీర్ఘంగా దేశ రాజకీయాలు, 2024 ఎన్నికల వ్యూహం గురించి చర్చించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని శరద్ పవార్‌కు సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో ప్రతిపక్షాలన్నింటికీ ఆమోదయోగ్యమైన నాయకుడు పవార్‌ ఒక్కరే కనిపిస్తుండటం, అదే విధంగా ఆయనకు అన్ని పార్టీల  నాయకులతో ఉన్న సంబంధాల దృష్ట్యా ఈ వ్యూహగానాలకు ఇంకొంత  బలం చేకూరింది. అయితే, పవార్ కానీ, ఎన్‌సీపీ వర్గాలు కానీ, ఈ వ్యూహాగానలపై  ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. అవుననీ అనలేదు కాదనీ కొట్టేయలేదు.  ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే భారతీయ జనతా పార్టీ బలమే అధికంగా ఉండడం వల్ల ఆ పార్టీ అభ్యర్థే గెలిచే అవకాశాలు ఉన్నాయి. దీంతో అసలు.. పవార్‌ ఈ పదవికి పోటీ చేస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతే కాకుండా, సుమారు ఆరు దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న పవార్, రాష్ట్రపతి పదవిని అంగీకరిస్తారా అనేది కూడా ప్రశ్న గానే ఉంది. మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ, అలాగే, ప్రస్తుత ఉప రాష్ట్రపతి  వెంకయ్య నాయుడు, క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుని, రాజ్యాంగ పదవిని స్వీకరించినా, అనేక సందర్భాలలో  తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచారు. సో..ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నిజంగానే పవార్’తో అదే విషయం చర్చించారా, లేక 2024 పీఎం అభ్యర్ధి విషయమే  చర్చించారా, అనేది పక్కన పెడితే, పవార్ రాష్ట్రపతి రేసులో నిలిచేందుకు అంగీకరిస్తారా ? అనేది వెయ్యి కాదు వేల లక్షల డాలర్ల ప్రశ్న.

మంత్రి బుగ్గనకు ఘోర అవమానం..

ఆయనో మంత్రి... అయినా ఎయిర్ పోర్టు అధికారులు పట్టించుకోలేదు. లోపలికి అనుమతించలేదు. తాను మంత్రినని చెప్పుకున్నా వినిపించుకోలేదు. మంత్రైతే మాకేంటి.. లిస్టులో పేరు ఉంటేనే ఎంట్రీ అంటూ ఎయిర్ పోర్టు సిబ్బంది గేటు దగ్గరే ఆపేశారు. దీంతో చేసేది లేక వెనక్కి వెళ్లిపోయారు సదరు మంత్రి. తనకు జరిగిన అవమానంతో రగిలిపోతున్నారు. ఈ అవమానం జరిగిన మంత్రి ఎవరో కాదు.. ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి. ఏపీ  ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంత్రనాథ్ రెడ్డికి తిరుపతి విమానాశ్రయంలో ఈ అవమానం జరిగింది. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కు వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన మంత్రి ఎయిర్ పోర్టు సిబ్బంది అడ్డుకున్నారు. రన్ వేకు వెళ్లే రెండో గేట్ దగ్గర మంత్రి బుగ్గనను నిలిపివేశారు.  కేంద్రమంత్రి పియూష్ గోయల్ తిరుపతి నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో ఆర్థికమంత్రి వీడ్కోలు చెప్పాల్సి ఉంది. ఆ సమయంలో ఆయన లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ ఆయన్ను అడ్డుకున్నారు. ఆయన తాను రాష్ట్ర ఆర్థిక మంత్రిని అని చెబుతున్నా వినకకుండా తోసేసినట్టు తెలుస్తోంది.  తాను మంత్రినని బుగ్గ ఎంత చెప్పినా సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదు. లిస్టులో పేరు ఉన్నవారిని మాత్రమే పంపిస్తామని.. ఆ లిస్టులో బుగ్గన పేరులేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయ సిబ్బందితో మంత్రి వాగ్వాదానికి దిగారు. అధికారుల తీరుతో కేంద్రమంత్రికి ఆయన వీడ్కోలు పలకలేకపోయారు. ఎయిర్ పోర్టు డైరెక్టర్ నిర్లక్ష్య ధోరణి వల్లే ఇలా జరిగిందని తిరుపతి ఆర్డీవో వివరణ ఇచ్చారు. ఎయిర్ పోర్టు డైరెక్టర్ అనుమతి లేనిదే ఎవరికీ అనుమతి ఇవ్వలేం అంటూ ఎయిర్ పోర్టు టెర్నినల్ మేనేజర్ స్పష్టం చేశారు. తనను అడ్డుకున్నవారి వివరాలు ఇవ్వాలని బుగ్గన అడిగారని తెలుస్తోంది.  అంతకుముందు చిత్తూరు జిల్లా  తిరుచానూరు.. శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ దర్శించుకున్నారు. ఆయనతో పాటు మంత్రి బుగ్గను కూడా పాల్గొన్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ జేఈవో సదా భార్గవి ఇతర అధికారులు స్వాగతం పలికారు. దర్శనం ముగిసిన తరువాత తిరిగి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. 

ఆగ‌ష్టులోనే హుజురా-వార్‌... స‌మ‌యం లేదు ఈట‌ల‌!

ఎమ్మెల్యే ప‌ద‌వికి మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా. హుజురాబాద్‌కు త్వ‌ర‌లో ఉప ఎన్నిక‌. ఆరు నెల‌ల లోపు ఎల‌క్ష‌న్ ఎప్పుడైనా రావొచ్చు. క‌రోనా కాబ‌ట్టి అంత‌కంటే ఎక్కువ స‌మ‌య‌మూ ప‌ట్టొచ్చు. ఇన్నాళ్లూ ఇదే న్యూస్ చూశాం. తాజాగా, ఢిల్లీ వ‌ర్గాల నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర అప్‌డేట్ వ‌స్తోంది. ఆగ‌ష్టులోపే హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌ర‌గొచ్చ‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌భావం హుజురాబాద్ మీద ప‌డ‌బోతోంది. అంటే, బెంగాల్‌లో స్విచ్ వ‌స్తే.. హుజురాబాద్‌లో లైట్ వెల‌గ‌బోతోంద‌న్న‌ట్టు. అవును, బెంగాల్ ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్ ఈట‌ల రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ప్ర‌భావం చూప‌బోతోంది. మార్చిలో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ జారీ చేసింది కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌. బెంగాల్ దంగ‌ల్‌లో పోటీ ప‌డ‌టానికి ప‌లువురు ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి అసెంబ్లీ బ‌రిలో దిగారు. దీంతో, ఆయా చోట్ల‌ లోక్‌స‌భ స్థానాల‌కు ఖాళీలు ఏర్ప‌డ్డాయి. రాజీనామాల‌తో ఖాళీ అయిన పార్ల‌మెంట్ స్థానాల‌కు ఆరు నెల‌లలోగా ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఆ లెక్క‌న‌, బెంగాల్‌లో మార్చిలో చేసిన‌ రాజీనామాల‌కు.. ఆరు నెల‌ల వ్య‌వ‌ధి ఉంటుంది. అంటే, ఆగ‌ష్టుక‌ల్లా అక్క‌డ ఉప ఎన్నిక నిర్వ‌హించాల్సిన త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రోవైపు, క‌రోనా కార‌ణంగా ప‌లు రాష్ట్రాల్లో ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు మృతి చెందారు. ఆయా స్థానాల్లోనూ బైపోల్‌కు గ‌డువు ముంచుకురాబోతోంది. ఇలా, దేశ‌వ్యాప్తంగా ప‌లుచోట్ల ఈసీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సిద్ధ‌మైతే.. ప‌నిలో ప‌నిగా హుజురాబాద్‌లోనూ ఎన్నిక‌ల న‌గారా మోగేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఈసీ వ‌ర్గాల నుంచి అందుతున్న‌ స‌మాచారం.  జూన్ 12న‌ ఈట‌ల ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆగ‌ష్టులో హుజురాబాద్‌కు ఉప ఎన్నిక రాబోతుంద‌నే న్యూస్‌తో రాజకీయ వ‌ర్గాల‌న్నీ ఒక్క‌సారిగా అల‌ర్ట్ అయ్యాయి. ప‌ట్టుమ‌ని రెండు నెల‌ల్లోగా ఎల‌క్ష‌న్ జ‌రిగితే ఎవ‌రికి లాభం? మ‌రెవ‌రికి న‌ష్టం? అనే ఊహాగానాలు అప్పుడే మొద‌లైపోయాయి. ఆ గ‌డియార‌పు లెక్క‌ల చిక్కు ముల్లు భ‌లే ఆస‌క్తిగా ఉన్నాయి.  కేబినెట్ నుంచి అర్థాంత‌రంగా ఈట‌ల‌ను మెడ‌బ‌ట్టి గెంటేయ‌డంతో రాజేంద‌ర్‌పై సానుభూతి వెల్లువెత్తింది. తాజాగా ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఉద్య‌మ కార్య‌చ‌ర‌ణపై ఆస‌క్తి నెల‌కొంది. ఇలా విష‌యం వాడి-వేడిగా ఉన్న‌ప్పుడే ఎల‌క్ష‌న్ జ‌రిగితే.. అది ఈట‌ల‌కు అనుకూల ప‌రిణామం అయ్యే అవ‌కాశం ఉందంటున్నారు. ప్ర‌జ‌ల్లో ఈట‌ల ఎపిసోడ్ హాట్ హాట్‌గా ఉన్న‌ప్పుడే.. హుజురాబాద్‌లో ఎత్తుకు పైఎత్తు రాజ‌కీయం న‌డుస్తున్న‌ప్పుడే ఉప సంగ్రామం జ‌రిగితే.. ఆ ఎమోష‌న‌ల్ ఎన్విరాన్మెంట్ బాధితుడి ప‌క్షానే మొగ్గు చూపే ఛాన్సెస్ ఉంటాయ‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి. ఈట‌ల వ‌ర్గంపై స‌ర్కారు నుంచి బెదిరింపులు, తాయిలాలు పూర్తి స్థాయిలో రాక‌ముందే.. రెండు నెల‌ల్లోనే ఎల‌క్ష‌న్ కోడ్ వ‌చ్చేస్తే.. రాజేంద‌ర్‌కు అది సేఫ్ యాంగిల్‌గా మారుతుంద‌నేది ఓ విశ్లేష‌ణ‌. అదే ఉప ఎన్నిక ఆల‌స్యం అయినా కొద్దీ.. స‌ర్కారు నుంచి కేడ‌ర్‌పై ప్రెజ‌ర్‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, ప్ర‌భుత్వ ప‌థకాల అమ‌లుతో.. ఓట‌ర్ల‌కు గాలం వేసి.. అధికార‌పార్టీ వైపు మ‌ళ్లించే ప్ర‌య‌త్నాలు పెద్ద ఎత్తున జ‌రగ‌డం మామూలు విష‌య‌మే. అది టీఆర్ఎస్‌కే అనుకూలం.  అందుకే, ఇటు ఈట‌ల కానీ, అటు బీజేపీ కానీ.. హుజురాబాద్ ఉప ఎన్నిక ఎంత త్వ‌ర‌గా వ‌స్తే అంత బెట‌ర్ అని భావిస్తోంది. ఎలాగూ ఈట‌ల బీజేపీ కండువా క‌ప్పుకున్న‌ట్టే కాబ‌ట్టి.. ఈట‌ల‌కు అనుకూలంగానే బై ఎల‌క్ష‌న్ డేట్ వ‌చ్చే అవ‌కాశ‌మే ఎక్కువ అంటున్నారు. ఆ మేర‌కు రాజేంద‌ర్ ఇప్ప‌టికే ఢిల్లీ వ‌ర్గాల‌తో ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చార‌ని కూడా చెబుతున్నారు. అందుకే, ఆయ‌న స‌మ‌యం లేదు మిత్ర‌మా అన్నట్టు.. రాజీనామా చేయ‌క‌ముందు నుంచే హుజురాబాద్‌లో తెగ ప‌ర్య‌టిస్తున్నారు. వ‌రుస స‌మావేశాలు, రోడ్‌షోల‌తో బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగుతున్నారని అంటున్నారు.  జూన్‌లో రాజీనామా చేశార‌ని.. ఆరునెల‌ల్లోపు ఎన్నిక జ‌ర‌గాలి కాబ‌ట్టి.. అక్టోబ‌ర్ వ‌ర‌కూ వేచి చూసే ఓపిక ఇరు వ‌ర్గాల్లోనూ క‌నిపించ‌డం లేదు. అటు కేసీఆర్ సైతం హుజురాబాద్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టారు. మండ‌లాల వారీగా బాధ్య‌త‌ల‌ను బ‌డా నేత‌ల‌కు అప్ప‌గించారు. ఈట‌లకు పోటీగా బ‌ల‌మైన అభ్య‌ర్థిని ఎంపిక చేసే ప‌ని ఇప్ప‌టికే ప్రారంభించేశారు. ఎల‌క్ష‌న్ శంఖం ఎప్పుడు ఊదినా.. సంగ్రామానికి సిద్ధంగా ఉన్నాయి ఇరు ప‌క్షాలు.  మ‌ధ్య‌లో కాంగ్రెస్ మేట‌ర్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈట‌ల‌కు బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిగా మారిన కాంగ్రెస్ అభ్య‌ర్థి కౌశిక్‌రెడ్డి వ్య‌వ‌హారం ఆ పార్టీలో క‌న్ఫ్యూజ‌న్‌కు దారి తీసింది. ఇటీవ‌ల జ‌రిగిన ఓ ప్రైవేట్ ఫంక్ష‌న్‌లో మంత్రి కేటీఆర్‌తో కౌశిక్‌రెడ్డి క్లోజ్‌గా ఉండ‌టం.. వారిద్ద‌రు చాలాసేపు మాట్లాడుకోవ‌డం.. అనుమానాస్ప‌దంగా మారింది. కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్‌లోకి జంప్ అవుతున్నాడంటూ ప్రచారం జ‌రుగుతుండ‌టం.. అలాంటిదేమీ లేద‌ని.. తాను కాంగ్రెస్ నుంచే పోటీ చేసి.. ఈట‌ల‌ను ఓడిస్తానంటూ యంగ్ లీడ‌ర్‌ కౌశిక్‌రెడ్డి స‌వాల్ చేయ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. హుజురాబాద్‌లో కౌశిక్‌రెడ్డి స్ట్రాంగ్ క్యాండిడేట్‌. గ‌త ఎన్నిక‌ల్లో 60వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఈట‌ల‌కు ల‌క్ష‌కు పైగా ఓట్లు వ‌చ్చాయి. ఈ లెక్క‌న‌.. ఆ ల‌క్ష ఓట్లు.. ఈసారి ఈట‌ల‌కు, టీఆర్ఎస్‌కు మ‌ధ్య చీలిపోతే.. కాంగ్రెస్‌ ఓట్లు ఎప్ప‌టిలానే ప‌డితే.. గెలుపు త‌న‌దేన‌నే ధీమా కౌశిక్‌రెడ్డిలో క‌నిపిస్తోంది. హుజురాబాద్ ఉప పోరు.. ఈట‌ల‌, టీఆర్ఎస్‌కు మ‌ధ్య జ‌రిగే పోరుగానే చూడ‌కూడ‌ద‌ని.. మ‌ధ్య‌లో కౌశిక్‌రెడ్డి ఉన్నాడ‌నే విష‌యం మ‌ర్చిపోవ‌ద్ద‌ని అంటున్నారు. హుజురాబాద్‌లో జ‌ర‌గ‌బోయేది ట్ర‌యాంగిల్ వార్ అని తేల్చి చెబుతున్నారు.  ఇలా.. మూడు పార్టీలు.. మూడు వ‌ర్గాలు.. హుజురాబాద్ బైపోల్‌కు రెడీగా ఉండ‌టంతో.. ఎల‌క్ష‌న్ ఎప్పుడొచ్చినా స‌మ‌రమే అన్న‌ట్టుగా ఉంది సీన్‌. అయితే.. ఎన్నిక ఆల‌స్యం అయితే.. అధికార పార్టీకి కాస్త అడ్వాంటేజ్ అని చెబుతున్నారు. కానీ, ఆగ‌ష్టులోనే ఉప ఎన్నిక రాబోతోందంటూ ఢిల్లీ నుంచి స‌మాచారం లీక్ అవ‌డంతో.. స‌మ‌యం లేదు మిత్ర‌మా అంటూ అన్ని వ‌ర్గాలూ క‌త్తుల‌కు ప‌దును పెడుతున్నాయి. హుజురాబాద్‌ ఉప సంగ్రామానికి సై అంటున్నాయి. 

ఫామ్‌హౌజ్‌లో కిర్రాక్ పార్టీ.. మ‌స్త్ పోరీలు, పోర‌గాండ్లు.. క‌ట్ చేస్తే...

కుర్రాళ్లోయ్‌.. కుర్రాళ్లు.. వెర్రెత్తి ఉన్నోళ్లు.. ఆట‌గాళ్లు.. పాట‌గాళ్లు.. పోటుగాళ్లు.. అంతా ఓ ఫామ్‌హౌజ్‌లో చేరారు.. ఓ బ‌డాబాబు బ‌ర్త్‌డే పార్టీని య‌మ జోష్‌గా జ‌రుపుకున్నారు.. ఒక‌రు, ఇద్ద‌రు కాదు.. దాదాపు 70మందికిపైగా పోరీలు, పోర‌గాండ్లు... చూట్టానికి అంతా స్టూడెంట్స్‌లానే ఉన్నారు.. అంద‌రూ రిచ్‌కిడ్స్‌లానే క‌నిపిస్తున్నారు.. మ‌స్త్ పోష్‌గా రెడీ అయ్యారు.. లాక్‌డౌన్‌తో ఇన్నాళ్లూ ఇంట్లో బోరింగ్‌గా ఉన్న‌ట్టున్నారు.. ఫామ్‌హౌజ్‌లో బ‌ర్త్‌డే పార్టీ అన‌గానే అంతా రెచ్చిపోయారు.. ఎక్క‌డెక్క‌డి నుంచో వాలిపోయారు.. మాంచి హుషారు మీదున్నారు.. ఆ ఫోటోలు చూస్తేనే తెలుస్తుంది వాళ్ల మ‌స్త్ మ‌జా పార్టీ ఏ రేంజ్‌లో జ‌రిగిందో.... అది, రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లోని ఓ ఫామ్‌హౌస్‌... అర్థ‌రాత్రి స‌మ‌యం.. డీజే సౌండ్లు.. మంచి మంచి బ్రాండ్ల మందు బాటిళ్లు.. ర‌క‌ర‌కాల నాన్‌వెజ్ ఐట‌మ్స్‌... వారెవా.. బ‌ర్త్‌డే పార్టీ అంటే అట్లుండాలే.. అనే రేంజ్‌లో జ‌రిగిందా సెల‌బ్రేష‌న్‌... మిడ్‌నైట్‌.. ఫుల్ మ్యూజిక్‌తో.. ఫుల్‌గా మందేసి.. చిందేసి.. ర‌చ్చ రంబోలా చేశారు వారంతా... అస‌లే లాక్‌డౌన్ టైమ్‌.. ప్ర‌శాంతంగా ఉండే ఫామ్‌హౌజ్‌లో అర్థ‌రాత్రి అంత హంగామా జ‌రుగుతుంటే.. ఆ విష‌యం బ‌య‌ట‌కు రాకుండా ఉంటుందా? అలానే జ‌రిగింది.. ఫామ్‌హౌజ్ నుంచి అరుపులు, కేక‌లు, సౌండ్ల‌తో ఇరిటేట్ అయిన స్థానికులు డ‌య‌ల్ 100కి కాల్ చేశారు.. ఇంకేముంది ఖేల్ ఖ‌త‌మ్‌.. బ‌ర్త్‌డే పార్టీ బంద్‌.. తాగింది దిగ‌క‌ముందే ఖాకీలు ఎంట్రీ ఇచ్చారు.. పార్టీ అంతా ఫ‌స‌క్‌.... లాక్‌డౌన్‌లో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పార్టీ చేసుకున్నార‌నే కార‌ణంతో ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఫామ్‌హౌజ్ నుంచి భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. డీజేను సీజ్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

రాత్రికి రాత్రే 135 ఏళ్ల చరిత్ర నేలమట్టం! అంత రహస్యమెందుకు కేసీఆర్.. 

తెలంగాణలో మరో చరిత్రాత్మక కట్టడం కాలగర్భంలో కలిసిపోయింది. 135 ఏండ్ల చరిత్ర నేలమట్టం అయింది. హైదరాబాద్ లోని చరిత్రాత్మక సచివాలయ భవనాన్ని కూల్చినట్లే.. వరంగల్ సెంట్రల్ జైలును కూడా గప్ చుప్ గా నేలమట్టం చేశారు అధికారులు. శనివారం తెల్లవారుజామున మొదలైన కూల్చివేత పనులు.. ముమ్మరంగా సాగుతున్నాయి.పెద్ద పెద్ద యంత్రాలతో భవనాలను కూల్చేస్తున్నారు అధికారులు. ఇదంతా అత్యంత రహస్యంగా కానిచ్చేస్తున్నారు. కూల్చివేతలను పరిశీలించేందుకు మీడియాకు, జైల్ సిబ్బందికి గాని అనుమతి ఇవ్వడం లేదు. కూల్చివేతలకు సంబంధించి ఇప్పటివరకు కనీసం ఒక ఫోటో కూడా బయటికి రాలేదంటే.. ఎంత గప్ చుప్ గా పని కానిస్తున్నారో ఊహించవచ్చు.  సెంట్రల్ జైలును కూల్చవద్దంటూ ఓ స్వచ్ఛంద సంస్థ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేయనుందని వార్తలు వచ్చిన కొద్ది గంటల్లోనే అధికారులు చకచకా పనులు మొదలు పెట్టారు. జైలు అధికారులు శుక్రవారం రాత్రే ఆగమేఘాల మీద ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ వద్దకు వెళ్లి జైలు స్థలాన్ని అప్పగిస్తున్నట్లు లేఖ అందించారు. ఆ వెంటనే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి.ఇప్పటికే సగానికి పైగా భవనాలను కూల్చేశారని తెలుస్తోంది. కూల్చివేతలతో కేఎంసీ నుంచి వరంగల్ వైపు రోడ్డును క్లోజ్ చేసేశారు. ఎంజీఎం సెంటర్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జైల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్ బంక్‌ను సైతం క్లోజ్ చేశారు.  వరంగల్ జైలు కూల్చివేతల్లో అధికారులు తీరుపై విమర్శలు వస్తున్నాయి. మీడియాను సైతం అనుమతించకుండా జైలు గేట్లు మూసేసి భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేయాల్సిన అవసరం ఏముందని జనాలు ప్రశ్నిస్తున్నారు.సెంట్రల్ జైల్లో కూల్చివేతలు జరుగుతుంటే రోడ్డుపై కూడా నిర్బంధాలు ఎందుకంటూ జనం మండిపడుతున్నారు. అసలు కూల్చివేత విషయాన్ని ఎందుకంత గోప్యంగా ఉంచుతున్నారని నిలదీస్తున్నారు. భారతదేశంలోనే అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించిన  కారాగారం వరంగల్‌ సెంట్రల్‌ జైలు.  6వ నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ హయాంలో నిర్మిం చిన ఈ కారాగారానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి.  ప్రస్తుతం  దేశంలోనే అత్యంత పటిష్టమైనదిగా చెప్పుకుంటున్న తీహార్‌ జైలు నుండి కూడా ఎన్నోసార్లు ఖైదీలు తప్పించుకొని వెళ్లారు. కానీ 135 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన వరంగల్‌ జైలు నుండి ఇప్పటివరకూ ఒక్క ఖైదీ కూడా తప్పించుకొని పోలేదంటే, ఈ జైలు నిర్మాణం ఏవిధంగా ఉందో ఊహిం చొచ్చు. ఈ జైలులో నేసిన తివాచీలు ప్రపంచ ప్రఖ్యా తిని గాంచాయి. నక్సలైట్‌ అగ్రనేతలైన కానూ సన్యాల్‌తోపాటు కాళోజి, దాశరథి, వీవీ, ప్రస్తుత మావోయిస్టు అగ్రనేత గణపతి లాంటి ఎందరో ఈ జైలు జీవితం గడపిన వారే.  కాకతీయ సామ్రాజ్యంగా ఓరుగల్లుకు ఎంత చరిత్ర ఉందో, వరంగల్‌ కేంద్ర కారాగారానికి అంత పేరుంది. 19వ శతాబ్దం అంతం వరకు జైళ్ల పరిస్థితి దయనీయంగా ఉండేది. నేరస్తులు, నేరా రోపణ ఎదుర్కొంటున్న వారిని గోదాముల లాంటి గదుల్లో ధించేవారు. సరైన మరుగుదొడ్లు, నీటి సదుపాయాలు ఉండేవి కావు. అయితే 1880లో నిజాం ప్రభుత్వంలో హన్కిన్‌ అనే అధికారి జైళ్ల శాఖ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిజాం రాష్ట్రంలో జైళ్ల నిర్వహణలో గణనీయమైన మార్పులొ చ్చాయి. అందులో భాగంగానే, 1885లో వరంగల్‌ సెంట్రల్‌ జైలు నిర్మాణం జరిగింది. 15 ఏళ్ల క్రితం వరకు నాటి కట్టడ ప్రతిరూపంగా ఉన్న జైలు ముఖ ద్వారం స్థానంలో కొత్త ప్రవేశ ద్వార నిర్మాణం జరి గినా లోపల మాత్రం గత నిర్మాణాలు యధాతథంగా కన్పిస్తాయి. నాటి నుండి నేటి వరకు కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థతో పాటు పరిశుభ్రత, ఖైదీల్లో పరి వర్తనకు మారుపేరుగా నిలిచిందీ కారాగారం. జైళ్లను ఉత్తమ ప్రమాణాలు కలిగిన పరివర్తనాలయాలుగా మార్చినందుకు హన్కిన్స్‌కు నిజాం ప్రభుత్వం 1913లో ప్రత్యేక పురస్కారం అందచేసింది. వరంగల్‌ జైలు కమ్యూనిస్టు తీవ్రవాదులను ఉంచే ప్రధాన కారాగారంగా పేరొందింది. 2010 వరకు మావోయిస్టు, జనశక్తి పార్టీ వాళ్లకు ప్రత్యేక బ్యారక్‌లను కేటాయించేవారు. వారి కిచెన్‌లను వారే నిర్వహిం చుకునేవారు. ఖైదీలు కోర్టుకు వెళ్లకుండా ఇక్కడి నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపే సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ జైలులో ఐఎస్‌.ఐ. లాంటి వాటికి చెందిన కరుడు గట్టిన ఉగ్ర వాద ఖైదీలను ఉంచుతున్నారు.            13 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సెంట్రల్‌ జైలులో 700 మంది ఖైదీలను ఉంచడానికి అవకాశ ముండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు,  కృష్ణా జిల్లాల అండర్‌ ట్రయల్స్, నేరస్థులను కూడా ఇక్కడ ఉంచేవారు. విచారణ ఎదుర్కొనే అండర్‌ ట్రయల్స్‌కు ఇక్కడ ప్రత్యేక లాకప్‌ ఉండడం దానికి ఒక కారణం. ఖైదీలకు వైద్య సదుపా యాలు అందించడానికి ప్రత్యేక డిస్పెన్సరీ, విద్యావ కాశాలకుగానూ ఓపెన్‌ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌ కూడా ఉంది. ఇక్కడ శిక్ష అనుభవిస్తూనే అనేక మంది ఖైదీలు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులను పూర్తిచేశారు. దీనిలో బాస్కెట్‌బాల్, వాలీబాల్‌ తదితర క్రీడా సౌక ర్యాలున్నాయి. గతంలో ఈ జైలులోని ఖైదీలు, అండర్‌ ట్రయల్స్‌ రాసే రచనలు, కవితలు, కథలతో సుధార్‌ అనే ఇంటర్నల్‌ మ్యాగజైన్‌ కూడా వెలువరించేవారు. పలు వ్యాధులతో బాధపడే ఖైదీలను ఐసోలేషన్‌లో ఉంచడానికి ప్రత్యేక గదులున్నాయి.  సెంట్రల్ జైలు పరిధిలో ఉన్న 15 ఎకరాల వ్యవసాయ భూమిలో కూర గాయలు, మొక్కజొన్న, మామిడి చెట్లతో పాటుగా అనేక పూల మొక్కలను నేటికీ పెంచుతున్నారు. ఈ జైలు ఖైదీల ద్వారా పెట్రోల్‌ పంపులను కూడా నిర్వ హిస్తున్నారు. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన వరంగల్‌ సెంట్రల్‌ జైలు ఇకనుండి చరిత్రగానే మిగిలిపోనుంది. అయితే ఈ జైలు స్థలంలో అత్యాధు నిక ప్రమాణాలతో చిన్నపిల్లల ఆసుపత్రిని నిర్మించ డంపై వరంగల్‌ వాసులు సంతృప్తి చెందుతున్నారు.

ఉద్యోగాల భ‌ర్తీ ఇంకెప్పుడు? హామీల‌పై ఎందుకు మాట త‌ప్పుడు?

ఒక‌టి.. రెండు.. మూడు.. ఇప్పుడు నాలుగోది. సీఎం జ‌గ‌న్ ఎన్నిక‌ల హామీల‌పై వ‌రుస‌గా నాలుగో లేఖాస్త్రాన్ని సంధించారు ఎంపీ ర‌ఘురామ‌. అన్నీ ప్ర‌జా స‌మ‌స్య‌లే. అన్నీ జ‌గ‌న్ స్వ‌యంగా ఇచ్చిన హామీలే. అన్నీ మాట త‌ప్పి, మ‌డ‌మ తిప్పిన అంశాలే. న‌వ ర‌త్నాల ముసుగులో మ‌రుగున ప‌డిన‌ వైఫ‌ల్యాల‌ను అక్ష‌రాలా బ‌య‌ట‌కి తీస్తూ.. ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకొస్తున్నారు ఆ పార్టీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. తాజా లేఖ‌లో కీల‌క‌మైన ఉద్యోగాల భ‌ర్తీ క్యాలెండ‌ర్‌పై సీఎం జ‌గ‌న్‌ను నిల‌దీశారు.  ఏటా జ‌న‌వ‌రిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండ‌ర్ ఉంటుంద‌ని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేశారు ర‌ఘురామ‌. ఉద్యోగాల భ‌ర్తీ క్యాలెండ‌ర్ విడుద‌ల హామీ నెర‌వేర్చ‌లేద‌ని ప్ర‌శ్నించారు. ఈ హామీతోనే ఎన్నిక‌ల స‌మ‌యంలో నిరుద్యోగుల నుంచి మ‌ద్ద‌తు ల‌భించింద‌ని.. ఇప్పుడు ఆ హామీని ప‌క్క‌న‌పెట్టేయ‌డం స‌రికాద‌న్నారు. ఉగాదికి నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌న్న ఆశ‌తో నిరుద్యోగులు ఎదురు చూశార‌ని.. ఏపీ ప్ర‌భుత్వం వెంట‌నే ఉద్యోగాల భ‌ర్తీకి వార్షిక క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించాల‌ని సీఎం జ‌గ‌న్‌రెడ్డికి రాసిన లేఖ‌లో డిమాండ్ చేశారు ఎంపీ ర‌ఘురామ‌. ఏపీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివ‌రాల‌నూ ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ స‌చివాల‌యాల్లో 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని.. ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌లో 6,100 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వాల్సి ఉంద‌న్నారు. 18వేల ఉపాధ్యాయ, 6 వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు రిక్రూట్‌మెంట్‌కు సిద్ధంగా ఉన్నాయ‌ని లేఖ‌లో తెలిపారు. వంద‌ల సంఖ్య‌లో సెక్ర‌టేరియ‌ల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌న్నారు. 3వేల పోస్టుల కోసం 2018-19లో ఏపీపీఎస్సీ నోటిఫికేష‌న్ ఇచ్చింద‌ని.. కోర్టులో కేసుల కార‌ణంగా అంతంత మాత్ర‌మే భ‌ర్తీ అయ్యాయ‌ని గుర్తుచేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా మెగా డీఎస్సీ తీసుకొస్తామ‌ని సీఎం జగన్‌ ప్ర‌క‌టించార‌ని.. ప్ర‌తి కుటుంబానికి ప్ర‌భుత్వ ఉద్యోగం హామీని ఇప్ప‌టికీ నెరవేర్చ‌లేద‌ని ర‌ఘురామ‌ త‌న లేఖ‌లో నిల‌దీశారు. త‌న లేఖ‌కు స్పందించి వెంట‌నే ఉద్యోగాల నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు ఎంపీ ర‌ఘురామ‌.    వ‌రుస లేఖ‌ల‌తో ర‌ఘురామ మ‌రింత దూకుడు పెంచారు. ఇప్ప‌టికే, త‌న‌పై జ‌రిగిన దాడిపై దేశ‌వ్యాప్తంగా మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నారు. పార్ల‌మెంట్‌లో జ‌గ‌న్‌రెడ్డిని దోషిగా నిల‌బెట్టేందుకు స‌ర్వం సిద్ధం చేస్తున్నారు. ఓవైపు ఇలా త‌న వ్య‌క్తిగ‌త రివేంజ్ తీర్చుకుంటూనే.. మ‌రోవైపు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైనా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. గ‌తంలో ఇచ్చిన హామీల‌న్నీ ఏమ‌య్యాయంటూ లేఖ‌ల‌తో నిల‌దీస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు లేఖ‌లు రాయ‌గా వాటిపై ఏపీలో విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత‌కుముందు ఇలాంటివే మ‌రో మూడు లేఖ‌లు రాశారు. ఇచ్చిన హామీ మేర‌కు.. వృద్ధాప్య పింఛనును రూ.2,750కు పెంచాలని.. ఏపీలో సీపీఎస్‌ విధానం రద్దు హామీని వెంటనే నిలబెట్టుకోవాలని.. పెళ్లి కానుక‌, షాదీ ముబార‌క్ సాయం పెంచాల‌ని.. డిమాండ్ చేస్తూ ముఖ్య‌మంత్రికి లేఖ‌లు రాశారు. తాజాగా, నాలుగో లేఖ‌లో ఉద్యోగాల భ‌ర్తీ క్యాలెండ‌ర్ వెంట‌నే విడుద‌ల చేయాలంటూ సీఎం జ‌గ‌న్‌ను లేఖలో నిల‌దీశారు. ఇచ్చిన హామీలు నెర‌వేర్చాలంటూ.. ఎంపీ ర‌ఘురామ సీఎం జ‌గ‌న్‌రెడ్డికి రాస్తున్న లేఖ‌లు ఏపీలో తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి.   

బెల్లి లలిత అన్నకు ఎమ్మెల్సీ? ఈటల టార్గెట్ గా కేసీఆర్ సంచలనం..

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు స్థానంలో లేదు.. ఉద్యమ ద్రోహులే ప్రభుత్వంలో ఉన్నారు.. బంగారు తెలంగాణలో బలిదానాలకు గౌరవం లేదు.. ఇది కేసీఆర్ ప్రభుత్వంపై వస్తున్న ప్రధాన ఆరోపణలు. ఉద్యమకారులు, విపక్షాలే కాదు సామాన్య జనాల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రివర్గంలో ఉన్న నేతలు, ఉద్యమంలో వారి పాత్రను గమనిస్తే... కేసీఆర్ పై వస్తున్న ఆరోపణలు నిజమని భావించక తప్పదు. ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో ఈ వాదన మరింతగా వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ముందున్న ఈటలను తొలగించడంపై జనాల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న గులాబీ బాస్ కి కూడా ఈ విషయం అర్ధమైందని తెలుస్తోంది. నిఘా వర్గాల నుంచి తెప్పించుకున్న సమాచారం కూడా ఇలానే  ఉందట.  ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం, తాజాగా ఈటల ఎపిసోడ్ తోడవడంతో మొదటికే మోసం వస్తుందనే ఆందోళనలో కేసీఆర్ ఉన్నారట. అందుకే జనాగ్రహం నుంచి బయటపడేందుకు సీఎం కేసీఆర్.. సరికొత్త ఎత్తులు వేస్తున్నారని సమాచారం. అందులో భాగంగానే ఇంతకాలం నిర్లక్ష్యం చేసిన ఉద్యమకారులకు పెద్దపీట వేయాలని నిర్ణయించారట. ఈటెల రాజీనామా తో ఖాళి అయిన బీసి నాయకుడి స్థానాన్ని మరో బిసితో పాటు మలిదశ తెలంగాణా ఉద్యమానికి ఉపిరి పోసిన బెల్లి లలిత కుటుంబానికి ఇచ్చి  అండగ ఉండాలని  టిఆర్ఎస్ అధిష్టానం వ్యూహ రచన చేస్తోందని సమాచారం.  22 ఏండ్ల క్రితం మార్చి 29, 1999లో భువనగిరిలో దారుణ హత్యకు గురైంది బెల్లి లలిత. ఆమె శరీరాన్ని 17 ముక్కలుగా చేసి 17 బావుల్లో పడేశారు దుండగులు. ఈ ఘటన అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ గ్యాంగ్ ఈ హత్య చేసినట్లు తేలింది.  బెల్లి లలిత హత్య తర్వాత నయూం భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన కృష్ణ.. ఆ గ్యాంగ్ స్టర్ ఎన్ కౌంటర్ తర్వాతే మళ్లీ కనిపించారు. దాదాపు 20 ఏండ్ల పాటు ఆయన రహస్యంగానే ఉన్నారు. బెల్లి లలిత అన్న బెల్లి కృష్ణకు ఎమ్మెల్సీ ఇస్తే.. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీ నెరవేర్చడంతో పాటు బీసీకి సీటు ఇచ్చినట్లు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారట.  బెల్లి క్రిష్ణ యాదవ్ కి ఎమ్మెల్యే కోటలో MLC ఇచ్చి పార్టీలొకి ఆహ్వానం పంపినట్లు తెలుస్తున్నది.  దీనికి స్థానిక MLA తో పాటు బెల్లి క్రిష్ణయాదవ్ కు సన్నిహితంగా ఉన్న మరో ఇద్దరు MLAలతో పాటు మాజీ MLA కూడా  చర్చలు జరిపారని తెలుస్తుంది. ప్రస్తుత భువనగిరి MLA  సొంత ఊరు కుడా బెల్లి క్రిష్ణ యాదవ్ ఊరే కావడంతో ఇద్దరి మద్య మంచి సాన్నిహిత్యం ఉంది.  తెలంగాణ ఉద్యమానికి ఉపిరి పోసిన బెల్లి లలిత కుటుంబానికి అండగా ఉండాలని గతంలోనే కేసీఆర్ భావించారట. బెల్లి క్రిష్ణ యాదవ్ కి రాజ్యసభ సీటు ఇవ్వాలని నిర్ణయించినా.. చివరి నిమిషంలో కొంత మంది నాయకుల వల్ల  బడుగుల లింగయ్యకు ఇచ్చారని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ లో రోజు రోజుకు మారుతున్న రాజకీయ సమీకరణలు దృష్టిలో ఉంచుకుని బహుజన సామాజిక ఉద్యమ నాయకుడైన బెల్లి క్రిష్ణకి MLC  ఇచ్చి పార్టీలో చేర్చుకుంటే  అమరవీరుల కుటుంబానికి న్యాయం చేసినట్లు అవుతుందని టీఆర్ఎస్ లీడర్లు కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈటల రాజేందర్ సహా విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు దీనితో చెక్ పెట్టవచ్చని అంచనా వేస్తున్నారు గులాబీ నేతలు. 

20వేల పోలీస్ జాబ్స్‌.. త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్‌..

ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం చ‌కోరా ప‌క్షుల్లా ఎదురుచూస్తున్నారు నిరుద్యోగులు. ఏళ్ల త‌ర‌బ‌డి ఉద్యోగాల భ‌ర్తీ అట‌కెక్క‌డంతో చ‌దువుకున్న వారు పెద్ద సంఖ్య‌లో నిరుద్యోగులుగా మిగులుతున్నారు. ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తుండ‌టం.. స‌ర్కారుపై ఒత్తిడి పెరుగుతుండ‌టంతో.. ఉద్యోగాల భ‌ర్తీకి పూనుకుంటున్నారు. త్వ‌ర‌లోనే పెద్ద సంఖ్య‌లో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామంటూ ఇటీవ‌లే ప్ర‌క‌ట‌న కూడా చేశారు. తాజాగా 20వేల పోలీస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నట్టు ప్ర‌క‌టించారు తెలంగాణ హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ. తెలంగాణ‌లో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు అధిక ప్రాధాన్యత ఇస్తోంది ప్ర‌భుత్వం. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పాటు.. లేటెస్ట్ టెక్నాల‌జీతో పోలీసింగ్ సిస్ట‌మ్‌ను అమాంతం మార్చేశారు. సీసీకెమెరాలు, ఇంటిగ్రేటెడ్ మానిట‌రింగ్ సిస్ట‌మ్‌తో క‌మ్యూనిటీ సెక్యూరిటీని మ‌రింత టైట్ చేస్తున్నారు. ఆ మేర‌కు పోలీస్ శాఖ‌లో సిబ్బందినీ పెంచాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతోంది. అందుకే, తెలంగాణ రాష్ట్రం వ‌చ్చాక‌.. ఇప్ప‌టి వ‌ర‌కూ పోలీస్ శాఖ‌లోనే అధికంగా ఉద్యోగాలు భ‌ర్తీ అయ్యాయి. తాజాగా, మ‌రోసారి 20వేల పోలీస్ జాబ్స్‌కు త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ ఇస్తామంటూ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ స‌ర్కారు. కొత్త నోటిఫికేష‌న్‌లో మ‌హిళ‌ల‌కు 33శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేస్తామని హోంమంత్రి ప్ర‌క‌టించ‌డం విశేషం. 

చంద్రబాబుతో పని చేస్తానన్న సోనూసూద్.. ఏపీకి ఇక వరమే? 

కరోనా కల్లోలంలో ప్రజలకు నేనున్నాంటూ ఆదుకుంటున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. కష్టాల్లో ఉన్నామని చెబితే నిమిషాల్లో వారికి సాయం చేస్తూ రియల్ హీరోగా నిలిచారు. దేశ ప్రజలకు ఆప‌న్న హ‌స్తం అందిస్తున్న సోనూసూద్ .. త్వ‌ర‌లోనే టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబుతో క‌లిసి ప‌నిచేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. చంద్ర‌బాబు విజ‌న్ బాగుంద‌ని.. త‌న‌కు ఎప్ప‌టి నుంచో చంద్ర‌బాబు గురించి తెలుసున‌ని.. ఆయ‌నతో క‌లిసి ప‌నిచేసేందుకు తాను సిద్ధ‌మ‌ని సోనూ చెప్పడం రాజ‌కీయ వ‌ర్గాలతో పాటు సాధార‌ణ ప్ర‌జ‌ల్లోనూ ఆస‌క్తిగా మారింది. పొలిటికల్ హీరో, రియల్ హీరో కలిస్తే అద్బుతాలు జరగతాయని కొందరు ఆశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు వరమేనని మరికొందరు చెబుతున్నారు.  దేశానికి కరోనా విసురుతున్న సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలు అన్న అంశంపై.. వివిధ రంగాల నిపుణులు, ప్రముఖులతో తాజాగా చంద్రబాబు వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సమావేశంలో నటుడు సోనూసూద్తో పాటు వివిధ రంగాల నిపుణులు పాల్గొన్నారు. కొవిడ్‌ సమయంలో తనకు తోచిన సాయం అందిస్తున్నట్లు ఈ సంద‌ర్భంగా సోనూసూద్‌ తెలిపారు.విపత్కర పరిస్థితుల్లో సేవ చేయడం బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. కొవిడ్‌ మహమ్మారి చాలా మందిని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తోందని సోనూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సేవకు ఐక్య కార్యాచరణ రూపొందిద్దామని సోనూసూద్‌కు చంద్రబాబు సూచన చేశారు. త్వరలోనే ఐక్య కార్యాచరణ రూపొందిద్దామని కోరిన నేపథ్యంలో చంద్రబాబు సూచనను సోనుసూద్ అంగీకరించారు. క‌లిసి ప‌నిచేసేందుకు కూడా ఆయ‌న ముందుకు వ‌స్తున్న‌ట్టు తెలిపారు.ఆనాడు హైదరాబాద్ నగరంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడంతోపాటు జంటనగరాలను అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదేనని కితాబిచ్చారు. కరోనాపై పోరాటంలో తమ ఇద్దరి ఆలోచనలు కలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఈ రియల్ హీరో అన్నారు. ఆంధ్రా, తెలంగాణ.. తనకు రెండో ఇల్లు వంటివ‌ని సోనూ తెలిపారు. తన భార్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కావడం ఆనందకరమని అన్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలోనూ సాయం కోసం ఫోన్ కాల్స్ వచ్చేవని తెలిపిన సోనూసూద్‌ .. సమయంతో సంబంధం లేకుండా సేవ చేయడమే విధిగా భావించినట్లు స్పష్టం చేశారు. ఎవరికివారు తమ సాయాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దని.. సాయం కోరిన వారి పట్ల సేవ చేయడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోండని ప్రజలకు, అభిమానులకు సోనూ సూద్‌ సూచించారు. కుల, మత ప్రాంతాలతో పని లేదన్న ఆయ‌న‌.. తెలుగు రాష్ట్రాల్లో 18 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తొలిదశలో కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్‌తో పాటు 4 చోట్ల ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. భారత దేశ రాజకీయ చరిత్రలో చంద్రబాబునాయుడు తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. సుస్పష్టమైన ప్రణాళిక,దార్శనికత, ముందుచూపు కలిగిన అతి కొద్ది మంది నాయకుల్లో చంద్రబాబు ముందు వరుసలో ఉంటారు.  విజన్ 2020 పేరుతో ఏపీ అభివృద్ధికి  బీజాలు వేసిన రాజకీయ దార్శనీకుడు చంద్రబాబు. తెలుగునాట ఐటీ అంటే తెలియని రోజుల్లోనే హైదారాబాద్ లో ఐటీ రంగాన్ని అభివృద్ది చెయ్యడం చంద్రబాబుకే సాధ్యమైంది.  హైటెక్ సిటీ. భారీ వేతనాల తో కూడిన లక్షలాది ఉద్యోగృగాలు,ఏటా వేల కోట్ల రూపాయల ఐటి ఎగుమతులు ఇప్పుడు వస్తున్నాయంటే అందుకు అప్పటి చంద్రబాబు కృషే కారణం. బెంగుళూరు, ఈ విషయాన్ని ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశం మొత్తం అంగీకరిస్తుంది. అటువంటి విజనరీ హీరో చంద్రబాబుపై రియల్ హీరో సోనూ సూద్ తాజాగా ప్రశంసల జల్లు కురిపించడం, ఇద్దరం కలిసి పనిచేద్దామని సూచించడం సంచలనంగా మారింది. ఏపీ ప్రజలు ఈ పరిణామాలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

సోనూసూద్ ఆంధ్రా అల్లుడే.. ఆయన విజయాల వెనక ఆమె..

సోనూ సూద్.. నిజంగానే సోనా కంటే గొప్పవాడు.  లాక్ డౌన్ వేళలో ఎంతోమందిని ఆదుకున్నాడు. పేదలు గొంతెత్తి పిలిస్తే చాలు ప్రత్యక్షమైపోతున్నాడు. వంద రూపాయలిచ్చినా.. వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి వీడియోను వైరల్ చేసుకునే సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. కాని కోట్లు ఖర్చు పెట్టినా.. తీసుకున్నవాడు చెప్పేవరకు తెలియకపోవడమే సోనూసూద్ స్పెషాలిటీ. సింపుల్ గా ఉంటూ.. ఇంత సాయం.. భారతదేశంలో ఈ మధ్య కాలంలో ఎవరూ చేయలేదు. సాయం చేయడానికి, వచ్చిన రిక్వెస్టులను వెరిఫై చేయడానికి ఓ యంత్రాంగం.. దాని ద్వారా ఎవరికైనా గంటల్లో సాయం అందించడం చేస్తూ సోనూ సూద్ అందరి హృదయాల్లో ముఖ్యంగా తెలుగువారి హృదయాల్లో నిలిచిపోయాడు.  అయితే ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే.. సోనూసూద్ మన తెలుగింటి అల్లుడంట. ఇప్పటివరకు సోనూసూద్ పర్సనల్ విషయాలు ఎక్కడా బయటకు రాకపోవడంతో.. చాలా మందికి ఇది తెలియదు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అమ్మాయినే సోనూ పెళ్లి చేసుకున్నాడు. అది కూడా లవ్ మ్యారేజ్. ఆ అమ్మాయి పేరు సోనాలి. సోనూ సోనాలి దిల్ గెలుచుకుంది నాగపూర్ లో. అవును సోనూసూద్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు.. అదే యూనివర్శిటీలో సోనాలి ఎంబీఏ చదువుకుంది. మనోడు హ్యాండ్సమ్..మేడమ్ బ్యూటీ..మొత్తానికి ఎక్కడో చూపులు కలిశాయి..ఆ తర్వాత మాటలు కలిశాయి.. కొన్ని రోజులకు మనసులు కలిశాయి. ఇంకేముంది ప్యార్, ఇష్క్, మొహబ్బత్ అన్నీ ఒకేసారి వచ్చేశాయి. ఇద్దరూ ప్రేమించుకున్నారు. 1996లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు, ఇప్పుడు లైఫ్ హ్యాపీ. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎవరికైనా పెళ్లయిందంటే వాడి కెరీర్ ఖతమే. ఇక వాడు సంపాదన అనే రేసులో పరిగెత్తాలి..బ్యాంకు బాలెన్స్ పెంచాలి అంతే.. ఇంకే పిచ్చి పిచ్చివేషాలు వేయకూడదు. కాని సోనూసూద్ లైఫ్ టర్నింగ్ అయిందే పెళ్లయిన తర్వాత. 23ఏళ్ల వయసులోనే సోనూసూద్ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత సినిమాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొదట్లో కాస్త సందేహించినా..సోనూసూద్ ఆకాంక్షలను గౌరవించి సోనాలి ప్రోత్సహించింది. సోనూసూద్ అంటే ఎంత ప్రేమంటే.. అతడు, మరో నలుగురు స్నేహితులతో కలిసి ఉండే సింగిల్ బెడ్ రూమ్ లోనే ఉండటానికి సిద్ధపడిందట.. ఈ విషయం సోనూసూద్ చాలా గర్వంగా చెప్పుకున్నాడు. ఇంకో విషయం ఏంటంటే.. ఎవరైనా మంచి హైప్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటారు.. ఫ్లాప్ లు వచ్చాయంటే డైవర్స్ ఇచ్చి వెళ్లిపోయిన కేసులు కూడా ఉన్నాయి. ఇక్కడ అంతా స్పెషల్... తనకసలు కెమెరా కూడా చూడని టైములో పెళ్లి చేసుకుంది. అతడు స్టార్ అవడానికి తానే అండగా నిలిచింది. ఇప్పుడు తను కూడా సెలెబ్రిటీ అయింది. కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది. మామూలుగా ఒక్క రూపాయి బయట ఎవరికైనా ఇవ్వాలంటే.. భార్యకు తెలియకుండా అన్నాఇవ్వాలి.. భార్యను ఒప్పించి అయినా ఇవ్వాలి.. తెలిశాక దబిడిదిబిడే. అలాంటిది సోనూసూద్ తన ఆస్తులను పణంగా పెట్టి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటుంటే..పక్కన నిలబడి ప్రోత్సహించిందంటే.. వారిద్దరూ ఒకరి మనసును మరొకరు ఎంతగా అర్ధం చేసుకుంటే..ఇలాంటి మిరకిల్స్ సాధ్యమవుతాయి కదా.  సోనూసూద్ లాంటి వాడు దేశానికి గర్వకారణం అయితే.. అలాంటి వాడిని ఇంత ఎత్తుకు ఎదిగేలాచేసిన మన తెలుగింటి అమ్మాయి సోనాలి మనకు గర్వకారణం. హేట్సాఫ్ టు మిస్టర్ అండ్ మిసెస్ సోనూ సూద్.

ఈట‌ల‌కు ఐదేళ్ల గండం.. ఈసారీ రాజ‌కీయ సుడిగుండం?

కొంద‌రిది అదో ర‌క‌మైన జాత‌కం. వారి జీవిత‌మంతా అదోర‌కంగా సాగిపోతుంటుంది. అనేక ప్ర‌త్యేక‌త‌లు, అంత‌కుమించి సంచ‌ల‌నాల‌తో ముందుకు పోతుంటారు. ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. అంతే అధఃపాతాళాన్నీ చూస్తారు. అలాంటి ప్ర‌త్యేక కోవ‌లోకి ఈట‌ల రాజేంద‌ర్ కూడా చేరుతారు. వ‌రుస‌గా ఎమ్మెల్యేగా గెలుస్తూ వ‌చ్చారు. ఏనాడు ఓట‌మి ఎరుగ‌రు. ప్ర‌జాక్షేత్రంలో తిరుగులేని నేత‌గా నిలిచారు. రెండు ప‌ర్యాయాలు మంత్రిగా చేశారు. కానీ, ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఈట‌ల‌ ఏనాడూ పూర్తిగా ఐదేళ్ల పాటు ఎమ్మెల్యే ప‌ద‌విని అనుభ‌వించ‌కపోవ‌డం విచిత్రం. క‌మ‌లాపూర్ నుంచి వ‌రుస‌గా రెండుసార్లు.. హుజురాబాద్ నుంచి వ‌రుస‌గా నాలుగు మార్లు.. మొత్తంగా వ‌రుస‌గా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు ఈట‌ల రాజేంద‌ర్‌. అయితే, ఆయ‌న ఏనాడు పూర్తిగా ఐదేళ్ల పాటు ప‌ద‌విలో లేని ఎమ్మెల్యేగానూ రికార్డు నెల‌కొల్పారు ఆయ‌న‌. 2004లో మొద‌టిసారి టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా క‌మ‌లాపూర్‌లో పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు రాజేంద‌ర్‌. అయితే, ఐదేళ్లు నిండ‌కుండానే.. నాలుగేళ్లు గ‌డిచే స‌రికి.. కేసీఆర్ ఆదేశాల మేర‌కు 2009లో రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లారు. గెలిచారు.  ఆ త‌ర్వాత 2009లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరిగి కమలాపూర్‌ నియోజకవర్గం రద్దయింది. హుజూరాబాద్‌ కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పడింది. 2009లో హుజురాబాద్ నుంచి బ‌రిలో దిగిన ఈట‌ల మ‌రోసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే, ఏడాది గ‌డిచే స‌రికి మ‌ళ్లీ రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. 2010లో ఎమ్మెల్యే ప‌ద‌వికి రిజైన్ చేయ‌డం.. ఉప ఎన్నిక‌లో గెలవ‌డంతో ఈసారి నాలుగేళ్లు ప‌ద‌విలో కొన‌సాగారు.  2014లో ప్ర‌త్యేక తెలంగాణ‌లో మ‌రోసారి హుజురాబాద్ నుంచే పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి ప‌ద‌వి కూడా చేప‌ట్టారు. అయితే.. అప్పుడు కూడా ఐదేళ్లు ఎమ్మెల్యే ప‌ద‌విలో లేరు ఈట‌ల‌. సీఎం కేసీఆర్ ఆరు నెల‌లు ముందుగానే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డంతో.. నాలుగున్న‌రేళ్లు మాత్ర‌మే ప‌ద‌విలో ఉన్నారు రాజేంద‌ర్‌.  2018 అసెంబ్లీ ఎల‌క్ష‌న్స్‌లో మ‌ళ్లీ హుజురాబాద్ నుంచి విజ‌యం సాధించి.. ఆరోసారి ఎమ్మెల్యే అయి.. మ‌రోసారి మంత్రి అయ్యారు. అయితే, అనూహ్యంగా కేసీఆర్ కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ అవ‌డం.. పార్టీని వీడి ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేయ‌డంతో ఈసారి రెండున్న‌ర ఏళ్ల‌కే ప‌ద‌వి వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. ఇలా.. ఈట‌ల రాజేంద‌ర్ ఎమ్మెల్యేగా ఏనాడూ ఐదేళ్లు ప‌ద‌విలో ఉండ‌క‌పోవ‌డం కాక‌తాళీయ‌మే అయినా.. ఆస‌క్తిక‌రం.  హుజురాబాద్‌కు త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోవు ఉప ఎన్నిక‌లో ఈట‌ల గెలిచినా, ఓడినా సంచ‌ల‌న‌మే. ఓడితే, తొలిసారి ఓట‌మి చ‌విచూసిన వాడిగా నిలిచిపోతారు. గెలిస్తే మ‌రో రెండున్న‌రేళ్లు మాత్ర‌మే అధికారంలో ఉంటారు. ఈసారి కూడా రాజేంద‌ర్ ఐదేళ్లు ప‌ద‌విని అనుభ‌వించ‌లేరు. ఆయ‌న రాజ‌కీయ జాత‌కం అలాంటిది మ‌రి అంటున్నారు.   

తొడగొట్టనున్న రేవంత్.. బుడగ పేలిపోనుందా? 

తెలంగాణ కాంగ్రెస్ లో సస్పెన్స్ కు తెర పడిపోనుందా... ఇక ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ పడిపోతుందా? కాంగ్రెస్ వైఫైలోనే ఉన్న అసంతృప్తి రాగాలన్నీ మళ్లీ గట్టిగా ఎత్తుకోనున్నాయా..? ఏతులు పలికిన మొనగాళ్లు ఇక రెస్ట్ తీసుకుంటారా? ఏం జరగబోతుంది?హస్తినలో తెలంగాణ కాంగ్రెస్ నేతల మకాం వేశారు. ఇక కొన్ని గంటల్లోనే పీసీసీ చీఫ్ ఎవరో తేలిపోనున్నది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మధు యాష్కీ, ఇంకా కొందరు నేతలు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.పీసీసీ ప్రకటన వచ్చాకే వారు హైదరాబాద్ రానున్నారు. దాదాపు రేవంత్ రెడ్డి పేరే ఫైనలని హస్తినలో వినపడుతోంది. ఎప్పుడో ఫైనల్ అయినా ఎవరో ఒకరు..ఏదో ఒక పేరుతో అడ్డం పడుతుండటంతో.. అది ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్లే తయారైంది. కనీసం ఇప్పటికైనా పీసీసీ చీఫ్ ను ప్రకటించి... అన్నీఉన్నా గాంధీభవన్ నోట్లో శని అన్నట్లు పడుకున్నకాంగ్రెస్ ఇకనైనా లేపుతారని అనుకోవచ్చు. ఇప్పటిదా..ఎప్పటిదో.. ఈ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ. 2018లో కాంగ్రెస్ అసెంబ్లీలో ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి మొదలైంది ఇక ఉత్తమ్ వెళ్లుడే.. కొత్తోడు వచ్చుడేనని. అయినా అదే ఉత్తముడు ఏకంగా ఇప్పటికీ రెండున్నరేళ్లుగా ఆ కుర్చీని వదిలిపెట్టకుండా కూర్చున్నాడు. మధ్యలో రాజీనామా అని పద్ధతి కోసం చెప్పినా.. ఆ పద్దతి కోసమేనన్నట్లు అలాగే కొనసాగాడు... కొనసాగుతున్నాడు. అసలు ఆ పదవి కోసమే కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డి అప్పటి నుంచి దాని కోసం తన వంతు ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ నేతలు మంచానికి నాలుగు కోళ్లలా.... తలోవైపుకు లాగడంలో ఎక్స్ పెర్ట్స్. అలా రేవంత్ రెడ్డికి కుస్తీ, బాక్సింగ్, కబడ్డీ అన్నీ ఒకేసారి ప్రాక్టీస్ చేసినంత పనైంది.  ఉన్నంతో రాష్ట్ర వ్యాపిత ఇమేజ్ ఉండి.. బలం.. బలగం ఉండి.. ఆర్ధికంగా కూడా బ్యాకప్ ఉన్నవాడు రేవంత్ రెడ్డి.  తెలుగుదేశం నుంచి వచ్చాడని.. ఓటుకు నోటు కేసులో ఉన్నాడనే పాయింట్లు తప్ప... వేరే నెగెటివ్ పాయింట్స్ ఏమీ లేవు. అలాంటి రేవంత్ రెడ్డిని ఎలా ఎంపిక చేస్తారంటూ లెజెండ్ వీహెచ్ చాలాసార్లు ప్రశ్నించాడు.  ఇక పెద్దలు జానారెడ్డి గారైతే ఇప్పుడు.. మన...సాగర్..ఎన్నిక...అయ్యాక.. ఫైనల్ చేస్తే బాగుంటుందని లేఖ రాయడం.. సరే గెలిచే సాగర్ అనవసరంగా ఓడిపోతామని భయపడి అదిష్టానం దాన్ని పాలో అవడంతో మరో మూడు నెలలు వెనక్కు దేకించారు ఆ నిర్ణయాన్ని. ఇప్పుడు కూడా ఎప్పటికో అవుద్దని భయపడ్డారు..కాని ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానంలో కొన్నికుదుపులు రావడంతో.. కాస్త స్పీడ్ పెంచారు. ఇప్పటికైనా గేరు మార్చకపోతే మారలేమని అర్ధమైనట్లుంది.. కథ ముందుకు కదిలింది. ఇక కొన్ని గంటల్లోనే రేవంత్ రెడ్డి పేరు ప్రకటించడం...టీకాంగ్రెస్ లో తీన్ మార్ మొదలవటం ఖాయంగానే కనపడుతోంది.

కరోనా లెక్కల్లో ప్రభుత్వాల అబద్ధాలు

హమ్మయ్యా..ఎట్టకేలకు కరోనా లెక్కల వాస్తవాలు, అవాస్తవాలపై ఇప్పటికైనా చర్చ జరుగుతోంది. కరోనా కేసులు రోజువారీగా బులెటిన్లు విడుదల చేసే ప్రభుత్వాలు (ఇది కూడా కోర్టులు మొట్టికాయలు వేశాక మొదలెట్టారు).. వాటిల్లో వాస్తవాలు చెప్పటం లేదనే ఆరోపణలు మొదటి నుంచీ వస్తున్నాయి. లేటెస్టుగా మధ్యప్రదేశ్ లో లక్షా 70 వేల మరణాలు దాచి పెట్టారనే విషయం బయటకు రావడంతో... దీనిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అయితే జనం మాత్రం ఎప్పడూ దానిపై మాట్లాడుకుంటూనే ఉన్నారు. కరోనా పాండమిక్ డిసీజ్ కావడంతో.. దీనిపై పానిక్ అయ్యేలా వార్తలిస్తే.. అదో కేసు మళ్లీ.  అందుకే మీడియా కూడా వాస్తవాలు తెలిసినా.. బుద్ధిగా ప్రభుత్వాలు చెప్పిన ఫిగర్లనే వేస్తూ వచ్చారు. మన దేశంలో ఈ విషయంలో జాతీయ మీడియా చాలా బెటర్. నేరుగా ఫీల్డ్ కు వెళ్లి.. మరణాలు ఎక్కువున్నాయని శ్మశానాలు చూపించారు లైవ్ లో. గంగానది ఒడ్డుకు శవాలు కొట్టుకు రావడంతో.. ఈ విషయంపై సీరియస్ నెస్ మరింత పెరిగిందనే చెప్పాలి. అటు ఏపీ, తెలంగాణ రెండు చోట్లా కరోనా లెక్కల్లో నిజాయితీ లేదనే ఆరోపణలు ఉన్నాయి. గాంధీ ఆస్పత్రిలో మరణాలపైన ప్రశ్నిస్తేనే.. అవి గుండెపోటుతో చనిపోయినవని..సర్టిఫికెట్ లో అవే ఉన్నాయని.. కరోనా వచ్చినా.. చివరకు వారు చనిపోయింది మాత్రం గుండెపోటుతోనే అని ఆస్పత్రి సూపరిండెంట్ అధికారికంగా చెప్పారు. ఇంకేమనగలం చెప్పండి.  ఆంధ్రప్రదేశ్ లో చాలామంది ఎవరికివారు.. తమ బంధువులు, స్నేహితులు, తెలిసినవారు చనిపోతుంటే భయంతో వణికిపోయారు.  ఎవరికివారు లెక్కలేసుంటే వారి వారి సర్కిల్స్ లోనే 10 నుంచి 50 మందిదాకా తేలేవారు. కాని ప్రభుత్వం మాత్రం రోజువారీ కరోనా మరణాలు 50 నుంచి 100 వరకు మాత్రమే చూపించింది. ఒక్క ఉదాహరణ చాలు..అవి ఎంత ఖచ్చితమైన లెక్కలు అర్ధం చేసుకోవాలంటే.  ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రిలో ఒక రోజు 33 మంది చనిపోయారు. కాని ఆ రోజు బులెటిన్ లో ప్రకాశం జిల్లా మొత్తం ముగ్గురే చనిపోయినట్లు రిపోర్టు ఇచ్చారు. ఇదొక్కటి చాలు మనకి.. మరణాలు అధికంగా అవుతున్నాయని .. జనాన్ని భయాందోళనకు గురిచేసి.. పానిక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాని వాస్తవాలు దాచి పెట్టి.. తద్వారా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నిస్తే అది క్షమించరాని నేరం అవుతుంది. మీడియాకు తెలుస్తుంది... ఎక్కడికక్కడ జనానికి తెలుస్తుంది..కాని కళ్లు మూసుకుని తాగే పిల్లి లాగా.. లెక్కలు తగ్గించి చెప్పుకుంటే ఎవరికి ఉపయోగం? ఏపీలో 20 వేలు కేసులు చూపించినప్పుడు.. దాదాపు 60 వేల పైనే ఉన్నాయని.. 10 వేలకు తగ్గించాక.. అవి 30, 40 వేలు ఉన్నాయని..ఇప్పుడు 6, 7 వేలు చూపిస్తున్నారని..వాస్తవంలో ఇప్పుడు 20 వేలు ఉంటాయని..కొందరు ఆరోపిస్తున్నారు. ఒక్క ఆస్పత్రికి వెళ్లినా యావరేజ్ మిగతాచోట్ల పరిస్ధితి ఏంటో తెలిసిపోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు వాస్తవాలనే బులెటిన్లలో ఇస్తే.. ప్రజలంతా ఒక అంచనాకు రాగలుగుతారు. పై నుంచి చెప్పే హెచ్చరికలకు, డాక్టర్లు చెప్పే జాగ్రత్తలకు, ప్రభుత్వాలు ఇచ్చే లెక్కలకు పొంతన లేకపోతే.. ప్రజల్లో సరైన అవేర్ నెస్ ఎలా ఆశించగలం మనం?

ఉద్యోగం పేరుతో.. ప్రభుత్వ అధికారి కమిట్మెంట్.. చివరికి ఇలా..  

కమిట్‌మెంట్ ఈ మాట వినగానే అందరికి గుర్తుకు వచ్చేది సినిమా ఇండస్ట్రీ.. ఇలాంటి చిన్న వార్త వినిపించగానే అందరి కళ్ళు ఒక్కసారిగా ఆ విషం మీద పడి రచ్చ రచ్చ చేస్తారు.. ఎందుకంటే సినిమా అంటే క్రేజ్ ఉంటుంది కాబట్టి.. జనాలకు కూడా వాళ్ళ గురించి తెలుసుకోవాలని మోజు ఉంటుంది కాబట్టి.. సినిమా ఇండస్ట్రీ లో జరిగితే అందరికి తెలుసు కాబట్టి ప్రశ్నిస్తారు.. మరి అదే రోజులు సమాజంలో జరిగే కమిట్మెంట్స్ గురించి ఎంత మంది ప్రశ్నిస్తున్నారు.. రోడ్డు ఎక్కి వాళ్లకు న్యాయం జరగాలని ధర్నాలు చేస్తున్నారు..ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే.. తాజాగా ఉద్యోగం ఇప్పిస్తాను అని ఒక మహిళకు కమింట్మెంట్ అడిగాడు ఒక ఉగ్యోగి.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి.. నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఘటన మరువక ముందే ఏపీలో మరో అమానుష ఘటన వెలుగుచూసింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి యువతిని నేరుగా కమిట్‌మెంట్ అడిగిన ఉన్నతాధికారి బాగోతం బయటపడింది. ఇలా మనదేశంలో మన రాష్ట్రాల్లో బయటపడని సంఘటనలు ఎన్నో ఉన్నాయి..   పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువతి విడుదల చేసిన సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. శారీరక వాంఛలు తీర్చుకుని ఉద్యోగం ఇవ్వలేదని.. వెళ్లిన ప్రతిసారీ మళ్లీ కోరిక తీర్చాలని వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. బాధితురాలి కథనం మేరకు.. ఇద్దరు మధ్యవర్తులు ఉద్యోగం ఇప్పిస్తామని కేఆర్ పురం ఐటీడీఏ ఉన్నతాధికారి వద్దకు తీసుకెళ్లారని యువతి తెలిపింది. ఆయన తణుకులో వార్డెన్ ఉద్యోగం ఇప్పిస్తానని.. తనను కమిట్‌మెంట్ అడిగాడని చెప్పింది. ఉద్యోగం కోసం ఆశతో.. గత్యంతరం లేక ఆయనకు లొంగిపోయానని.. పలుమార్లు ఆయన తనతో తీసుకెళ్లారని ఆరోపించింది. ఆ తర్వాత ఉద్యోగం కోసం అడిగినా పట్టించుకోవడం లేదని ఆమె వాపోయింది. వెళ్లిన ప్రతిసారీ మళ్లీ తనతో రమ్మంటూ వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొంది. ఉద్యోగం రాకపోగా.. లొంగిపోయి మోసపోయానని.. తనలా మరో అమ్మాయికి జరగకూడదనే ఉద్దేశంతోనే బయటపెడుతున్నానని ఆమె ఆవేదన చెందింది. ఈ వీడియో సీఎం జగన్ వరకూ వెళ్లాలని.. తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంంటోంది.

యూపీ ఎన్నికల బరిలో ఎంఐఎం.. ఎవరికి లాభం?  

ఒకప్పుడు హైదరాబాద్ పాత బస్తీకి పరిమితమైన ఓవైసీల కుటుంబ పార్టీ, అల్ ఇండియా మజ్లీస్ ఈ - ఇత్తెహాదుల్ ముస్లిమాన్ (ఏఐఎంఐఎం) పార్టీ గత కొంత కాలంగా, దేశంలోని అన్ని రాష్ట్రాలలో విస్తరించేందుకు విశ్వ ప్రయత్నాలు సాగిస్తోంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా,  అన్ని రాష్త్రాలలో ఎన్నికల బరిలో దిగుతోంది. మహా రాష్ట్రలో  రెండు అసెంబ్లీ స్థానాలతో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటకలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఒకటి రెండు చోట్ల విజయం సాధించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన బెంగాల్, తమిళనాడులో పోటీ చేసినా ఫలితం లేక పోయింది. బెంగాల్లో, ఐఎస్ఎఫ్’తో పొత్తు కుదిరినా కూటమి   చివరి నిముషంలో ఎంఐఎంకు చెయ్యిచ్చి హస్తం పార్టీతో చేతులు కలిపింది. మరో వంక ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు జమిరుల్ హసన్’ పార్టీకి రాజీనామా చేసి మమతా బెనర్జీ గూటికి చేరారు. అయినా ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, పట్టువదలని విక్రమార్కునిలా ఏడు స్థానాల్లో అభ్యర్ధులను నిలబెట్టారు. ఏడుగురు ఓడిపోతే పోయారు గానీ, ఒవైసీ బెంగాల్లో ఎంఐఎం ఉనికిని అయితే నిలబెట్టారు.  ఇదలా ఉంటే, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి,మార్చిలో జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 100 సీట్లలో అభ్యర్ధులు నిలిపేందుకు ఎంఐఎం సిద్ధమవుతోంది. అంతేకాదు, ఒవైసీ ఇప్పటికే  మాజీ మంత్రి ఓం ప్రకాష్ రాజ్భార్ సారధ్యంలోని తొమ్మిది పార్టీల కూటమి, భగీధరీసంకల్ప మోర్చా (బీఎస్ఎం)తో పొత్తు కుదుర్చుకున్నారు.అయితే, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్న బీజేపీ, రాజ్భార్ సారధ్యంలోని ఎస్బీఎస్పీని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. రాజ్భార్ ఒకప్పుడు బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. సో, ఆయన కాషాయ కూటమి వైపు వెళ్ళినా, అసదుద్దీన్ ఒవైసీ, తమ కూటమిలోకి  ఓబీసీ, దళిత,మైనారిటీలను చేర్చుకుని వందకు పైగా స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు.  ఎన్నికలలో పోటీ చేయడంతో పాటుగా సంస్థాగతంగా పార్టీ నిర్మాణానికి కూడా ఒవైసీ  ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్టంలోని మొత్తం 75 జిల్లాలకు, జిల్లా అధ్యక్షులను నియమించారని,  ఎంఐఎం యూపీ అధ్యక్షుడు షౌకత్ అలీ చెప్పారు. నిజానికి ఎంఐఎం 2017 అసెంబ్లీ ఎన్నికల్లో నే 36 స్థానలకు పోటీ చేసింది.అన్ని చోట్లా ఓడి పోయింది. అయితే ఇటీవల జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో 24 సీట్లు గెలుచుకుంది.పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ కొంత నష్ట పోయినా, పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకు పోలేదు. ఈ పరిస్థితులలో ఎంఐఎంపొతే చేయడం వలన ముస్లిం ఓటు చీలిపోయి, బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  తొమ్మిది పార్టీల కూటమి, ఎస్పీ లేదా బీఎస్పీతో పొత్తు పెట్టుకోకపోతే, యూపీలో బీజేపీని ఓడించడం అయ్యే పని కాదని కూడా పరిశీలకు భావిస్తున్నారు. ఎంఐఎం కూటమి చివరకు కాషాయ కూటమికి మేలు చేసేందుకు తప్ప ఇంకెందుకు పనికి రాదని విశ్లేషకులు అంటున్నారు. మరో వంక, ఎంఐఎం కాషాయ పార్టీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని, ముస్లిం ఓట్లను చీల్చెందుకే యూపీ బరిలో దిగుతోందని, ప్రత్యర్ధి పార్టీలు ఆరోపిస్తున్నాయి.ఏది ఎలా ఉన్నప్పటికీ, హైదరాబాద్ పాతబస్తీ పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతోంది.