రఘురామపై వేటు తప్పదా..? కేంద్రానికి జగన్ సరెండరేనా..?
posted on Jun 26, 2021 @ 3:42PM
వాళ్లిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లే కనపడుతోంది. కళ్ల ముందు జరిగింది కనపడుతున్నా.. చట్టం ఒకరికే చుట్టంలా పని చేసిందని తెలుస్తూనే ఉన్నా.. ఆ విషయాన్ని పక్కన పెట్టి..ఇప్పుడు రహస్య మిత్రులు ముందు వేటు వేయడానికే సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటుకు రంగం సిద్ధమైపోయిందని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈసారి వదిలేది లేదు..అన్ని వీడియోలు స్పీకర్ కు ఇచ్చాం..ఖచ్చితంగా వేటు పడుతుందంటూ బల్లగుద్ది చెబుతున్నారు. మరోవైపు ఎంపీ రఘురామ మాత్రం తనను సీఐడీ అధికారులు వేధించిన తీరుపై ఢిల్లీలో దాదాపు గడప గడపకు తిరిగి వినిపించారు. వివిధ రాష్ట్రాల ఎంపీలు సైతం స్పందించి దీనిపై పార్లమెంట్లో చర్చ పెడతామని ఇప్పటికే ప్రకటించారు.
ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి తన పంతం నెరవేర్చుకునే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మామూలుగా ప్రశ్నిస్తే సహించలేని జగన్... సొంత పార్టీ ఎంపీ అయి ఉండి కూడా తనను అనేక అంశాలలో నిలదీయడమే కాక..ప్రజల్లో తనను డీఫేమ్ చేశారని మండిపడుతున్నారని.. అందుకే రూల్స్ గీల్స్ పక్కన పెట్టి ఎలాగైనా సరే జైలులో వేయాలని ఆదేశాలివ్వడంతోనే... సీఐడీ ఎపిసోడ్ జరిగిందనే టాక్ వినపడుతోంది. ఇప్పటివరకు రఘురామ మీడియాలో మాట్లాడుతూ తెలుగు ప్రజల్లోనే జగన్ తప్పుల గురించి చెబుతూ వచ్చారు.. కాని ఇప్పుడు సీఐడీ ఎపిసోడ్ తో అన్ని రాజకీయ పార్టీల ఎంపీలకు జగన్ వైఖరి తెలిసేలా ఓ సైలెంట్ క్యాంపెయిన్ చేస్తున్నారు.దీంతో జగన్ కు కోపం మరింత పెరిగిందని అంటున్నారు. అందుకే కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి.. ఎలాగైనా సరే రఘురామపై సస్పెన్షన్ వేటు వేసేలా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అంతా సెట్ అయిపోయిందని..వేటు పడటమే లేటని..స్పీకర్ ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకుంటారని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. బిజెపి సైతం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వేళ... అందుకు తగ్గట్టుగానే జగన్ రిక్వెస్టును యాక్సెప్ట్ చేసి ఉండొచ్చని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.గతంలో అనేకసార్లు స్పీకర్ కు లేఖలిచ్చిన వైసీపీ నేతలు..లేటెస్టుగా మరో లేఖతో పాటు.. రఘురామ మాట్లాడిన వీడియోలను కూడా సమర్పించారు.అయితే తనపై చర్య తీసుకోవద్దంటూ తాను చేసిన కామెంట్లకు వివరణ ఇస్తూ రఘురామ కూడా స్పీకర్ కు లేఖ రాశారు. అయితే బిజెపి ఈ విషయంలో తెలివిగా వ్యవహరించే అవకాశం ఉందనే కామెంట్లు వినపడుతున్నాయి.
ఒకవైపు స్పీకర్ ద్వారా రఘురామపై అనర్హత వేటు వేయించి.. మరోవైపు రఘురామ, ఇతర ఎంపీలు కోరినట్లుగా...ఏపీ సీఐడి అధికారుల వ్యవహారంపై చర్చకు అనుమతిస్తారు. ఈ చర్చ అయిన తర్వాతనే అనర్హత వేటు ఆదేశాలు వస్తాయని చెబుతున్నారు. హస్తినలో ఇప్పుడు ఇదే మంత్రాంగం నడుస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే త్వరలోనే నర్సాపురంలో ఎన్నికలు తప్పవు..అప్పుడు రఘురామను ఓడించి.. గట్టి బదులు ఇవ్వాలని.. రఘురామ రాజకీయ అంతం చూడాలనే పంతంలో జగన్ ఉన్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.