దేవాలయ భూములు దేవుడివే ...మద్రాస్ హైకోర్టు తీర్పు
రాజుల సొమ్ము రాళ్ళ పాలు... ఇది ఒకప్పటి సామెత, దేవుడి సొమ్ములు దయ్యాల పాలు, ఇది నేటి వాస్తవం. ఒక రాష్ట్రమని కాదు, ఒక ప్రభుత్వం అని కాదు, దేవుని ఆస్తులు, దేవుని భూములు అన్యాక్రాంతం కానీ రాష్ట్రం దేశంలో లేనే లేదు. భక్తులు దేవునికి భక్తితో సమర్పించుకున్న భూములు, ఇతర ఆస్తులు, దైవ కార్యానికి ఉపయోగించాలే కాని, మరెందుకు ఉపయోగించరాదు. అయితే, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజోపయోగ కార్యక్రమాల పేరున, దేవుని భూములను వినియోగించుకోవడం మాత్రమే కాదు, ఏకంగా అమ్మేస్తున్నాయి. ఇది, ధర్మ విరుద్ధం. చట్ట విరుద్ధం.ఇదే విషయాన్ని, మద్రాస్ హై కోర్టు మరో మారు స్పష్టం చేసింది. దేవాలయాల భూములు ఎప్పటికీ దేవాలయాల భూములే, దేవాలయ భూములుగానే ఉంటాయి. ప్రజోపయోగం పేరున దేవాలయాల భూములు తీసుకోవడం, కుదరదు, అది చట్ట రీత్యా నేరం అని మద్రాస్ హై కోర్టు, బుధవారం స్పష్టమైన తీర్పును ఇచ్చింది.
ఈ తీర్పుకే కాదు ఈ కేసుకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే, ఒక పత్రికలో ప్రచురించిన లేఖ ఆధారంగా న్యాయస్థానం సుమోటోగ కేసును విచారణకు స్వీకరింఛి. సంచలన తీర్పును ఇచ్చింది . వివరాల్లోకి వెళితే...2015లో జనవరి 8వ తేదీన, ‘ది హిందూ’ దినపత్రికలో, ‘ది సైలెంట్ బరియల్’ మకుటంతో వచ్చిన లేఖ ఆధారంగా మద్రాస్ హై కోర్టు అప్పటి ప్రధాన న్యాయయముర్తి( ప్రస్తుత సుప్రీం కోర్టు న్యాయమూర్తి) జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ సుమోటోగా విచారణ చేపట్టారు. ఆతర్వాత మరొకొందరు ప్రజా ప్రయోజ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ క్రమంలో తీగ లాగితే డొంకంత కదిలింది అన్నట్లు నోరులేని దేవుని భూములను భోచేసిన భూబకాసురులు, రాజకీయ భోక్తల భాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం వ్యవాహారం పై ఇంచుమించిగా ఏడు సంవత్సరాలు విచారణ జరిపిన న్యాయస్థానం, బుధవారం తీర్పునిచ్చింది.
తమిళనాడులో ఉన్నన్ని పురాతన దేవాలయాలు, బహుశా దేశంలో మరే రాష్ట్రంలో ఉండవు, కావచ్చును. అలాగే, తమిళనాట గల దేవాలయాల ఆస్తులు కూడా చాలా చాలా ఎక్కువ రాజులు, సంస్థానాదీశులు వందలు కాదు, వేల ఎకరాల్లో భూములను దేవాలయాలకు సమర్పించుకున్నారు. అప్పటికి ఎన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయో ఏమో కానీ, 1984-85 నాటికి ప్రభుత్వ రికార్డుల ప్రకారమే రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాలకు కలిపి 5.25 లక్షల ఎకరాల భూములున్నాయి. గడచిన పాతిక ముప్పై ఏళ్లలో, అవి కుదించుకు పోయాయి. 2019-20 సంవత్సరానికి 4.78 లక్షల ఎకరాలకు తరగి పోయాయి. ఇలా ఎలా జరిగిందని, మద్రాస్ హై కోర్టు తమిళ నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆరాష్ట్ర దేవాదాయ శాఖను వివరణ కోరింది. ఈ సందర్భంగా నాయస్థానం “రాష్ట్ర ప్రభుత్వం కానీ, హిందూ మత ధర్మదాయ దేవాదాయ (హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్) శాఖ కానీ, దాతల అభిమతానికి విరుద్ధంగా దేవాలయాల భూములను విక్రయించరాదు. అన్యులకు ఇవ్వరాదు” అని స్పష్టం చేసింది. అలాగే, పురాతన దేవాలయాలు, పురాతన కట్టడాలాను పరిరక్షించవలసిన అవసరాన్ని నొక్కి చెపుతూ, జస్టిస్ ఆర్. మహదేవన్,జస్టిస్ పీడీ ఆదికేశవులు ధర్మాసనం, 224 తీర్పులో, 75మార్గదర్శకాలను నిర్దేశించింది.
అంతే కాదు పురాతన దేవాలయాలు ప్రకృతి వైపరీత్యాల వలన ద్వంసం కావడం లేదని, పురాతన దేవాలయాల పాలిట సంరక్షకులే బక్షకులుగా మారి మింగేస్తున్నారు అనే అర్థం వచ్చే విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎంతో విలువైన మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశ్వాసం లేని సంరక్షకుల వల్లనే, పురాతన దేవాలయాలు విద్వంసానికి గురుతున్నాయని, సర్కార్ స్వాములకు గట్టిగా వాతలు పెట్టింది. రాష్ట్రంలో యునెస్కో వారసత్వ సంపదగా, వారసత్వ ప్రదేశాలుగా గుర్తించిన రెండు వేల సంవత్సరాల పైబడిన చరిత్ర గల పురాతన దేవాలయాలు కూడా శిధిలావస్థకు చేరుకుంటున్నాయని, రాష్ట్రంలోని ఆలాయాల నుంచి వస్తున్న ఆదాయం ఎమౌతోందని, ప్రభుత్వ యంత్రాగాన్ని, ఎండోమెంట్స్ అధికారాలను ధర్మాసనం ప్రశ్నించింది.ధర్మాగ్రహం వ్యక్త పరిచింది, అన్యాక్రాంతమైన దేవాలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు, అలాగే, కౌలు బకాయిల వసూలుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, ఆరు వారాల్లో అన్ని వివరాలను కోర్టు ముందు ఉంచాలని న్యాయస్థానమ ఆదేశించింది. అలాగే న్యాయస్థానం దేవాలయ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను ఎనిమిది వారల గడువు ఇచ్చి కూల్చి వేయలని, దేవాలయాల భూముల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, ఆదేశించింది. ఇలా దేవాలయ భూముల పరిరక్షణకు తీసుకోవల్సిన చర్యలను ఆదేశాల రూపంలో జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలు ఎంత వరకు అమలవుతాయి, అనేది ఆదేవునికే ఎరుక.
ఇది ఒక్క తమిళనాడు రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన సమస్య,కాదు, పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్’లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్యమత విశ్వాసాలకు ప్రాధాన్యత పెరగడంతో పాటుగా హిందూ దేవాలయాల విధ్వసం మహాజోరుగా సాగుతోంది. అనేక ప్రధాన దేవాలయాలలో విగ్రహాల విధ్వసం, దేవుని రధాల దహనం వంటి దుష్క్రుత్యాలు అనేకం జరిగాయి. అలాగే, దేశం మొత్తంలో తిరుమల వెంకటేశ్వరునికి భక్తులు ఇచ్చిన వేల ఎకరాల భూములను, ఇతర స్థిరాస్తులను, టీటీడీ చైర్మన్ బాబాయిని అడ్డుపెట్టుకుని విక్రయించేందుకు పెద్ద స్కెచ్చే గీసింది. అయితే, అప్పట్లో తెలుగు దేశం, ఇతర ప్రతిపక్ష పార్టీలు, వివిధ హిందూ, ధర్మ, ధార్మిక,సమస్థలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో జగన్ రెడ్డి ప్రభుత్వం తాత్కాలికంగా విక్రయ ప్రణాళికను వాయిదా వేసింది. హిందూ సమాజం ఏమాత్రం ఏమర పాటు ప్రదర్శించినా ... తమిళనాడును తలదన్నే రీతిలో ఎపీలోనూ దేవాలయాల భూములు మాయమై పోతాయని ... హిందూ ధార్మిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి.