వేటు అంత వీజీ కాదు.. నన్నేమీ చేయలేరు.. జగన్‌రెడ్డికి రఘురామ సవాల్..
posted on Jun 12, 2021 @ 12:38PM
పార్లమెంట్ సెషన్ జరగబోతోందనే టెన్షన్ ఒకవైపు.. రఘురామ ఎపిసోడ్‌లో తాను దోషిగా నిలబడాల్సి వస్తుందనే ఆందోళన మరోవైపు.. వెరసి సీఎం జగన్‌రెడ్డి రఘురామ విషయంలో మానసికంగా బాగా నలిగిపోతున్నారట. అందుకే, రఘురామను పార్లమెంట్‌లో అడుగుపెట్టకుండా చేయాలని జగన్‌రెడ్డి అత్యంత బలంగా కోరుకుంటున్నారట. జస్ట్.. కోరుకుంటే సరిపోద్దా? ఎంపీ రఘురామపై వేటు వేయడం అంత ఈజీనా? కానే కాదు. నేనేమి చేశాను నేరం.. అంటూ రఘురామ రివర్స్ అవడమే కాకుండా.. జగన్‌రెడ్డి తనపై చేసిన దారుణాలన్నిటిపైనా పార్లమెంట్ ముందుంచేందుకు రెడీ అవుతున్నారు.
జూలైలో పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయనే వార్తలతో.. జగన్‌రెడ్డిలో కలవరపాటు పెరిగిపోతోంది. సమయం లేదు శత్రువా.. అంటూ రఘురామకు కౌంటర్ అటాక్ ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు. అయితే, వైసీపీ ముందున్న ఒకే ఒక ఆప్షన్.. లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం. అందులో భాగంగా.. వైసీపీ ఎంపీగా ఎన్నికైన రఘురామ.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు కాబట్టి.. ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సభలో వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీనిపై రఘురామ కౌంటర్ ఇచ్చారు.
తాను ఏ పార్టీతోనూ జట్టుకట్టలేదని.. అధికార పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించలేదని అన్నారు ఎంపీ రఘురామ. ప్రభుత్వ సంక్షేమ ఫలితాల అమలులో లోపాలను మాత్రమే ప్రస్తావించానని.. తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. '' కొంతమంది తప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేశా. వాస్తవాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి. నాపై దాడి చేసిన వారి విషయంలో మరోసారి ప్రివిలైజ్ మోషన్ ఇస్తా. నాపై ఈ నెల 10న ఫిర్యాదు చేసి 11న చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. హోంమంత్రిని సీఎం కలిశాకే ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. అనర్హత వేటుపై ఇప్పటికే నాపై నాలుగైదు సార్లు ఫిర్యాదు చేశారు'' అంటూ రఘురామ ఎదురుదాడి చేశారు.
రఘురామ అంత తెలివి తక్కువ వాడు ఏమీ కాదు. ఆయన ఎక్కడా చిక్కకుండా.. ఎక్కడా పార్టీ లైన్ తప్పకుండా.. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చారు. విమర్శలన్నీ సీఎం జగన్‌రెడ్డిపైనే అయినా.. సలహాలు, సూచనలనే కాన్సెప్ట్‌తో సర్కారును ఏకిపడేసేవారు. వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తప్పుడు విధానాలపై ప్రతినిత్యం దుమ్మెత్తిపోసేశారు. టెక్నికల్‌గా చూస్తే.. ఇవేవీ పార్టీ వ్యతిరేక విధానాలు కావు. అందుకే అవేవీ రూల్స్ అతిక్రమించినట్టు కాదు. అందుకే, తనపై బహిష్కరణ వేటు వేయడం అసాధ్యమని రఘురామ ధీమాగా చెబుతున్నారు. లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ చీఫ్ విప్ భరత్ ఇచ్చిన ఫిర్యాదుతో ఉపయోగం ఏమీ ఉండదని అంటున్నారు. జూలైలో జరగబోయే పార్లమెంట్ సమావేశాలకు తాను హాజరవుతానని.. తనపై జరిగిన దాడిని పార్లమెంట్ ముందు ఉంచుతానని.. సీఎం జగన్‌రెడ్డిని దేశ ప్రజల ముందు దోషిగా నిలబెడతానని సవాల్ చేస్తున్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు. వెయింట్ ఇక్కడ.. అంటూ ఢిల్లీలో ఉంటూ ఏపీ సీఎం జగన్‌రెడ్డిని దడదడలాడిస్తున్నారు.