ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క

ఇప్పటిదాకా ఒక లెక్క... ఇప్పటి నుంచి ఓ లెక్క... ఆడొచ్చాడు.. రేవంత్ రెడ్డి వచ్చాడని చెప్పు... అంటూ రేవంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియో హోరెత్తిస్తున్నారు. నిజంగానే తెలంగాణ రాజకీయాలు ఇక నుంచి మరో లెక్కలో వెళతాయనడంలో డౌటే లేదు. ఇప్పటిదాకా.. మంచాన్ని నాలుగు వైపుల నుంచి లాగినట్లే లాగారు కాంగ్రెస్ నేతలు.. ఎవరూ ముందుకు వెళ్లకుండా..వెనక్కు లాగుతూనే ఉన్నారు. ఎవరికి వారు తామే కింగులమంటూ రెచ్చిపోవడం కాంగ్రెస్ లో అలవాటు. అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైములో చెరిగిపోయింది.  ఆయనే రాజు ఆయనే మంత్రిలా వ్యవహారం నడిచింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లో అలాంటి నాయకత్వం అందించడం బహుశా రేవంత్ రెడ్డికే సాధ్యం. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో వన్ సైడ్ డ్రైవింగ్ నడవబోతుందనే చెప్పాలి.  రేవంత్ రెడ్డి దూకుడు, ఆయనకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్..ముఖ్యంగా కేసీఆర్ శత్రువుల్లో ఆయన పట్ల ఉన్న క్రేజ్..ఇవన్నీ.. ఓ రేంజ్ లీడర్ షిప్ అందించే దిశగా వెళతాయనే ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. ఒక దశలో కాంగ్రెస్ పని అయిపోయింది.. ఇక బిజెపియే ప్రతిపక్షం..కేసీఆర్ ని ఢీకొట్టేది ఇక బిజెపియే అంటూ టాక్ మార్మోగింది. దుబ్బాక ఎన్నికతో ఆ టాక్ మరింత చెలరేగిపోయింది.  గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చిన ఓట్లతో బిజెపి ఇక రాబోయే అధికారం వారిదేనని ఫిక్స్ అయిపోయింది. కాని తర్వాత కేసీఆర్ వేసిన ఒకే ఒక పాచికతో అవన్నీ కొట్టేసినట్లు అయిపోయింది.  ఢిల్లీలో కేసీఆర్ దోస్తీ ఉందనే వార్తలు రావడంతో.. రాష్ట్రంలో బిజెపి నేతలు కమెడియన్స్ అయినంత పని అయింది. నాగార్జునసాగర్ ఉపఎన్నికతో అదే ప్రూవ్ అయింది. ఇప్పుడు హూజురాబాద్ తో మళ్లీ జూలు విదిల్చాలని చూస్తున్నారు. ఈ టైమ్ లో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఎంట్రీ ఇవ్వడం నిజంగా బిజెపికి గట్టి స్ట్రోకే. అయితే హూజురాబాద్ ఈటల రాజేందర్ బొమ్మతో నడుస్తుంది కాబట్టి.. అక్కడ ఫలితాలు వేరేగా ఉంటాయి. కాని ఇక నుంచి తెలంగాణ కాంగ్రెస్ మాత్రం రేవంత్ రెడ్డి నాయకత్వంలో దుమ్ము రేపుతుందని...ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. అయితే ఇప్పటివరకు రేవంత్ రెడ్డిని ఆపటానికి ప్రయత్నించిన వారంతా ఇక నుంచి ఏం చేస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీహెచ్ లాంటి నేతలతో సమస్య లేదు..ఎందుకంటే సీనియారిటీ ఉన్నా మాస్ మద్దతు లేదు. శ్రీధర్ బాబు పరిస్దితి కూడా అంతే. ఎటొచ్చీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం నల్గొండ జిల్లా మొత్తం ప్రభావం చూపించగలిగిన వాడు. పైగా రేవంత్ తో పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడినవాడు. కాబట్టి సహకరిస్తాడా..లేక నల్గొండ వరకు చూసుకుంటాడా అనేది కూడా చూడాలి. పైగా రేవంత్ తనకు నచ్చినవారిని నేతలుగా రంగంలోకి దింపాలనుకుంటే..ఆ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుపడటం ఖాయమే. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎటూ బిజెపిలోకి వెళ్లిపోవడం కూడా అంతే ఖాయం. ఇప్పటివరకు అన్నకు పదవి వస్తుందేమోనని  ఆగిన రాజగోపాల్ రెడ్డి ఇక ఆలస్యం చేయకుండా బిజెపిలోకి వెళ్లిపోతారనే చెబుతున్నారు. అయితే అసంతృప్తిగా ఉండే నాయకుల్లో కొందరిని కేసీఆర్ మేనేజ్ చేసి..కాంగ్రెస్ లో నే కుంపటి రగిలేలా చేసే అవకాశం అయితే ఉంది. దానిని రేవంత్ రెడ్డి ఎలాఎదుర్కొంటారనేదే చూడాలిక.

ఫ్రైర్ బ్రాండ్ లీడర్.. రాజకీయ సంచలనం రేవంత్ రెడ్డి

ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి.. ఫైర్ బ్రాండ్ లీడర్. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. తనదైన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రేవంత్ రెడ్డి.  జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. అనతి కాలంలోనే ఎన్నో కీలక పదవులు సాధించారు.  ఎన్ని ఒడిదుడుకులు ఎదొర్కున్నారు. కొన్ని రోజులు జైలు జీవితం కూడా గడిపారు.తెలంగాణలో తనకంటూ ఓ పత్యేక అనుచర గణాన్నిఏర్పరుచుకున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్‌కు ధీటైన నాయకుడిగా ఎదిగారు. గత కొన్నేండ్లుగా కేసీఆర్ సర్కార్ పై, కేసీఆర్ కుటుంబంపై చేస్తున్న పోరాటంతో ఆయనకు మరింత క్రేజీ వచ్చింది. ఈ క్రమంలోనే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది. పీసీసీ పదవికి గట్టి పోటీ ఉన్నా  రేవంత్‌పై నమ్మకంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆయననే రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. 1969 నవంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో జన్మించారు రేవంత్ రెడ్డి. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు మళ్లారు. ఓయూలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఆరెస్సెస్ కు మద్దతుదారుగా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ చదువుతున్నప్పుడు రేవంత్‌రెడ్డి అఖిలభారత విద్యార్థి పరిషత్‌ సభ్యుడిగా ఉన్నారు. 24 ఏళ్ల వయసులోనే రేవంత్ రెడ్డికి వివాహమైంది. వారికి నైమిష అనే కుమార్తె ఉంది.  2006లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ కు మద్దతుగా పని చేశారు. అప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అంతంతమాత్రంగానే ఉంది. మిడ్జిల్ జెడ్పీటీసీ టికెట్ కోసం ఎంత ప్రయత్నించినా ఏ పార్టీ ఇవ్వకపోవడంతో సొంతంగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2008లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేశారు. అప్పుడు కూడా స్వతంత్రంగానే పోటీ చేసిన రేవంత్ రెడ్డికి టీడీపీ సపోర్ట్ చేసింది. ఎమ్మెల్సీగా  అప్పటి అధికార పార్టీ అభ్యర్థిపై గెలిచి సంచలనం స్పష్టించారు రేవంత్ రెడ్డి. అప్పటి నుంచి ఆయన రాజకీయం గమనం వేగంగా మారిపోయింది.  కొంత కాలానికే రేవంత్ రెడ్డి  చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీలో చేరారు.  తన సొంతూరు అచ్చంపేట నియోజకవర్గంలో ఉంది. ఆ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో కొడంగల్ కు మకాం మార్చారు రేవంత్ రెడ్డి. 2009 ఎన్నికల్లో తొలిసారి కొడంగల్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేశారు. అప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ లో బలమైన నేతగా ఉన్న గురునాథ రెడ్డి ఉన్నారు. ఆతనికి ఎదుర్కోవడం రేవంత్ రెడ్డి వల్ల కాదనుకున్నారు. 2009 ఎన్నికల ప్రచారంలోనూ రేవంత్ రెడ్డి చాలా కష్టాలు పడ్డారని చెబుతారు. అయితే ఆ ఎన్నికలో అనూహ్య విజయం సాధించారు రేవంత్ రెడ్డి.  2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా కొడంగల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఓసారి ఎమ్మెల్సీ, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ టీడీపీలోనే ఉన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధినేత టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అయినా.. రేవంత్ రెడ్డి హవా నడిచేది. ఆయన ఏం చేసినా చెల్లుబాటయ్యేది. అసెంబ్లీలో కూడా పార్టీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు అయినా.. రేవంత్ రెడ్డి లేచి నిలబడితే అధికార పార్టీ నేతల కళ్లు ఎర్రబడేవి. ఓ దశలో కవిత మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేసే వరకు వ్యవహారం వెళ్లింది.  2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థికి ఓటేసేందుకుగాను ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారన్న ఆరోపణలతో తెలంగాణ ఏసీబీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపింది. ఆ కేసులో అరెస్టయిన రేవంత్ రెడ్డి అయినా వెనక్కి తగ్గలేదు. కొద్ది రోజులు జైలులో ఉన్న రేవంత్ రెడ్డి.. విడుదలయ్యాక కూడా సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తూనే ఉన్నారు.తెలంగాణలో బలపడుతున్న కేసీఆర్, ఏపీకే పరిమితమవుతున్న చంద్రబాబు.. ఈ రెండింటినీ బేరీజు వేసుకున్న రేవంత్ రెడ్డి వ్యూహాత్మక అడుగు వేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఆ తర్వాత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మీద ఐటీ దాడులు జరగడం సంచలనంగా మారింది. రేవంత్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారంటూ ఓ న్యాయవాది ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేయడంతో ఇన్‌కం ట్యాక్స్ దాడులు నిర్వహించింది. ఇక, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి బరిలో నిలిచిన రేవంత్ రెడ్డి ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే ఆ ఎన్నికల సమయంలో కొడంగల్‌లో చోటుచేసుకన్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పోలింగ్‌కు రెండు రోజుల ముందు పోలీసులు రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. దీనిపై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన రేవంత్ రెడ్డి.. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 

ల‌య‌న్ రేవంత్‌రెడ్డి క‌మింగ్‌.. ఇక కాస్కో కేసీఆర్‌...

పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి. రామ్‌గోపాల్‌వ‌ర్మ మాట‌ల్లో చెప్పాలంటే సింహాన్ని పీసీసీ ప్రెసిడెంట్‌గా ప్ర‌క‌టించి సూప‌ర్ ఫెంటాస్టిక్ డెసిష‌న్ తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పుడిక పులుల‌న్నీ ఆ సింహాన్ని చూసి భ‌య‌ప‌డాల్సిందే. తెలంగాణ రాజ‌కీయం ఇప్ప‌టి దాకా ఓ లెక్క‌. రేవంత్‌రెడ్డి ఎంట్రీతో ఇప్పుటి నుంచి ఇంకోలెక్క‌. ఆ లెక్క‌.. అనేక మంది త‌ల‌రాత‌లు మార్చేసే అవ‌కాశం ఉంది. సింహం వేటాడితే ఎట్టా ఉంటాదో ఇక‌పై చూడ‌బోతోంది తెలంగాణ స‌మాజం. చిచ్చ‌ర‌పిడుగు రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ చీఫ్‌గా ప‌గ్గాలు చేత‌బ‌ట్టి.. కేసీఆర్‌పై దండ‌యాత్ర‌కు దూసుకొస్తున్నారు. రేవంత్‌రెడ్డి టార్గెట్ ఒక్క‌టే.. అది కేసీఆర్‌ను గ‌ద్దె దింప‌డం. ఆయ‌న్ను ఒక్క‌రోజైనా జైల్లో పెట్ట‌డం.  లేటైనా.. లేటెస్ట్‌గా జెట్ స్పీడ్‌తో దూసుకొస్తున్నారు డైన‌మిక్ లీడ‌ర్‌ రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్‌లో ఇంత స్పీడ్‌గా ఎదిగిన మ‌రో నేత మ‌న‌కు క‌నిపించ‌రు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాక‌.. ఇక టీడీపీతో వ‌ర్క‌వుట్ కాద‌ని.. హ‌స్తం పార్టీలో చేరారు. అన‌తికాలంలోనే వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు పీసీసీ చీఫ్ పోస్ట్ సాధించారు. ఆ ప‌ద‌వే ఆయ‌న్ను ఏరికోరి వ‌రించింది. సీనియ‌ర్లు ఎన్ని కొర్రీలు పెట్టినా.. అధిష్టానానికి ఎన్ని లేఖ‌లు రాసినా.. వీహెచ్ లాంటి నేత‌లు ఎంత‌గా ర‌చ్చ చేసినా.. అవేవీ రేవంత్ స్పీడ్‌కు బ్రేకులు వేయ‌లేక‌పోయాయి. రాహుల్‌గాంధీ ఆశీస్సులు పుష్క‌లంగా ఉండ‌టం.. క్షేత్ర స్థాయిలో నివేదిక‌ల‌న్నీ రేవంత్‌రెడ్డికే అనుకూలంగా ఉండ‌టంతో.. ఆయ‌న పేరునే ఖ‌రారు చేయ‌క త‌ప్ప‌లేదు అధిష్టానానికి. చేష్ట‌లుడిగి.. చేవ చ‌చ్చిన కాంగ్రెస్‌కు.. ఇప్పుడు రేవంత్‌రెడ్డే పెద్ద దిక్కు. రేవంత్ హ‌స్తం పార్టీ హ‌స్త రేఖ‌లు మార్చే మొన‌గాడు. అందుకే, కాంగ్రెస్ ఈసారి ఎలాంటి త‌ప్పు చేయ‌కుండా.. రేవంత్‌రెడ్డికి పీసీసీ కిరీటం క‌ట్ట‌బెట్టింది. ఇన్నేళ్ల చ‌రిత్ర‌లో ఆ పార్టీ తీసుకున్న మంచి నిర్ణ‌యాల్లో ఇదొక‌టిగా నిలిచిపోతుంద‌ని అంటున్నారు.  తెలంగాణ‌లో ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి అస‌లేమాత్రం బాగాలేదు. కేసీఆర్ దూకుడు ముందు హ‌స్తం పార్టీ అస్త‌వ్య‌స్థం అవుతోంది. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో రేవంత్‌రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్‌గా ప్ర‌క‌టించ‌డంతో ఆ పార్టీ శ్రేణుల్లో వెయ్యి ఏనుగుల బ‌లం వ‌చ్చిన‌ట్టైంది. ద‌మ్మున్న మొన‌గాడు పార్టీ ప‌గ్గాలు చేప‌ట్డ‌డంతో ఇక కాంగ్రెస్‌కు పూర్వ వైభ‌వం వ‌చ్చినట్టేనంటూ అప్పుడే ఊరూరా సంబ‌రాలు చేసుకుంటున్నారు రేవంత‌న్న అభిమానులు.  ఇక‌, ఇవాళ రాత్రి కేసీఆర్ ప్ర‌శాంతంగా నిద్ర‌పోలేర‌ని ఎద్దేవా చేస్తున్నారు కాంగ్రెస్‌వాదులు. ఎందుకంటే ఇక‌పై కేసీఆర్‌కు మ‌న‌శ్శాంతి క‌రువవుతుంద‌ని చెబుతున్నారు. రేవంత్ రంగంలోకి దిగితే మామూలుగా ఉండ‌దు మ‌రి. కేసీఆర్‌కు చుక్క‌లే. పీసీసీ అధ్య‌క్షునిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచీ.. రేవంత్‌రెడ్డికే ఒక‌టే ప‌ని.. ఒక‌టే ధ్యాస‌.. ఒక‌టే ల‌క్ష్యం.. అది కేసీఆర్‌ను దెబ్బ‌కొట్ట‌డం. ఉద‌యం నిద్ర లేచిన‌ప్ప‌టి నుంచీ.. రాత్రి నిద్ర పోయేదాక.. కేసీఆర్ ప‌ని ప‌ట్ట‌డ‌మే రేవంత్‌రెడ్డి ప‌ని. రేవంత్‌ రంగంలోకి దిగితే కేసీఆర్‌కు మామూలుగా ఉండ‌దిక‌. దేత్త‌డి.. పోచమ్మ గుడే... ఇక కాస్కో కేసీఆర్‌.....

ఈటలను బీజేపీలో చేర్చిందే కేసీఆర్! పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి సంచలనం...

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా నియమించబడిన కొద్ది సేపటికే సంచలనానికి తెర తీశారు ఎంపీ రేవంత్ రెడ్డి. కేసీఆర్ తో పాటు బీజేపీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరికపై బాంబ్ పేల్చారు రేవంత్ రెడ్డి. ఈటల రాజేందర్ ను బీజేపీలో చేర్చింది సీఎం కేసీఆరే అంటే సంచలన ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్ తో మాట్లాడేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్ కేసీఆర్ సమకూర్చిందే అన్నారు. కేసీఆర్ సన్నిహితుడికి చెందిన విమానంలోనే కిషన్ రెడ్డి వచ్చి.. బీజేపీలో చేరాలని ఈటల రాజేందర్ ను ఆహ్వానించారని చెప్పారు.  కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి నేతలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో వర్గపోరు లేదన్నారు. అభిప్రాయలు వేరువేరుగా ఉన్నాయే తప్ప విభేదాలు కావన్నారు. ఎవరూ ఏమైనా మాట్లాడే స్వేచ్చ కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు రేవంత్ రెడ్డి. పీసీసీ పదవి కావాలని ఎవరికైనా అడిగే హక్కు ఉంటుందన్నారు. ఇప్పటివరకు తనకు వ్యతిరేకంగా మాట్లాడిన నేతలందరిని కలుస్తానని చెప్పారు. కాంగ్రెస్ నేతలమంతా సమిష్టిగా పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తన కుటుంబ సభ్యులన్నారు రేవంత్ రెడ్డి. వీహెచ్ ను కలిసి మద్దతు కోరుతానని తెలిపారు. కొన్నేళ్లుగా కేసీఆర్  సర్కార్ ను టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి... పీసీసీ చీఫ్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దుర్మార్గపు పాలనను అంతం చేయడమే తన లక్ష్యమన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు. అరాచక పాలనకు చరమ గీతం పాటి... తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తెస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. 

YSRలా రేవంత్ రెడ్డి పాదయాత్ర? సీఎం పోస్టే టార్గెట్ ?

అందరు అనుకుంటున్నట్లే తెలంగాణ పీసీసీ పగ్గాలు ఎంపీ రేవంత్ రెడ్డికి దక్కాయి. రేవంత్ రెడ్డిని ప్రకటించడంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. పీసీసీ చీఫ్ పదవి సాధించిన రేవంత్ రెడ్డి.. నెక్స్ట్ టార్గెట్ ముఖ్యమంత్రి పోస్టేనంటూ నినాదాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మద్దతుదారుల హంగామాతో గాంధీభవన్ సందడిగా మారింది.  అనుకున్నది సాధించిన రేవంత్ రెడ్డి... నెక్స్ట్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. పీసీసీ చీఫ్ పదవి వస్తుందని ముందునుంచే ధీమాగా ఉన్న రేవంత్ రెడ్డి.. భవిష్యత్ కార్యాచరణ కూడా ఇప్పటికే సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. నెక్ట్స్ మూడేళ్ల‌కు స‌రిప‌డా మాస్ట‌ర్ ప్లాన్ రెడీ చేసుకొని పెట్టుకున్నారట.  కేసీఆర్‌పై దండ‌యాత్రే ఆయ‌న ల‌క్ష్యమని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా కేసీఆర్ పాలన, కేసీఆర్ కుటుంబంపై పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ గా తన దూకుడును మరింత పెంచనున్నారు.  అసెంబ్లీ సంగ్రామానికి ఇంకా రెండున్న‌రేళ్ల గడువుంది. అందుకే, ఇప్ప‌టి నుంచే ఆవేశ‌ప‌డకుండా.. తుదిపోరుకు ఎన‌ర్జీ సేవ్ చేసుకునేలా ఆచితూచి అడుగులు వేయాల‌నేది రేవంత్‌రెడ్డి స్ట్రాట‌జీలా క‌నిపిస్తోంది. గతంలో  వైఎస్సార్ అనుస‌రించిన ఎత్తుగ‌డ‌ల‌నే రేవంత్‌రెడ్డి ఇంప్లిమెంట్ చేసేలా స‌న్నద్ద‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. అధికారంలోకి వచ్చేందుకు  వైఎస్సార్ వేసిన తిరుగులేని ఎత్తుగ‌డ‌.. పాద‌య‌త్ర‌. అదే ఆయ‌న రాజ‌కీయ జీవితానికి మ‌రో ప్ర‌స్థానంగా బాట‌లు ప‌రిచింది. చేవెళ్ల‌లో వేసిన తొలి అడుగు.. వైఎస్సార్‌ను ముఖ్య‌మంత్రి పీఠం వ‌ర‌కూ తీసుకెళ్లింది. ఆ పాద‌యాత్ర‌ తర్వాతే వైఎస్సార్‌. కాంగ్రెస్‌లో తిరుగులేని నేత‌గా ఎదిగారు. ఆ త‌ర్వాత ముఖ్య‌మంత్రి పదవినే చేపట్టారు.  వైఎస్సార్ లానే సేమ్ టూ సేమ్ ఇదే స్ట్రాట‌జీని రేవంత్‌రెడ్డి సైతం ఫాలో కాబోతున్నార‌ని తెలుస్తోంది. జిల్లాల వారిగా ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డికి విశేష అనుచ‌ర‌గ‌ణం ఉంది. వారిలో స‌మ‌ర్థుల‌కు, త‌న అనుకున్న వారికి.. డీసీసీ ప‌ద‌వులు క‌ట్ట‌బెడ‌తార‌ట‌. ఇప్ప‌టికే ఆ జాబితా కూడా రెడీ చేసుకున్నార‌ని తెలుస్తోంది. ఇలా జిల్లాల వారీగా త‌న మ‌నుషుల‌తో పార్టీలో బ‌లం పుంజుకొని.. అప్పుడిక వైఎస్సార్ మాదిరే మ‌హా పాద‌యాత్ర‌తో.. అస‌లైన దండ‌యాత్ర‌కు శ్రీకారం చుడతార‌ని అంటున్నారు. తెలంగాణ‌లో గ్రామ‌గ్రామాన కాలిన‌డ‌క‌న ప‌ర్య‌టించి.. ఊరూరా త‌న పాద‌ముద్ర వేసి.. ఆ అడుగుల స‌వ్వ‌డితో కాంగ్రెస్ పార్టీని పవర్లోకి తీసుకువచ్చేందుకు స్కెచ్ వేశారట రేవంత్ రెడ్డి.  కేసీఆర్ పాల‌న‌లోని లోటుపాట్ల‌ను ఇంటింటికీ వెళ్లి ఎండ‌గ‌డుతూ.. ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకొస్తార‌ని రేవంట్ రెడ్డి అనచరులు అంటున్నారు. అయితే, ఈ పాద‌యాత్ర ఇప్పుడే చేస్తారా? లేక‌, ఎల‌క్ష‌న్ల ఏడాది చేయాలా? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేద‌ని తెలుస్తోంది. అనుకోకుండా ఈట‌ల రాజేంద‌ర్ పాన‌కంలో బుడ‌గ‌లా బ‌య‌ట‌కు రావ‌డం.. అందులోనూ బీజేపీలో చేరి.. త‌న‌కు పోటీగా నిలిచే అవ‌కాశం ఉండ‌టంతో.. పాద‌యాత్ర‌కు ఇదే మంచి స‌మ‌యం అని అంచ‌నా వేస్తున్నార‌ట‌. గ‌తంలో పాద‌యాత్ర‌ను న‌మ్ముకున్న ఏ ఒక్క‌రు వైఫ‌ల్యం చెంద‌లేద‌ని.. వైఎస్సార్‌, చంద్ర‌బాబు, జ‌గ‌న్‌.. ఆ ముగ్గురూ పాద‌యాత్ర‌తోనే ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిష్టించార‌ని.. అలానే రేవంత్‌రెడ్డి సైతం పాద‌యాత్రతో సీఎం అయ్యేలా అడుగులు వేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి, పాద‌యాత్ర‌తో రేవంత్‌రెడ్డి హిస్ట‌రీ రిపీట్ చేస్తారా? కాంగ్రెస్‌లో మ‌రో వైఎస్సార్‌లా తిరుగులేని నేత‌గా నిల‌బ‌డ‌తారా?

బిగ్ బ్రేకింగ్.. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది .ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లే మల్కాజ్ గిరి ఎంపీ , ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డిపై పీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. తెలంగాణ పీసీసీ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడ్డారు. చివరి వరకు మాత్రం రేసులో ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి నిలిచారు. అయితే రాష్ట్ర నేతల నుంచి సేకరించిన అభిప్రాయ సేకరణలో మెజార్టీ నేతలు రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. దీంతో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటిస్తూ ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.  పీసీసీ చీఫ్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురిని, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా 10 మందిని నియమించింది ఏఐసీసీ. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రస్తుతం కొనసాగుతున్న మహ్మద్ అజారుద్దీన్ తో పాటు మాజీ మంత్రి గీతా రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు మహేష్ గౌడ్ ను అపాయింట్ చేసింది. ఇక సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా సీనియర్ నేతలు సంభాని చంద్రశేఖర్, మల్లు రవి, దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే పొదెం వీరయ్య , సురేష్ షెట్కార్, వేం నరేందర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, నిరంజన్, కుమార్ రావు, జావెద్ అమీర్ ను నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. ​ టీపీసీసీ కమిటితో పాటు మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ఛైర్మన్, అజ్మదుల్లా హుస్సేన్ కన్వీనర్ గా ప్రచార కమిటీ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఛైర్మన్ గా ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటి, నిర్మల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆలేటీ మహేశ్వర్ రెడ్డి చైర్మన్ గా ఏఐసీసీ ప్రోగామ్ ఆర్గనేజింగ్ కమిటీని కూడా ఏఐసీసీ ప్రకటించింది.  

అక్కరకురాని ఆరోగ్య  పథకాలు! ఏపీలో మరీ ఘోరాలు... 

అక్కరకు రానీ ఆరోగ్య పథకాలు మాకు ఎందుకు? పనికి రాని మొగుడు పక్కలో ఉంటేనేమి?ఎక్కడ ఉంటె ఏమిటి? అన్నట్లుగా తయారయ్యింది ఆరోగ్య పధకాల తీరు. అసలు ఈ విషయం ఇప్పుడు ఎందుకు నిధులు జాస్తి పథకం అమలు నాస్తి అన్నట్లుగా  ఉంది దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో పరిస్తితి మరీ దారుణం గా ఉంది. అసలుఏ పథకమైనా  అక్కరకు  వచ్చినప్పుడే గా రంగు బయట పడుతుంది అంటారు. అలాగే ప్రభుత్వాలు అధికారం లో లేనప్పుడు ఆరోగ్య పధకం అంటూ గొప్పలు చెప్పుకున్న ఆరోగ్యశ్రీ, ముఖ్య మంత్రి సహాయ నిధి కింద ఇచ్చే ఆర్ధిక సహాయం నేరుగా ఇస్తామని చెప్పిన పార్టీలు వాస్తవానికి అవసరం వచ్చే సరికి పడక వేశాయి.  ప్రైవేటు ఆసుపత్రులకు వరంగా వచ్చిన ఆరోగ్య శ్రీ పధకం,కోవిడ్ సమయం లో అక్కరకే రాకుండా పోయింది.  ఆతరువాత వచ్చిన ఇతర దీర్ఘ కాలిక సమస్యలకు  చికిత్స తీసుకుందామంటే అసలు ఆరోగ్యశ్రీని పరిగణలోకి తీసుకోవడం లేదు  కార్పోరేట్ ఆస్పత్రులు. దీంతో ఎక్కడికి వేళ్ళాలో ఎలా చికిత్స చేసుకోవాలో తెలియక సామాన్యుడు  తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. తిందామంటే  తిండే లేదు,చేద్దామంటే పని లేదు, బతకాలంటే వైద్యం లేదు అని లోలోపల కుమిలి పోతున్నారు.  ఆరోగ్యశ్రీ లో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా చికిత్స ఉచితం ఉచితం అంటూ చెప్పిన జగన్ సర్కార్ వాటినిఅమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యింది.వడ్డించే వాడు మనవాడే అయితే కడ బంతిలో కూర్చున్న మనకు రావాల్సింది వస్తుందని పూర్తిగా నమ్మే తెలుగు ప్రజల చెవుల్లో పూలు పెట్టారు. ముందు డబ్బు పెట్టుజున్న తరువాత ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి  పలుకుబడితో తెచ్చుకోవచ్చు అనుకుంటే పొరపాటే. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక వాస్తవాన్ని మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తాను . అక్కడ కూడా బ్రోకర్లు,కమీషన్ ఏజంట్లు తిష్ట వేసుకు కూర్చోవడంతో ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇచ్చే ఆర్ధిక సహాయం కూడా బాధితులకు అందడం లేదు. సాయం వస్తుందన్న నమ్మకంతో అప్పు చేసి తెచ్చిన డబ్బుఎలా తీర్చాలో అర్ధం కాక తీవ్రమన స్థాపానికి గురవుతున్నారు. ఇది సామాన్యుడే కాదు ఒక ప్రముఖ పాత్రికేయుడికి కుడాఈ పరిస్థితే ఎదురైందంటే ఆరోగ్య శ్రీ అమలు ఎలా ఉందో ఊహించవచ్చు. సీఎం సహాయనిధి ఇప్పిస్తానని ఆ జర్నలిస్టుకు ఏ నేత హామీ ఇచ్చాడట. దీంతో అతను హమ్మయ్య గండం గట్టెక్కింది అనుకున్నాడు. అంతదాకా ఎందుకు నేనే ఇస్తానంటూ వాగ్దానం చేసాడు సదరు నాయకుడు ఇంకేముంది సహాయం వచ్చినట్టే అని భావించారు. ఇప్పటికి ఆరునెలలు దాటినా ఆ సదరు పాత్రికేయుడి ఫైల్ ఎక్కడుందో తెలియడం లేదట. సహాయ నిధి లేదు, సాయం చేస్తానన్న మనిషీ లేడు. అడిగితే జవాబు చెప్పే నాధుడు కరువయ్యారు. ఇక తెలంగాణలోను ఇదే పరిస్థితి అటు ప్రధాని భీమా యోజన, ప్రధాన మంత్రి సహాయనిది ఇదే పరిస్థితి. అక్కరకు రాని ఎన్ని ఉంటె ప్రయోజనం ఏముంది, అవి ఉపయోగంలో లేనప్పుడు ఆ పథకాన్ని దప్పుకొట్టి మరీ చెప్పుకోవడం దేనికి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏ ఆరోగ్య పథకం అయినా ఎన్నికల స్టంట్ గా వచ్చేవే అని మనం అర్ధం చేసుకోవాలి. తమకు అంటే ప్రభుత్వ పెద్దలకు మేలుచేయని వాటికీ ఓట్లు రావని భావించి అరకొర నిధులు ఇచ్చి దులుపుకోడమంటే కుదరదు. కోవిడ్ సమయంలో అటు ముఖ్య మంత్రులకు ఇటు ప్రధాన మంత్రి సహాయ నిధికి వెళ్లువెత్తిన విరాళాల వివరాలను బయపెట్టాలి. సంవత్సరకాలంగా ఏ పథకానికి ఎంత మేర నిధులు ఇచ్చారో వివరించాలి. ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అక్కరకు రానీ పధకాలు మాకెందుకు? చని పోయిన తరువాత ఇచ్చే ఎక్స్ గ్రేషియా లో సైతం ఇవ్వని ప్రభుత్వాలు ఉన్నాయంటే సిగ్గు సిగ్గు. అయ్యా అసలు మీ పధకాలు అమలు కానప్పుడు ఆశాఖ ఎందుకు మూసేయండి... 

ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు? లాభమెవరికో..?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గత గురువారం, జమ్మూ కశ్మీర్ రాజకీయ పార్టీల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జమ్మూ కశ్మీర్’ కు రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆ  రాష్ట్రంలో నియోజక వర్గాల పునర్విభజ అంశాన్ని ప్రధానంగా చర్చించారు. గత సంవత్సరం జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన సమయంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి త్వరలోనే  తిరిగి రాష్ట్ర ప్రతిపత్తిని కలిపిస్తామని  ప్రకటించింది. అదీ గాక దేశ సరిహద్దులలో సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్  రాజకీయ పార్టీల నాయకులను విశ్వాసంలోకి తీసుకుని సమావేశం నిర్వహించింది. ముఖ్యంగా, నియోజక వర్గాల పునర్విభజనకు కేంద్రం ఏర్పాటు చేసిన  రంజన్‌ ప్రకాష్‌ దేశాయ్‌ నేతృత్వంలోని డీలిమిటేషన్‌ కమిషన్‌ భేటీలకు కశ్మీర్‌ రాజకీయపక్షాలేవీ ఇంతకాలమూ హాజరుకాలేదు.ఈ నేపద్యంలో ప్రాంతీయ పార్టీలను  ఒప్పించేందుకు ప్రదాని స్వయంగా సమావేశం ఏర్పాటు చేశారు.  నిజానికి, ఈ సమావేశం ప్రధానంగా జమ్మూ కశ్మీర్’ లో నియోజక వర్గాల పునర్విభజనకు సంబందించిన అంశాలను  మాత్రమే చర్చించింది. అయితే, ఇప్పుడు తాజాగా, జమ్మూ కశ్మీర్’ తో పాటుగా, రాష్ట్ర విభజన నేపధ్యంగా, విభజనకు ముందు నుంచి వినిపిస్తున్న, తెలుగు రాష్ట్రాలలో నియోజక వర్గాల పునర్విభజన అంశం మరో మారు తెర మీదకు వచ్చింది. ఈ పాత ప్రతిపాదనని పరిగణలోకి తీసుకుని కేంద్ర జమ్మూ కశ్మీర్’ తో పాటుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ నియోజక వర్గాల పునర్విభజన  చేట్టాలని కేంద్ర ప్రభుత్వం అలోచిస్తునట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే, ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం ఏదీ లేదు.రాష్ట్ర బీజేపీ నాయకులూ కూడా అలాంటిది ఏమీ ఉండదనే అంటున్నారు.  అదలా ఉంటే, నియోజక వర్గాల పునర్విజన కేవలం పరిపాలనా పరమైన నిర్ణయం మాత్రమే కాదు, రాజకీయ ప్రయోజనాల ఆధారంగా తీసుకునే రాజకీయ నిర్ణయం. అదీ గాక ఒకసారి తేనే తుట్టెను కదిలిస్తే, ఇక అది ఎక్కడికి వెళుతుందో తెలియదు. అందుకే గతంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు   చెందిన ప్రాంతీయ పార్టీలు, నియోజక వర్గాల పునర్విభజన డిమాండ్  చేసిన ప్రతి  సందర్భంలోనూ, కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఆ ప్రస్తావనే లేదని కుండబద్దలు కొట్టారు. నిజానికి, తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో నియోజక వర్గాల పునర్విభజన జరిగి, అసెంబ్లీ, లోక్ సభ స్థానాల సంఖ్య పెరిగితే, దాని వలన అధికార తెరాసకే ప్రయోజనం చేకూరుతుంది. గడచిన ఏడు సంవత్సరాలలో ఒక్క బీజేపీ, తెరాస మిత్ర పక్షం ఎంఐఎం మినహా మిగిలిన అన్ని పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు చాలా వరకు కారెక్కారు. ప్రస్తుత అసెంబ్లీలో తెలుగు  దేశం పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతే, కాంగ్రెస్ టిక్కెట్ మీద గెలిచిన 19 మందిలో 12 మంది అధికార తెరాసలో చేరారు. సీఎల్పీనే తెరాస లో విలీనం చేశారు. రేపో మాపో మిగిలిన వారిలో మరి కొందరు తెరాస గూటికి చేరండ ఖాయంగా కలిపిస్తోంది  సో .. కారు ఓవర్ లోడ్ అయింది. తెరాసలో సీట్ల పంపకం కష్టంగా మారింది. కాబట్టి,నియోజక వర్గాల సంఖ్య పెరిగితే తెరాసకు ప్రయోజనం చేకురుతుంది. అలాగే, ఏపీ లోనూ నియోజక వర్గాల పునర్విభజన వలన రాష్ట్ర రాజకీయాలలో ప్రధాన ప్రత్యర్ధులుగా ఉన్న తెలుగు దేశం, వైసీపీలకు ప్రయోజనం చేకూరుతుందే కానీ, ఆటలో అరటి పండు కూడా కాని బీజేపీకి వచ్చేది లేదు పోయేది లేదు.సో ..ఇలాంటి పరిస్థితిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలుగు  రాష్ట్రాలలో నియోజక వర్గాల పునర్విభజనకు ఎంతవరకు ఓకే అంటుందో .. అనుమానమే.  నిజానికి, జమ్మూ కశ్మీర్ లో నియోజక వర్గాల పునర్విభజనకు మోడీ ప్రభుత్వం మొగ్గు చూపడానికి కూడా రాజకీయ ప్రయోజనాలే కారణం. ప్రస్తుతం బీజేపీకి అనుకులంగా ఉండే జమ్మూ ప్రాంతంలో నియోజక వర్గాల సంఖ్య తక్కువగా, ప్రత్యర్ధి పార్టీల ప్రాబల్యం అధికంగా ఉన్న కశ్మీర్ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. అందుకే, నియోజక వర్గాల పునర్విభజనకు బీజేపే తొందర పడుతోంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఆ పరిస్థితి లేదు . వ్రతం చెడ్డా ఫలితం దక్కే పరిస్థితి లేదు . సో.. ఎప్పటిలానే ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన ...ఊహాగానం మాత్రమే కావచ్చును.

ఏపీ కొత్త సీఎస్ ఎంపికలో  ట్విస్టులే ట్విస్టులు 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీ కాలం జూన్ 30 న ముగుస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో ఆరు నెలలు ఆయననే కొనసాగించాలని భావించారు. అందు కోసంగా ప్రదాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలతో చర్చలు జరిపారు. ఓకే అని పించుకున్నారు. అయితే  ఆదిత్యనాథ్‌  దాస్ సీఎస్‌గా కొనసాగడం ఇష్టం లేని ఒక కీలక అధికారి అడ్డుపుల్ల వేశారు. కేంద్రానికి లేఖను తొక్కిపట్టి, సాంకేతికంగా సమస్యలు సృష్టించారు. ఆదిత్యనాథ్‌ పదవీ కాలం పొడిగింపును దిగ్విజయంగా అడ్డుకున్నారని ఆయన స్థానంలో  నీరబ్‌కుమార్ ప్రసాద్ సీఎస్’గా రావచ్చని  వార్తలొచ్చాయి.అయితే ఢిల్లీలోని మరో పెద్ద తలకాయ చొరవతో  దాస్‌కు పొడిగింపు ఇస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. అదలా, ఉంటే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరంలో, ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ తెరమీదకు వచ్చింది. కొనేళ్లుగా కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సమీర్‌ శర్మ ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు తిరిగి వస్తున్నారు. ప్రస్తుతం శర్మ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు. అయితే, ఎందుకనో, ఆయన రాష్ట్ర సర్వీస్’కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. అయితే కేంద్రంలోకీలకమైన పదవిలో ఉన్న ఆయన ఉన్నపళంగా  రాష్ట్ర కేడర్‌కు రావడం అధికార వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. 1985 బ్యాచ్‌కు చెందిన సమీర్‌ శర్మను తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చేస్తారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌(1987 బ్యాచ్‌) సమీర్‌ శర్మ కంటే రెండేళ్లు జూనియర్‌. మరోవైపు ఏపీ ప్రభుత్వం అభ్యర్థన మేరకే సమీర్‌ శర్మను రాష్ట్రానికి పంపుతున్నట్లు కేంద్ర నియామకాల కమిటీ ఉత్తర్వులలో పేర్కొందని సమాచారం. పొడిగింపు తర్వాత ఆదిత్యనాథ్ దాస్‌ సెప్టెంబరు నాటికి పదవీ విరమణ చేస్తారు. ఆ తర్వాత ఆయనకు సీఎస్‌ గా బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత మాములుగా అయితే ఎక్కువ కాలం సీఎస్’గా  కొనసాగే  అవకాశం లేదని అంటున్నారు.  ఆ మాత్రం దానికే సమీర్ శర్మ కేంద్రంలో పెద్ద పోస్టు వదులుకుని ఎందుకు వస్తున్నారో తెలియడం లేదని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆయన్న ప్రస్తుతానికి బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ (హెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్‌ జనరల్‌గా నియమించి.. మూడు నెలల తర్వాత సీఎస్‌గా నియమించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన రిటైర్‌మెంట్ తర్వాత  మళ్లీ కేంద్రానికి రాసి కొనసాగింపు ఇప్పించే అవకాశం ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ లో కేసీఆర్ కలకలం.. భట్టి టీమ్ కు బ్యాండేనా! 

తెలంగాణలో కాంగ్రెస్ కొత్త చిచ్చు సెగలు రేపుతోంది. ప్రగతి భవన్ లో  సీఎం కేసీఆర్‌తో సీఎల్పీ నేతలు సమావేశం కావడం హస్తం పార్టీలో  తీవ్ర దుమారం రేపుతోంది. కేసీఆర్ ను కలిసిన నేతలపై కొందరు హైకమాండ్ కు ఫిర్యాదు చేయగా... అటు నుంచి కూడా వెంటనే రియాక్షన్ వచ్చిందని తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసిఆర్ ను కలవడంపై అధిష్టానం  సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. పార్టీలో చర్చించకుండా ముఖ్యమంత్రిని కలవడం ఏంటని ప్రశ్నించిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మనిక్కం ఠాగూర్..  సీఎంతో జరిగిన సమావేశంపై  వివరణ ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను  ఆదేశించినట్లు తెలుస్తోంది.  ఇటీవల కాలంలో కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ ఒక్క సారి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సీనియర్ నేత వీహెచ్ కొన్ని రోజుల క్రితమే కేసీఆర్ ను కలవాలని ప్రగతి భవన్ దగ్గరకు వెళ్లినా... లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన అక్కడే ఆందోళన చేశారు. అలాంటిది శుక్రవారం సడెన్ గా భట్టీ టీమ్ కు అపాయింట్ మెంట్ వచ్చింది. సీఎల్పీ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. యాదాద్రి జిల్లా అడ్డగూడురు పోలీసు స్టేషన్‌లో లాకప్‌డెత్‌కు గురై మరియమ్మ అంశం గురించి మాట్లాడేందుకు మాత్రమే సీఏంను కలిసామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు.  అయితే కేసీఆర్ ను భట్టీ టీమ్ కలవడం కాంగ్రెస్ లో దుమారం రేపుతోంది. తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కేసీఆర్ ను కలిస్తే  రాజకీయంగా పార్టీకి నష్టం జరిగిందని కొందరు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌తో భేటీ అవ్వడం వల్ల తప్పుడు సంకేతాలు జనాలలోకి వెళ్లాయని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భట్టి తీరుపై కొందరు హస్తం నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఖరారు అయిందనే వార్తల నేపథ్యంలో భట్టి అండ్ టీం కేసిఆర్‌ను కలవడం మరో చర్చకు దారితీస్తోంది. కావాలనే పార్టీని నష్టపరిచేందుకు సీఏంను కలిసారని రేవంత్ రెడ్డి అండ్ టీం నేతలు చెపుతున్నారు. ఈ విషయంలో హైకమాండ్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. సీఎల్పీ నేతలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. కమలం నేతలు. కాంగ్రెస్ ఓట్లను టీఆర్ఎస్‌కు బదలాయింపు చేయడానికే భేటీ జరిగిందని బీజేపీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. కేసీఆర్ ను కలవడం వల్ల కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకుందా అనే చర్చ  రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతోంది.  తాజా ఘటనతో సొంత పార్టీ నేతలను ఏమీ అనలేక.. బయటకు మాట్లాడలేక తెగ ఇబ్బంది పడిపోతున్నారట సీఎల్పీ లీడర్లు. మొత్తంగా కేసిఆర్ వ్యూహాత్మకంగా కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ నేతలకు దిమ్మతిరిగి పోయిందని అంటున్నారు. 

అల్వాల్ లో వరస హత్యలు.. కారణాలు ఇవే.. 

ఈ కాలంలో ఒకరు పుట్టడం తల్లి దండ్రుల ఇష్టం.. కానీ మరొకరిని చంపడం ఎవరు ఎవరికి ఇచ్చిన అధికారం.. వరుస హత్యలు అల్వాల్‌లో కలకలం రేపుతున్నాయి. మొన్న ఓ వృద్దురాలిని కిరాయిదారుడే అంతమొందించగా, శనివారం మరో మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన పూలమ్మ(40) అల్వాల్‌లో వెంకటాపురంలోని ఓ గుడిసెలో ఒంటరిగా నివాసం ఉంటూ..ఆమె జీవితం గడవడం కోసం రోజు వారీగా అడ్డాకూలీగా పని చేస్తుంది. రోజు పనికొవెళ్లి వచ్చిన డబ్బులతో ఆమె జీవితం గడపడం..ఆమె రోజు వారి కృత్యాలు.  ఈ క్రమంలో శనివారం ఉదయం పూలమ్మ గుడిసెలో నుంచి బయటకు రాలేదు. రోజు ఈ టైం బయటికి వచ్చే పుల్లమ్మ బయటికి ఎందుకు రాలేదని స్థానికులు  అనుమానం వచ్చింది. చివరికి కొంత దైర్యం చేసి లోపలి వెళ్లి చూశారు. పుల్లమ్మ మంచం మీద పడుకుని ఉంది కానీ ఆమె ముఖంపై తీవ్ర గాయాలు కనిపించాయి. లొకాలికి వెళ్లిన వాళ్ళు ఒక్కసరిగా షాక్ తిన్నారు. ఒకటి రెండు సార్లు పుల్లమ్మ పుల్లమ్మ అని పిలిచి చూశారు. ఆయినా ఆమె పలకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జీపు వేసుకుని  ఘటన స్థలానికి చేరుకొని.. మహిళ చనిపోయినట్లు నిర్దారించారు. ఆమె మృతిపై విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్, వేలి ముద్రల నిపుణులను రంగంలోకి దింపి వివరాలను సేకరించారు. పూలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పుల్లమ్మ మరణం పై స్థానికుల్లో ఆందోనళ కలిగిస్తుంది. ఇంట్లో ఉన్న పుల్లమ్మ ఇంట్లో ఎలా చనిపోయిందని ఆవేదన చెందుతున్నారు.  పుల్లమ్మ హత్యపై అనుమానాలు.. పులమ్మ దారుణ హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఓ వ్యక్తి గుడిసెలకు చెందిన స్థలం తమదని, గుడిసెలను ఖాళీ చేసేందుకు ప్రయత్నించగా.. పూలమ్మ అడ్డుకుందని స్థానికులు చెబుతున్నారు. దీంతో, పూలమ్మపై సదరు వ్యక్తి దాడికి యత్నించగా, ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అయితే, హత్యకు భూ వివాదమే కారణమా.? లేక ఇతర కారణాలున్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలతో పాటు, బాధితురాలి కాల్ లిస్టు అధారంగా కేసును త్వరలోనే చేధిస్తామని అల్వాల్ సీఐ గంగాధర్ తెలిపారు. 

శోభనానికి స‌రిపోదు.. జగనన్న ఇళ్లపై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు..

నవరత్నాల హామీలో భాగంగా 2023 జూన్‌ నాటికి పేద‌లంద‌రికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాల‌ని ఏపీ స‌ర్కారు టార్గెట్ పెట్టుకుంది. ఏపీలో రెండు దశల్లో రూ.50,944 కోట్లతో.. 28,30,227 పక్కా ఇళ్లను నిర్మించడానికి ప్రణాళిక రూపొందించింది.  మొదటి దశలో 15.60 లక్షల గృహాలు, రెండో దశలో 12.70 లక్షల ఇళ్లను నిర్మించ‌నుంది. వైఎస్సార్‌ జగనన్న కాలనీలుగా నిర్మించనున్నారు. ఒకేరకమైన డిజైన్‌తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని 340 చదరపు అడుగులలో ఒక పడక గది, హాలు, వంట గది, స్నానాల గది, వరండాతో నిర్మిస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే, ప్ర‌చారం, ఆర్బాటం ఇలా ఉంటే.. వాస్త‌వం మ‌రోలా ఉంది. జ‌గ‌న‌న్న ఇళ్లు కాపురానికి ప‌నికి రావంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేనే కామెంట్లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇంకా ప‌క్కాగా చెప్పాలంటే.. కొత్త జంట శోభ‌నానికి ఈ ఇళ్లు ప‌నికి రావంటూ.. జ‌గ‌న‌న్న ఇళ్ల‌పై స‌మీక్ష నిర్వ‌హించిన వైసీపీ ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది.   జగనన్న ఇళ్లపై హౌసింగ్ రివ్యూలో నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జగనన్న ఇళ్లలో బెడ్రూమ్స్ సరిగా లేవని అన్నారు. బెడ్ రూమ్స్‌లో పెళ్ళయిన కొత్త జంటలకు శోభనానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందంటూ ఘాటైన కామెంట్లు చేశారు. బెడ్ రూమ్ చాలా చిన్నదిగా ఉందని.. లబ్ధిదారులు రాత్రివేళల్లో బెడ్ రూమ్ లో ఏదైనా పని చేయాలనుకున్నా ఇబ్బందిగా ఉంటుందంటూ ‘ఏ’ స‌ర్టిఫికెట్‌ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  బెడ్ రూమ్ లో పెద్ద మంచం వేయాల్సి వస్తే కష్టంగా ఉంటుందన్నారు వైసీపీ ఎమ్మెల్యే. బాత్ రూమ్ బయట ఏర్పాటు చేసి బెడ్రూమ్ సైజు పెంచాలని సూచించారు. అర్బన్ ప్రాంతాల్లో కేవలం 6 అంకణాల్లోనే ఇళ్లు నిర్మించనున్నారని.. అలాంటి ఇళ్లలో.. హాల్లో శోభనం చేసుకొని బెడ్రూమ్‌లో పడుకోవాల్సి వస్తుందంటూ ప్ర‌స‌న్న‌కుమార్ కామెంట్స్ చేయ‌డాన్ని బ‌ట్టి చూస్తే.. ఆ జ‌గ‌న‌న్న ఇళ్లు ఎంత చెండాలంగా ఉన్నాయో అర్థం అవుతోందని అంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చనీయాంశం అయింది. జ‌గ‌న‌న్న ఇళ్ల సంఖ్య పెంచ‌డానికి ఇరుకిరుకు ఇళ్ల‌ను క‌డుతున్నార‌ని అంటున్నారు. ఆర్భాటం మిన‌హా.. ఆ ఇళ్లు కాపురానికి ప‌నికి రావంటూ ఎద్దేవా చేస్తున్నారు.  అందుకు వైసీపీ ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కామెంట్లనే ఉద‌హ‌రిస్తున్నారు. మ‌రి, ఎమ్మెల్యే ఆరోపించిన‌ట్టు.. జ‌గ‌న‌న్న ఇళ్లు.. శోభ‌నానికి ప‌నికి వ‌స్తాయో లేదో.. ఆ జ‌గ‌నన్నే చెప్పాలి మ‌రి....  

17 ఏళ్ళ బాలికపై.. ఎస్ఐ వాంఛ.. 

అతనొక పోలీస్ అధికారి.. ప్రజలు తప్పు చేస్తే శిక్షించాలి. వాళ్ళని శిక్షించే అధికారం వాళ్లకు మాత్రమే కలిపించింది. అలాగే అదే ప్రజలకు తోడు ఉండాలి వెసులుబాటు కూడా కిలిపించింది మన రాజ్యాంగం. కానీ ఆ పోలీస్ తప్పులు చేస్తే.. చివరికి తన తప్పులు రుజువై జైలుపాలయితే. ఎందరికో ఆదర్శంగా నిలవాల్సింది పోయి.. కామ కోరికల కోసం ఆరాటపడి కటకటాలపాలయ్యాడు. 17 ఏళ్ల  బాలికను తుపాకీ చూపించి ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు ఓ ఎస్ఐ. అంతటి దారుణానికి పాలుపడ్డ అతను చివరికి జైలు ఊసలు లెక్కపెట్టారు. ఇంకా ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఈ అఘాయిత్య కార్యానికి  బాలిక తల్లి, పెద్దమ్మ  సహకరించడం మరో దారుణం.  అది చెన్నై కాశిమేడు పోలీసు స్టేషన్‌. అక్కడ స్పెషల్‌ టీం ఎస్‌ఐ గా సతీష్‌కుమార్‌ పనిచేస్తున్నాడు. అతను ఇటీవల మాధవరంలో భద్రత విధులు నిర్వహించాడు. ఈ నేపథ్యంలోనే ఆ ఏరియాలో ఉంటున్న రేషన్ దుకాణం మహిళలతో పరిచయం పెంచుకున్నాడు. ఇక పరిచయం తో ఆగక నిత్యం ఏదో ఒక కారణంతో రేషన్ షాపుకు వెళ్లడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే అతడి కన్ను రేషన్‌ దుకాణంలో పనిచేసే  మహిళా సిబ్బంది కూతురు(17) పై పడింది. ఆమెను ఎలాగైనా లొంగతీసుకోవాలనుకున్నాడు. అందుకు ఏం చేయాలని ఆలోచించాడు. ముందు కోడిని వలలో వేస్తే కోడి పిల్ల దాని అంతటికి అదే వస్తుందనుకుని. తన పధకం పిల్ల తల్లికి చెప్పడు. బాలిక తల్లి, పెద్దమ్మ కూడా అతడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తోడుగా ఉంటామని మద్దత్తు మద్దతు పలికారు. దీంతో భయపడిన బాలిక తన తండ్రికి విషయాన్ని తెలియజేసింది. అసమర్థుడైన తండ్రి ఏమి చేయలేని పరిస్థితి కావడంతో అతడు మిన్నకుండిపోయాడు. ఇక అంతే తండ్రి అసమర్థుడు, తల్లి, పెద్దమ్మ లు అతనికి సపోర్ట్ అనుకున్నాడు.. అతనికి ఇంకా అడ్డు లేదనుకున్నాడు అతన్ని ఎవరు ఏం చేసేవాళ్ళు లేరని ఫీల్ అయ్యాడు. ఇదే అదునుగా భావించిన ఎస్ఐ సతీష్‌కుమార్‌ తాను చెప్పినట్టు వినకుంటే తండ్రి, తమ్ముడిని కేసుల్లో ఇరికించి జైలుకు తరలిస్తానని ఆ అమ్మాయిని బెదిరించాడు. అయినా బాలిక చిక్కలేదు. దాంతో ఎస్ఐ బాలికకు తుపాకీ గురిపెట్టి ఆమెను లైంగికంగా వేధించాడు. ఎస్ఐ ఆగడాలు తట్టుకోలేని బాలిక వాట్సాప్‌ ద్వారా పుళల్‌ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకా మహిళా పోలీసులు రంగంలోకి దిగి బాలిక ఫిర్యాదు మేరకు ఆమె తల్లి, పెద్దమ్మను గురువారం పోలీసులు అరెస్ట్ చేయగా.. పక్కా ఆధారాలతో శుక్రవారం  ఎస్‌ఐ సతీష్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన చెన్నై లో వెలుగు చూసింది. 

కేంద్ర‌మంత్రిపై ట్విట్ట‌ర్ రివేంజ్! ఏఆర్ రెహ‌మాన్ కార‌ణ‌మా?

కేంద్రప్ర‌భుత్వం వ‌ర్సెస్ ట్విట్ట‌ర్‌. ఐటీ చ‌ట్టాల అమ‌లుపై కొంత‌కాలంగా ఓ రేంజ్‌లో వార్ న‌డుస్తోంది. కేంద్రం స్ట్రాంగ్ యాక్ష‌న్‌తో ట్విట్ట‌ర్‌ను కార్నర్ చేయ‌డంతో దిగిరాక త‌ప్ప‌లేదు. అంత‌కుముందు కోర్టుకు వెళ్లినా.. ఇక త‌ప్పేలా లేదంటూ ఐటీ చ‌ట్టాల‌కు స‌రేనంటూ త‌లొగ్గింది ట్విట్ట‌ర్‌. కేంద్రం దెబ్బ‌కు దిబ్బ తిరిగి మైండ్ బ్లాంక్ అయినంత ప‌నైంది ఆ అమెరిక‌న్ కంపెనీకి.  ద‌బాయించ‌డ‌మే తెలిసిన ట్విట్ట‌ర్‌ను ద‌డ‌ద‌డ‌లాడించిన ఘ‌న‌త మాత్రం కేంద్రానిదే. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌కే చుక్క‌లు చూపెట్టిన ట్విట్ట‌ర్‌.. భార‌త ఐటీ శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ముందు తోక ముడిచింది. దీన్ని అవ‌మానంగా భావించిందో, లేక ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకుందో.. శుక్ర‌వారం మంత్రి ట్విట్ట‌ర్ అకౌంట్‌ను గంట పాటు ఆపేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ట్విట్ట‌ర్ ఓవ‌రాక్ష‌న్‌పై ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యారు. గంట త‌ర్వాత అకౌంట్ ప‌ని చేసినా.. ర‌చ్చ మాత్రం కంటిన్యూ అవుతోంది. మ‌రోమాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శ‌శిథ‌రూర్ సైతం త‌న‌కూ రెండుసార్లు ఇలానే జ‌రిగిందంటూ ట్విట్ట‌ర్‌పై మండిప‌డ్డారు.  ఇంత‌కీ కేంద్ర ఐటీ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ట్విట్ట‌ర్ ఖాతాను గంటసేపు ఎందుకు బ్లాక్ చేయాల్సి వ‌చ్చిందంటూ ఆరా తీస్తే.. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగుచూసింది. మంత్రి గారి ట్విట్ట‌ర్ అకౌంట్‌పై మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్ ఎఫెక్ట్ ప‌డింది. నేరుగా లేక‌పోయినా.. ఆయ‌న కంపోజ్ చేసిన ఓ సాంగ్ ర‌విశంక‌ర్ అకౌంట్ మూత‌ప‌డేలా చేసింది. ఎలాగంటే... కాపీరైట్ చ‌ట్టం కింద ట్విట్ట‌ర్ సంస్థ మంత్రి ట్వీట్ల‌ను నిలిపివేసింది. అయితే మంత్రి ర‌విశంక‌ర్ ఓ మ్యూజిక్ కంపెనీ సౌండ్‌ట్రాక్‌ను వాడ‌డం వ‌ల్ల కాపీరైట్ జ‌రిగిన‌ట్లు తేలింది. ఏఆర్ రెహ్మాన్ కంపోజ్ చేసిన ‘మా తుజే స‌లామ్’ పాట సౌండ్‌ట్రాక్‌లోని ఓ క్లిప్‌ను మంత్రి పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఉన్న‌ట్టు లుమెన్ డేటాబేస్ ద్వారా వెల్ల‌డైంది. అమర వీరుల‌కు నివాళులర్పిస్తూ మంత్రి ర‌విశంక‌ర్ పోస్ట్ చేసిన‌ వీడియోలో మా తుజే స‌లామ్ ట్రాక్ వాడ‌టంతో కాపీరైట్స్ స్ట్రైక్ ప‌డింది. సోని మ్యూజిక్ సంస్థ ఆ కాపీరైట్‌ను జారీ చేసింది. అమెరికాకు చెందిన డిజిట‌ల్ మిలీనియ‌మ్ కాపీరైట్ యాక్ట్ కింద ఈ ఉల్లంఘ‌న జ‌రిగిన‌ట్లు ట్విట్ట‌ర్ వెల్లడించింది. గంట త‌ర్వాత మ‌ళ్లీ పున‌రుద్ద‌రించినా.. ట్విట్ట‌ర్ సంస్థ భార‌తీయ ఐటీ చ‌ట్టాల‌ను ఉల్లంఘించిందంటూ మంత్రి మండిప‌డ్డారు. భార‌త ఐటీ శాఖ‌కు ట్విట్ట‌ర్‌కు మ‌ధ్య పెద్ద ఎత్తున వివాదం నెల‌కొన్ని ప్ర‌స్తుత సంద‌ర్భంలోనే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం కాక‌తాళీయ‌మా? లేక‌, ఉద్దేశ్య‌పూర్వ‌క‌మా? అనే అనుమానం రాక‌మాన‌దు. ముందుముందు ఈ క‌వ్వింపు చ‌ర్య‌లు ఎక్క‌డికి దారి తీస్తాయో చూడాలి...  

 ఫస్ట్ రౌండ్ లో ఈటలదే విన్! కేసీఆర్ దిగొచ్చారుగా... 

రాజకీయాలలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చును. లెఫ్ట్ లో పుట్టి రీజినల్ పార్టీలో ఎదిగిన ఈటల రాజేందర్, రైటిస్ట్ పార్టీ బీజేపీలో చేరతారని ఎవరైనా ఉహించారా, ఒక్క ఈటల మాత్రమే కాదు, ఇంకా చాలా మంది, విభిన్న భావజాలాలకు చెందిన వారు, అందుకు విభిన్న భావజాల పార్టీలలో చేరి సర్దుకు పోతున్నారు. రాజకీయ అవసరాలు ఎంతటి వారిని  అయినా  చివరకు కేసీఆర్’ అంతిటి వాడినే అయినా, కిందకు దిగి వచ్చేలా చేస్తాయి. అందులోనూ అందితే జుట్టు, లేదంటే కాళ్ళు పటుకోవడంలో సిద్దహస్తుల  విషయం అయితే చెప్పనే అక్కర లేదు.  అదేమంటే, వసుదేవుడు ... గాడిద కాళ్ళు ఉండనే ఉన్నాయి.  ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్న చరిత్రను చూస్తే, అదే అనిపిస్తుంది. ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత గౌరవం ఇస్తారో, అందరికే తెలిసిన విషయమే. ఇంతవరకు ప్రగతి భవన్’లో కాలు పెట్టిన ప్రతిపక్ష నాయకులను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చును.సరే, మంత్రులకే ఎంట్రీ లేని కోటలోకి, ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఎంట్రీ లేక పోవడం పెద్ద విచిత్రం కాదు. నిజమే, కుక్క మనిషిని కరిస్తే అది వార్త కాదు. మనిషి కుక్కను కరిస్తే అది వార్త ... అని కదా అంటారు.  అందుకే కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ ఇవ్వడం సంచలన బ్రేకింగ్ వార్త అయింది.   కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జగ్గా రెడ్డి. కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి బృందానికి ప్రగతి భవన్’లోకి ఎంట్రీ కాదు. ఏకంగా రెడ్ కార్పెట్ స్వాగతమే లభించింది. అంతే, కాదు కాంగ్రెస్ నేతలకు అడిగిందే తడవుగా అప్పాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా,యదాద్రి జిల్లా గూడూరు పోలీసి స్టేషన్’లో దళిత మహిళ మరియమ్మ అనుమాన స్పద మృతిపై ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని పుచ్చుకుని, నిముషాల్లోనే, చర్యలు తీసుకున్నారు. మరియమ్మ మృతిపై విచారణకు ఆదేశించారు. నిజ నిర్ధారణ చేసి చట్ట ప్రకారం  చర్యలు తీసుకోవాలని, అవసరం అయితే, మరియమ్మ  మృతికి బాధ్యులైన వారిని ఉద్యోగం  నుంచి తొలిగించాలని, బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించాలని డీజీపీని ఆదేశించారు. అంతే కాదు మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్’కు రూ.15 లక్షలు, ఆమె ఇద్దరు కుమార్తెలకు రూ.10 లక్షల వంతున ప్రభుత్వ సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అంతే కాదు, ఎస్సీల పట్ల సమాజ దృక్పధం మారాలని, ఎస్సీలు పేదలపట్ల పోలీసుల ఆలోచనాదోరణి మారాలని ముఖ్యమంత్రి  ఉద్భోదించారు. ఎస్సీల  మీద చేయి  పడితే ఊరుకునేది లేదని ఓ హెచ్చరిక కూడా చేశారు.   ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులకు అప్పాయింట్మెంట్ ఇవ్వడమే చిత్రం, విచిత్రం అనుకుంటే, ఇలా నిముషాల్లో విపక్ష నేతల డిమాండ్లను జీహుజూర్ తరహాలో అములు చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అయితే ఇందంతా  హుజురాబాద్ మహత్యం అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.  హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర  రాజకీయ భవిష్యత్’ను ముఖ్యంగా తెరాస భవిష్యత్’ను తిరగరాసే ప్రమాదం పొంచి ఉందని, అందుకే కేసీఆర్’ లో ఈమార్పు అని  అంటున్నారు. నిజానికి, హుజురాబాద్, ఈటల ఎఫెక్ట్’ తోనే కేసీఆర్, ఫార్మ్ హౌస్ వదిలి ప్రజల్లోకి వెళ్లారు.అధికార కార్యక్రమాల పేరున వెళ్ళినా, ఎన్నికల ప్రసంగమే చేశారు. ఇక, హుజురాబాద్ ‘లో అయితే మంత్రులు,  ఎంపీలు, ఎమ్మెల్యేలను రేషన్ కార్డులు ఇతర  ప్రయోజనాలను ఇంటింటికి పంచుతున్నారు. మరో  రాజకీయ  బేరసారాలు జోరుగా సాగుతున్నాయాని, ఈటల ఇతర బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయినా అది వేరే విషయం అనుకోండి.  అయితే మార్పు మంచిదే అయినా, ఎస్సీల మీద చేయిపడితే ప్రభుత్వం ఊరుకోబోదని, నిందితులపై తక్షణమే కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హెచ్చరిక స్వాగతించ దగినదే అయినా, యాదాద్రి లాకప్‌డెత్ ఘటనపై నిమిషాల్లో  విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి , ఏళ్లు గడిచిపోతున్నా నేరెళ్లలో దళితులపై జరిగిన భౌతిక దాడులపై అవే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న సందేహాలు సహజంగానే వ్యక్తమవుతున్నాయి. నేరెళ్ళ దురాగతం జరిగి ఇన్నేళ్ళు అయినా, ఇప్పటకీ, కేటీఆర్ తమ సొంత నియోజకవర్గం సిరిసిల్లకు ఎప్పుడు వెళ్ళినా, దళితులను అరెస్ట్ చేయడం, లాఠీలు విరగడం  రొటీన్’ గా జరిగి పోతూనే ఉంది, కదా.. అన్న ప్రశ్నలు కూడా దళిత వర్గాల నుంచే వినవస్తున్నాయి. ముఖ్యమంత్రి మొదలు అధికార పార్టీ అగ్రనేతలు హుజురాబాద్’ ఉప ఎన్నిక విషయంలో వ్యవహరిస్తున్నతీరు చూస్తే, ఎందుకో ఉలిక్కి పడుతున్నట్లు కనిస్తోంది. అందుకే, ఫస్ట్ రౌండ్’లో ఈటలదే పై చేయి అంటున్నారు విశ్లేషకులు.

రఘురామపై వేటు తప్పదా..? కేంద్రానికి జగన్ సరెండరేనా..? 

వాళ్లిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లే కనపడుతోంది. కళ్ల ముందు జరిగింది కనపడుతున్నా.. చట్టం ఒకరికే చుట్టంలా పని చేసిందని తెలుస్తూనే ఉన్నా.. ఆ విషయాన్ని పక్కన పెట్టి..ఇప్పుడు రహస్య మిత్రులు ముందు వేటు వేయడానికే సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటుకు రంగం సిద్ధమైపోయిందని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈసారి వదిలేది లేదు..అన్ని వీడియోలు స్పీకర్ కు ఇచ్చాం..ఖచ్చితంగా వేటు పడుతుందంటూ బల్లగుద్ది చెబుతున్నారు. మరోవైపు ఎంపీ రఘురామ మాత్రం తనను సీఐడీ అధికారులు వేధించిన తీరుపై ఢిల్లీలో దాదాపు గడప గడపకు తిరిగి వినిపించారు. వివిధ రాష్ట్రాల ఎంపీలు సైతం స్పందించి దీనిపై పార్లమెంట్లో చర్చ పెడతామని ఇప్పటికే ప్రకటించారు. ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి తన పంతం నెరవేర్చుకునే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మామూలుగా ప్రశ్నిస్తే సహించలేని జగన్... సొంత పార్టీ ఎంపీ అయి ఉండి కూడా తనను అనేక అంశాలలో నిలదీయడమే కాక..ప్రజల్లో తనను డీఫేమ్ చేశారని మండిపడుతున్నారని.. అందుకే రూల్స్ గీల్స్ పక్కన పెట్టి ఎలాగైనా సరే జైలులో వేయాలని ఆదేశాలివ్వడంతోనే... సీఐడీ ఎపిసోడ్ జరిగిందనే టాక్ వినపడుతోంది. ఇప్పటివరకు రఘురామ మీడియాలో మాట్లాడుతూ తెలుగు ప్రజల్లోనే జగన్ తప్పుల గురించి చెబుతూ వచ్చారు.. కాని ఇప్పుడు సీఐడీ ఎపిసోడ్ తో అన్ని రాజకీయ పార్టీల ఎంపీలకు జగన్ వైఖరి తెలిసేలా ఓ సైలెంట్ క్యాంపెయిన్ చేస్తున్నారు.దీంతో జగన్ కు కోపం మరింత పెరిగిందని అంటున్నారు. అందుకే కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి.. ఎలాగైనా సరే రఘురామపై సస్పెన్షన్ వేటు వేసేలా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే అంతా సెట్ అయిపోయిందని..వేటు పడటమే లేటని..స్పీకర్ ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకుంటారని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. బిజెపి సైతం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వేళ... అందుకు తగ్గట్టుగానే జగన్ రిక్వెస్టును యాక్సెప్ట్ చేసి ఉండొచ్చని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.గతంలో అనేకసార్లు స్పీకర్ కు లేఖలిచ్చిన వైసీపీ నేతలు..లేటెస్టుగా మరో లేఖతో పాటు.. రఘురామ మాట్లాడిన వీడియోలను కూడా సమర్పించారు.అయితే తనపై చర్య తీసుకోవద్దంటూ తాను చేసిన కామెంట్లకు వివరణ ఇస్తూ రఘురామ కూడా స్పీకర్ కు లేఖ రాశారు. అయితే బిజెపి ఈ విషయంలో తెలివిగా వ్యవహరించే అవకాశం ఉందనే కామెంట్లు వినపడుతున్నాయి. ఒకవైపు స్పీకర్ ద్వారా రఘురామపై అనర్హత వేటు వేయించి.. మరోవైపు రఘురామ, ఇతర ఎంపీలు కోరినట్లుగా...ఏపీ సీఐడి అధికారుల వ్యవహారంపై చర్చకు అనుమతిస్తారు.  ఈ చర్చ అయిన తర్వాతనే అనర్హత వేటు ఆదేశాలు వస్తాయని చెబుతున్నారు. హస్తినలో ఇప్పుడు ఇదే మంత్రాంగం నడుస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే త్వరలోనే నర్సాపురంలో ఎన్నికలు తప్పవు..అప్పుడు రఘురామను ఓడించి.. గట్టి బదులు ఇవ్వాలని.. రఘురామ రాజకీయ అంతం చూడాలనే పంతంలో జగన్ ఉన్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. 

కేసీఆర్ డ్రామాలో పావుగా జగన్! జల వివాదంలో ట్విస్టులు..

తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల వివాదంలో రోజుకో కీలక పరిణామం వెలుగు చూస్తోంది. ప్రాజెక్టులు అపాలని ఏపీ ప్రభుత్వానికి కృష్ణా రివర్జ్ బోర్డు లేఖ రాసినా.. వివాదం చల్లారడం లేదు. తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాల అజయ్ కుమార్ తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నీళ్లను అక్రమంగా తరలించుకుపోయిన దొంగ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటూ మళ్లీ కాక రేపారు. అయితే గులాబీ నేతలు వైఎస్సార్ టార్గెట్ గా విరుచుకుపడుతున్నా వైసీపీ నేతలు కూల్ గానే ఉండటం, సీఎం జగన్ శిబిరం నుంచి వేగంగా యాక్షన్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నీళ్ల పేరుతో సెంటిమెంట్ రగిలిస్తూ.. రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.  తెలంగాణలో జనాగ్రహం ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్.. రాజకీయంగా లబ్ది పొందటానికే కృష్ణ జలాలపై వివాదం చేస్తున్నారని ఏపీ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీని అడ్డుకోవడం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ డ్రామా ఆడుతున్నారని ఏపీ బీజేపీ   విష్ణువర్ధన్ రెడ్డి  విమర్శించారు. కేసీఆర్ ఆడుతున్న  డ్రామాలో ఏపీ సీఎం పావుగా మారారన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు.కృష్ణా జలాల వాటాల విషయంలో వివాదమే లేదన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తూ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించిందని, కేంద్రమే చొరవ తీసుకుందని ఆయన గుర్తుచేశారు. ఈ విషయాన్ని ట్రిబ్యూనల్ తీర్పు స్పష్టంగా చెప్పిందన్నారు. తెలంగాణ మంత్రులు  రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని  విష్ణువర్ధన్ రెడ్డిఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ మంత్రులు ఉపయోగించే భాష సరిగా లేదన్నారు. రాయలసీమ ప్రజలకు సాగు నీరే కాదు.. తాగు నీరు కూడా లేదని స్వయంగా కేసీఆరే అన్నారని, అలాంటి ప్రాంతానికి నీటినిచ్చే ప్రాజెక్టులను ఇప్పుడు అడ్డుకోవడం కేవలం రాజకీయం కోసమేనని ఆరోపించారు. తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ కుట్రలో సూత్రధారులు, పాత్రధారులుగా తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఐకమత్యంగా, క్షేమంగా ఉండాలన్నదే బీజేపీ వైఖరి అని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నిర్మించే ప్రాజెక్టులను అక్రమ ప్రాజెక్టులు అని మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్‌కు, తెలంగాణ మంత్రులకు లేదన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. పాలమూరు లిఫ్ట్, డిండి ప్రాజెక్టులు అక్రమంగా నిర్మించలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో పాలమూరు జిల్లా కూడా వెనుకబడింది కదా అని ఏపీ నేతలు వీటిపై పెద్దగా మాట్లాడలేదని పేర్కొన్నారు. సమస్యను రెండు రాష్ట్రాల జలవివాదంగా చూడకుండా రాయలసీమ ప్రజల నీటికష్టాలుగా చూడాలని హితవుచెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టులో రాయలసీమ రైతులు భూములు కోల్పోయారని, కానీ ప్రాజెక్టు తెలంగాణకే ఎక్కువ ఉపయోగపడుతోందన్నారు విష్ణువర్ధన్ రెడ్డి.

వామ్మో.. మళ్లీ ఎన్నికలా! వైసీపీ నేతల్లో టెన్షన్...

పరిషత్ ఎన్నికలు మళ్లీ పెడతారా? అమ్మో అంటూ గుండె పట్టుకుంటున్నారు వైసీపీ నేతలు.  ఒకవైపు ప్రభుత్వం ఎన్నికల రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేసే పనిలో బిజీగా ఉంటే..రూల్స్ బుక్ చదువుతూ న్యాయమూర్తులు మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను నిలదీస్తోంది. దీంతో మళ్లీ ఎన్నికలు పెట్టక తప్పవా అనే అనుమానాలు వస్తున్నాయి.  ఇంకోవైపు అసలు గెలిచామో లేదో కూడా తెలియని పరిస్ధితుల్లో ఉన్న క్యాండేట్లు మాత్రం..మళ్లీ పోలింగ్ అనే ఆలోచన వస్తేనే అల్లాడిపోతున్నారు. జిల్లా, మండల స్థాయి వైసీపీ నేతలు పాపం కష్టాల్లో పడ్డారు. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడ్డ పరిషత్ ఎన్నికలకు..మూడు సార్లూ ప్రచారం ఖర్చు పెట్టుకున్నారు. పోలింగ్ మేనేజ్ మెంట్ ఖర్చు ఎటూ భారీగానే ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా మెజారిటీ స్థానాలు గెలవాలని ఆదేశమివ్వడంతో.. పాపం భారీగానే ఖర్చు పెట్టారు. అయితే ఇప్పుడు ఆ ఖర్చంతా వేస్ట్ అనే పరిస్దితి రావడంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. మళ్లీ ఎన్నికలు అంటే...కష్టమేనని వారంతా ఆవేదన చెందుతున్నారు. ఆల్ రెడీ టీడీపీ బాయ్ కాట్ చేయడంతో... కొందరు ఖర్చు పెట్టుకున్నారు..చాలామంది వదిలేశారు. కాని వైసీపీ పరిస్దితి మాత్రం అది కాదు. ప్రతి స్థానం మనమే గెలవాలన్నట్లుగా వ్యూహాలు పన్ని.. పై నుంచి అధినాయకులు ఒత్తిడి చేయడంతో... డబ్బులు కుమ్మరించేశారు. డామిట్ కథ అడ్డం తిరిగిందన్నట్లు అయిందిప్పుడు పరిస్దితి. అసలు తప్పంతా ఎవరిదంటే..అందరి చూపు జగన్మోహన్ రెడ్డి వైపు తిరుగుతుంది. పైకి ఏమీ అనలేరు..ఆయనేమో కంటి చూపుతోనే బెదిరించడం కాదు.. అసలు కంటిచూపుకే దొరకని పరిస్ధితి. ఎమ్మెల్యేలు, మంత్రులతోనే మొరపెట్టుకోవాల్సి వస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత కాలం...ఎన్నికల జరగకుండా ఆపాలని చూసిన వైసీపీ సర్కార్...ఆయన ఎన్నికలు పెట్టినప్పుడు ఆపడానికి హైకోర్టు, సుప్రీంకోర్టుకు పరుగులు పెట్టింది. చివరకు తప్పక పాల్గొనడానికి సిద్ధపడ్డారు. అయితే విచిత్రంగా అక్రమాలు ఎన్ని జరిగినా..కంప్లయింట్లు ఎన్నివచ్చినా... నిమ్మగడ్డ రమేష్ కుమార్ సైలెంట్ గానే ఉండిపోయారు. పైగా గతంలో ఆయనే స్వయంగా రాసిన అక్రమాల గురించి కూడా పట్టించుకోలేదు. దీంతో టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించింది.  ఇక నిమ్మగడ్డ రిటైర్ కాగానే...వెంటనే వినయ విధేయ సాహ్ని గారిని ఎన్నికల కమిషనర్ చేసేశారు. వాళ్లనుకున్నట్లుగా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు కంప్లీట్ చేసేయాలనే ప్లాన్ లో ఉన్న జగన్ ఆదేశాలను తుచ తప్పక పాటించిన సాహ్ని.. సుప్రీంకోర్టు గత ఆదేశాలను, నిబంధనలను అన్నీ తుంగలో తొక్కేసి హడావుడిగా ఎన్నికలకు వెళ్లిపోయారు. చాలామంది కోర్టుకు వెళ్లినా... హైకోర్టు స్టే విధించలేదు. దీంతో ఎన్నికలు జరిగిపోయాయి..కాని తర్వాత తుది తీర్పులో హైకోర్టు ఎన్నికలను రద్దు చేసింది. దీంతో కథ మొదటికి వచ్చింది. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టిన వైసీపీ జిల్లా, మండల స్థాయి నేతలు మాత్రం ఫలితాల సంగతి మర్చిపోయారు. మళ్లీ ఎన్నికలు పెట్టకపోతే అదే పదివేలని ఎదురు చూస్తున్నారు. కాని ఎన్నికలు మళ్లీ పెట్టక తప్పేటట్టు లేదు. అదే జరిగితే అటు అధినేత డబ్బులు ఎటూ ఇవ్వరు.. మంత్రులు, ఎమ్మెల్యేల సంగతి సరే సరి..వాళ్లకు ఇన్ కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. అందుకే మళ్లీ డబ్బులు ఎలా సమకూర్చుకోవాలా అనే టెన్షన్ లో పడ్డారు వైసీపీ నేతలు.

ముంచుకొస్తున్న‌ డెల్టా ప్ల‌స్‌.. తెలుగుస్టేట్స్ అల‌ర్ట్‌..

డెల్టాతోనే డేంజ‌ర్ అనుకుంటే డెల్టా ప్ల‌స్ మ‌రింత డేంజ‌ర‌స్ అంటున్నారు సైంటిస్టులు. కొత్త వేరియంట్ మ‌రింత వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో 12 రాష్ట్రాల్లో.. 50కిపైగా కేసులు న‌మోద‌య్యాయి. డెల్టా ప్లస్ కేసుల్లోనూ మ‌హారాష్ట్ర ముందుగా బ‌ల‌వుతోంది. అత్యధికంగా మహారాష్ట్రలో 22 కేసులు.. తమిళనాడులో 9, మధ్యప్రదేశ్‌లో 7 కేసులు వెలుగుచూశాయి. కేరళలో మూడు, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో రెండేసి కేసులు.. ఏపీ, ఒడిశా, రాజస్థాన్‌, జమ్ము, కశ్మీర్‌, హరియాణా, కర్ణాటకల్లో ఒక్కో కేసు బ‌య‌ట‌ప‌డ్డాయి.  సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటకల్లో కేసులు నమోదు కావడంతో తెలంగాణ‌ సర్కారు అప్రమత్తమైంది. అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్య అధికారులను రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అల‌ర్ట్ చేశారు. కొవిడ్‌ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా రోజుకు లక్ష తగ్గకుండా చేయాలని సూచించారు. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకినవారికి ఆక్సిజన్‌ అవసరం ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో  ఆస్పత్రుల్లో  ప్రాణవాయువు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 130 (డీఎంఈ, టీవీవీపీ) ఆస్పత్రుల్లో 27,141 పడకలను వైద్య శాఖ సిద్ధం చేసింది. 10,224 బెడ్స్‌కు ఆక్సిజన్‌ లైన్‌ ఏర్పాటు చేయగా, మిగిలిన 16,917 పడకలకు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. డెల్టా ప్ల‌స్‌పై ఏపీ సైతం అప్ర‌మ‌త్త‌మైంది. ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించి త‌గు ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. మహారాష్ట్రలో థర్డ్‌ వేవ్‌లో ఐదు లక్షల మంది పిల్లలు సహా 50 లక్షల మంది వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉందని ఆ రాష్ట్ర మంత్రి రాజేంద్ర షింగ్నే ఆందోళన వ్యక్తం చేశారు. మూడో వేవ్‌లో దాదాపు 8 లక్షల యాక్టివ్‌ కేసులు ఉండొచ్చని అంచ‌నా వేస్తున్నారు. 5 లక్షల మంది పిల్లల్లో 2.5 లక్షల మందికి ఆస్పత్రి చికిత్స అవసరమవుతుందని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. థర్డ్‌వేవ్‌, డెల్టా ప్లస్‌ ముప్పు నేపథ్యంలో మహారాష్ట్ర.. మళ్లీ లెవెల్‌-3 ఆంక్షలను అమల్లోకి తెచ్చింది.  డెల్టా వేరియంట్‌కు.. బీటా వేరియంట్‌లోని కే417ఎన్‌ మ్యుటేషన్‌ తోడై.. డెల్టా ప్లస్‌ వేరియంట్‌గా రూపొందింద‌ని నిపుణులు వివరిస్తున్నారు. ప్లస్‌ అంటే దీని తీవ్రత ఎక్కువని అర్థం కాదని చెబుతున్నారు. డెల్టా ప్లస్‌ కేసులు పెరుగుతున్నందున్న‌ అప్రమత్తంగా ఉండాలని ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక సహా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్రం హెచ్చ‌రించింది.  కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. అది రెండో వేవ్‌ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం ద్వారా ఈ ముప్పును వీలైనంతవరకూ బాగా తగ్గించవచ్చని వెల్లడైంది. ఐసీఎంఆర్‌కు చెందిన సందీప్‌ మండల్‌, బలరామ్‌ భార్గవ్‌, సమీరన్‌ పాండా, ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌కు చెందిన నిమలన్‌ అరినమిన్‌పతి చేసిన ఈ అధ్యయన నివేదిక ‘ప్లాసిబిలిటీ ఆఫ్‌ ఏ థర్డ్‌ వేవ్‌ ఆఫ్‌ కొవిడ్‌-19 ఇన్‌ ఇండియా: ఏ మ్యాథమెటికల్‌ మోడలింగ్‌ బేస్డ్‌ ఎనాలిసిస్‌’’.. ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌లో ప్రచురితమైంది.