YSRలా రేవంత్ రెడ్డి పాదయాత్ర? సీఎం పోస్టే టార్గెట్ ?
posted on Jun 26, 2021 @ 8:48PM
అందరు అనుకుంటున్నట్లే తెలంగాణ పీసీసీ పగ్గాలు ఎంపీ రేవంత్ రెడ్డికి దక్కాయి. రేవంత్ రెడ్డిని ప్రకటించడంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. పీసీసీ చీఫ్ పదవి సాధించిన రేవంత్ రెడ్డి.. నెక్స్ట్ టార్గెట్ ముఖ్యమంత్రి పోస్టేనంటూ నినాదాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మద్దతుదారుల హంగామాతో గాంధీభవన్ సందడిగా మారింది.
అనుకున్నది సాధించిన రేవంత్ రెడ్డి... నెక్స్ట్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. పీసీసీ చీఫ్ పదవి వస్తుందని ముందునుంచే ధీమాగా ఉన్న రేవంత్ రెడ్డి.. భవిష్యత్ కార్యాచరణ కూడా ఇప్పటికే సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. నెక్ట్స్ మూడేళ్లకు సరిపడా మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకొని పెట్టుకున్నారట. కేసీఆర్‌పై దండయాత్రే ఆయన లక్ష్యమని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా కేసీఆర్ పాలన, కేసీఆర్ కుటుంబంపై పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ గా తన దూకుడును మరింత పెంచనున్నారు.
అసెంబ్లీ సంగ్రామానికి ఇంకా రెండున్నరేళ్ల గడువుంది. అందుకే, ఇప్పటి నుంచే ఆవేశపడకుండా.. తుదిపోరుకు ఎనర్జీ సేవ్ చేసుకునేలా ఆచితూచి అడుగులు వేయాలనేది రేవంత్‌రెడ్డి స్ట్రాటజీలా కనిపిస్తోంది. గతంలో వైఎస్సార్ అనుసరించిన ఎత్తుగడలనే రేవంత్‌రెడ్డి ఇంప్లిమెంట్ చేసేలా సన్నద్దమవుతున్నారని సమాచారం. అధికారంలోకి వచ్చేందుకు వైఎస్సార్ వేసిన తిరుగులేని ఎత్తుగడ.. పాదయత్ర. అదే ఆయన రాజకీయ జీవితానికి మరో ప్రస్థానంగా బాటలు పరిచింది. చేవెళ్లలో వేసిన తొలి అడుగు.. వైఎస్సార్‌ను ముఖ్యమంత్రి పీఠం వరకూ తీసుకెళ్లింది. ఆ పాదయాత్ర తర్వాతే వైఎస్సార్. కాంగ్రెస్‌లో తిరుగులేని నేతగా ఎదిగారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవినే చేపట్టారు.
వైఎస్సార్ లానే సేమ్ టూ సేమ్ ఇదే స్ట్రాటజీని రేవంత్‌రెడ్డి సైతం ఫాలో కాబోతున్నారని తెలుస్తోంది. జిల్లాల వారిగా ఇప్పటికే రేవంత్‌రెడ్డికి విశేష అనుచరగణం ఉంది. వారిలో సమర్థులకు, తన అనుకున్న వారికి.. డీసీసీ పదవులు కట్టబెడతారట. ఇప్పటికే ఆ జాబితా కూడా రెడీ చేసుకున్నారని తెలుస్తోంది. ఇలా జిల్లాల వారీగా తన మనుషులతో పార్టీలో బలం పుంజుకొని.. అప్పుడిక వైఎస్సార్ మాదిరే మహా పాదయాత్రతో.. అసలైన దండయాత్రకు శ్రీకారం చుడతారని అంటున్నారు. తెలంగాణలో గ్రామగ్రామాన కాలినడకన పర్యటించి.. ఊరూరా తన పాదముద్ర వేసి.. ఆ అడుగుల సవ్వడితో కాంగ్రెస్ పార్టీని పవర్లోకి తీసుకువచ్చేందుకు స్కెచ్ వేశారట రేవంత్ రెడ్డి.
కేసీఆర్ పాలనలోని లోటుపాట్లను ఇంటింటికీ వెళ్లి ఎండగడుతూ.. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారని రేవంట్ రెడ్డి అనచరులు అంటున్నారు. అయితే, ఈ పాదయాత్ర ఇప్పుడే చేస్తారా? లేక, ఎలక్షన్ల ఏడాది చేయాలా? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది. అనుకోకుండా ఈటల రాజేందర్ పానకంలో బుడగలా బయటకు రావడం.. అందులోనూ బీజేపీలో చేరి.. తనకు పోటీగా నిలిచే అవకాశం ఉండటంతో.. పాదయాత్రకు ఇదే మంచి సమయం అని అంచనా వేస్తున్నారట. గతంలో పాదయాత్రను నమ్ముకున్న ఏ ఒక్కరు వైఫల్యం చెందలేదని.. వైఎస్సార్, చంద్రబాబు, జగన్.. ఆ ముగ్గురూ పాదయాత్రతోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారని.. అలానే రేవంత్‌రెడ్డి సైతం పాదయాత్రతో సీఎం అయ్యేలా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. మరి, పాదయాత్రతో రేవంత్‌రెడ్డి హిస్టరీ రిపీట్ చేస్తారా? కాంగ్రెస్‌లో మరో వైఎస్సార్‌లా తిరుగులేని నేతగా నిలబడతారా?